10
"ఒదినా ! నీ పరిస్థితి చూస్తుంటే రోజు రోజుకీ భయం వేస్తోంది చూస్తుండగానే బాగా చిక్కిపోయి శల్యంలా అయిపోతున్నావు. ఒంట్లో కూడా రక్తం లేనట్లు తెల్లగా పాలి పోతోంది. విడిచి విడిచి వస్తూన్న ఆ జ్వరం . రాత్రింబవళ్ళు పీడిస్తున్న ఆ దగ్గూ వీటితో నీ పరిస్థితి మరీ భయంగా ఉంది. మొన్న నేను చెప్పినట్లు వెళ్ళి హాస్పిటల్లో చూపించుకున్నావా?' గోపాలం ఇలా ఆదుర్దాగా సునంద ఆరోగ్యం గురించి వాకబు చెయ్యడం. పక్క గదిలో కూచుని జాకెట్టు చేతికి ఎంబ్రాయిడరీ కుట్టుకుంటున్న రత్నం చెవిని పడింది. అక్కడ నుంచి ఆమె జాగ్రత్తగా చెవి ఒగ్గి వినసాగింది.
సునంద నవ్వి "నీ చాదస్తం కాని, నాకెందుకు వైద్య పరీక్షలు. నిక్షేపంలా ఉన్నదానికి?' అంది.
"ఏం నిక్షేపం? రోజురోజుకీ నీ ఆరోగ్యం దిగజారి పోతోంది నేను చూస్తున్నాను. ఈ మధ్య మీ ఆఫీసులో నువ్వు నీరసం వచ్చి ఒళ్ళు తెలియకుండా పడి పోయావుటగా ఒకటి రెండు సార్లు?"
"ఎవరు చెప్పారు?" అంతా అబద్దం" నవ్వడానికి ప్రయత్నించింది.
"అలా తేలిగ్గా తీసేయ్యకు వదినా-- ప్రస్తుతం నీ ఆరోగ్యం ముఖ్యం. నువ్వు మంచం ఎక్కావంటే అక్కడ అన్నయ్య కి, ఇబ్బంది అవుతుంది. నేను ఆఫీసు కి వెళ్ళి రావడం తోనూ రత్నం చంటీ వాడితోనూ అన్నయ్యకి సరిగ్గా సౌక్యం కుదరదు."
"ఇంక మీ అన్నయ్య ఎల్లప్పుడూ ఆసుపత్రి లోనే కూచుంటారేమిటి. జబ్బు బాగా నయం అయింది. వచ్చే నెలలో డిస చార్జ్ చెయ్యొచ్చని డాక్టరు పోయిన నెలలో చెప్పావు అన్నావు."
"అవుననుకో, కాని నిన్నటి ఎక్స్ రే చూసి డాక్టరు మళ్ళీ నానుస్తున్నాడు.
"ఆ.... ఏవైందీ?..... నిన్నటి ఎక్స్ రేలో లంగ్ ఎలాఉంది? తగ్గలేదా.
"డాక్టరంటాడూ అసలు మీరు టి.బి. అని అనుమానించగానే ఆయన్ని హాస్పిటల్ కి తీసుకురావలసింది. జబ్బు ముదరబెట్టి తీసుకువచ్చారు. అందుకే ఎన్ని మందులిచ్సినా ఎన్ని గోల్డ్ ఇంజక్షనులు ఇచ్చినా ఓ నెల తగ్గినట్టే తగ్గి మళ్ళీ వస్తోంది. ఆఖరికి ఎయిరీ ఇంజక్షనుకూడా ఇచ్చి టి.బి ఎటాక్ అయిన ఆ లంగీకి ఈ నలుగు నెలలూ రెస్టు ఇచ్చి చూశాను. ఏం చూసినా ఆ "లంగ్"లో టి.బి. జరమ్స్ పోలేదు. మరి ఇలా ఎన్నాళ్ళు మందులూ, ఇంజక్షనులూ ఇస్తూ చూడమంటారు? పైగా ఈ లోగా రెండో ఊపిరి తిత్తికికూడా టి.బి. ఎటాక్ కావచ్చు. అప్పుడు పేషంట్ కి ప్రమాదం వస్తుంది. అందువల్ల ఆ పాడై పోయిన లంగ్ తీసేస్తే ఆరోగ్యంగా ఉన్న ఆ రెండో లంగ్ తో నైనా ఆయన హాయిగా జీవిస్తారు. ఏమంటారు? ఆపరేట్ చేసి టి.బి వ్యాపించిన ఆ లంగ్ తీసేయమంటారా అని అడిగారు."
"ఆ....ఒక ఊపిరితిత్తి తీసెయ్యడమే!" భయంగా అరిచింది సునంద.
"ఏం చేస్తాం వదినా! తప్పనిసరి అయి. అలా అయితే కాని అన్నయ్య ఆరోగ్యం కుదుట పడదు. అని కనక డాక్టర్లు అంటే మనం చేసేది ఏముంది? ఏమైనా మనకి జబ్బు నెమ్మదించి అన్నయ్య ఇంటికి రావడంకదా ముఖ్యం?"
ఏమోనయ్యా తలుచుకుంటే నాకు భయం వేస్తోంది నేనేం చెప్పలేను .... ఏం నిర్ణయం చేస్తావో నువ్వే నిర్ణయం చెయ్యి."
"ఏం ఫర్వాలేదు వదినా నేను చల్మంధిని అడిగాను ఒకే లంగ్ తో పనిపాటలు చేసుకుంటూ హాయిగా జీవిస్తూన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అదేం పెద్ద విషయం కాదన్నారు."
సునంద ఏం మాట్లాడలేదు.
"ఏ లంగ్ ఆపరేషన్ తోటో అన్నయ్య ఆరోగ్యం కుదుటపడుతుంది. నాకా ధైర్యం వుంది. కాని నా బెంగఅల్లా నీ గురించే ఇలా అశ్రద్ధ చేస్తున్నావు ఆనక అవస్థ పడవలసి వస్తుందేమో నని."
"అవస్థా లేదు ఏం లేదు. ముందు ఆయన జబ్బు తగ్గి ఇంటికొచ్చే యత్నం చూడు ఆపరేషనో మరోటో ఏదో ఒకటి ఏడాది నుంచి పాపం ఆ హాస్పిటల్ లో అవస్థపడుతున్నారు. చూడలేక మనస్సంతా వికలం అయిపోతోంది."
ఆ మాట వింటే గోపాలానికి వదినమీద జాలేసింది. అన్నయ్య అలా బెడ్ మీద ఉన్నందుకు పాపం ఆవిడ విలల్లాడిపోతోంది. అవును మరి? అయిన వాళ్ళందర్నీ చెందనాడుకొని అన్న య్యతోటిదేలోకం అనుకుని వచ్చిన అమాయకురాలు. ఇలా నమ్ముకున్న వ్యక్తి పుట్టెడు రోగంతో తీసుకుంటూంటే గుండె విచ్చిపోదూ? అన్నయ్యా అలా ఉన్నాడు? అమ్మా నువ్విలా కష్టపడుతున్నావా తల్లీ అని ఆప్యాయత చూపించే వాళ్ళదగ్గర లేకపోయిరి! పాపం ఈ ఆవేదనలో నువ్వు తిన్నావా ఉన్నావా అన్న దిక్కె లేకపోయే తనూ రత్నం ఉంటున్నా రన్న మాటకాని ఆమె కష్టం ఎవరు కనుక్కుంటున్నారు? ఆమె కడుపునిండా తిని, కంటినిండా నిద్ర పోతోందో లేదో... ఏమో....
.jpg)
గోపాలం హృదయం ద్రవించిపోయింది సునందని చూసేటప్పటికి. వదినా నిజం చెప్పు నా మీద ఒట్టు. నువ్వు రోజూ కడుపు నిండా అన్నం తింటున్నావా? గుండె లోతుల్లోంచి ఆప్యాయతగా వచ్చిన ఆ ప్రశ్నకి మనస్సు కదిలిపోయి అందం చెప్పలేక కళ్ళు రెండూ చెరువులయి, నేలకేసి చూస్తూ ఉండిపోయింది సునంద.
గోపాలం కంఠంలో కొత్తగా ధ్వనించిన ఉద్వేగం విని. ఆశ్చర్యపోయి రత్నం గుమ్మం ద్గాగారికి వంగి, ఇవతల గదిలోకి తొంగి చూసింది.
ఎంతో ఆదరణా మరెంతో ఆప్యాయతా ముఖంలో ప్రస్ఫుటమౌతూ సునంద కేసి రెప్ప వెయ్యకుండా చూస్తూ నిలబడ్డ గోపాలం!
అతనికి సమీపంలో నేలకేసి చూస్తూ బేలగా నిలబడివున్న సునంద.
ఆ దృశ్యం చూసి రత్నం గతుక్కుమంది.
ఆమె గుండెల్లో రక్తపు మట్టం ఒక్కసారిగా తగ్గిపోయింది.
నవనాడులూ స్థంభించి ఒక్కక్షణం మెదడు పని చెయ్యటం మానేసింది.
వికృత పర్వం చూసినట్లూ, అపస్వరం విన్నట్లూ, మనస్సంతా జుగుప్సతో నిండిపోయింది.
పెళ్ళయి రెండేళ్ళు కావస్తోంది. గోపాలం ఎప్పుడైనా తనని ఇంత ఆదరణగా పలకరించి ఎరుగునా?
"ఛీ..." అని ముఖం తిప్పేసుకుంది రత్నం.
సునంద చెంపలమీదుగా కారుతున్న కన్నీరు చూడలేక చలించిపోయి ఇవతల గదిలోకి వచ్చేశాడు గోపాలం.
అతనికేసి చురచురా చూసింది రత్నం అదేం గమనించకుండా "రత్నం! అవతల గదిలో వదిన బాధపడుతోంది. వెళ్ళి కాస్త ఆ మాట ఈ మాట చెప్పి పలకరించి. ఆ దృష్టి మరిపించు. అన్నాడు.
"నా కెందుకు? ఎవరి వల్ల ఆవిడకా బాధ వచ్చిందో వాళ్ళే చూసుకుంటారు ఆ సంగతి.
రత్నం దగ్గర్నుంచి అనుకోకుండా అంత పెడసరం సమాధానం వచ్చేసరికి గోపాలం విస్తుబోయాడు. వెంటనే "ఏవిటది? ఏవిటా సమాధానం? ముందు వెళ్ళి నేను చెప్పినట్లు చెయ్యి" అంటూ కసురుకున్నాడు.
"నా కవసరం లేదు"
గోపాలం సహనం హద్దులు దాటింది. "ఏవిటి? ఏవిటన్నావు? అవసరం లేదూ? .... ఆమె..... మళ్ళీ అను ఆ మాట" అంటూ చెయ్యెత్తి ఆమెమీదకి వెళ్ళాడు. బాబిగాడు కెవ్వుమన్నాడు ఇంకొంచెం ఉంటే రత్నం వంటి మీద దెబ్బపడి ఉండును.
వాళ్ళ ఘర్షణ విని ఆ గదిలోకి వస్తూన్న సునంద అది చూసి "ఆ.....ఆ....ఏవిటది గోపలం? అంటూ రెండు అంగల్లో వచ్చి అతని చెయ్యి పట్టుకుంది.
వెంటనే గోపాలం విస్తుబోయి ఆ మట్టునే ఉండిపోయాడు. చట్టున తొందరపడ్డానని గ్రహించి అతని చెయ్యి వదిలేసింది సునంద.
కళ్ళు చింత నిప్పుల్లా చేసి మటమటలాడిపోయింది రత్నం.
ఆ రోజల్లా సిగ్గుపడి ఒకళ్ళకొకళ్ళు కనిపించకుండా తప్పించుకు తిరిగారు గోపాలం మనందాను. రత్నం కూడా ఆ రోజల్లా ఏదోఒక వంక తన కోపాన్నీ అసహనాన్నీ ప్రదర్శిస్తూనే ఉంది. ఆ తర్వాత నాలుగైదు రోజులు ఏదో జరగకూడనిది జరిగినట్లు ఒకళ్ళనొకళ్ళు పలకరించుకోకుండా మౌనంగా ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటూ ఒకే ఇంట్లో ఆ ముగ్గురూ విచిత్రంగా గడిపారు. మధ్యలో బాబిగాడు వాళ్లకి కొంత కాలక్షేపానికి ఆదుకుంటూ వచ్చాడు. ఒకటి రెండుమాట్లు సునంద పలకరించపోతే రత్నం విసిరికొట్టింది. అలాగే రత్నం మాట్లాడించబోతే గోపాలం చీదరించుకొన్నాడు.
ఆ నాలుగు రోజులూ రత్నానికి ఒకటే ఆలోచన. సరదా లేవీ పుట్టింట్లో ఎలాగా తీరలేదు. ఎప్పుడూ అన్నయ్యలూ, వదినలూ డబ్బో డబ్బో అంటూండేవారు. పెళ్ళయి అత్తారింటికి వచ్చాకేనా చేతినిండా డబ్బు ఉంటుందనీ, స్వేచ్చగా ఖర్చుపెట్టుకోవచ్చనీ అనుకుంది. కాని గోపాలం తన ముచ్చట్లేనీ తీర్చలేదు. ఎప్పుడూ బడ్జెట్ ఎకౌంటూ అంటూ తను సరదాపడింది ఒక్కటి కొనలేదు. చొరవచేసి ఏదైనాకొంటే, "పల్లెటూరి దానివి. చదువు లేకపోవడం మూలాని లోకం తీరూ భర్త కి ఉన్న సమస్యలూ అర్ధం కాక డబ్బువిలువ తెలియకుండా ఖర్చుపెడుతున్నావు" అంటూ వంద చదివేవారు. సరదా లేవీ తీరకుండానే బాబిగాడు కలగడం తర్వాత నాలుగైదు నెలలకే తను ఎంతవద్దని మొత్తుకుంటున్నా అన్నగారిని ఆదుకోవడం కోసం. ఆయన ఈ ఊరు ట్రాన్స్ఫర్ చేయించుకోవడం జరిగిపోయాయి.
ఎంత ఇష్టంలేకుండా ఈ ఊరు వచ్చినా, సునందలో ఆ ఓర్పూ ఆమె ముఖంలో ఆ సొమ్మతా ప్రశాంతతా చూసేసరికి, తనకి ఎవరో ఆత్మీయురాల్ని చూసినట్లు ఆనందం అయింది' ఆమెకూడా తనని స్వంత చెల్లెలులాగా చూసు కునేది. ఈ సంగతే పండగలకి వెళ్ళినప్పుడు అమ్మతో అంటే. "ఓసీ వెర్రిదానా చెల్లెలు లాగా చూసుకోదుటే మరీ. దాని అనవసరమా నీ అవసరమా? నీ మొగుడు మెత్తన కనక తన సంపాదనంతా దానికీ, దాని మొగుడికీ దోచిపెడుతున్నాడు. ఇలా కొన్నాళ్ళు పోతే నీకూ నీ చంటాడికీ ఏం మిగులుతుందే! నీ కబుర్లు చూస్తుంటే నీకూ మీ ఆయనకీ కూడా అది ఏదో మందు పెట్టినట్లు అనిపిస్తోంది. లేకపోతే చదువు కున్నది ఏమిటి. పట్నవాసంది ఏమిటి శ్రీమంతుల బిడ్డయేమిటి; అంత అణుకువగా ఉండడం ఏమిటి? ఉద్యోగంకూడా చేస్తోంది అంటున్నావు కదా? ఇంక అలాంటిది నెమ్మదిగానూ మంచిగానూ ఉంటుందా? ఏదో వేస్తోంది ఎత్తు. కొంచెం కాచుకునిఉండు. మీ ఆయన జీతంలోది పాతికో పరకో తీసి వేరే దాచుకో నెలచెలా, ఓ వంద రూపాయలు అర్జంటుగా అవసరం వస్తే ఉంటుంది. ఈ సంగతి మీ ఆయనకి తెలియక్కర్లే దులే!" అంటూ చివాట్లు పెట్టింది.
అప్పుడు అమ్మ ఇలా అంటుందేవిటి అనుకుందికాని ఇప్పుడర్దమైంది. నిజమే- ఆయనకి ఏమైనా మందు పెట్టిందేమో సునంద. లేకపోతే ఏమిటి? ఎప్పుడూ నామీదకూడా చూపించనంత అభిమానం ఆయన దానిమీద చూపిస్తున్నారు.
మొన్నటికి మొన్న సంఘటన మాట ఏమిటి? ఇద్దరూ విచారిస్తూ నుంచున్నారు. నన్ను చూసి తొట్రుపడి తప్పుకున్నారు. ఇంకా ఇదేవిటని ఆయన చెయ్యే పట్టేసుకుంది. అందులో నా ఎదురుగుండానే! ఛీ.... ఛీ... సిగ్గూ, లజ్జా, నీతీ నియమం అన్నీ వదిలేస్తే సరి." పదిమందిలోకి వెళ్ళి ఉద్యోగం చేసి వస్తోందంటే- ఎన్నిరకాలుగా ఉండకపోతే రోజు గడుస్తుంది? రామ....రామ....మనుష్యులు ఎంత అధ్వాన్నంగా చెడిపోయారు.
