వెంటనే మళ్ళీ బట్టలు వేసుకుని ఆఫీసు కాగితాలు తీసుకుని అప్పటి కప్పుడే వెళ్ళిపోయారు. ఆ రాత్రి ఎవరం భోజనం చెయ్యలేదు. విచారమే మాతో తన ఆకలి తీర్చుకున్నది.
రెండోవాడు నా డొక్కలో దూరి పడుకున్నాడు. పెద్దవాడు నా పక్కలో చేరి ,
"అమ్మా, నాన్న కొత్తాడా, ఎలవ్వాకు, నాన్న ఇంటికి రానీ తందాం" అన్నాడు. కళ్ళు తుడ్చుకుని లేని నవ్వు తెచ్చుకుని, "లేదు బాబూ నాన్న కొట్టలేదు. ఊరికే ఎగతాళి కి వీపు మీద అట్టా అన్నారు అంతే. అది కొట్టటం కాదు. నాన్నని తందాం అనకూడదమ్మా' తప్పు , నాన్న పెద్దవాడు కదూ" బుజ్జగిస్తూ అన్నాను. అంతా చూసిన వాడి బుర్రలోకి నేను చెప్పిన మాటలు ఎక్కలేదు.
"కాదూ నాన్న పిచ్చి, అమ్మ మంచి . నాన్న కి జిల్లాయి లు" అన్నాడు.
వాణ్ణి సముదాయించి నిద్ర పుచ్చాను. రాత్రి తెల్లవార్లూ మేలుకునే ఉన్నాను. వారు రాలేదు. ఉదయం ఆరు గంటలకు వచ్చారు. ముఖం పీక్కు పోయింది. కళ్ళు ఎర్రబడి లోతుకు పొయినయ్యి. అంతా గ్రహించాను. వారు తాగారు. ఏ లాడ్జి లోనో మకాం వేశారు. ఇంక ఆ మనిషిని ఏం అడిగినా ప్రయోజనం లేదని ఏమీ అడగలేదు.
జీవిత సోపానం లో పైకి వెళ్ళవలసిన వారి జీవిత గమనం ఆరోజు కారోజుకూ కిందికి జారుతున్నది.
వారం రోజులు వారు నాతొ ముక్తసరిగానే మాట్లాడారు. ఒకరోజు అడిగాను.
"ఆరోజు రాత్రి ఇంటికి రాలేదు ఆఫీసులోనే ఉన్నారా."
"లేదు హోటల్లో భోజనం చేసి లాడ్జి లో పడుకున్నాను."
"ఎందుకని."
"నా మనస్సు కు అట్లా చేస్తేనే బాగుండని పించింది, తప్పా."
"మీరు తాగి లాడ్జి లో పడుకున్నారు. మీ మనస్సు కు నచ్చిందన్నారు. తప్పో ఒప్పో మీకూ తెల్సు మంచి చెడ్డలు ఆత్మాభిమానమూ ఆడదానికే కాదు మగవారికీ అవసరమే. నామీద కోపం వచ్చి నన్ను కొట్టి సర్వ పాపాలకు నిలయమైన ఆ లాడ్జి లో ఒక రాత్రి గడిపారు. ఉదయమే ఏమీ ఎరగనట్లు తిరిగొచ్చారు . ఆ పనే నేనూ చేస్తే మీరు నన్ను ఇంటికి రానిచ్చే వారేనా? చెప్పండి "
సిగరెట్ వెలిగించారు. మరో సిగరెట్ తీసి నా పెదవుల మధ్య ఉంచారు. వెలిగించ బోయారు నేనూ ఖంగారు పడి ఆ సిగరెట్ ని తుంచి అవతల పారేసి ఆ వాసనకు వాంతి వచ్చినంత పనై నోరంతా మంచి నీళ్ళతో కడుక్కుని వచ్చాను. కళ్ళు చెమ్మగిల్లినాయి. ఈ వింత సంఘటన నుంచీ వెంటనే తేరుకోలేక పోయాను.
"నేను బ్రతకాలని లేదా మీకు" మళ్ళీ మంచం మీద కూర్చుని అడిగాను. రాత్రి పది దాటింది. అంతా నిద్రపోతున్నారు.
"పెదవుల మధ్య సిగరెట్ ఉంచి నందుకే ఇంత ఖంగారు పడి కళ్ళ నీళ్ళు పెట్టుకున్నావే, నువ్వు లాడ్జి కి వెళతావా సుభా. ఈ జన్మ లో నువ్వా పని చెయ్యలేవు. లాడ్జి లో ఉండే ఆ స్త్రీలు వేరు, వాళ్ళ మాటలు వేరు. వాళ్ళ ప్రవర్తన వేరు. నువ్వంత విశాల హ్రుదయురాలివి కాదు సుభా. కాలేవు కూడా"
వారి చేతిలో సిగరెట్ పూర్తికా వచ్చింది. కిటికీ లో నుంచీ పారేశారు. పక్కన మంచం మీద పడుకున్న రెండో వాడు కదిలాడు. చిచ్చి కొడితే వాడూ పడుకున్నాడు.
"నా పవిత్రత యందు మీకు సంపూర్ణ మైన విశ్వాసం ఉన్నది. కృతజ్ఞురాలిని. కాని కారణంతరాలవల్ల నేను అపవిత్రురాల్ని అవుతాను సహృదయంతో మీరు నన్ను స్వీకర్తిస్తారా"
"తప్పకుండా స్వీకరిస్తాను."
నిరుత్తరురాలినయ్యాను. వాదనకు పూనుకున్నారని తెలుసు.
"అటువంటప్పుడు ఏ పతితనో పెళ్ళాడితే పోయేది గా మీకు పేరూ వచ్చేది. మీ ఆదర్శాలూ నిలబెట్టుకునే వారు. ఎందుకూ సాహించని నన్నెందుకు పెళ్ళాడారు.
మాట్లాడలేదు, సమాధానం చెప్పగల సమర్ధులైన చెప్పదలచుకోలేదేమో! గోళ్ళు కొరుక్కుంటూ కూర్చున్నారు.
"మీ భార్య పవిత్రురాలిగా ఉండాలని మీరు కోరుకున్నప్పుడు నా భర్త మవిత్రుడి గా ఉండాలని నేను కోరుకోటం లో తప్పు గాని, అత్యాశ గాని లేదేమో, ఇన్ని ఉదాహరణలు చెప్తున్నా నంటే ఇవన్నీ మీకు తెలియవనీ , మీకు పాఠాలుగా బోధిద్దామనీ కాదు, నా మనో వేదన మీకు అర్ధమయ్యేలా మీ మనస్సు కూ హృదయాని కీ తాకేలా విన్నవించుకుంటున్నాను. మీ భార్య త్రాగుబోతు, వ్యభిచారి అని ఒక్కసారి ఊహ మాత్రం గా నైనా మీరు రెండు నిమిషాల పాటు ఊహించుకు చూడండి. మీ మనస్సు ఎంత కలవరపడుతుందో . కాని, నా భర్త త్రాగుబోతు, జూదరి, వ్యభిచారి అని తెల్సి కూడా నేను మనస్సులో బాధపడుతున్నానే గాని మిమ్మల్ని ద్వేషించడం లేదు. సన్మార్గం లోకి తిప్పాలనేదే నా ఆకాంక్ష. కోరిక, ఆవేదన. అది నా మనో దౌర్భల్యమనండి. ఆడది కనుక ఏమీ చెయ్యలేక ఇట్లా వాపోతున్నదనండి. ఎట్లా అనుకున్నా మీరు గౌరవంగా జీవించటమే నాకు కావలసింది" అన్నాను.
ఏం సమాధానం చెప్పలేక నా గుండెల్లో ముఖాన్ని దాచుకుని కన్నీరు పెట్టుకున్నారు.
మరొక మాసం గడిచింది. వారి ప్రవర్తన లో మార్పు కలిగిందనే ఆశించాను. క్రుతజ్ఞాత్యురాల్న యాననే భావించాను. మనస్సు సంతోషంతో పిల్లి మొగ్గలు వేసింది. లాటరీ లో లక్ష రూపాయలు బహుమతి వచ్చినా అంత ఆనందం కలుగదేమో.
అమ్మకూ, సునంద కూ చీరెలు పూర్తిగా చిరిగి పోయాయి. కట్టుకునేది కాక మరొక చీరే మాత్రమే ఉండేది. అవీ జీర్ణావస్థలోనే ఉన్నయ్యి. కోర్టు వ్యవహారాలు కూడా పరిష్కారం కాలేదు. ఈ స్థితిలో నా జీతం రాగానే ఇద్దరికీ చేరి రెండు చీరెలూ, జాకెట్ గుడ్డలూ పిల్లలిద్దరికీ చొక్కాలు, లాగులూ కొన్నాను. అంతా నూట పాతిక రూపాయలు పైగా అయింది. ఆ క్రితం నెల్లోనే అత్తయ్య కూ రెండు చీరెలు కొనటం తో ఈ నెల్లో ఆవిడకు తీసుకోలేదు. రెండు మసాల నుంచి అంటే అమ్మా, అక్కయ్య వచ్చి నప్పట్నుంచీ నా జీతం నన్నే తీసుకో మంటున్నారు. ఎవరి జీతమైనా ఇద్దరం కలిపే వాడుతున్నాం.
ఇంటికి రాగానే ఈ బట్టలన్నీ వారికి చూపించాను.
"నేను రెండు టేరిలిన్ పాంట్లూ, రెండు టేరిలిన్ చొక్కాలు కుట్టించుకోవాలనుకున్నాను సుభా. నీ జీతం సగం పైగా అయిపొయింది . ఇంటి ఖర్చుల క్కూడా మిగతా జీతం ఇద్దరిదీ కలిపినా చాలదు. ఇక నా కోరిక వాయిదా వేసుకోవలసిందే" అన్నారు. ముఖంలో అయిష్తర వ్యక్తమయింది.
దడ్నేం మీద అమ్మకున్న ఒక్క చీరే. అక్కయ్య కున్న ఒక్క చీరే తీసుకొచ్చి వారికి చూపించాను.
"కట్టుకున్న చీరే కాక చెరొక చీరే మాత్రమే వాళ్ళ కున్నది. పండక్కి కొన్నట్లుగా వాళ్ళకేం కొనలేదు. రోజువారీ కట్టుడు చీరలే కొన్నాను. వాళ్ళను గురించి మీరు బట్టలు కుట్టించు కోటం మానేయ్యకండి. వెచ్చం కొట్టు వాడికి వచ్చే నెల్లో తీరుస్తానని నేను చెప్తాను" అని సర్ది చెప్పాను.
"బట్టల సంగతి కేం గాని వీళ్ళ కోక శాశ్వత మైన ఉపాధి ఏదైనా ఏర్పాటు చెయ్యాలి. ఎల్లకాలం మనం పోషించనూ లెం. వాళ్ళకూ గౌరవం కాదు"
"నాన్న చేసింది ఎలిమెంటరీ స్కూల్ టీచరు ఉద్యోగం. ఏ నెలకా నెల అయన గొర్రె తోక జీతం ఇంటి ఖర్చులకే చాలేది కాదు. అన్నయ్య సంగతి మీకూ తెలుసు కదా! వాడు పోయి జైల్లో కూర్చున్నాడు. ఈ పరిస్థితుల్లో వాళ్ళెక్కడికి వెడతారు చెప్పండి."
"నాకా సంగతి తెలీదు. నీకు నేను కావాలో మీ అమ్మ, అక్కయ్యా కావాలో తేల్చుకో. నెల రోజుల్లో ఈ వ్యవహారం తేలిపోవాలి."
నా నెత్తిన పిడుగు పడ్డట్లయింది . మా ఇద్దర్నీ కూర్చి నందుకు ఆ భగవంతుణ్ణి ఏమిటో అయిష్టతగా అనుకున్నాను. తెలిసీ తెలియని రెండు మూడేళ్ళ పిల్లలు మారం చేస్త్గూ ఉంటారు. బాలు కొనిస్తే లక్క పిడత కావాలంటారు. ఆ లక్కపిడత ఇస్తే దాంట్లో అన్నం అట ఆడుకునేందుకు ఏ కంది పప్పో కావాలని గొడవ చేస్తారు. కంది పప్పు చారెడు పోస్తే పంచదారో, బెల్లం ముక్కో కావాలని మారాం. అందుకూ వాళ్ళ కోరిక తీరిస్తే. ఈలోగా ఆ బూరా పేలిపోతుంది. వెంటనే తాడు కట్టి ఈడ్చుకునే రైలో, కారో కావాలని ఏడుపు కాళ్ళు, రెండూ బాదుకుని మనల్ని ఏ పనీ చేసుకోనివ్వకుండా కాళ్ళకు అడ్డాలు పడి, కింద పడుకుని దొర్లుతూ రభస ఎట్లాగో ఈ గోల భారాయించ లేక ఓ నాలుగు రూపాయలు పెట్టి "కీ" యిస్తే తిరిగే మోటారు కొని పెడితే అది వారం రోజుల్లో పాడు చేసి ఏ చక్రానికా చక్రం ఊడదీసి పాడయి పోయిందని సణుగుడు.
ఆ రకమైన చిన్న పిల్లల మనస్తత్వం లానే ఉంది వారి మనస్తత్వమూ పాత సమస్యలు వదిలాయను కుంటే ఇప్పుడీ కొత్త సమస్య తీర్చరానిదే అయింది.
అమ్మా, అక్కయ్యా ఎక్కడికి వెళ్ళతారండి నాన్న చనిపోవటం చేతా. పోషించే దిక్కు లేక పోవటం చేతా. తల దాచుకోటానికి ఇల్లయినా లేకపోవటం చేతా వాళ్ళని ఇక్కడికి తీసుకు వచ్చానే గాని నా ఆస్తి తినేవాళ్ళూ లేక కాదే. వాళ్ళ కున్నది రెండు గోతాల పాత సామాను. రెండు మంచాలు, నాలుగు పెట్టెలూ నాలుగు బిందెలూ మినహా మరేమీ లేవు. ఈ స్థితిలో వాళ్ళు మాత్రం ఎక్కడికి వెళతారు. కొత్త పెచీకి ఈ పాత సమస్యను అడ్డు వేసి పరిష్కారానికి అందని సరి కొత్త పెచీని సమయాను కూలంగా ప్రవేశ పెట్టారు.
"వాళ్ళను వేరే ఉంచినందువల్ల ఆ ఖర్చు మనకే ఎక్కువవుతుంది కదూ. ఆ పరిష్కార మేదో మీరే ఆలోచించండి. నెల రోజులు కాదు రేపే వాళ్ళను చంపేస్తాను." బ్రతిమాలు తున్నట్లే చెప్పాను.
"మీ అమ్మ సంగతి తరువాత చూద్దాం. మీ అక్కయ్య ను కాకినాడ తీసుకు వెళ్లి మీ బావ దగ్గర దిగవిడిచి రా. ఆరు వేలు కట్నం తీసుకుని పుస్తీ కట్టింది ఆయనా, తిండి పెట్టటం నేనూనా" గట్టిగా అరుస్తూ అన్నారు.
"మీకు పుణ్యం ఉంటుంది నెమ్మదిగా చెప్పండి. అమ్మ వింటే బాధపడుతుంది.
ఈ మాట విని అత్తయ్య వచ్చారు. అమ్మ పెరట్లో కూర్చుని కుమిలి పోతున్నది. అక్కయ్య కూడా అమ్మ దగ్గరే కూర్చుంది.
"ఎక్కడికయినా పోదాం పదవే అమ్మా. ఈ అల్లుడితో చివాట్లు తింటూ ఇక్కడెందుకూ. పోనీ నేను కాకినాడ వెళ్ళేదా. ఆయనా నన్ను ఏలుకుంటారేమో ఈ మధ్య కోర్టు వాయిదా క్కూడా నేను వెళ్ళక్కర్లెడంటున్నారు ప్లీడరు గారు. వార్ని చూసి చాలా రోజులైంది. చూడాలని ఉందే అమ్మా ఇహిహిహి" అని వెకిలిగా నవ్వింది అక్కయ్య.
"పోదాం పద ఇద్దరం గోదావరి లో దూకితే ఈ జన్మకు ఈ పీడ విరగడై పోతుంది. అంత కన్న మార్గం లేదు" ఏడుస్తూ అన్నది అమ్మ.
"ఒరేయ్ అబ్బీ. నువ్వీరకంగా పేచీలు పెట్టావంటే వాళ్ళ కన్నా ముందు నేను వెళ్లి పోతాను జాగ్రత్త" అన్నది అత్తయ్య.
"నా సొమ్ము తినటానికి ఎంత బాధ్యత ఉందొ నేననే మాటలు కూడా అంత బాధ్యత తోనూ స్వీకరించాలి. అల్లుడు సొమ్ము తినొచ్చు కాని మాట పడరేం. నువ్వేం నన్ను బెరించక్కర్లేదు అవసరం పడితే నువ్వూ వెళ్ళాల్సోస్తుందేమో" అని విసురుగా వెళ్లబోయారు. వారి చెయ్యి పుచ్చుకున్నది అత్తయ్య.
"అంతవరకూ వస్తే అందుకు నా సమాధానమూ ఉన్నది. తల్లిని భార్య పిల్లల్నీ పోషించవలసిన బాధ్యత నీకు ఉన్నదా లేదా.
"ఉన్నది కాని బాధ్యత ఆర్ధిక పరిస్థితిని బట్టి ఉంటుంది."
"అట్లాగే దాని సంపాదనతో వాళ్ళిద్దర్నీ పోషిస్తున్నది . అదేం వాళ్ళకు తవ్వి తలకేత్తటం లేదు. రవ్వంత విషయాన్ని రచ్చకీడ్చి నీ మనస్సు పాడుచేసుకుని మా మనస్సు పాడు చెయ్యకు" అని వెళ్ళి అమ్మను ఊరడించినది అత్తయ్య.
"సరే కానివ్వండి మీరంతా కలిసి నా మీద కత్తి కట్టారు. ఆ కత్తితో ఎవరి పీక తెగుతుందో ఎవరు చెప్పగలరు."
ఒక ఆదివారం ప్లీడరు గారింటికి వెళ్లాను. ఆయనా కాస్త దూరపు బంధువు అక్కయ్య కేసు చూస్తున్నది ఆయనే. పేరు కేశవరావు. ఆయనతో అక్కయ్య విషయం చర్చించాను.
"మా పరిస్థితి అంతా మీకూ తెలుసు. అక్కయ్య ను బావ దగ్గరకు కాకినాడ పంపవచ్చా."
"లేదమ్మా. రాజీపడి కేసు పరిష్కారం చేసుకుంటే తప్ప ఈ స్థితిలో పంపటానికి వీల్లేదు. అప్పుడే కేసు స్వభావం ఇంకో రకంగా మారుతుంది. ముందు మధ్య వర్తి ద్వారా సంప్రదింపులు జరపండి. అతని నడకన బట్టి మనమూ ఆలోచిద్దాం" అన్నాడాయన.
ఇంటి కొచ్చి ఈ విషయం వారితో చెప్పాను. వచ్చే ఆదివారం ఇద్దరం కాకినాడ వెళదామని చెప్పెను. నాకేం సంబంధం రానన్నారు. మూడు రోజులు నచ్చ చెప్పిన మీదట ఒప్పుకున్నారు.
