Previous Page Next Page 
మమత పేజి 14

 

    రాజయ్యగారూ- సీతమ్మగారు మద్రాసు చేరేసరికి- మిణుకు,మిణుకు మంటున్న జీవం కనిపించింది.
    మమానికం ముమ్మరంగా పోసింది రంగాజమ్మకు. మతి కూడా చెదిరింది.
    ఒక బిడ్డను -- తన మేనత్త చేతికి అంతకు ముందే అప్పగించింది రంగాజమ్మ.
    రెండవ బిడ్డను-- వచ్చిన సీతమ్మ గారి కిచ్చి -- 'ఇంతకంటే -- మీ ఋణం నేను తీర్చుకోలేను తల్లీ-- అమ్మా - అంటున్నాను మిమ్మల్ని. బిడ్డ తప్పులు చేస్తుంది. రోగం వస్తుంది. నడుం విరుగుతుంది. మనస్సు మండిపోతుంది. లోకం ద్వేషిస్తుంది. కాని తల్లి- దేవతా! నువ్వు - దైవంలో కఠీనత్వముంది తెలుసా? కాకపోతే పాపానికి ఎందుకు కిరీటం పెడతాడు భగవంతుడు? కడుపంతా ప్రేమిస్తున్నా-- రక్తం-- అణువులు- నరాలు-- జీవితం -- నీలో చూస్తున్నా ఆమ్మని- తల్లి -- నేను ఋణపడింది నీకు- తీర్చుకోలేను . ఈబిడ్డ -- నీకిస్తున్నా-- ఇంకేమీవ్వగలను ? - దేవతా-- సీతా -- అక్కా-- నువ్వు -- నేను-- నీకు తెలుసు -- తెలియదు-- నాకే తెలియదు-- నమ్ము తల్లీ -- నేను కావాలన్నానా ఈ జీవితం? దేముడే దొరికాడు -- చూడగానే అనిపించింది. ఎవరు నమ్మాలి నా ప్రేమను? ఈ దిక్కుమాలిన లోకంలో -- బ్రతకలేను తల్లీ -- సీతా- అక్కా-- నా దేముణ్ణి -- నా ప్రాణాన్ని -- నా బిడ్డని-- నీ కప్పగించి--నిన్ను నమ్మి-- ఎవరున్నారు? నన్ను- పోతుంది -- నమ్ము-- నేను అనేది...'
    అనలేదు రంగాజమ్మ యింకేమీ మరొకరికి అర్ధం కాగలమాట.
    ఆరిపోయింది దీపం -- చైతన్యం. సౌందర్యాన్ని జీవనశక్తి గా నిలుపుకుని, యింతకాలం బ్రతికింది రంగాజమ్మ. ఆ సౌభాగ్యాన్ని పోగొట్టుకున్నానని రోదించే మనస్సు కూడా రంగాజమ్మకు మీగలలేదు.ఎంతటి వాంఛనీయమైన వస్తువు కూడా పరిస్థితి బెసిగిన తర్వాత , ఆత్మీయులు కూడా భరించలేని భారంగా పరిణమిస్తుంది.
    సీతమ్మ గారు రంగాజమ్మ అందించిన నెత్తురు గుడ్డును గుండెలకు హత్తుకుని రాజయ్య గారి కళ్ళు తుడిచింది.
    
                                                 *    *    *    *

    అందరిలాగానే స్వామి బాల్యం కూడా కొంత, ఊహ తెలియని అజ్ఞానంలోనూ, మరికొంత సగం సగం రెక్కలు విప్పు కుంటున్న ఊహల నివ్వెర పాటులతోనూ గడిచిపోయింది.
    గడచిన జీవితంలోని అనుభవాలను మూటగట్టుకుని -- ఆ జన్మాంతం పదిలంగా గుండెలలో దాచుకోగల శక్తి మనిషి కుంది. ఇది వరమో , శాపామో మాత్రం ఎవరూ నిర్ణయించలేరు.
    మాతృగర్భం నుంచి పుడమి పైబడిన ప్రతి ప్రాణి కొంతకాలం అజ్ఞానామృతంలో ఆదమరచి ఊపిరి పీలుస్తుంది. ప్రపంచంలో ఊపిరి పేలుస్తున్నా లోకానికి అతీతంగా బ్రతికే మహాయోగుల ఆక్షణం -- యింకా ఆవిరి చేసుకుని అదృష్టం పసి పాపది.
    ఒక నవ్వు పూసింది.
    'స్వామి అనే ప్రాణి ఈ జగన్నాటక రంగం మీద అవతరించింది. తన పాత్ర ధరించడానికి అవసరమైన రూపం ఇంకా దిద్దుకోలేదు.
    తల్లి గుండెల్లో వెచ్చగా పడుకుని చనుబాలు త్రాగుతూ ఆయువు పోసుకుంటున్న ఆ ప్రాణికి- కళవళపడుతూ రెప్పలార్చుకుంటూ చూస్తున్న తన కళ్ళ మీద- అనురాగామృతాన్ని పులుముతూ ముద్దుల వర్షం కురిపిస్తూ -- దేవతల చిరు మందహాసాలు వలకపోస్తున్న తత్త్వం రూపం -- ఆనాటి దివ్య స్వరూపం స్పురణకు రాదు. ఆ మాధుర్యాన్ని తనివితీరా అనుభవించి జీర్ణం చేసుకుని, మహా నిక్షేపంగా జీవితాంతం గుండెల్లో పదిలపరచుకోగల శక్తి మాత్రం లేదు. పసితనానికి. ఉన్ననాడు- కావాలని ఎవరు కాలదన్నుకుంటారు ఆ పసితనాన్ని? పెరిగి పెద్ద కావాలని-- పెరిగి పెరిగి విరిగిపోయిన శైశవ  మధుర్యాన్నివిస్మరించి -- సంత లాంటి ప్రపంచంలో కాలుపెట్టి -- అదృష్టాల నిచ్చెనల మీదకు ఎగబ్రాకాలనే ఆరాటంతో -- ఎందుకు పరుగులు తీయడం జరుగుతుంది ఏమనిషైనా ?
    ఊహ తెలిసిన నాటి నుంచి రెండుమూర్తులు స్వామి ముందు మేదిలినాయ్- ఎవరు ఎవరో తెలుసుకున్నా నమ్ముకున్న 'జ్ఞానం' -- ఆ మనస్సుకు యింకా ముసుగులు కప్పింది కాదు.
    ఆనాటి తల్లి రూపం ఎక్కువ గుర్తు లేదు.
    రంగాజమ్మ రూపం గుర్తుంది!
    తనకు కధలు చెప్పేది రంగాజమ్మ. పొట్ట మీద కూర్చో బెట్టుకుని అనుకుంటూ -- ముంగురులు సవరించి - ఒక్కసారిగా ఉప్పెన లాంటి ఆలోచనలతో గుండెలకు హత్తుకునేది. కాలిపోతున్న చెంపను చల్లని బుగ్గలు తోడయేది. కన్నీళ్ళతో కడుగుతున్నట్లు ముఖాన్ని పులుము కుంటూ తన బుగ్గలను ముద్దాడుతున్న రంగాజమ్మ స్వామికి గుర్తు.
    అది తన భ్రమ కావచ్చు.
    మమత లో కరిగిన మనస్సు, నిలుపుకుంటానికి ప్రయత్నిస్తున్న - మధుర స్వప్నం కావచ్చు.
    'అమ్మా' అని పిలిచినపుడు - చెంపల మీద చిటికవేసి - 'అలా పిలవగూడది బాబూ , ' పిన్నీ అనాలి' అంటూ దీనంగా నిట్టూర్పులు విడిచేది రంగాజమ్మ.
    ఆనాడు --
    రంగాజమ్మ చివరిసారి ఊపిరి పీల్చిన నాడు-- భయపడుతోనే - తనను దగ్గరకు తీసుకుని- రెండు చేతులతో -- తన తల్లి 'సీతమ్మ గారికి అప్పగించి ' మీ బిడ్డ అంది ఏడుస్తూ.
    'ఎప్పుడు కాదన్నాను ?' అంది సీతమ్మ గారు.
    'ఇప్పుడు ఔననండి. నాకోసం -- మీ కడుపున పుడతాను.'
    -- ఈ దృశ్యం లీలగా గుర్తుంది స్వామికి. యిన్నాళ్ళు గడిచినా -- ఇన్నేళ్ళు గడిచినా, ఫలితంగా అనేక ప్రశ్నలు తనను చిరకాలంగా వేధిస్తున్నాయి. సమాధానం కోసం తల్లి సీతమ్మగారి నడిగే శక్తి తనకు లేకపోయింది. ఇంకెవరు మనస్సులోని చిక్కు ముడిని విడదీయగలరో తనకు తెలియదు.
    తనకు యింకా పూర్తిగా బుద్ది తెలియని కాలంలోనే తండ్రి రాజయ్యగారు కూడా ఈలోకం వదిలి పోవడం జరిగింది. అది తన దురదృష్టం , 'వాడిని రాజాను చేస్తాను' చూడవే' అనే వారాయన తల నిమురుతూ అంతులేని నమ్మకంతో. కాని జరిగిందేమిటి? రాజయ్యగారు పోయిన నాటి రాత్రి , ప్రాణత్యాగం చేయాలనే సంకల్పంతో దొడ్లో దిగుడు బావి దగ్గరకు నడిచి వెళ్తున్న తల్లికి -- తానె అడ్డం పడ్డాడు. రెండు కాళ్ళనూ పట్టుకుని 'అమ్మా' అంటూ గావుకేక పెట్టాడు. ఆ పిలుపు త్రెంచుకోలేని బంధమై -- ఈ లోకంలో తిరిగి నిలబెట్టింది సీతమ్మ గారిని.
    'నువ్వు నా బిడ్డవు -- నా బిడ్డవు -- కాదంటావా నాయనా?' అంతో రోదించింది సీతమ్మ గారు.
    'ఔనమ్మా -- అమ్మవు కదా?" అన్నాను ఆమె కన్నీళ్లు తుడుస్తూ.
    "నీకోసం బ్రతుకుతానురా తండ్రీ! పాపిష్టిదాన్ని ఎంత  ఘోరంతలపెట్టాను నీకు?' అంటూ బిడ్డను గుండెలకు హత్తుకుని యింట్లోకి నడిచింది సీతమ్మ గారు.
    రెండు ప్రాణుల్ని మాలిన్యం లేని మమతలో ఏకం చేసిన గాదా పరిపక్వమది. అలా రెండు ప్రాణులూ- ఒకరి నుంచి ఒకరు బలాన్ని ఊరటగా అంది పుచ్చుకుంటూ ఆ రాత్రి  జాగరణ చేశారు ఒకరికొకరు హత్తుకుపోయి . ఆమె చెంపల నుంచి జారి రాలిన వెచ్చటి కన్నీటి చుక్కలు స్వామి తలపై బోట బోతమంటూ రాలి రాత్రిని కరిగించినై
    ఆ కన్నీటి రహస్యం ఆనాడు స్వామికి తెలియదు.
    
                                                 *    *    *    *
    రాజయ్యగారు బ్రతికుంటే స్వామి జీవితం -- ఎలా నడిచేదో ఈనాడు మనం ఊహించలేము. నిజంగానే కానన కొడుకుని అందల మెక్కించాలని కలలు కన్నారు రాజయ్యగారు. ఆ కాలాన్నీ పండించి, నిజం చేయాదానికే ధాన్యం వ్యాపారం పెట్టడం జరిగింది.
    'సాంతం దివాళా తియ్యడానికి మొదలు పెట్టాడయ్యా వ్యాపరమంటూ ?
    ఈమాట అన్నదేవరో కాదు. సాక్షాత్తూ రాజయ్యగారి బావమరిది మంగపతి.
    'ఇటువంటి దౌర్భాగ్యుడికిచ్చి నా చెల్లెలు గొంతుకోశాను." అంటూ వాపోయాడు గూడా పదిమందికి చెప్పుకుంటూ.
    కాని--
    అందరూ అనుకున్నట్లూ ఆశించినట్లూ జరుగలేదు. సంవత్సరం తిరిగే సరికి వ్యాపారం విపరీతంగా అందుకుంది. ఆ గ్రామంలో చిన్న కారెక్కిన ప్రతి మనిషినీ -సింహాసన మెక్కిన రాజుగారిని గౌరవించినట్లు గౌరవించేవారు. ఆచిక్క కారు ఎవరి తాలుకాదైనా సరే . బస్సు పర్మిట్లిచ్చే కమిటీ లో మెంబరైన నాయుడు గారు అప్పుడప్పుడు చిన్నకార్ల మీద దిగి యింట్లోకి పోవడం చూసిన తర్వాతనే ఆ ఊరి ప్రజ లయన ఘనతను హృదయ పూర్వకంగా గుర్తించింది. అటువంటి గ్రామంలో ఒక జీపు కారు -- సొంతంగా కొనేశారురాజయ్యగారు.
    'పెద్దింటి రాజయ్య' గా పేరొందిన పెద్దమనిషి కి 'జీపు రాజయ్య'అనే పేరు స్థిరపడి పోవడానికి ఆ జీపు కారే కారణం. ఆరిపోయాడు పెద్దమనిషి - అనుకున్న మరీ పెద్ద మనుష్యులంతా -- 'రాజయ్య కేమండీ? ఆయనగారు మొదటి నుంచి మహారాజే ' అనడం మొదలు పెట్టారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS