'వెదర్ అయుంటుందా?'
'బెటర్ అయి వుంటుందనిపిస్తుంది' అంది నవ్వుతూ లలిత.
'అంతే అయి వుంటుంది -- ' అంటూ ఇద్దరూ కలిసి నవ్వేశారు. ఈ సన్నిహిత దృశ్యం అప్పుడే వరండా లోకి రాబోయిన సరళ కంట పడింది. లలిత ఒళ్లో ఉత్తరం ఆమె చెంపకి తగిలెంత దగ్గిరగా వంగి ఉన్న బలరాం తల -- అతని ముఖంలో కనిపించిన మెరుపు లాంటి ఉత్సాహం...మింగుడు పడని కషాయంగా కన్పించాయి సరళకి. ఎంత నంగనాచి! ఎలాగేనా బలరాం ని దగ్గిరకి తీసుకోవాలని ఎంత బాగా నటిస్తోంది! అనుకుని పళ్ళు కొరుక్కుంది. ఆ క్షణంలో ఏం మాట్లాడినా తన ధోరణి బయటపడి పోతుందని వచ్చినట్టే తెలియకుండా లోపలికి వెళ్ళిపోయింది. ఇదేమీ గుర్తించని బలరాం లలితతో వుషారుగా అంటున్నాడు--
'లలితా గట్టిదానివే -- బ్రహ్మ లిపి కూడా క్షుణ్ణంగా చదవ కల్గావంటే ....అయినా ఈ రాతెందుకా ముసలాయనకి?' అన్నాడు.
'అర్జెంటు గా రాయాలని తోచి ఉంటుంది.. .గుమస్తా కోసం కూర్చోమన్నావేమిటి? రాసి పారేశారు. అది నయం కదూ?'
'ఓసారి వచ్చి వెళ్ళమంటున్నారు. వెడతావా?' అడిగాడు బలరాం.
'కొన్నాళ్ళగి వెడతాను. నాకేక్కడికి కదలాలని లేదు' అంది లలిత -- ఆమె సమాధానం అతని కెంతో తృప్తి నిచ్చిందన్న దానికి అతని ముఖమే నిదర్శన.
'నీ యిష్టం ...ఈ వారం లో అమ్మమ్మ గారింట్లో చాలా హడావిడి. నీకు తెలుసు కదూ! వస్తున్నట్టేనా?'
'సరళ గాంగ్ అంతా వస్తారా?' భయంగా నెమ్మదిగా అడిగింది.
"ఎందుకు రారు? వాళ్ళలో అమ్మమ్మ గారి మేనల్లుళ్ళూ, మనవలూ మనవరాళ్ళూ, ఎందరున్నారో తెలిస్తే ఆశ్చర్య పోతావు నువ్వు!' నవ్వుతూ అన్నాడు బలరాం.
'ఆమె అంత గంబీరంగా హుందాగా ఉంటారు కదా. వీళ్ళంతా ఇలా ఉన్నారేమిటి?' కుతూహలం అణుచుకోలేక అడిగింది లలిత.
'గొప్పవాళ్ళ పిల్లలు అలాగే ఉంటారు లలితా. ఆ మాత్రం ఊహించలేవా?' వేళాకోళం చేశాడు.
'నేనా వర్గంతో ఎక్కువగా మసలలేదు బలరాం. అలా నిర్లక్ష్యంగా ఉంటె నా కేమిటోలా ఉంటుంది.'
'అందుకే నువ్వింకా మామూలు అమ్మాయిలాగా ఆలోచించ కల్గుతున్నావు. అదే నీకు ఆస్థి ఉండి, అంతస్తు ఉందని తెలిసి, చిన్నప్పటి నుండి డబ్బు ఎంత సులభంగా కావలసినవన్నీ సమకూర్చి పెట్టకలదో తెలిస్తే -- నీ ధోరణి వేరుగా ఉండేది. వెనకటి కోసారి సరళే ఏం చేసిందో తెలుసా? ఎవరో పిల్లాడి మీదికి కారు తోలేసింది. ఆపి వాడికేం దెబ్బ తగిలిందో చూళ్ళేదుట. పర్సు లోంచి ఓ వంద కాగితం తీసి పక్క నున్న పెద్ద వాళ్ళ కిచ్చేసి, అవసరం అయితే కర్చు చేయండి అంటూ ఏం జరగనట్టే వెళ్ళిపోయిందిట....'
'ఓహ్!' అంది నమ్మలేనట్టు లలిత.
'అందుకే చెప్త. నమ్మలేవు. నీలాంటి జీవితం సాగించిన మనిషికిది దారుణంగా కన్పిస్తుంది. డబ్బున్న వాళ్ళలో సహృదయులుండరని కాదు....కాని యిలాంటి కుర్రకారుకి బాధ్యత అసలు తెలియదని....'
'ఇప్పుడు అమ్మమ్మ గారి మనవరాలు కూడా అంతేనా?' ...ఆవిడ...'
'మైగాడ్ అమ్మమ్మగారి పెద్ద కోడలి చూడలేదు నువ్వు. ఇలా డబ్బు పారేస్తే రానిదేమీ ఉండడను కుంటుందావిడ....'
'పోనీలే , నాకీ సంగతులు చెప్పకు. నాకేదో బెంగగా ఉంటుంది....'
బలరాం నవ్వుతూ జేబులోంచి సిగరెట్ పేకట్ తీశాడు. ఒక సిగరెట్టూ తీసి అంటించి పొగ వదులుతూ ఎటో చూస్తున్నాడు.
లలిత మటుకు బలరాం చెప్పిన విషయాలు గ్రహిస్తూ అతని కేసే తెలియకుండానే కన్నార్పక చూస్తుంది.... చటుక్కున తిరిగి చూసిన బలరాం కి లలిత కళ్ళు వింతగా మెరుస్తూ కనిపించాయి. నవ్వుకుంటూ అటు నుంచి నడిచాడు.
'ఇంకా ఇదార్రోజులుంది కదా, ఎలాగో తప్పించుకోవచ్చు.'
నే వాళ్లతో కలవలేను. కలిసినా సరదాగా ఉండలేను' అనుకుంది లలిత.
కొత్తకారు వచ్చేలోగా వాడుకోమని చిన్న తెల్ల కారొకటి తీసుకు వచ్చారు సుబ్బారావు గారు. ఇద్దరే ఇద్దరు కుర్చుందుకు వీలున్న ఆ కారు ముచ్చటగా ఉంది. లలిత చుట్టూ ప్రక్కల రోడ్ల వెంట తోలి అలవాటు చేసుకుందుకు బాగుంటుందని బలరాం కూడా ఒప్పుకున్నాడు. ఉట్టినే ఉన్నప్పుడల్లా లలిత కారు తీసి నడుపుతుంది. మనస్సు ఆలోచనలతో నిలవనీయనప్పుడు ఇదెంతో బాగుంది లలితకి. అవకాశం వచ్చినప్పుడల్లా మోహన్ ప్రసక్తి తెస్తూనే ఉంది సరళ.
'ఈ సరళ కి కూడా మోహన్ గురించి చెప్పాలి.' అనుకుంది లలిత.
ఆరోజు ఉదయం కాఫీలు ముగియగానే కారు బయటికి తీసింది లలిత. తోటవాడు ఆత్రంగా పరుగెత్తి వెళ్లి గేటు బార్లా తీశాడు. చిన్నకారు ముందుకి దూసుకు పోయింది.
ఆ సమయం లోనూ, సాధారణంగా ఒక్క రాత్రి పూటల తప్పించి చుట్టూ ప్రక్కల రోడ్లు రద్దీగా ఉండవు ...వెళ్ళిన రోడ్డంటే వెడుతూ మళ్ళిన మళుపే మళ్ళుతూ , స్వేచ్చగా రెక్కలు సాచిన పక్షిలా తిరిగుతోంది లలిత. ఇంకా తిన్నని రోడ్డంట కొంతదూరం వెడదామని కారు తిప్పి పోనిచ్చింది... ఐదారు ఫర్లాంగులు వెళ్లేసరికి ముందు భాగం పక్కకి తిప్పుకుని రోడ్డుకి కొంచెం పక్కగానే ఓ కారు కన్పించింది. ప్రమాదం జరిగింది కాబోలు, అని అదిరిపోయింది లలిత. కారు పక్కగా ఆపి దిగింది ...రోడ్డు వార మైలు రాయి మీద తల చేత్తో పట్టుకుని కూర్చుని ఉన్నాడు మోహన్. అదిరిపడింది లలిత. కారటు తిప్పి బయిలు దేరి నందుకు తనని తనే తిట్టుకుంది.
'నా కళ్ళని నేనే నమ్మలేకుండానే ఉన్నానే? ఆపద్భందవీ'? అంటూ నాటకం లోలాగా అన్నాడు మోహన్ నవ్వుతూ.
"ఎవడో డీ కొట్టబోయి, తప్పంతా నాదేనని తిట్టి మరీ వెళ్ళిపోయాడు లలితా. ఎవరేనా ఇటు రాకపోతారా అని కూర్చుని తపస్సు చేస్తున్నాను.'
'కారసలు నడవదా?' నూతి లోంచి వస్తున్నట్టుంది లలిత కంఠం. ఎదురు చూడని ఈ సంఘటన కి అదిరిపడింది లలిత గుండె. కారెందుకు తోలడం నేర్చుకున్నాను?' అంటూ తిట్టుకుంది.
'లాభం లేదు. లాక్కెళ్ళ వలసిందే... డిక్కీ లో తాడుంది-- ప్లీజ్ నన్ను కనికరించు' అన్నాడు ప్రాధేయపడుతూ.
'నోనో నిన్నెక్కడ దింపమంటావో దింపుతాను తరవాత కారు తీసుకెళ్ళే ఏర్పాట్లు చేసుకో" అంది.
మారు మాట్లాడక ఎక్కి కూర్చున్నాడు మోహన్. మౌనంగానే టౌను వైపు కారు పోనిచ్చింది లలిత.
'నాతొ మాట్లాడ్డం కూడా ఇష్టం లేదా లలితా? నన్ను క్షమించలేవా?'
'మాట్లాడ్డాని కేం? కాని ఏముంది మాట్లాడ్డానికి?'
"మనం ఎన్నేసి గంటలు కూర్చుని మాట్లాడుకునే వాళ్ళం? అంతా మరిచిపోయావా?'
ఎంతో నీరసం అనిపించింది లలితకి.
తెలిసిన వాళ్ళ ఇళ్ళు ఒక్కోకటీ వస్తున్నాయి. లలిత మనస్సు దడదడ లాడుతోంది. ఈ వ్యక్తీ తో తనని ఎవరేనా చూస్తె ఎన్నైనా కల్పిస్తారు. నేను బలరాం కి అన్నీ చెప్పెముందే అతని మనసులో తప్పుడూహాలు తలెత్త నివ్వకూడదు అనుకుంది. కనపడని దైవాలకి మొక్కుకుంది.
'ఎక్కడ దింపాలో చెప్పు?' అంది.
'అదిగో ఆ ఎడమ వైపు గేటు దగ్గర అపు. మా కంపెనీ వాళ్ళంతా అక్కడే దిగాం.' అన్నాడు మోహన్. కొంచెం పక్కగా కారాపింది లలిత. తలుపు తెరచి పట్ట్టుకు నిలబడ్డాడు మోహన్ -- ఓసారి దిగి లోపలికి వస్తావా/ నా ఆతిధ్యం ఇంత విషయమై పోయిందని కలలో కూడా అనుకోలేదు లలితా.' అన్నాడు.
'నే వెళ్ళాలి. అసలింత దూరం వద్దామనే అనుకోలేదు.' అంది కారు స్టారు చేస్తూ. కారు మళ్ళించే లోగా ఇంకో కారు దూసుకుంటూ వస్తుంది. కొంచెం ఆగింది లలిత మోహన్ ముఖం ఆనందంతో విడగా ఆ కారులోని ఎవరికో చేయి ఊపాడు. ఎవరన్నది చూడలేదు లలిత -- కారు రోడ్డు మీదే అడ్డంగా తిప్పి ఇంటి ముఖం పట్టించే తాపత్రయం లో ఉంది.... 'మళ్ళీ కన్పిస్తావు కదూ' అంటున్న మోహన్ కి సమాధానమేనా చెప్పకుండా ... కొత్త డ్రయివింగన్న జ్ఞాపకం కూడా లేకుండా స్పీడుగా కారు పోనిచ్చింది .. ఆమె ఊహలంతా వేగంగానూ కారు సాగుతుంది.
పది నిముషాల్లో ఇల్లు చేరుకుంది. గేటు పక్కగా నిలబడి ఆత్రంగా రత్తీ తోటవాడూ చూస్తున్నారు.
'వచ్చారా? మీరేటేళ్ళారో తెలియలేదమ్మా, అయ్య కోపం చేసుకున్నారు' అంటూ కారు లోపలికి రానిచ్చి గేటు మూశాడు తోటమాలీ.
'అమ్మగారోచ్చిసినారు. మీరెల్లండమ్మా' అంటూ రత్తి హెచ్చరించింది. 'ఎవరు, అమ్మగారోచ్చారా?' అనుకుంటూ పోర్టికోలో కారాపి దిగింది లలిత.
పై మెట్టు మీద నిలబడి ఉంది సరస్వతమ్మ. వరండా లో కుర్చీలో కూర్చుని సిగరెట్టూ కాలుస్తున్నాడు బలరాం. పక్కనే విలాసంగా జారపడి కూర్చుని ఉంది సరళ. అర్ధం కాని పిరికితనం ఆవరించింది లలితని.
'చెప్పా పెట్టకుండా ఎక్కడి కెళ్లావు తల్లీ!' అంది సరస్వతమ్మ గారు పలకరింపుగా. ఆ కంఠస్వరం లో పలకరింపు మటుకు లేదు!
'అంతదూరం వెడదామానుకోలేదండీ' అంటూ కుంటి సాకు చెప్పి మెట్లన్నీ గబగబ ఎక్కింది లలిత.
'కారు బాగుందా. ట్రబుల్ లేదు కదూ?' అడిగాడు బలరాం.
'మంచివాడివె లలితెం పసిపిల్లా?.... నేనస్తూ చూశానుగా -- ఎవరినో ఎక్కించుకుని లిప్ట్ కూడా యిస్తుంది' అంది ఉరమని పిడుగులాగా సరళ.
'ఏమిటేమిటి?' అని సాగతీస్తూ లలిత వెనకనే పైకి వచ్చారు సరస్వతమ్మ.
నోటమాట రాక నిలబడిపోయింది లలిత. మోహన్ చేయి ఊపినది యీమె గారి కన్నమాట! అన్న ఆలోచన ఆమె మెదడుని దోల్చేయడం ప్రారంభించింది.
'లేదు బలరాం, దారిలో నన్ను చూసిన మోహన్ యాక్సిడెంటయి కన్పించాడు. దింపేయమంటే సరేనన్నాను.' అన్న సింపుల్ నిజం చెప్పాలని ఎంతో ప్రయత్నించింది. కాని ఆ వాతారవణం సరస్వతమ్మ ముసిముసి నవ్వులు, సరళ బలరాం కేసి 'చూశావా' అంటున్నట్టు చూడ్డం -- అంతా కలిసి పిరికిదాన్ని , మొండి దాన్ని కూడా చేశాయి లలితని. తొలిసారే బలరాం కి చెప్పి ఉండవలసింది...కాని ఒకటికి లక్ష సార్లనుకుని ప్రయోజనం ఏమిటి? ఇప్పుడెంత చెప్పినా --లేట్.
'ఏం ఎవరికీ లిఫ్ట్ వ్వకూడడా?' మొండిగా తల ఎగరేసి అడిగింది లలిత.
ఆదరిపడ్డట్టు తలెత్తి చూసినా, మళ్లీ తన ఆలోచనలలోకి మళ్లిపోయినట్టు ముఖం తిప్పుకున్నాడు బలరాం.
గబగబా మెట్ల కేసి నడిచి వెళ్ళిపోయింది లలిత. ఏం చేస్తుంది? అంతా నేరస్తుణ్ణి చూసినట్టు ముళ్ళ లాగా అలా చూస్తుంటే 'బలరాం నువ్వూ నన్నెందుకలా చూస్తున్నావు?' అనుకుంది.... రెండు మెట్లేక్కిందో లేదో పరుగున వచ్చి మోచేతి మీద చేయి వేస్తూ ఆపింది సరళ.
'సారీ లలితా, నేనవసరంగా తొందర పడ్డాను. ఏమీ అనుకోకు. నువ్వు మోహన్ ని చూడ్డానికి వెళ్తున్నట్టు ఒక్క మాట చెప్పి ఉంటె కప్పి ఉంచే దాన్ని కదా?' అంది రహస్యంగా లాలోచీగా.
'ఏమిటి నువ్వనేది? నేను మోహన్ ని కలుసుకుందుకు వెళ్ళానా? ఎవరు చెప్పారు నీకు? మతి పోయిందా నీకు?' అనవసరంగా ఆవేశం తెచ్చుకుంది లలిత.
'ఏం లేదు లలితా. నేనలా నిన్ను బయట పెట్టకపోతే ఏ గొడవా ఉండేది కాదు కదా. నా కంత తోచలేదు.... అయినా నువ్వేం తక్కువ దానివా, నిముషం లో అందరి నోరూ మూయించావు!' అంది నవ్వుతూ.
'మైగాడ్, నువ్వెంత ఊహించు కుంటున్నావు!' అనేసి ఇక నిలబడలేక మెట్లన్నీ పరుగున ఎక్కేసింది....
సరళ చిన్నపోయినట్టు ముఖం పెట్టుకుని మెట్లు దిగేసింది. తన కళ్ళని తానె నమ్మలేనట్టు చూశాడిదంతా బలరాం. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కాని తన రూములోకి వెళ్ళిపోయాడు.
సరళ అర్ధవంతంగా సరస్వతమ్మ కేసి చూసింది!
'బాగుంది బాగుంది. సంగతేమిటో చెప్పు?' అంటూ బలరాం కాళీ చేసిన కుర్చీలో కూలబడ్డారావిడ.
నవ్వుతూ తనూ కూర్చుంది సరళ -- అమెగారికి విందుబోజనం చేసినంత ఆనందంగా ఉంది. తను తిరిగి వస్తుంటే టౌను అవతల లలిత మోహన్ ని దింపి కారు మళ్ళిస్తోందనీ అతను తనకి చేయి వూపాడనీ చెప్పింది.
'అయితే లలిత కతను బాగా తెలుసుంటావా?' నమ్మలేకపోతూ అడిగారావిడ.
'బాగా తెలుసుండాలమ్మా , ఏదో జరిగుండాలి కూడా. లేకపోతె ఎందుకీ దొంగతనం? బలరాం కి తెలిస్తే యిబ్బందనీ-- ఎంత నాటకం ఆడుతోందో చూశావా?' ముక్కు మీద వేలేసుకుని కూర్చుని ఉండిపోయారావిడ. ఆ క్షణం లో తన కూతురి భవిష్యత్తు కి అడ్డు వైదొలగిపోతున్నట్టు సాక్షాత్కరించింది -- సరస్వతమ్మ గారికి!-- ఇన్నాళ్ళ నుండి లలిత దేవతేమోనని యిబ్బంది పడుతుంది.
