Previous Page Next Page 
ప్రేమించు ప్రేమకై పేజి 15


    తన చెవులని తానె నమ్మలేక -- అలా చూస్తూ ఊరుకుంది లలిత. అంతేనన్న మాట. తనకోసం ఎవరూ ఇక్కడ బెంగ పడరన్న మాట. అనుకుంది.
    'సరే అలాగే చేద్దాం -- నీకూ యీ న్యూసెన్స్ తప్పుతుంది -- ఏడుస్తూనే గలగల నవ్వింది లలిత.
    ఆమె రెండు భుజాల మీద చేతులు వేసి ఒక్కసారి కుదిపి వదిలి పెట్టాడు బలరాం. అతని ముఖం సరదాగా లేదు. నుదుటి మీద విసుగుతో ఏర్పడే మూడు ముడుతలు ఏర్పడ్డాయి....
    'లలితా , ఎప్పుడూ అలా అనకు. నీ కళ్ళంట నీళ్ళు చూస్తె ఈసారి నేనేం చేస్తానో నాకే తెలియదు. ఎప్పుడూ నా సహనం పరీక్షకు పెట్టను....రేపు నాలుగయ్యేసరికి సిద్దంగా ఉన్నావంటే ..టౌను వెడదాం... మళ్ళీ రాత్రికే రావడం....తరవాత మిగిలిన విషయాలు' అంటూ చకచేక నడిచి వెళ్ళిపోయాడు బలరాం. వెడుతున్న అతనినే చూస్తూ నిలబడిపోయింది లలిత. ఎందుకీ వ్యక్తీ తనలో ఇలాంటి అలజడిని రేకెత్తించాలి? అని ప్రశ్నించుకుని సమాధానం దొరక్క.... విరబూసిన ఓ గులాబిని చూస్తూ అలా గట్టు మీదే కూర్చుండి పోయింది.
    సాయంత్రపు నీడలు పోయి, నెమ్మదిగా చీకటి వెల్గుల మధ్య చీకటి పెరుగుతూ ప్రపంచాన్ని ఆక్రమించు కుంటుంది. ఆకాశం లో తోలి నక్షత్రం వేల్గింది. ఇంట్లో ఒకటొకటిగా దీపాలు వెల్గుతున్నాయి. తోటలోంచి చూస్తె అద్దాల కిటికీ రెక్కలలోంచి దీపాలు గుడి కట్టిన చంద్రుళ్ళలాగా ఉన్నాయి. పూవుల రంగులు కలగా పులగం అయిపోయినట్టే వాసనలు కలిపిన సన్నని గాలి వీస్తుంది.... చూస్తుండగానే సర్వం చీకటిలో తలదాచుకున్నాయి... నెమ్మదిగా లేచి తన గదిలోకి దారి తీసింది లలిత...మంచం మీద వాలిపోతూనే......అనుకుంది -----రేపోక్కరోజు.... రేపోక్కరోజు.....మళ్ళీ తన ప్రపంచంలోకి పడుతుంది- అక్కడైతే కనీసం తనెటు నడుస్తుందో అర్ధం అవుతుంది. కాని ఇక్కడేం తెలియదు. గుడుగుడు కుంచం ఆడినట్టు అక్కడక్కడే తిరిగి కళ్ళు తిరుగుతున్నాయి-- ఈసారి ఈ హృదయం దెబ్బ తట్టుకోలేదు. ఇది....ఆవేశం కాదు. ఇది మోహం కాదు , అంతర్వాహిని . నాకే తెలియక రూపం దాల్చి ప్రవాహ వేగం హెచ్చుతున్న అంతర్వాహిని-- ఇది కనడపని మంట-- కార్చిచ్చు అయి నన్ను కాల్చే లోగా తప్పుకోవడం మంచిది -- అనుకుంది . అదే నిశ్చయంతో ఆమె నిద్రపోయింది.
    తెల్లవారింది మొదలు ఇంట్లో ఒకటే హడావిడి పెట్టేస్తుంది సరళ. రత్తి ఎంత కంటికి కనబడకుండా తిరుగుతున్నా వెతికి పట్టుకుని ప్రాణాలు తీస్తుంది -- 'ఇది ఇస్త్రీ' పెట్టు, అది తీసి సరిగ్గా పెట్టు' అంటూ. లలిత కదేమీ తెలియక పోయేదే . కానీ రత్తీ ఆలిండియా రేడియో లాంటిది. వార్తలందిస్తే గాని ఊరుకోలేదు. సమయం చిక్కినప్పుడల్లా లలిత గదిలో దూరి తలుపులు జేరవేసి కూర్చుంటుంది. లలితకి దాని దొంగ బుద్దులు చూస్తె ఎప్పుడూ నవ్వే. తనపట్ల ఎంతో పక్షపాతం చూపిస్తూనే సరళంటే ఎంత మంటో చూపిస్తూ ఉంటుంది. 'రేపు నేనంటే ఇష్టం లేకపోతె -- ఇంతే నాగతీ' అని నవ్వుకుంటూ ఉంటుంది లలిత.
    'కాఫీ పట్టుకొచ్చేస్తా నమ్మాయిగారూ, మీరింకొంచెం సేపు పడుకోండి' అంటూ ఎనిమిడవుతుంటే వచ్చి మంచం పక్కనే కూర్చుంది. రాత్రంతా నిద్రలో మరచిన ఎన్నో విషయాలు కళ్ళు తెరిచీ తెరవగానే జ్ఞాపకానికి వచ్చాయి -- లలితకి. లేవదనికే బద్ధకం వేసింది. రత్తిని చూస్తూ తలూపింది.
    'సరళమ్మగారే పాటికి లేచినారో గాని ఇల్లు పీకి పందిరేస్తున్నారమ్మా. ఏంటీ హడావిడీ?' అంది -రోంటిని దోపిన తమల పాకులా సంచీ తీస్తూ, అంటే కాస్సేపిలాగే తిష్ట వేసి కూర్చుని లోకాభిరామాయం అందిస్తుందన్న మాట రత్తి -- అనుకుంటూ వత్తిగిలి మోచేతి మీద తల అన్చుకుని పడుకుంది కుతూహలంగా.
    'ఎక్కడికో వెళ్ళాలంట. ఒకటే హడావిడి పడుతున్నారు-- వెళ్ళేప్పుడు కట్టుకుందుకో చీర. మధ్యలో మర్చుకుందుకు మరో రెండు పెట్టు. వాటికి తగిన సరంజామా-----ఏంటి శేషం అమ్మాయి గారూ .' అంది.
    'అమ్మమ్మ గారింట్లో భోజనాలే-- యివాళ. ఆవిడ కూతుళ్ళు మనమలూ మేనకోడళ్ళూ, మేనల్లుళ్ళూ -- అంతా వచ్చారుట. అందుకు ఈరోజు విందుకు పిలిచారు. అంతా సాయంత్రం వెళ్లి బాగా రాత్రయితే గాని రామని అయ్య చెప్పారు' అంది లలిత.
    'అట్లాగా? మరి చెప్పారు కారెం? త్వరగా లేవండి. మీరు కూడా తలంటు పోసుకుని.... ఏమేం చెయ్యాలో చెప్పేస్తోంది లలితకి. నవ్వుతూ పడుకునే ఉంది లలిత. మరిప్పుడే కదే కాఫీ తెచ్చిస్తానన్నావు నువ్వు తే-- నే నింతలో లేచి ముఖం కడుగుతానులే -- అంది బద్ధకం వదిలించుకుంటూ.
    'అలాగన్నారు బాగుంది' అంటూ తూనీగలాగా బయిటకి పరుగెత్తింది -- లలితకి కాఫీ పట్రాడానికి.    
    లేచి ముఖం కడిగింది లలిత. అద్దంలో తన ముఖం తనకే కొత్తగా కన్పించింది. అలసిన కళ్ళు ఉబ్బినట్టున్నాయి. రత్తి అన్నట్టు శుభ్రంగా తలకి పోసుకుంటే తేలికగా ఉంటుందని నెమ్మదిగా జడ ముందుకి వేసుకుని విప్పడం ప్రారంభించింది.
    రత్తి కాఫీ కప్పుతో ప్రత్యక్ష మవుతూనే రహస్యంగా లలిత దగ్గిరకి వస్తూ 'అయ్య ఎవరిమీదో చాలా కోపం చేసుకున్నాడు....' అంది.
    అదిరిపడింది లలిత.
    'ఎలా తెలిసిందే నీకు?' అడిగింది.
    'సరస్వతమ్మ గారేమో అరి గదిలోంచి వస్తూనే దుమధుమ లాడిపోయారు. అందుకని తెలిసింది.
    అమ్మయ్య అనుకుంది లలిత. తన మీద కానందుకేందుకో సంతోషం కల్గింది.... ఏమిటో బలరాం కి తను కోపం తెప్పించకూడదు , విసిగించకూడదు-- తన నతని దృష్టిలో చులకన చేసే ఏ పనీ చేయకూడదని పిస్తుందెందుకు?' అనుకుంది.
    'తల్లీ కూతుళ్ళు చెప్పు కుంటున్నారమ్మాయిగారూ కాఫీ తాగుతూ. ఏదో జరిగింది-- మీ మాట కూడా వచ్చింది....'మీరెలా గేనా కొంచెం భద్రంగా మసలుకోవాలండమ్మా అంది హెచ్చరికలాగా. సరళతత్వం బాగా తెలిసిపోయిన లలితకి--  ఎప్పుడూ భయమే తానో పాము పడగన ఉన్నట్టు . సరళ కి తనంటే అసహ్యం ఏర్పడింది. అవకాశం వస్తే తనకీ యింట్లో స్థానం లేకుండా చేయ్యాలని ఎంత తాపత్రయ పడుతుందో ఎప్పుడో గ్రహించింది.
    లలిత కాఫీ తాగేయడం చూసి కొబ్బరి నూనె సీసా అందుకుంది రత్తి.
    చేతిలో ఇంత నూనె వంపుకుని 'రండమ్మాగారూ, ఇలా కిటికీ దగ్గర వేస్తాను కుర్చీ -- కూర్చోండి. బాగా తలకి నూనె పట్టించేస్తాను. కాస్సేపుండి రుద్దేసుకోవచ్చు.' అంది దాని వెళ్ళ సందుల్లోంచి నూనె కారిపోడానికి సిద్దంగా ఉంది. హడావిడిగా లేచి కిటికీ దగ్గరకీ కుర్చీ లాక్కుంది లలిత.
    పాయలు తీసి కుదుళ్ళ కీ నూనె పట్టిస్తూ ఆ కబురూ యీ కబురూ చెప్తుంది రత్తి మత్తుగా ఉండి నిద్దురోచ్చేస్తున్నట్టయింది లలితకి.
    'మిమ్మల్ని చూసిన దగ్గిర నుంచే సరస్వతమ్మ కి కోపం ఎక్కువై పోయిందమ్మా.... ఎందుకో తెలుసా?'
    'నన్ను చూసిన దగ్గర నుండీనా , పోవే , రత్తీ నీకు అన్నీ విపరీతం ఊహలే' అంది తోటలోకి చూస్తూ.
    'లేదమ్మా, అయ్యగారి రోజు అలాగే అన్నారు-- అంటేనే -- సరళమ్మ తిరగబడి -- ఏమిటీ? మాట్లాడితే లలితని చూడంటావు' అంటూ నిలదీసింది... నేనప్పుడే హల్లో కోస్తూ విన్నాను.' అంది రత్తీ. రత్తిదంతా నికార్సయిన వార్తా సేకరణ పద్దతి! నవ్వుకుంది లలిత.
    'నిజమే మరి, మీరెంతో మామూలుగా ఆయనింటి అమ్మాయిలాగా ఉంటారు. ఆవిడగారి సింగారం చూస్తె చిరెత్తుకొస్తుంది -- ఆ జుట్టేంటీ! ఆ కొబ్బరి బొండాం లా సిగేంటి?ఆ....'
    'అదంతా తప్పు కాదె రత్తీ. ఇప్పుడంతా అలాగే వేసుకుంటారు. నా జుట్టు పొడుగు. అంచేత అలాంటిదేం కుదరదు-- ' లేకుంటే నేనూ వేసుకుందునన్నట్టు అంది లలిత.
    'మీరేట్టా వేస్తారమ్మా అలా? బారెడు జడ చక్కగా ఉంటేనూ' అయినా చూడ్డానికి బాగుండక పోయినా వేసుకోవాలా ఏంటి?అంది రత్తి.
    అది ప్రశ్నే. జవాబు చెప్పడం కష్టం. ఫాషన్ అంటే ఎవరికి వారికి తగి ఉంటుందా లేదా అన్న ప్రశ్నే తలెత్తదా! ఇంత ఆధునిక ఊహని రత్తికి అర్ధమయెలా చెప్పడం కష్టం అని ఊరుకుంది లలిత. ఇంతట్లోకి ఆమె కంట ఓ వ్యక్తీ పడ్డంతో కిటికీ మీదికి వంగింది.
    బలరాం గులాబి చెట్లకి శుశ్రుష చేస్తున్నాడు!
    'మీరు కూర్చోండి అమ్మాయి గారూ నేను నీళ్ళనీ సిద్దం చేసి వస్తాను' అంటూ తెలిసిందిలే అన్నట్టు ముసిముసి నవ్వులు నవ్వుతూ రత్తి అవతలికి పరుగెట్టింది. రత్తి ముఖం అద్దం లాంటిదే . లోపలి ఊహలసలు దాచలేదు.
    బలరాం నే చూస్తూ కూర్చుంది. ఎవరైనా చూస్తూన్నప్పుడూ, లేనప్పుడూ కూడా ఒకలాగే ఉండే బలరాం ప్రవర్తన ఎన్నోసార్లు వాచ్ చేసింది లలిత. అంత పొడగరీ ఎంతో హుందాగా కదులుతాడు. చిన్న గోల పెట్టుకుని చెట్ల మొదళ్ళ లో మట్టి బులబులాగ్గా చేస్తున్నాడు. రెండో చేత్తో ఒకటీ అరా ఎందాకులు ఉంటె తీసేస్తున్నాడు. కుటుంబం లేని మనిషి కనక ఉదయం పూట శ్రద్దగా చెట్ల చుట్టూ తిరుగుతూ కాలక్షేపం చేస్తున్నాడు అనుకుంది లలిత.
    బలరాం ఇన్నాళ్ళెందుకు పెళ్లి చేసుకోకుండా ఉన్నాడన్న ప్రశ్న చాలాసార్లు మొలకెత్తింది లలిత మనస్సులో.... నాకోసమే అని గట్టిగా చెప్పుకోవాలని ఉన్నా ధైర్యం రావడం లేదు...ఇంకేముంది అంతా అయిపొయింది. ఈరోజు అయిపోగానే ఎప్పుడు వెడతా నంటే అప్పుడే పంపించేస్తాడు....అని నిట్టూర్చింది.
    అదే క్షణం లో తలెత్తి కిటికీ లోంచి చూస్తున్న లలితని చూశాడు బలరాం-- అతని ముఖం వెల్గు నింపుకొంది . చేయి చాపాడు. లలిత కూడా చేయి ఊపింది.
    పదే పదే లలితని చూడాలన్న కోరికని బలవంతాన అరికట్టు కుంటున్న బలరాం కి ఇక తలవంచి పనిలో నిమగ్నం కాక వేరే దారి లేదు -- ఇటువంటి పరిస్థితిలో కాకుండా మాములుగా ఈ అమ్మాయి నా కెందుకు తారస పడలేదు? అది నా దురదృష్టం ! అని ఎన్నోసార్లు అనుకున్నాడు బలరాం--రాగ రంజితం అయిన తన హృదయాన్ని అదుపులో పెట్టుకుందుకు ఎంత అవస్థ పడుతున్నాడో కొంచమైన గ్రహిస్తుందా లలిత . 'బలరాం అంటూ అలా దగ్గరగా వచ్చినప్పుడు, నిస్సహాయంగా చూస్తున్నప్పుడు, కళ్ళ నీళ్లు పెట్టుకున్నప్పుడు -- హృదయానికి గట్టిగా హత్తుకుని ఓదార్చాలని , తపన పడే తన చేతులని ఎంతో కష్టం మీద పుస్తకం పట్టించాడు. ఒంటరితనం నన్ను ఉండనివ్వడం లేదని ఘోషిస్తే 'కోటి వీణలై మ్రోగుతున్న నా గుండెల పై వాలు లలితా , విను-- నీ ఒంటరితనాన్ని మరిచిపోతావు' అని కౌగలించు కోవాలన్న తన కోర్కెను అణచుకున్నాడు. జీవితంలోని మంచి అవకాశాలు ఆలస్యంగా వస్తే ఎంత బాధగా ఉంటుందో ఇప్పుడిప్పుడే గ్రహిస్తున్న బలరాం కి మోహన్ రాకతో మరీ బాధ అనిపించింది. తన అశక్తత కొట్టవచ్చినట్టు కనపడసాగింది. లలిత తనకి కాకుంటే ఇక్కడుండకుండా వెళ్ళిపోవడమే మంచిది -- అనిపించింది. అందుకే అందుకు తగిన ఏర్పాట్లు చేసి ఆమెని ఆమె కోరుకునే చోటికి పంపించేద్దామని నిర్ణయించు కున్నాడు బలరాం.
    కిటికీ లోంచి అలాగే తనకేసి చూస్తున్న లాలిత కి బలరాం మనస్సులో మెదలుతున్న ఊహలేలా తెలుస్తాయి?  నన్నెందుకీ వ్యక్తీ దూరంగా ఉంచుతున్నాడు అని బాధపడుతోందే గాని తనంతగానూ తన సాంగత్యాన్ని కోరుకుంటున్న హృదయం అతనిలో ఆరాట పడుతుందని గ్రహించలేదు లలిత తన మీద కోపం లేదన్న దానికి నిదర్శనగా తోచింది అతను చేయి ఊపడం. అంత చిన్న సన్నిహిత చేష్టకే లలిత మనస్సు ఆనందంతో తుళ్ళితలు వేసింది.
    'బలరాం ఇంక నెమ్మదిగా పని చేయలేక పోతున్నాడు. అస్తమానూ తలెత్తి కిటికీ లోంచి తనను చూస్తున్న లలిత కేసి చూడాలని పిస్తుంది. లేచి తోటలోంచి వెళ్ళిపోయాడు బలరాం. బాధ్యత లెరిగిన తను అసందర్భంగా ప్రవర్తించలేడు-- ఈ రోజు లలిత ఆనందంగా గడిపేస్తే చాలు, అనుకున్నాడు...ఏమిటో పిచ్చి---ఈరోజు ఆ ఆనందం శాశ్వతం గా గుండెల్లో గూడు కట్టుకుంటుందా. 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS