Previous Page Next Page 
ఇంద్రధనుస్సు పేజి 13

 

    బావిలో  బండ పడగానే అగ్గిరాముడై పోయాడు జగన్నాధం. ఆరోజు కనపడ్డ వాళ్ళ నల్లా తిట్టాడు. పది పదిహేను మంది కూలిలను చావ బాదాడు. భోజనం వద్ద భార్యను తిట్టాడు. ఇందిర శుద్ధ మట్టి బుర్రని, ఇంటరీ జన్మలో పాసు కాలేదని చిందులేశాడు. అందరూ అతని తత్త్వం తెలిసిన వాళ్ళే కాబట్టి, ఎవరూ నోరు మెదపలేదు.
    మరుసటి రోజు ఉదయమే బయలుదేరి చిత్తూరు కు వెళ్ళాడు. సాయంకాలానికల్లా ఒక మలయాళీ తోనూ, సంచెడు డైనేమైట్ల తోనూ దిగాడు. ఆ మలయాళీ నాట్లు పెట్టడం ప్రారంభించాడు.
    నాట్ల శబ్దంతో ఊరూ, ఊరు ప్రక్కనే ఉన్న ఆవుల కొండా దద్దరిల్లిపోయాయి. బావి గట్టు మీద ఎనిమిది రోజుల్లో చెయ్యెత్తు రాళ్ళ గుట్ట తయారయింది. కానీ బావిలో పడ్డ బండ మాత్రం అంతు చూపలేదు. మలయాళీ లాభం లేదని చెప్పి వెళ్ళిపోయాడు.
    జగాన్నాధం కోపం మిర్రెక్కింది. మద్రాసు నుంచి  గొప్ప ఇంజనీరు ను పిలిపించాడు. అతడు ఒక రోజంతా పరీక్ష చేసి "ఈ బండ తేలదు. చాలా లోతు దాకా ఉంది" అన్నాడు. జగన్నాధం గారు ఊట సంగతి అడిగారు. ఊట కూడా ఈ బావి లోంచి పోవడం లేదు అన్నాడు ఇంజనీరు.
    జగన్నాధం తల తిరిగిపోయింది. యుక్తా యుక్తాలు తోచటం లేదు. ఆగ్గి రాముడై యింటికి వచ్చాడు. అతడి కోపం చల్లారలేదు.
    'ఇందిరా!" ఇల్లు దద్దరిల్లేలా పొలికేక పెట్టాడు.
    "లేదండి.' అంది భార్య గదిలోంచి.
    "అవును, ఉండదు! నిన్ననేగా పాలేరు రాముడు చెప్పాడు, ఇందిర ప్రకాశం ఇంటికి రోజూ వెడుతుందని? మానం లేదూ? తన్ను పెళ్ళి చేసుకోనన్న వాడి కొంప కేలా వెళ్ళుతుంది? రాముడు ఇంకో విషయం గూడా చెప్పాడు. ప్రకాశం యింట్లోనే ఉన్న ఆ హైస్కూలు మాష్టారు భానుమూర్తి తో చనువుగా ఉంటుందట. ఈ రోజు రానీ-- శని వదిలిస్తాను....'
    తల వాకిట్లోనే కూర్చున్నాడు జగన్నాధం. పది నిముషాల్లో ఇందిర చేతిలో సందెడు పుస్తకాలతో వచ్చింది.
    "ఆ వెధవ ప్రకాశం గాడి యింటి నుంచేనా?' రంకె వేశాడు జగన్నాధం.
    ఆశ్చర్యపోయింది ఇందిర. తాను ప్రకాశం ఇంటి కెడతానని ఎవరు చెప్పారు? ఉన్నారుగా వార్తా హరులు! ఎవరో చెప్పి ఉంటారను కుంది.
    "అవున్నాన్నా. కానీ ప్రకాశం తో నాకేం పని? భానుమూర్తి గారి వద్ద కెళ్ళి ఇంగ్లీషు పాఠం చెప్పించుకొంటున్నాను. నాకేమో ఇంటరు పోయిందని సిగ్గుగా ఉంది. నువ్వేమో ట్యూషన్ వారి వద్ద చెప్పించవు. నా ఖర్మ" అంది అమాయికంగా.
    అంతలో పాలేరు రాముడు వచ్చాడు.
    "మీ కోసం పంచాయితీ దొర వచ్చినాడయ్యా' అన్నాడు.
    జగన్నాధం కోపాగ్ని మీద ఆ మాటలు వానజల్లులయ్యాయి. అతని కోపం చప్పగా చల్లారి పోయి ముఖం దీపంగా మారిపోయింది.
    రేపు నెల్లోనేగా పంచాయితీ ఎలక్షన్లు? అందుకోసం వచ్చాడేమో అనుకుని భార్యతో వంట సంగతి హెచ్చరించి బయలుదేరాడు.
    ఇదే సందనుకుని ఇందిర ఇంట్లోకి జారుకుంది.
    ఏప్రిల్ నెల ప్రారంభం కాగానే ఎండలు నిప్పులు చేరుగుతున్నాయి. ఎసుర్లోని బియ్యం లా గిల గిల్లాడిపోతున్నారు మనుషులు. మొదట నాటిన నంబరు వడ్ల మళ్ళు కోశారు. ప్రకాశం మడి కోతల్లో చాలా తీరిక లేకుండా ఉన్నాడు. మడి కోసి కుప్ప వేయించాడు. విశ్వనాధయ్య గారి మడి కూడా కోత అయి పోయింది. భానుమూర్తి నిర్విరామంగా బడి చాకిరీ చేస్తున్నాడు. సంవత్సరాంతం పరీక్షలకు స్పెషల్ క్లాసులు పెట్టు కొని. తరిఫీదు చేస్తున్నాడు. భానుమూర్తంటే విద్యార్ధులకు చాలా గౌరవ మేర్పడింది. అతని క్లాసంటే విద్యార్ధులు చెవి కోసుకుంటున్నారు. హెడ్మాస్టరు , భానుమూర్తి ని చాలా ప్రేమగా చూస్తున్నారు.
    మే నెలలో పంచాయితీ ఎన్నికలు జరుగుతాయని ప్రభుత్వ ప్రకటన జరిగింది. ఊరంతా గుసగుస పోతున్నారు. క్రిందటి పన్నెండు సంవత్సరాలు గా గ్రామ పంచాయితీ కి జగన్నాధం పట్టాదారు. కానీ ఈసారి ప్రకాశం పోటీ చేస్తున్నాడని కొందరూ, చేస్తాడని కొందరూ చెప్పుకుంటున్నారు. ఈ మాట వాళ్ళూ వీళ్ళూ వచ్చి తన చెవిలో వేసినప్పుడు జగన్నాధం మండి పోయాడు. అదెలా జరుగుతుందో చూస్తా నన్నాడు.
    ఇదేమీ తనకు పట్టనట్లు తన మడి కోతలు చూసుకొంటున్నాడు ప్రకాశం. ఊళ్ళో పిన్నలూ, పెద్దలు అతని వద్దకు వచ్చి నువ్వు తప్పకుండా నిలబడాలని బలవంతం చేస్తున్నారు. అప్పటి కింకా మెంబర్లు మాత్రం పంచాయితీ అద్యక్షుని ఎన్నుకునే పద్దతి రాలేదు. గ్రామంలో ఉన్న అందరూ ఓటర్లూ ఎన్నుకోవాలి. ప్రకాశం చేతులెత్తే పద్దతి ఈ గ్రామానికి పనికి రాదనీ, ఓట్లు వేసే పద్దతి కావాలనీ జిల్లా పంచాయితీ ఆఫీసరుకు పిటిషను పెట్టాడు. అతడు విచారణకు రాగానే దాదాపు వందమంది రైతులూ, యువకులూ కలిసి వెళ్ళి మహజర్లు ఇచ్చారు. జగన్నాధం తల క్రిందులుగా తపస్సు చేసినా ఓటింగు పద్దతిని రాకుండా చేయలేకపోయాడు. దానితో ప్రకాశం తనతో పోటీ చెయ్యటం ఖాయమని తెల్చుకున్నాడు, జగన్నాధం. ఎలాగైనా అతణ్ణి బాధ పెట్టాలని, తన కాళ్ళ వద్దకు తెచ్చుకోవాలని ప్రయత్నాలు చేశాడు. ప్రకాశం నాన్న తనకు వ్రాసిచ్చిన ఐదు వందల రూపాయల నోటును దాఖలు చేశాడు. ప్రకాశం నిమిషం కూడా ఆలస్యం చేయకుండా కోర్టులో డబ్బు కట్టేశాడు.
    ఉమాపతి మునుపటి లాగే ఉన్నాడు. ఒక రోజు మడికోస్తున్న సాలె పడుచు కొంగు లాగితే అది, "అయ్యోరా! మక్కెలు యిరగేసేను" అంది. ఆరోజు నుంచీ మడి వద్దకు వెళ్ళడం చాలించుకున్నాడు, కానీ, ఈ విషయం విశ్వనాధయ్య గారి చెవి దాకా పోలేదు.
    ఈ విషయం తెలిసి ప్రకాశం మందలించాడు. "నా యిష్టం పొమ్మన్నాడు" ఉమాపతి.
    ప్రకాశానికి ఉమాపతి మాటలు నచ్చలేదు. కండలో ముళ్ళలా ఉన్నాయి అతని మాటలు. 'అలా చెత్త మాట్లాడకు, ఉమాపతీ. అలా నోటితో కూడా ఎందుకు వ్యభిచారం?" అన్నాడు.
    "ఇందిర లాంటి పిల్ల దొరుకుతుందేమోనని" అన్నాడు ఉమాపతి.
    ప్రకాశం లేచి నిలబడ్డాడు.
    "లెయ్" అన్నాడు.
    ఉమాపతి లేచి నిలబడ్డాడు.
    "బయటికి నడు."
    ఉమాపతి తటపటాయించాడు.
    "గెటౌట్!"
    బయటికి నడిచాడు ఉమాపతి.
    "జాగ్రత్త! మొదటిసారి కాబట్టి నీ వాగుడు సహించాను. రెండోసారి వాగావో, నరాలు లాగెస్తాను. నాసంగతి నీకు బాగా తెలుసు. జాగ్రత్త. వెళ్ళు."
    ఉమాపతి ఏమో చెప్పబోయాడు.
    "షటప్! వెళ్ళు!' దాదాపు గర్జించాడు ప్రకాశం.
    ఉమాపతి కిక్కురు మనకుండా వెళ్ళి పోయాడు. గదిలో ప్రకాశం మిగిలి పోయాడు. దాదాపు సాయంత్రం అయిదు గంటలు కావస్తుంది. భానుమూర్తి ఇంకా స్కూలు నుంచి రాలేదు. అతడు ఈ రోజు యిప్పుడే రాడు. స్కూల్లో ఏదో కార్యక్రమం ఉందన్నాడు. ఇందిర ఈలోగా రావటమే లేదు. ఆవిడకు నాన్న గారి అంక్ష! సావిత్రమ్మ కూడా ఇంట్లో లేదు.
    కిటికీలో నుంచి బయటికి చూస్త్గున్న ప్రకాశానికి చేతిలో గిన్నెతో శారద రావటం కనిపించింది.
    శారద లోపలికి వచ్చి 'అత్తయ్యా" అని పిలిచింది. ఎదురుగా ప్రకాశం కనిపించాడు. శారదకు సిగ్గూ, భయమూ కలిగాయి.
    "రా, శారదా" అన్నాడు ప్రకాశం.
    "మీరు ఉండరనుకున్నాను."
    "కానీ ఉన్నాను."
    'అత్తయ్య ఉన్నట్లు లేదే?"
    "అవును, లేనట్టుంది."
    శారద చిన్నగా నవ్వింది. శారద కనిపించే సరికి ప్రకాశానికి కూడా మనసు హాయినిపించింది. శారద వంటింట్లో కెళ్ళి గిన్నె పెట్టి వచ్చి, వస్తాను' అంది. వినపడి వినపడనట్లుగా.
    "రా?"
    "పొండి. మీతో అంతా అల్లరే!'
    "ఎక్కడికి పోమ్మంటావు? నేను ఎక్కడికైనా వెళ్ళాలంటే నీ దగ్గరికే వెళ్ళాలి. కానీ నువ్వే ఇక్కడున్నావు. అందువల్ల ఎక్కడికీ వెళ్ళవలసిన అవసరం లేదు" అన్నాడు ప్రకాశం.
    "మీకో విషయం చెప్పాలని రోజూ అనుకుంటూ ఉన్నాను. కాని నా వల్ల కావటం లేదు" అంది శారద తల వంచుకునే.
    "నాకు తెలుసు."
    ఆశ్చర్యంగా చూసింది శారద.
    "ఎందుకంత ఆశ్చర్యం? నిన్ను చూసి తెలుసుకున్నాను. అందుకు పెద్ద అనుభవం కూడా అక్కరలేదు. కానీ ఒక మాటడుగుతాను. నిజం చెప్పాలి. నువ్వు తప్పకుండా నిజమే చెబుతావు, నాకు తెలుసు. అదో, అలా చూస్తె అడగను. కళ్ళు తుడుచుకో. నా ఎదురుగా ఆడపిల్ల ఏడవకూడదు."
    శారద కళ్ళు తుడుచుకుని భయంగా నిలబడింది.
    "ఎందుకిలాంటి పని చేశారు?"
    "ఎవరు?' అడిగింది శారద.
    "ఇందు కెవరు బాధ్యులో నాకూ తెలీదు. ఎందుకో నువ్వు గూడా నన్ను సరిగా అర్ధం చేసుకోలేదు. నువ్వు కృష్ణాపురం వెళ్ళి రాకపోయినా మన పెళ్ళి జరిగి తీరేది."
    ఇలాంటి విషయాన్నెలా చెప్పాలో ప్రకాశానికి బోధ పడలేదు. ఏదో తోచినట్లుగా అడిగాడు.
    శారద అదిరి పడింది. ఆవిడకు అంతా అర్ధమైంది. తాను కృష్ణాపురం వెళ్ళటాన్ని ఇతను మరో రకంగా అర్ధం చేసుకున్నాడన్నమాట. శారదకు జవాబు తెలుసు. దాన్ని బయటికి చెప్పే సాహసం లేదు. మనసులోని మాట పెదవుల దాకా వచ్చి మళ్ళీ లోపలికే పోతుంది. అవమానంతో, సిగ్గుతో దేహం పిడచకట్టుకు పోతుంది. చివరికి తెగించి అంది.
    'అలాంటిదేమీ లేదు. మీ గొప్పతనం నాకు తెలుసు. మీ మనస్సును తలచుకుంటే నేను పొంగి పోతాను. మా అమ్మ నాకు అబద్దం చెప్పింది. నాకేమీ తెలీదు. నమ్మాను. కానీ మరి పది రోజులకే అంతా అబద్దమని తేలిపోయింది. అంతే గాని మరేమీ లేదు."
    "చాలు, శారదా. నా కంతే చాలు. నాకీ ప్రపంచంలో మూడే కావాలి. మీ మామయ్యా ఆశీర్వాదం, నీ ప్రేమ, భానుమూర్తి స్నేహం. ఇందులో నాకేదీ కరువు కాకూడదు."
    శారదను తన చేతుల్లోకి తీసుకున్నాడు ప్రకాశం. అతనిలో ఒక రకమైన నూతన భావానుభూతి రేగుతుంది. మనసిచ్చిన కన్నె శరీరం మల్లె మొగ్గ! ఆ మనసు ప్రేమ లూరే పన్నీటి బుగ్గ! శారద కాదొక దివ్యానుభూతి! వెలుగు వెన్నెల స్నానం! వెయ్యి పీయూషాల పాపం! ప్రకాశం, శారద నుదురు మీద మెత్తగా ముద్దు పెట్టుకున్నాడు. శారద సిగ్గుతో నేలకు జారిపోయింది.  గలగలమని నవ్వుతూ వెళ్ళి దూరంగా నిలుచుంది. ప్రకాశం ముందడుగేసే సరికి గెంతి పారిపోయింది. కిటికీ వద్ద అలాగే నిలుచున్నాడు. సంజె చీకట్లు కమ్ముకుంటున్నాయి. పడమటి కొండ వెనుక సూర్యుడు, తూర్పు కొబ్బరి తోటల మీద చంద్రుడు దోబూచులాడుతున్నారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS