6
కళ్యాణి చదువుకునే రోజుల్లో గేయాలు కధలు వ్రాస్తుండేది. ఆమె తన స్టూడెంటు గా ఉన్నప్పుడు వాటిని చూసి తను మెచ్చుకునేవాడు కూడాను. కాని పెళ్ళయిన తరువాత వెంట వెంటనే పిల్లలు పుట్టుకొచ్చి బాధ్యతలు నెత్తి మీద పడి ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే వ్రాయాలన్న ఆలోచన కళ్యాణి కి కాని ఆమెలోని రచయిత్రి ని ప్రోత్సహించాలన్న ఆలోచన కాంతారావు కి గాని కలగనేలేదు. ఆమె బాధ పడుతూ అన్నమాటల్లో కొంత సత్యం లేకపోలేదు. కాని దాని కంతటి కీ బాధ్యత తనదేనని ఆమె ఆరోపించటం చాలా అన్యాయమని పించింది అతనికి.
అందుకే ముఖం చిన్న బుచ్చుకుని మాట్లాడకుండా వెనక్కు తిరిగి నడవటం మొదలెట్టేడు. కళ్యాణి అతని ననుసరించింది. భర్త ముఖం చిన్న బుచ్చుకోవటం గమనించే సరికి ఆమెకు తను చేసిన తప్పు తెలిసి వచ్చింది.
కళ్యాణి కెందుకో ఆసమయంలో గట్టిగా ఏడవాలని పించింది. దానికి కారణాలు ఎన్నైనా చెప్పుకోవచ్చు. మూడు సంవత్సారాల పాటు ఒకరకమైన యాంత్రిక జీవనానికి అలవాటు పడిన తను ఒక్కసారిగా పచ్చని ప్రకృతి మధ్యలోకి వచ్చి స్వేచ్చగా గాలి పీల్చుకోవటం తో ఆమె మనసులో నిద్రాణంగా ఉన్న మృదువైన భావాలన్నీ హటాత్తుగా మేల్కొన్నాయ్. ఆ భావోద్వేగానికి తట్టుకోలేక ఆమె హృదయం మరింత సున్నితంగా తయారయింది. ఆ సమయంలో ఒక కాల్పనిక జగత్తు లో విహరిస్తోంది ఆమె మనసు. భర్త వాక్యాలు ఆమెను వాస్తవ ప్రపంచం లోకి తీసుకు వచ్చినాయ్. ఈ రెండు ప్రపంచాలకి మధ్య గల అంతరాన్ని భరించలేక కటువైన మాటలతో భర్త మనసును గాయపరిచింది. అలాటి సమయంలో మనసు ఎంత సున్నితంగా ఉంటె మాటలు అంత కరుకుగా వెలువడుతాయ్. ఆ సంగతి భర్తకి ఎలా తెలియ బరచటం?
కళ్యాణి పరధ్యానంగా పాప నెత్తుకుని నడుస్తోంది. అలా నడుస్తూ నడుస్తూ ఒక రాయి కాలికి తగిలి , తూలి పడబోయింది. వెంటనే కాంతారావు ఆమె భుజం పట్టుకుని అపేడు.
ఆమె కుడి కాలి చిటికెన వ్రేలు చిట్లి కొద్దిగా రక్తం చిమ్మింది. కాంతారావు "అమ్మో రక్తం కూడా వస్తోందే!" అన్నాడు గాభరాగా వంగి ఆమె వ్రేలును పట్టుకుంటూ.
ఆ వ్రేలి బాధకన్నా ఆ సమయంలో అతనన్న సానుభూతి వాక్యం, అతని స్పర్శ -- ఆమెకు కన్నీళ్లు తెప్పించినాయ్.
తలెత్తి చూసిన కాంతారావు 'ఛ! ఇంత చిన్న దెబ్బకే ఏడుస్తా వెందుకు? ఎవరైనా చూస్తె నవ్వుతారు. కళ్ళూ తుడుచుకో!'
అప్పుడు కళ్యాణి కి భర్త గుండెలో తల దాచుకుని 'కాంతం! నన్ను క్షమించవూ? అనవసరంగా నిన్ను బాధపెట్టేను.' అని గట్టిగా ఏడవాలని పించింది. కాని తమతో పాటు అక్కడ యింకా కొందరు మనుషులు ఉండటం వల్ల ఆమె భావాలన్నీ ఆమె కంఠం లోనే దిగబడి పోయినాయ్'.
'ఛ! ఏమిటిలా మరీ అతిగా 'ఫీ' లవుతున్నాను నేను? కాస్త మనసును గట్టి పరచుకోవాలి.' అనుకుంది కళ్ళు తుడుచుకుంటూ కళ్యాణి.
కాంతారావు మాత్రం కల్యాణి కి దెబ్బ తగలటం తో తన కోపాన్ని తాత్కాలికంగా మర్చిపోయేడు. కళ్యాణికి యించుమించు అనుకుని నడుస్తూ, టాక్సీ దగ్గరకు వెళ్ళేడు. టాక్సీ 'పాప నాశనం' వైపుకు పరుగు దీసింది.
కళ్యాణి కళ్ళు తుడుచుకుని మరల తన భావనా జగత్తు లోకి ప్రవేశించింది. కాంతారావు కళ్యాణి అన్న వాక్యాలను గుర్తుకు తెచ్చుకుని, తన కోపాన్ని మళ్ళీ తిరిగి తాను తెచ్చుకుని , కళ్యాణి కి కొంచెం దూరంగా జరిగి, బయటకు చూస్తూ కూర్చున్నాడు.
కొద్ది నిమిషాల్లో టాక్సీ పాపనాశనం దగ్గర ఆగింది. మళ్ళీ మామూలు ప్రపంచం లోకి ప్రవెశించారిద్దరూ. కళ్యాణి తన కలలను, కాంతారావు తన కోపాన్ని మర్చిపోయి, హడావుడిగా దిగి పాపనాశనం వద్దకు కుతూహలంగా వెళ్ళేరు.
అక్కడి దృశ్యం చూడదగినంత మనోహరంగా లేదు కాని వొ పెద్ద గోడ మీదుగా నీళ్ళు క్రింద పడుతున్నాయ్. అందులో స్నానం చేస్తే పాపాలన్నీ నశించి పోతాయి కనుక దానికి పాపనాశనం అంటారట.
భక్తులందరూ అందులో దిగి కొందరు స్నానం చేస్తుంటే, మరికొందరు కాళ్ళూ చేతులూ కడుక్కుని పూర్తిగా స్నానం చేయనందుకు మన్నించమని దేవుణ్ణి లోలోపలే క్షమాపణ వేడుకుని లెంపలు వాయించుకుంటూ యివతలకు వచ్చేసేరు.
కళ్యాణి , కాంతారావు అక్కడే ఉన్న వంతెన గోడకు అనుకుని ఆ దృశ్యాన్ని చూస్తూ నిలబడ్డారు. గోడ మీద నుండి ధారలుగా పడుతున్న నీళ్ళను చూసి పిల్లలిద్దరూ సంబరపడ్డారు. 'లాల, లాలా' అంటూ చప్పట్లు చరచేరు.
వాళ్ళ సంతోషం చూసి తల్లిదండ్రులిద్దరి మనసులూ తేలిక పడినాయ్. ఆ నీటిని బాక్ గ్రౌండ్ గా తీసుకుని వంతెన మీద నిల్చున్న కళ్యాణిని పిల్లలను రెండు ఫోటోలు తీసేడు కాంతారావు.
తరువాత అక్కడే ఉన్న హోటలు అనబడే చిన్న పూరి పాకలోకి వెళ్ళి బియ్యం పిండితో చేసిన దోసెను కషాయం లాటి కాఫీని త్రాగి బయట పడ్డారు. పిల్లలు కూడా వాటిని తిన్తామని మారాం చేస్తుంటే వాళ్ళను గదమాయించి తమతో పాటు తెచ్చిన యాపిల్ పండ్లను చేరోకటి యిచ్చింది కళ్యాణి. తరువాత వాళ్ళకు నీళ్ళలో కలిపిన పాలను హొటల్లో రెండు గ్లాసులు తీసుకుని పిల్లల చేత త్రాగించింది.
.jpg)
ఎండలో తిరగటం వల్ల పిల్లలిద్దరి ముఖాలూ వాడి పోయినాయ్. 'ఒక్కరోజుకే పిల్లలిలా అయిపొయినారు ఇంకా మిగతా ప్రయాణం లో ఎలా ఉంటారో!' అంది కళ్యాణి.
'రాత్రికి నిద్రపోతే వాళ్ళే మంచిగా ఉంటార్లే. పళ్ళు, పాలు వాళ్ళకు బాగా పెడ్తే సరి. ఆరోగ్యం దేబ్బతినదు.' అన్నాడు కాంతారావు.
'పళ్ళంటే ఎంత డబ్బు పెట్టయినా కొని పెడ్తా,మనుకోండి . పాల మాటేంటి? చూసేరా! ఎక్కడ చూసినా నీళ్ళల్లో కాసి నన్ని పాలు కలిసిచ్చే వాళ్ళే కాని, మంచి పాలు ఒక్కళ్ళూ యివ్వటం లేదు' అంది బాధగా కళ్యాణి.
'అందుకే అన్నారు. పాలమ్ముకోవటాన్ని మించిన మంచి వ్యాపారం మరొకటి లేదని' వాల్లమ్మే పాలలోని పాలకూ, నీటికీ గల నిష్పత్తి ని ఆ పరమాత్ముడు కూడా కనుక్కోలేడు.
'అదేమిటండోయ్ అలాగంటారు. పాలలోని నీళ్ళను కనిపెట్టటానికి 'లాక్టోమీటర్' అనే సాధనం ఉందండోయ్. ఐనా యింగ్లీషు లెక్చరర్ కి సైన్సు ను గురించి యెమీ తెలుస్తుంది లే!' వెక్కిరించింది కళ్యాణి. అమెది యింటర్మీడియట్ లో సైన్సు గ్రూపు.
కాంతారావు లోలోపలే కళ్యాణికి తెలియకుండా నాలుక కొరుక్కుని పైకి మాత్రం తన వోటమిని గుర్తించనట్లే ముఖం పెట్టి 'చూస్తుంటే ఈ బోడి లెక్చరర్ ఉద్యోగం వెలగబెట్టే కన్నా పాల వ్యాపారం పెడ్తే వేలకు వేలు సంపాదించవచ్చు ననిపిస్తోంది.' అన్నాడు.
'సరి సరి. ఇది మరీ బాగుంది. వెనుకటికి మీలాటి వెర్రి పిల్లే ఒకతి "తెగలాగా అయిపోయినావే అమ్మా!" అంటే 'తేగ తెచ్చిపెట్టు' అంటూ ఏడుపు లంకించుకుందిట! పదండి. పదండి. ఆలస్యం చేస్తే టాక్సీ వాడు గోల పెడతాడు. అంటూ లేచింది కళ్యాణి.
టాక్సీ తిరుగు ప్రయాణం ప్రారంభించింది. కాటేజీ కి వెళ్ళగానే ఆ సాయంత్రమే సామానంతా సర్దేసుకుని చిరుచీకట్లు ముసురుకుంటున్న సమయంలో ఏడు కొండలను దిగి వచ్చి దిగువ తిరుపతిని చేరుకున్నారు.
దిగువ తిరుపతి లో ఒక హోటల్లో గది తీసుకున్నారు. వేసవి కాలం అవటం వల్ల పగలల్లా చేసిన ప్రయాణం లో శరీరాలు చెమటతో, మట్టితో కలిసి మలినమయినాయ్. చల్లని పడకల మీద మేను వాల్చేరు. అలసిపోయి ఉండటం వల్ల పిల్లలు వెంటనే ఫాను గాలిలో హాయిగా నిద్ర పోయేరు. అంతవరకు తమ ప్రయాణపు హడావుడి లో తాత్కాలికంగా మరుగున పడిపోయిన కాంతారావు కోపం మళ్ళీ మేల్కొంది. 'మిమ్మల్ని చేసుకున్న నాడే నాలోని కవితా శక్తి చచ్చిపోయింది.' అంత కఠినంగా ఎలా అనగలిగింది కళ్యాణి! తననా వాక్యం బాదిస్తుందని- తెలిసి కూడా, తనని బాధ పెట్టాలన్న ఉద్దేశ్యంతో ఆమె అన్నదా, లేక ఏమీ ఆలోచించకుండా అలా అన్నదా? - 'కళ్యాణి యేమైనా చిన్నపిల్లా! ముఖం మీద పట్టుకుని 'మిమ్మల్ని చేసుకున్న నాడే.....' అని అనగలిగిన ఆడది అమాయకురాలు ఎలా కాగలదు?" అలా ఆలోచించుకుంటూ పాషాణం లా మారి పోసాగింది.
భార్యాభర్తల కలహాలేప్పుడూ పడక గదిలోకి ప్రవేశించే సరికి తారాస్థాయినందుకుంటాయి. అందుకే నిజానికి కళ్యాణి ఆ వాక్యం అన్నప్పటి కన్న యిప్పుడే అతని కోపం వెయ్యి రెట్లు ఎక్కువగా ఉంది. అందువల్ల శిలలా కదలిక లేకుండా కళ్ళు మూసుకుని వెల్లికిలా పడుకున్నాడు.
పిల్లలు నిద్రపోయేరని నిర్ధారించుకున్నాక కళ్యాణి మెల్లిగా భర్త వద్దకు జరిగి అతని చాతి మీద చెయ్యి వేసింది. ఇప్పుడా ఛాతీ దగ్గర ఉన్నది గుండె కాదు. పాషాణం . అందువల్ల ఆమె స్పర్శ ఆ భాగాన్ని ఏమాత్రం కదిలించ లేకపోయింది.
"అప్పుడే నిద్ర వచ్చేసిందేమిటి?' అరచేత్తో లాలనగా అతని గరుకైన గడ్డాన్ని నిమిరింది.
పాషాణం లో కదలిక లేదు. దానికి కారణం తెలుసు కనుక కళ్యాణి మనసులోనే నవ్వుకుంది.
"అబ్బ! ఈ మీసాలు ఎంత బాగున్నాయో! తుమ్మెద రెక్కల్లా..... ఆఫ్ కోర్స్ నిజం చెప్పాలంటే తుమ్మెద ను నేనెప్పుడూ కళ్ళారా చూడనే లేదనుకొండి. ఏదో తెలుగు సినిమాలో హీరో హీరోయిన్లు డ్యూయెట్లు పాడుతుండగా ఒక సీనులో చూసిన గుర్తు' అంటూ అతని గుండె మీద తల ఆనించి పడుకుంది కళ్యాణి.
పాషాణం కొద్దిగా కదిలింది కాని, వెంటనే మళ్ళీ సర్దుకుని యధాస్థానం లో కూర్చుంది.
'ప్రేమించే హృదయమే క్షమించగల దంటారు! అ సంగతి లిటరేచర్ లో రిసెర్చి చేస్తున్న మహానుభావులకు తెలియదు కాబోలు!' తన తలను మరింత గట్టిగా అతని గుండెకు అదిమింది కళ్యాణి.
ఆ స్పర్శకు తట్టుకునే శక్తి ఆ పాషాణానికి లేదు. అందువల్ల వెంటనే వెన్నె ముద్దలా మెత్తబడి పోయింది.
'అబ్బ! నాకు నిద్ర రావటం లేదండీ! వో కధ చెప్పనా? అల వైకుంఠపురంబు నగరి లో .....శ్రీ మహావిష్ణువు తన భార్య యైన శ్రీ లక్ష్మీ ని ఎల్లప్పుడూ తన హృదయం లోనే ఉంచేసుకుంటాడుట!.....' వెన్న కరగ సాగింది.
'ఇక పొతే కైలాసవాసుడైన పరమేశ్వరుని భార్య తన భర్త శరీరంలోని అర్ధ భాగాన్నే అక్రమించేసుకుందిట!.....'
మేరు పర్వతమే కరిగి ప్రవాహం లా మారినట్లు అతని గుండెలో అలజడి , ఆ అలజడి ని గ్రహించగలిగిన కళ్యాణి శరీరంలో చిత్రమైన కంపనం కలిగింది. మాటలు తడబడుతుండగా మత్తుగా మధురంగా ఇలా పలికింది. 'ఈ భూతలం లో ....యీ కలియుగంలో..... కాంతారావు నామధే..... యుండైన ఒక ప్రేమ తపస్వి భార్యను తన .....శరీరం లోని ....అణువణువులోనూ ....దాచే..... సుకొన్నాడట....! యిప్పుడు..... చెప్పండి. ఈ ముగ్గురి లో .....ఎవరు గొప్ప....వారో!'
ఆ ప్రశ్నకు సమాధానం రాలేదు. వచ్చినా వినిపించుకునే స్థితిలో లేదు కళ్యాణి. ఆ సమయంలో ఆమె మన శ్శరీరాలు రెండూ .....ఒక మహా వెల్లువ లాటి భావోద్వేగం లో పడి ఉక్కిరిబిక్కిరవుతున్నాయి.
* * * *
