ఆ తర్వాత --
ఆలయం వెనుక నున్న సందుల్లోంచి రోప్పుకుంటూ బయటపడి - స్వామివారి పూజా ద్రవ్యాలు సమర్పించకుండా ఎవరో తరుముతున్నట్లు పరుగు తీస్తున్న కరణంగారినిచూసి 'అయ్యా వెళ్ళిపోతున్నారే దర్శనం కాకుండా అంటూ కేక పెట్టారు అర్చకులు మహాదానందాచార్యులవారు.
అప్పటికే కనుచూపు మేర దాటిపోయారు కరణంగారు.
'ఛీ! పాడుబుద్దులు. అందులో స్వామి సమక్షంలో' అంటూ వచ్చిన రంగాజమ్మను చూసి 'కరణంగారిని యింక రాజయ్య గారు బ్రతనివ్వరు' అనుకుని సంబర పడ్డారు అర్చకులు.
గుండెదడ హెచ్చి కొత్తగా వచ్చిన 'ఎల్ ఏమ్ సి' డాక్టరు' గారి దగ్గరకు వెళ్ళారు ఆ మధ్యాహ్నం కరణంగారు. కంగారులో వచ్చిన విషయం మర్చిపోయి - 'డాక్టరు గారు! నలభైయేళ్ళు వచ్చాయి ఆరాజయ్యకు ఏం పోయేకాలం చెప్పండి? ఈ వృద్దాప్యంలో ఆ సానిదానితో కలిసి ఆ పచ్చి శృంగార మేమిటండీ? ఇద్దరూ గువ్వలాడుతూ కూర్చుంటారట ఇరవై నాలుగు గంటలూ-" అనేశారు రోప్పుతూనే.
కరణంగారికి రహస్యంగా 'సూది మందు' యిస్తున్న కాంపౌండరుద్వారా - అంతకు ముందే అసలు కధ విన్న డాక్టరు గారు నవ్వుతూ "నలభయ్యేళ్ళకు వృద్దాప్యమేమిటండి ? దొరలదేశంలో అసలు కోడె వయస్సంటే నలభై దాటాకనే తెలుసా? ముప్పై - అయిదేళ్ళ కే మీకలా నడుం వంగి -- తల ముగ్గు బుట్ట అయిపోయిందంటే -- ఊరి లిటిగేషన్ల బరువు విపరీతంగా మోయడమే కారణం. అలా రొప్పుగూడదు సుమండీ- అది గుండెజబ్బు లక్షణం. ఆకుకూరలు రెండుపూటలా తింటూ, చ్యవన ప్రాపలేహ్యం -- ఐరన్ కలిసిందిధారాళంగా వాడకపోతే మీ గుండె ఆగిపోగల దండోయ్' అంటూ ఓ సీసాను లేహ్యమిచ్చి -- అయిదున్నర రూపాయల దుసుం - కాంపౌండరు చేత వసూలు చేయించాడు.
ఆ లేహ్యం సీసా చేత బట్టుకొని, ఆకుకూరల యజ్ఞం ప్రారంభించాలనే దృడ సంకల్పంతో - బ్రతుకు మీద ఒక్కసారిగా వల్లమాలిన మమకారం ముంచుకొచ్చి - కూరల నాగన్న కొట్టుకెళ్ళి అరడజను రకాల ఆకుకూర లిమ్మంటూ అర్దరిచ్చాడు కరణంగారు.
'రాజయ్య యిలా తెగించి -సానిదాన్ని సంసారాలు చేసుకుంటున్న కొంపలు మధ్య పెట్టడం ఏమన్నా బావుందా నాగన్న?" అంటూ పరామర్శించారు అఆసామినీ. ఉప్పు కారం తింటున్న మనిషి గనక ఉక్రోషం పట్టలేక.
'ఉళ్ళో చాలా మంది చచ్చు నాయాళ్ళ కంటే ఆయనగారే నయమండీ? ఆహా! ఆయనగారిదండి అసలైన చావండీ - నాకు నచ్చాడు లెండి.'
పోరంబోకు తగాదా యింకా లిటిగేషను లో ఉందని తెలుసుండీ గూడా మనసులో ఉన్నమాట అనేశాడు నాగన్న.
రంగాజమ్మ గుళ్ళో కరణంగారు చేసిన అఘాయిత్యం గురించి రాజయ్యగారికి చెప్పలేదు. మర్నాటి నుంచి ఆలయానికి వెళ్ళడం మానుకుంది.
కరణం గున్నేశ్వర్రావుగారి కర్నీక్మహత్యం కేవలం కారణం కాకపోవచ్చు. ఏమైనా -- ఆ వూళ్ళో -- ఆయింట్లో ఉండలేకపోయింది రంగాజమ్మ. ఉన్న నెలరోజుల్లో ఆమె ఆరోగ్యం దిగజారింది. పల్చటి చెంపలు ఇంకా పల్చబడ్డాయి. సన్నటి మెడ యింకా సన్నబడింది. పెద్ద కళ్ళు ఇంకా పెద్దవయ్యాయి.
'ఏమిటి రాజీ నీబాధ-- ఒకటికి పదిసార్లు లాలనగా అడిగినా ప్రయోజానం లేకపోయింది రాజయ్యగారికి.
'మీరుండగా నాకు బాధేముందండీ" అంటూ బలవంతంగా నవ్వేది. గ్రామం లోని స్త్రీలంతా మాట్లాడితే మైలపడి పోతామన్నట్టు రంగాజమ్మ ను గాదు - సీతమ్మగారిని కూడా తప్పించుకు తిరుగుతున్నారు. ఊళ్ళో వాతావరణం ప్రతికూల మైన కొద్ది -- రాజయ్యగారి కి ఆమె మీద మమకారం, లాలన, అధికం కావడం జరిగింది.
ఏమైనా మద్రాసులో ఉంటున్న వాళ్ళ పిన్నమ్మ గారింటికి మకాం మార్చటం మంచిదని నిశ్చయించుకుని చివరకు రాజయ్య గారిని కూడా ఒప్పించింది. ప్రయాణం నాడు ధర్మవరం పట్టుచీర కొనిపించి రంగాజమ్మకు పెట్టింది సీతమ్మ గారు. ఆవిడా స్వయంగా వీధి గుమ్మం వరకూ వచ్చి సాగనంపుతున్న దృశ్యాన్ని కిటికీల సందుల్లోంచి నాటకం చూసినట్లు ఎగబడి చూశారు అమ్మలక్కలు. 'ఎంత సయోధ్య లో సవతుల మధ్య!' అని రకరకాలుగా వ్యాఖ్యానాలు సాగినై. రాజయ్యగారు కూడా రైలుస్టేషను దాకా బయలుదేరారు. బండిని, వీధి మలుపు దాటి పోయేవరకూ అలాగే చూస్తూ గుమ్మంలో నిలబడింది సీతమ్మ గారు. బండిలో రాజయ్య గారి సరసన కూర్చున్న రంగాజమ్మ కూడా అలాగే రెప్పలార్పకుండా సీతమ్మగారి వంక చూస్తూ బరువుగా నిట్టూర్చి 'ఏం జీవితం!' అనుకుంది అస్పష్టంగా కలవరిస్తున్నట్లు.
'ఏమిటి రాజీ?' అన్నారు లాలనగా రాజయ్యగారు.
'పాపిష్టిదాన్ని ' అంది బరువుగా రంగాజమ్మ.
'ఎందుకని?'
'మీకు తెలీదా ఎందుకనో?'
తనకు కోరుకున్న జీవితాన్ని భగవంతుడివ్వలేదు.
అమెకళ్ళు చెమ్మగిల్లాయి.' ఆ యిల్లాలి ఉసురు నాకు తగులుతుంది.' అనుకుంది. 'తన వస్తువును నేను హరిస్తున్నాను' అనిపించింది.
'ఎందుకలా బాధపడతావు రాజీ' వెర్రిదానివి' అంటూ అరచేతిలోకి చేయి తీసుకుని మెత్తగా నొక్కారు రాజయ్యగారు.
'కాదండి! ఆమె మనిషి కాదు'
'మరి?'
'దేవత'
'ఎందుకో?'
'చల్లని తల్లిలా ఆశ్రయమిచ్చి-- పాపిష్టి దాన్ని అంత ఆపేక్షగా కడుపులో పెట్టుకుందంటే - ఎటువంటి దేవత చెప్పండి? మహాసౌభాగ్యం కొల్లగోట్టాను. ఆ సౌభాగ్యానికి నోచుకోని శాప గ్రస్తులం మేము పుట్టుకతో. నాకు నా పుట్టికే రోతనిపించింది. ఏడ్చాను. దొరగారిని నన్నూ గదిలో పెట్టి తాళం పెట్టింది అమ్మ.'భగవంతుడా ' అంటూ గావుకేక పెట్టాను. చివరకు ఎందు కిచ్చావురా తండ్రీ ఈ జీవితం? ఎవరు కావాలన్నారు? పూర్వజన్మ ఉందొ లేదో నాకు తెలియదు . ఈ జన్మలో ఏ పాపం చేశాను తండ్రీ-- ఆశ్రయమిచ్చిన కడుపునే తోలిపివేస్తున్నదేమో ఈ కీటకం.'
కళ్ళల్లో గూడు కట్టుకున్న కన్నీరు బండి కుదుపుకు త్రుళ్ళి పడి -- కట్టలు త్రెంచుకుని ప్రవహించసాగింది. దుఃఖ భారంతో తలవంచుకుంది రంగాజమ్మ. ఆబలయై రాజయ్యగారి కాలిమీద చేయి వేసి వత్తింది -- ప్రవాహంలో కొట్టుకుపోతున్న మనిషికి-- ఏదో ఆధారం దొరికినట్లు.
'ఏమిటి రాజీ?'
'ఎలా తీర్చుకోగలనండీ అదేవత ఋణం ' అంటూ దీనంగా రాజయ్యగారి ముఖంలోకి చూస్తింది రంగాజమ్మ.
రైలు స్టేషన్ వచ్చింది.
* * * *
రంగాజమ్మను మద్రాసులో దిగబెట్టి వచ్చిన రాజయ్యగారు -- 'నీకు కొడుకు కావాలా --కూతురా?' అన్నారు భార్యతో.
నిట్టూర్చింది సీతమ్మగారు.
అసలు విషయం చెప్పారు రాజయ్యగారు.
ఏడు నెలల లో పదహారు సార్లు జరిగింది రాజయ్యగారి మద్రాసు ప్రయాణం. ఎన్నడూ సీతమ్మ గారు అభ్యంతరం చెప్పలేదు. ఊళ్ళో కూడా ఈ విషయం పాతబడి పోయింది. ఒకటికి పదిసార్లు చూసిన నాటకం లా -- కాకపోతే సినిమాలా.
ఒకనాడు టెలిగ్రాం వచ్చింది మద్రాసు నుంచీ. 'సీరియస్' అంటూ. ఈసారి భార్యను వెంటబెట్టుకుని బయలుదేరి వెళ్ళాడు రాజయ్యగారు. అంతా అయిపొయింది ఇంచుమించు అప్పటికే.
కవలపిల్లలను కంది రంగాజమ్మ.
అందుకోసమే పుట్టినట్లు -- అకాలంగా ఆ యిద్దరు పిల్లలనూ పుడమి తల్లికి అప్పగించి-- రాజయ్యగారి జీవితం నుంచి శాశ్వతంగా తప్పుకుంది రంగాజమ్మ.
