Previous Page Next Page 
నిష్టూర ప్రేమ పేజి 13


    "పదండి , కాస్త కాఫీ తాగి వద్దాం" మాధవరావు సూచించాడు. నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తూ.
    "నేనిప్పుడే తీసుకుని పైకి వచ్చాను" అంటూ వాచీ చూసుకుని "నేనిక సెలవు తీసుకుంటాను." అన్నాడు జోగీ.
    "కాఫీ కోసం పిలవటం లేదు మిమ్మల్ని, మీతో కాస్త మాట్లాడవలిసిన పని ఉంది. మీ కభ్యంతరం లేకపోతె......." అన్నాడు మాధవరావు కొంచెం ఇబ్బందిగా .
    "నాతోనా?!"
    .......
    "సరే పదండి. మీరు కాఫీ తీసుకుంటూ మాట్లాడుదురు గానీ" తనే మళ్ళీ హోటలు లోపలికి దారి తీశాడు.
    డిల్లీ వంటి నగరం లో పంజాబీ , ఇంగ్లీషు లు కాక ఇంకో భాషెదైనా వస్తే అదొక పెద్ద ఎడ్వంటేజ్ . తనకు వచ్చిన తెలుగు అలవాటు చేసుకున్నట్టుంటుందని , ఆ పైన ఎవరికీ అర్ధం కాదు కాబట్టీ వ్యక్తీగత విషయాలను కూడా చర్చించుకునెందుకూ వీలు ఉంటుందనీ ఇందిరతో ఎప్పుడూ తెలుగులో మాట్లాడే వాడు జోగీందర్. ఇప్పుడు మాధవరావుతో కూడా తెలుగులో మాట్లాడాలా, వద్దా ఆమని ఒక నిమిషం తర్కించుకుని, చివరికి ఇంగ్లీషు లో మాట్లాడడమే ఉత్తమం అని నిర్ణయించాడు. మాధవరావు కి ఈ పంజాబీ యువకుడి బహు భాషా ప్రావీణ్యం తెలియక ఇంగ్లీషు లోనే ఉపక్రమించాడు.
    "ఇందిర కు మీరు మంచి స్నేహితులని నాకు తెలుసు. ఇందిరకు మీరంటే బాగా అభిమానమూ, గురీ కూడా ఉన్నాయని నేను గ్రహించాను. అందుకే ఇవాళ మీరిక్కడ తలవనితలంపుగా తటస్థ పడగానే పరిచయం చేసుకునైనా, మీతో కొన్ని సంగతులు మాట్లాడాలని పించింది. మన ఇద్దరికీ పరిచయం కలిగించలేదు ఇందిర. అనవసరమను కుందేమో!" ఆగాడు మాధవరావు.
    జోగీకి తను మాట్లాడవలిసిన అవసరం కనబడలేదు.
    అతనేం మాట్లాడక పోయేసరికి తప్పనిసరిగా మాధవరావే కొనసాగించాడు. "అతి చనువు తీసుకుంటున్నానని మీరు భావిస్తే చెప్పండి........."
    "అబ్బే, అలా అనుకోకండి. ఇందిర స్నేహితులు నాకూ స్నేహితులే." కుతూహలంగా ఇందిర మిత్రుడి వంక చూశాడు జోగీ. మనిషి అందంగా, పెద్దమనిషి తరహగానే ఉన్నాడు. సహృదయుడైతే ఇందిర ఇంక అభ్యంతరం చెప్పడానికి వీలులేదు అనుకున్నాడు. ఒక నిమిషం మౌనం రాజ్యం చేసింది.
    "ఇందిర దగ్గిర నించి ఉత్తరం వచ్చిందా?' జోగి తెలిసి పోయిందనుకున్నాడు.
    "అదే ప్రశ్న మిమ్మల్ని అడగ బోతున్నాను. నాకయితే రాలేదు నాకు తను రాస్తుందన్న ఆశ కూడా లేదు. ' అతని సుందర వదనం మలినమయింది. జోగీ కి ఏం మాట్లాడాలో తెలియలేదు.
    "వెళ్ళేముందు మాటామాటా అనుకున్నాం నేనూ ఇందిరా. అందుకనే మీకు ఏమన్నా క్షేమ సమాచారాలు  రాసిందేమో కనుక్కుందామని అనుకున్నాను." మొహమాటంగా నవ్వాడు మాధవరావు.
    అతని ముఖంలో అలుముకున్న నీలి నీడలను గమనించిన జోగీందర్ , అతను కేవలం ఇందిర క్షేమాన్ని గురించిన వార్త మాత్రమె అభిలాషిస్తున్నాడని ఎంత మాత్రమూ భ్రమ పడలేదు. అంతకంటే ప్రబలమైన కారణం ఉండబట్టే అతను ఇక్కడతనతో మాటల్లోకి దిగాడు అనుకున్నాడు. ఎంతవరకూ జోగీందర్ కి చెప్పాలో, ఎలా చెప్పాలో తెలియక, సతమతమవుతున్న మాధవరావు మనః స్థితి కొంతవరకూ అర్ధం చేసుకో గలిగాడు జోగీ. ఇందిరను ఇతడు ప్రేమిస్తున్నాడు అనుకోటం అంత అసమంజసంగానూ తోచలేదు. ఇందిర మాధవరావు ని గురించి రాసిన నాలుగు వాక్యాలూ ఆమెకు అతనంటే ఎంత ఆకర్షణ, అభిమానమూ ఉన్నాయో చెబుతూనే ఉన్నాయి. ఇందిర తను మాధవరావు ని అవమానించాననీ, తన మనో రధం తీరిందనీ రాసిందే కానీ, దాని వల్ల తన కెటువంటి ఆత్మానందం, తృప్తీ కలిగాయో తెలుపలేదు. అలా చేసినందుకు అసలు బాధపడ్డట్టు ధ్వనించింది. ఆ పైన ఆమె తనకు డిల్లీ తిరిగి రావాలని లేదనీ, అలాగని విశాఖ లోనేఉండాలనీ లేదనీ రాసింది. ఎవరూ తెలియని చోటికి ఎక్కడి కయినా పోవాలని ఉందని రాసిన ఇందిర తననించి తను తప్పించుకోజూస్తుందని అర్ధమైపోయింది జోగీందర్ కి. ఇందిరా మాధవరావులు ఏదో ఘర్షణ పడ్డారనీ, దానికి ఫలితంగా వారిద్దరికీ మధ్య దూరం ఎక్కువ కావడానికి బదులు తగ్గిందనీ కూడా జోగీ చురుకైన బుర్ర గ్రహించి వేసింది. అయితే ముఖాముఖిగా ఎదురు పడి బలాబలాలు చూసుకున్నాక ఇద్దరూ కూడా అవతలి వారిని ఎలా చేరడమో తెలియక మధనపడుతున్నారని ఊహించాడతను. అందుకే తన స్నేహితురాలికీ, ఆమెను ప్రేమిస్తున్న ఈ యువకుడికీ  సహయపడాలనే  కోర్కె గట్టి పడగా జోగీందర్  సాలోచనగా అన్నాడు.
    "ఇందిర మూడు రోజుల క్రితమే నాకు రాసింది. క్షేమం గానే ఉందట. అంతకంటే ఎక్కువ చెప్పడానికి ఇందిర అనుమతిస్తుందో లేదో కానీ, నేను చెప్పదలిచాను. ఇదమిత్తమని ఏం రాయలేదు కానీ, ఇందిర అంత సంతోషంగా ఉన్నట్టు లేదు. ఏదో జటిలమైన సమస్య ఆమెను వేధిస్తున్నట్టు కనిపిస్తుంది."
    అర్ధమైనట్టు తల ఊపాడు శ్రోత.
    కొన్ని క్షణాలు అలోచించి, తటపటాయిస్తూ అడిగాడు మాధవరావు: "ఇందిర తలి దండ్రులు మీకు పరిచయమే ననుకుంటాను. వారేటు వంటివారో చెప్పగలరా?"
    "వాళ్ళంత మంచి వాళ్ళనీ, సహృదయులనీ నేనెక్కడ చూడలేదని అనగలను. ముఖ్యంగా ఇందిర నాన్నగారు మంచి సంస్కారం, విశాల హృదయం కలవారు. పిల్లలందరికీ పరిపూర్ణమైన స్వేచ్చ నిచ్చాడాయన. అయినాఇదంతా మీకు ఇందిర చెప్పే ఉంటుంది. వాళ్ళ తండ్రి గారిని గురించి ఇందిర చెప్పకుండా ఉండదు."
    "మా పరిచయమే చాలా చిత్రంగా మొదలయింది. మీకివాళ అన్నీ చెప్పదలుచుకున్నాను. ఇందిర కు కావలసిన వారు కనుక మీతో ఆమెను గురించి చెప్పడంలో అనుచిత్తం ఏమీ లేదనే భావిస్తున్నాను.
    ఒక్క క్షణం సేపు ఆగి గట్టిగా శ్వాస తీసుకుని తిరిగి మొదలు పెట్టాడు మాధవరావు.
    "ఎన్నార్ధం క్రితం ఇందిరా వాళ్ళక్క ను పెళ్లి చూపులు చూశాను హైదరాబాదు లో. ఆమె నాకు నచ్చలేదు. పిల్ల అందంగా ఉన్నంత మాత్రాన పెళ్లి చేసుకోవచ్చుననే ఆలోచన నా కెప్పుడూ ;లేదు. ఎటొచ్చీ వాళ్ళకీ నేను తగిన వరుడి కింద కనబడ్డాను. ఒత్తిడి చేశారు అంగీకరించమని. నేను ఒప్పుకోలేదు. అంతే ఆ తరవాత ఏడాది కి ఇందిరను వాళ్ళ మామయ్య గారింట్లో కలిశాను. గోపాలరావు గారి కుటుంబంతో నాకు బాగా పరిచయం ఈ ఊళ్ళో. ఇందిర ఎవరో నాకు ముందు తెలియదు. తెలిసిన తరువాత ఆ ప్రసక్తి తీసుకు రానిచ్చిందే కాదు ఇందిర. ఏమయితే నేం మేమిద్దరం మంచి స్నేహితులమే అయ్యాము.నా అభిప్రాయం ఆమెకు చెప్పాను. తనైతే ఏమీ చెప్పలేదు గానీ నేను గ్రహించగల ననుకుంటాను. కానీ ఏ కారణం చేతనో నాకు సరియైన సమాధానం ఇవ్వలేక పోయింది. ఒకవేళ ఆమె తల్లి దండ్రులు మా మైత్రిని ఇష్టపడరను కుందేమో."
    పూర్తిగా , ఎంతో శ్రద్దగా అతను చెప్పిందంతా విన్నాడు జోగీందర్. నిర్మొహమాటంగా సూటిగా తమ స్నేహాన్ని గురించి చెబుతున్న ఈ ఆంధ్ర యువకుడి మీద అభిమానం కలిగింది జోగీకి. జోగీ కన్న వయసులో మాధవరావే రెండు మూడేళ్ళు పెద్దాయి ఉంటాడు. అయినా ఈ క్షణం లో జోగీ కళ్ళకి ఇందిరా మాధవరావు లు దారి తప్పిన చిన్న పాపల్లా కనిపించారు. ఒకప్పుడు ఇందిరను అతను కూడా తనదాన్ని చేసుకోవాలని కోరుకున్నాడు: ప్రయత్నించాడు కూడా. కానీ ఇందిరకు ఆ భావమే లేదని తెలిశాక ఆమెను స్నేహితురాలిగా పొందాలన్న ఉద్దేశ్యంతో ఆమె పై మోహాన్ని వాత్సల్యంగా మార్చుకుని, ఆమె మైత్రిని పొందగలిగాడు.
    ఇప్పుడు ఇందిర తాను ప్రేమిస్తున్న వ్యక్తిని పట్టుదలకూ, పౌరుషానికి పోయి తిరస్కరించి, తన ఓటమిని ఒప్పుకోలేక అభిమానంతో బాధపడుతుంది. ఎలాగైనా ఆమెకు సహాయం చేయాలన్నా కోర్కె తో , పరిస్థితి ని పూర్తిగా అర్ధం చేసుకుని ఏవిధంగా తాను ఇందిరకు ఆనందాన్ని చేకూర్చగలడో తెలుసుకోవాలను కున్నాడు.
    "మీరు ఒక విషయంలో పోరబడుతున్నారని నా కనిపిస్తుంది. ఇందిర నీతో స్నేహాన్ని వాంచిస్తున్నట్టు ఎప్పుడన్నా చెప్పిందా? ఆగండి, నేనీ ప్రశ్న ఎందుకు అడుగుతున్నానో పూర్తిగా వింటే మీకే తెలుస్తుంది. మీరు వాళ్ళ నిరుపమను తిరస్కరించడం వల్ల ఆమె చాలా మనః క్లేశానికి గురి అయిందనీ, మీ ప్రవర్తన ఆ సందర్భంలో చాలా దురుసుగా ఉందనీ, ఇందిర నాతొ ఒకటి రెండు సార్లు చెప్పింది. అందుకని ఇందిర మీతో మైత్రి నెరసి, మీరు ఏ మాత్రం సుముఖంగా కనబడ్డా మిమ్మల్ని తిరస్కరించి నొప్పించాలని తను నిర్ణయించు కున్నట్టు నాతొ అంది ఒకసారి. ఇప్పుడు చెప్పండి, ఇందిరకు మీమీద అభిమాన ముందని మీకూ ఇంకా అనిపిస్తుందా?' అలా మీరు భావించడానికి ఆధారమేమన్నా ఉందా?"
    ఎంతో ఆసక్తిగా విన్నాడు మాధవరావు జోగి చెప్పినదంతా. ఇందిర తనను మొదట్లో అంత ఏవగించుకున్నదేందుకో ఇప్పుడర్ధమవుతుంది తనకి. అసలు తాను చూసిన ప్రతి పిల్లనూ పెళ్లి చేసుకోవాలంటే ఎలా? ఆ పెళ్ళిళ్ళ పేరయ్య అతిగా ఒత్తిడి తెస్తే, తనకి ఆ అమ్మాయి నచ్చలేదని తెగేసి చెప్పాడు. దానికి ఇందిర ఇంత కోపగించుకోవడం అర్ధం లేని పని. కానీ తనకు ఇందిర అంటే ఏర్పడిన ప్రేమ, తన యందు ఇందిరకు కూడా కలిగిందనే ఊహించాడు తను తనంటే ఆమెకు అసహ్యం లేదని ఇందిర తన చేతుల్లో ఇమిడిపోయి తన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసినప్పుడే తనకు తెలిసిపోయింది. ఆరోజు సాయంత్రం బెలా రోడ్డు మీద తనతో అనవసరంగా ఘర్షణ పడిన ఇందిర అతని మనసును బాగా హత్తుకు పోయింది. ఏదో చెప్పలేని బాధా, తప్పు చేసిన భావమూ ప్రస్ప్రుటంగా కనిపించాయామె మొహంలో. అసలైన ఆడదిగా కనబడిందామె ఆ సాయంత్రం. తన అంతరంతారాలో ఏర్పడిన ఈ భావానికి రుజువెక్కడి నించి తేగలడు? ఆమె కళ్ళు కాంతి పుంజాలయి తనను దహించి వేశాయని ఎలా చెప్పగలడు? ఆమె తన చేతులను పెన వేసుకున్నప్పుడు ఆమె లోంచి తనలోకి ప్రవహించిన విద్యుత్తరంగాలను ఎలా విశదీకరించగలడు? ఆడది తన బాహువుల్లో ఇమిడినప్పుడు ఆమె ప్రేమ అంచనా ఎలా కట్టగలడు పురుషుడు? అది ఎలా బోధించగలడు? ఈ ప్రశ్నలను తప్పించుకుని తనవంకే పరీక్షగా చూస్తున్న జోగీందర్ వంక నవ్వుతున్న కళ్ళతో నిస్సహాయంగా చూశాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS