Previous Page Next Page 
వంశాంకురం పేజి 13

 

    రంగారావు స్వయంగా వచ్చి, కొడుకును కాలేజీ లో చేర్పించారు. నాల్గు రోజులు సెంట్రల్ స్టేషన్ దగ్గరలో గల ఎవరెస్ట్ లాడ్జి లో ఉన్నారు. తండ్రి స్నేహితుని సాయముతో మెంటల్ ఆస్పత్రి వెనుక అప్పుడే డెవలప్ అవుతున్న వెంకటాపురము కాలనీ లో ఒక ఇల్లు సంపాదించాడు. ఒక గది కాదు కాబట్టి ఇల్లు అనాలి. ఒక గది, వెనుకా, ముందు వరండాలు, పక్కన ఓ వంట ఇల్లూ ఉన్నాయి. హోటల్ టికెట్టు బుక్ కొని, భోజనము చేసే ఏర్పాటు జరిగింది. రంగారావు కొడుకు చేతిలో కొంత డబ్బు పెట్టి జాగ్రత్తలు చెప్పి తిరుగు ప్రయాణమయ్యాడు. తండ్రిని బండి యెక్కించి వెనుతిరిగిన ఆనంద్ కు కళ్ళమ్మట నీళ్ళు తిరిగాయి." మద్రాసు వంటి మహా పట్టణం లో ఒంటరిగా ఉండాలి. వేళకు అన్నీ అమర్చడానికి అమ్మ లేదు. హెచ్చరించడానికి నాన్న లేడు. బలవంతంగా మనసు మరో దిక్కు త్రిప్పాలని చూచాడు. సినిమా దియేటర్లు ఎక్కడుంటాయో తెలియదు. అందులో తెలుగు సినిమా ఆడే దియేటరెక్కడో తెలియలేదు. పేవ్ మెంట్ మీద నిల్చున్న ఓ అతన్ని పిలిచాడు.
    ఏమండీ. తెలుగు సినిమా ఆడే దియేటరు తెలుసా?"
    "యెన్న సామీ?' విసుగ్గా చూచాడు . "పోరాపోన్న సామీ" అనుకుని ముందుకు నడిచాడు. మద్రాసు లో మరో గొడవ. అరవము రానివాడు కానీకి గోరకాడు. కాస్త దూరములో నిల్చున్న ప్యాంటు వాలాను పట్టాడు. అతను ఇంగ్లీషు లో వివరాలన్నీ చెప్పాడు. సరే అనుకుని, ఎదురుగా ఉన్న రెస్టారెంట్ లో దూరి, వడ,దోసె సుష్టుగా తిని సినిమా కెళ్ళాడు. మద్రాసు లో తెలుగు సినిమా చూడడమంత పాపమూ మరొకటి లేదు. అంటే అరవాభిమానులకు కోపము వస్తుందేమో. అది ఆనంద్ వ్యక్తిగత అభిప్రాయము మాత్రమే. అంతా తెలుగు వారే కాక అరవవారు కూడా వస్తారు.
    "ఇది ఎన్నడా తంబీ?" ఒకతను ఈచివర నుండి, ఆ చివర కూర్చున్న పెద్ద మనిషిని అడుగుతాడు.
    "నాగేశ్వరరావు సావిత్రికి లవ్ లెటర్ కురిడేకేరాం. అవన్ వాండా సోల్లిం-------"
    "అదువా? సావిత్రిదాం ......రొంబ నన్న......" అతని మాట పూర్తీ కాక మునుపే మరో అతను గయిమని లేచాడు.
    "ఏమిటయ్యా , ఎన్నడా, పోన్నడా . జన్మకో శివరాత్రిని తెలుగు సినిమా కొస్తే మీ గోల యేమిటి? ఇంటి కెళ్ళి చెప్పుకోరాదూ." అతని మాటల కిరువురు గోనుక్కుని ఊర్కున్నారు. పది నిమిషాలు నిశ్శబ్దంగా గడిచాయి.
    "మామీ........సావిత్రి పౌడవ ఇల్లియా........ఇంద,మాదిరి పౌడవ వాంగరడ"
    "వేల యెన్న?"
    "అం బత్తంజిరువా . పట్టు మామి వేలై క్కారి వందాళా?"
    "యేనకు తెరియాదు." మరెవరో విసుక్కోటముతో ఇరువురు ఊర్కున్నారు. సినిమాలో సగము భాగము ఇలాగే గడిచింది. యెలాగో సినిమా అయిందని పించి బయటకు వచ్చాడు. ఇల్లు చేరితే , మళ్ళీ ఒంటరితనము భయంకరముగా కనిపించింది. ఇంటి వారి మాటలు అవుట్ హౌస్ వరకు వచ్చి చెవుల వద్ద రోద పెడుతున్నాయి.  బలవంతంగా కళ్ళు మూసుకున్నాడు.
    రెండవరోజు ఉదయము లేచి కాలకృత్యాలు తీర్చుకుని దగ్గరే ఉన్న హోటల్ లో కాఫీ త్రాగి వచ్చాడు. డ్రస్సు ముగించి హోటల్ భోజనము చేసి, కాలేజీ కి వెళ్ళాడు. అక్కడ ముగ్గురు ఆంధ్రులు కలిశారు. ఒకతను గోవిందు , కాకినాడ నుండి వచ్చాడు. రెండో అతను చక్రవర్తి రాజమండ్రి నుండి వచ్చాడు. మూడో అతను హైదరాబాద్ దగ్గర ఏదో ఊరి నుండి వచ్చాడు. అందరూ అప్ర్తులలా మాట్లాడుకున్నారు. మిగిలిన వారికీ దూరంగా. తమ జట్టు ఏర్పరచుకున్నారు. కాలేజీ లో అతననుకున్నంత ప్రాబ్లం ఏం లేదు. వాళ్ళు సీనీయర్స్ అయినా అతనితో కలిసిపోయారు. ఆనంద్ ను బాధించిన విషయమేమిటంటే , హోటల్ వాడు రోజూ అరిటికాయ కూరో, కూటో, పులుసో పెరుగులో వేసియో పెట్టటము, వాళ్లకు కూడా విద్యార్ధుల సంగతి తెలుసు. అందుకే వారి విషయంలో అశ్రద్ధ చేస్తారు.

 

                                   


    "అయ్యరూ, అరిటికాయ తప్ప మరే కూరలు దొరకవా?' విసుక్కుని అడిగాడు.
    "మురగా! దాని రుచి దేనికిదా వచ్చును?' అయ్యరు యెదురు ప్రశ్న వేశాడు.
    "నాతలకు వస్తుంది విసుక్కుంటూ చెయ్యి కదిగాడు. అతను బొమ్మలు ముడిచి తన మాటల వేగవృద్ది క్రమము బాగా పెంచాడు. ఆనంద్ ఘర్షణ కాకూడదని చిటపటలాడుతూనే కాలేజీ కి వెళ్ళాడు.
    "ఏవిట్రా , ముఖమలా మాడ్చేవూ? దీర్ఘం తీశాడు గోవిందు.
    "ఉదయమే ఎవరితో నైనా తగదా పడ్డావా ఏం?"
     "జల్ది చెప్పరా. అవతల గంట అవుతుంది." విలియమ్స్ అడిగాడు.
    "ఏం లేదురా . మా అయ్యరు తో గొడవ. రోజూ అరిటికాయ పెడతావేమయ్యా అంటే దానికంటే రుచికరమైన దేముంది అంటాడు నిజంగా మండిపోయింది.
    "నాయనా పోయినా సంవత్సరము మేమూ బాధపడ్దాము. అందుకే ఈసారి మాట కరుకైనా రుచి మంచిగా ఉంచుతుందో అత్తగారు. ఆమె వద్ద భోజనము చేస్తున్నాము." చక్రవర్తి చెప్పాడు.
    "అవునురా. పాపం విలియమ్స్ పరిస్థితి చూడాలి. వాడు యే కూరకాయతో నైనా సరే పిసరంత మాంసము ముక్క లేనిదే తినేవాడు కాదు, అలాంటి వాడికి అరటికాయ , వంకాయ పెడితే పాపమూ అదిరి పోయి హైదరాబాద్ చెక్కేస్తానన్నాడు." గోవింద్ అన్నాడు.
    'అరె మాటలు మాట్లాడుతావు గాని, ధనియాల పొడి కంపంటూ ఏడవలేదు వీడు ఒట్టి జూటాకోర్ రా" విలియమ్స్ చెప్పాడు.
    "ఒరేయ్! తగవులు కట్టిపెట్టి ఆ అత్తగారి వైనమేమో చెప్పండిరా."
    "నీకు దగ్గరేరా కోసూరు హైరోడ్డు వెడుతుందే, అక్కడే ఓ చిన్న యింటిలో ఉంటుందో అరవ చిన్నది. నెలకు మేము ముగ్గురమూ , తొంబై రూపాయలు ఇస్తాము. అన్నము, ఒక కూర, సంబారు, పచ్చడి , మజ్జిగ తో భోజనము పెడుతుంది. రోజు కోరకముగా వెరయిటీగా చేస్తుందని ఘంటాపదంగా చెప్పగలను. కాని కాస్త ముఖము ప్రసన్నంగా చేసి మాట్లాడబోయామా , చూపులతోనే మాడ్చేస్తుంది."
    "ఆవిడతో ప్రసన్నంగా మాట్లాడాలనే రాపత్రయము దేనికిరా?"
    "ఒరేయ్ ఆనంద్ నీ పేరెవరురా పెట్టింది?" అం....మొగబుద్దో, మోటు బుద్దో. ఆడపిల్ల కనిపించితే మాట్లాడాలని ఉండదా?" చక్రవర్తి అడిగాడు.
    "ఏడ్చావు , అడబుద్దో, అల్పబుద్దో అమ్మవారి అవతారము ఎత్తాలని ఉండదేమిటిరా? మనకా బాష సరిగ్గా రాదు. మన పాఠాలు మనము చదువుకుని హాయిగా వెళ్ళి పోదామురా , ఎందుకొచ్చిన గోల. నోరా వీపుకు తేకే...."
    "అనవయ్యా బాబూ నీ నీతి శతకము ఇంతకీ మా అత్తగారి భోజన వసతి గృహము లో సభ్యత్వము పుచ్చుకుంటావా లేదా?"
    "నిస్సందేహముగా పుచ్చుకుంటాను. నేను వచ్చి నా మంచితనము నిరూపించుకోవాలా, లేక డబ్బు మీరు కడితే చాలా?"
    "మా అత్తగారికి డబ్బుతో పనిరా. తరువాత నీ మంచితనము తనే తెల్సుకుంటుంది. మనము నలుగురము వెళ్ళితే ఇల్లు కాస్త ఇరుకవుతుంది.' అన్నాడు చక్రవర్తి.
    "యెవడి కోసమోయ్? డబ్బు పుచ్చుకున్నట్టు వసతి అమర్చాలి. పాత మంచము వాల్చే బదులు గోడను పెడుతుంది." అలా స్నేహితులు మాట్లాడుకుంటుంటే, ఆనంద్ ఆ సంభాషణకు ప్రాముఖ్యం ఇవ్వలేదు. కొందరు అరవ స్త్రీలు అతి తెలివి గలవారు. ఇంటి పట్టు నుండి డబ్బు సంపాదిస్తారు. ఈ అత్తగారు ఆ జాతికి చెందినదే కావచ్చునని అనుకున్నాడు. చక్రవర్తి, రెండవ రోజు ఉదయమే వచ్చి, అత్తగారూ అంగీకరించిందని, భోజనానికి రావచ్చని చెప్పాడు. స్నానము ముగించి వెళ్ళాడు. చిన్న సందులో, చిన్న ఇల్లు. ఇంటి ముందున్న ముగ్గు చూస్తూనే ఊహించవచ్చు, ఇంట్లో ఉండే స్త్రీ యెంత నేర్పరియో, చిన్న ఇంటిలోనే రెండు మూడు వాటాలుగా చేసినట్టున్నారు. యెడమ వైపు కున్న గుమ్మము వైపు వెళ్ళారు. అప్పటికే గోవింద్, విలియమ్స్ కూర్చుని ఉన్నారు. ఆనంద్ ఇంటిలికి పొర చూచాడు. అది ఇల్లా, గది ఒక మూల చిన్న ట్రంకు పెట్టె పైన పరుపు చుట్ట పెట్టె ఉన్నాయి. మరో గోడ వైపు గోడకు ఆన్చిన నులక మంచము ఉంది. రెండు పెద్ద మేకుల ఆధారముతో నిలిపిన చెక్కపై , చిన్న అద్దము , అట్టలు వేసిన నాల్గు పుస్తకాలు, కుంకుమ భరిణి పెట్టి ఉన్నాయి.
    'ఈ పూట అత్తగారి వంట కాలస్యములా ఉందే?"
    "వంట యెప్పుడో అయిందిరా. మనకంటే ముందు వచ్చే మేళం భోజనము చేసి పొయిందిరా,"గోవింద్ అన్నాడు.
    "మనకంటే ముందు వచ్చే జట్టు పాతిక రూపాయలే ఇస్తారుట. అత్తగారు చేసే అన్యాయము చూడు , పచ్చడి, మజ్జిగ, ఆదివారాలు చేసే స్పెషలు లేదుట."
    "ఇందులో అన్యాయమేముందిరా. అయిదు తక్కువ ఇస్తున్నారు. అధరువులు తక్కువ అమరుతున్నాయి.' గోవింద్ అత్తగారికి సపోర్టు పలికాడు.
    "ఒరేయ్ గోవిందూ! నిన్నగాని వంకాయ బజ్జి చాలావేసిందేమిట్రా ? అంతలా సపోర్టు పలుకుతున్నావు. మనందరి దగ్గర కొట్టిన డబ్బు ఏం జేస్తుంది?"
    మీరిలా మాట్లాడటము వింటే, ఆవిడ యేమనుకుంటుందిరా?"
    "అనుకోడానికి ఆవిడకి మన బాష అర్ధం అయితేగా?"
    "అరవము తప్ప మరేం రాదా?"
    "రానట్టే వుంది. కట్టే, కొట్టే , తెచ్చే అపద్దతిరా." చక్రవర్తి చెబుతుండగానే ఓ పదేళ్ళ కుర్రవాడు నల్గురికి విస్తరు  వేసి, శుభ్రంగా తోమిన కంచు గ్లాసు లతో నీళ్ళు పెట్టి పోయాడు.
    "వీడెవడు అత్తగారి పుత్రుడా?"
    "ఒరేయ్ఆనంద్! అత్తగారంటే పెద్ద మనిషనుకున్నావుట్రా? చిన్నదని నీకు చెప్పలేదూ? వీడు మనలాంటి వాడే. అంటే పనిచేసి పెట్టి అత్తగారు పెట్టె ఉచిత భోజనము స్వీకరిస్తాడు."
    "తంబీ! 'ఇంగేవా..." లోపలి నుండి ఓ మృదువైన కంఠం వినిపించింది. కుర్రవాడు వెళ్ళి , పచ్చడి వడ్డించి, తన కంచము తెచ్చుకుని కూర్చున్నాడు. కుడి ప్రక్కకున్న చీరతో కట్టిన తెర తొలగించుకుని, ఒక స్త్రీ అన్నము పళ్ళెముతో ప్రవేశించింది. ఆనంద్ ఆమెను చూచి రాతి బొమ్మలా అయిపోయాడు. యెంత మందిలో ఉన్న, చేరెడు కళ్ళు, గుండ్రని ముఖము, తమ పరిచయాన్నితెలుపుతాయి. ఒక క్షణము కళ్ళు తాటించిన ఆమె ముఖము లో రంగులు మారాయి. ఆమె యెవరో కాదు, సీతారామయ్య ఏకైక పుత్రిక సురేఖ.
    "ఒరేయ్ అలా చూడకురా. వేడి అన్నము ముఖాన కొడుతుంది." హెచ్చరించాడు గోవిందు. ఆనంద్ తేరుకున్నాడు. అతను ఇరకాటము లో పడినాడు. తన పరిచయమున్నట్టు తెలుపాలా వద్దా, అని, యే కారణము చేతనో తెలుగురానట్టు నటిస్తుంది.    
    "బావున్నారా ఆనంద్ గారూ!" ఆమె పలుకరించింది. అందరు పక్కలో బాంబు పడ్డట్టు చూచారు.
    "కనిపిస్తున్నానుగా! నాన్నగారు లేరా?' ఆనంద్ చిరునవ్వుతో అడిగాడు.
    "ఎగ్మూర్ లో ట్యూషన్ ఉంది. ఉదయము వెళ్ళితే సాయంత్రము గాని రారు. మీరు ఈ ఊరు యెప్పుడోచ్చారు?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS