భాస్కరం , సుమతి వాళ్ళు వచ్చారు. వేసంగు లలో వాళ్ళు చూసిన ప్రదేశాలూ, దేశాలూ వరుసగా చెప్పారు. నావంటరితనానికి కొంత మార్పు వచ్చింది.
నెలలు తిరుగుతున్నాయే గాని నామనస్సుకు శాంతి అనేది లేకనే పోయింది. సింహాచలాన్ని ఎంత మరచి పోదామనుకుంటే అంత గుర్తు రాసాగింది. రాధను పుట్టింటికి పంపాక, మొదటిసారి నేను చూడ్డానికి వెళ్లానప్పుడు. రాధ బాగా చిక్కిపోయింది. నన్ను చూసి, ఏదో పరాయి వ్యక్తీ లా పలకరించింది. అ పలకరింపులో ప్రేమ గానీ, అనురాగం గానీ, ఆత్మీయత గానీ, అభిమానం గానీ, లేవు. "ఎందుకు రాధా నన్నలా చిత్రవధ చేస్తావు" అనడిగాను. నా కళ్ళ వెంట నీరు నాకు తెలీకుండానే కారింది. కానీ రాధ చలించలేదు. "ఏం చెయ్యను చెప్పండి ఇలా చెయ్యాలని నేను చైటం లేదు. నాలో ఏదో అసంతృప్తి బయలు దేరింది. ఎన్ని విధాల నచ్చచెప్పు కుందామనుకున్నా అది కుదరడం లేదు. నాకు జీవితం మీదే ఆశ పోయింది." అంది నిర్లిప్తంగా.
నా విధిని తల్చుకుని ఏడ్చాను. రాధ మనస్సు నేను ఊహించిన కన్నా విరిగి పోయింది. అది తిరిగి అతకడం బహుశా సాధ్యం కాదనిపించింది. బెజవాడ లో నాలుగయిదు రోజులుండి వచ్చేశాను. మరుసటి నెల మళ్ళీ వెళ్ళాను. రాధను చూసి ఆశ్చర్యపోయాను. రాధ చెక్కిళ్ళు పాలిపోయాయి. కళ్ళు పీక్కుపోయాయి. జానకమ్మగారూ, పరంధామయ్య గారు అది అన్నారు.
"దాని మనస్సులో ఏముందో చెప్పదు. ఎప్పుడూ ఏదో పరధ్యానంగా వుంటుంది. కారణం చెప్పదు బాబూ" అందావిడ. కారణం రాధ యేమని చెప్పగలదు. ఆ రాత్రి రాధను నిలదీసి అడిగాను. రాధ నా ప్రశ్నకు సమాధానం చెప్పకుండా 'పాలు త్రాగండి' అంది. పాలగ్లాసు బల్లమీద పెడుతూ.
"కాస్త విషం కూడా యివ్వు. కలుపుకు తాగుతాను. నన్నిలా చిత్రవధ చేసే కన్నా అది నయం" అన్నాను. రాధ చలించలేదు. నాపక్కన కూర్చుని, నా జుట్టులో తన సన్నటి వేళ్ళు పోనిచ్చి పడసరి చేస్తూ, "ఎందుకంత బాధపడ్తారు? ఆనందంగా ఉండాలనీ , ఆనందం అనుభవించాలనీ నాకు మాత్రం లేదా! కానీ ఏ చైను? మిమ్మల్ని ఆ సంగతి అడక్కపోయినా బాగుణ్ణు కానీ జీవితమంతా ఆనందంగా వుండడం భగవంతునికి గిట్టదు. " అంది. ఆమె కళ్ళల్లో నీరు జలజల నేల రాలింది.
* * * *
శలవు లేనందు వల్ల ఆ మర్నాడే వెళ్ళి పోయాను. ఆ తరువాత ఆఫీసరు మారడం వల్ల శలవు యివ్వనందు వల్ల వెళ్ళలేక పోయాను. నాలుగు నెలలు అలానే గడిచాయి. రావాల్సిన టెలిగ్రాం వచ్చింది. ఆనందంతో నా శరీరం గగుర్పొడిచింది. పై ఆఫీసరుకు ఆ టెలిగ్రాం చూపించి శలవు మంజూరు చేయించుకుని ఆరోజే భాస్కరం వాళ్లతో చెప్పి బెజవాడ చేరాను.
ఇల్లు చేరేసరికి నేను వూహించుకున్న ఆనందం తల్లక్రిందులయ్యింది. రాధ తల్లి వొళ్ళో పసికందు వున్నాడు. నన్ను చూడడంతోనే ఆవిడ వెక్కివెక్కి ఏడ్చింది. దాది వచ్చి పసికందును తీసుకు పోయింది -- నాన్నగారు కూడా అక్కడే వున్నారు.
"రాధ మనని విడిచి వెళ్ళిపోయింది" అన్నారు.
నన్ను చిత్రహింస చేసి, హింసించే ముక్క యావత్ ప్రపంచంలో మరోటి వుండదు. రాధ నన్ను అంత కఠినంగా శపిస్తుందని అనుకోలేదు. పసికందును నాకోసం వదిలేసి, యిష్టం లేని తన జీవితాన్ని వదిలేసింది.
నాకు జీవితం మీద ఏనాడో విరక్తి కలిగింది. జీవితమే నాకు విరక్తి కలిగించింది. పసికందును వొళ్ళో పెట్టుకుని కుమిలి కుమిలి ఏడ్చాను. పసికందును వొళ్ళో పెట్టుకుని రాధతో ఆనందించే అదృష్టానికి నోచుకోని నాదురదృష్టానికి విలపించాను. విధి రాకాసి.
మద్రాసుకు తిరిగి వెళ్ళబుద్ది కాలేదు. నా జీవితం తిరిగిన మలుపును గురించి భాస్కరానికి రాశాను. భాస్కరం, సుమతి వాళ్ళు వచ్చి పరామర్శించారు. ఎవరొచ్చి ఏం లాభం?"
"నేనెలాగూ పెద్ద వాణ్ణయి పోయాను. వ్యాపారంలో నాకు కొంచెం సహాయం చేసినట్టుంటుంది. నువ్వు కూడా మన వ్యపారాన్నే చూడరాదూ." అన్నారు నాన్నగారు. నేను వెంటనే తలూపాను.
నాన్నగారితో తిరుగుతూ, పని నేర్చుకుంటూ, యాంత్రిక జీవితానికి అలవాటు పడనారంభించాను. రాధ నాకు వదిలి వెళ్ళిన పసి కందు "రామం" . రామాన్ని రాధ తల్లిగారు వాళ్ళింట్లోనే వుంచుకున్నారు. రోజూ ఏదో ఒక వేళలో వెళ్ళి రామాన్ని చూసి వచ్చేవాణ్ణి.
మానవుడొక వింత పశువు. ఫలానా కష్టం వస్తుందేమోనని భయపడ్తాడు. ఆ కష్టం వస్తే తను బ్రతకడం అసాధ్యమని అధైర్యపడ్తాడు. తీరా ఆ కష్టం కనుక వస్తే కాస్సేపు డుఖిస్తాడు. అంతే - ఆత్మ హత్య చేసుకోడు. అతని గుండె రాయి అవుతుంది. రాయిలా వుంటాడు.
నా విషయమూ అంతే అయ్యింది. రాధ లేని నాజీవితం తనకు తనే కొత్త రకం, పంధా తీసుకుంది. తనమార్గంలో తను పోసాగింది.
కాలగమనం రోజులను నెలలను నిర్దాక్షిణ్యంగా వెనక్కు నెట్టింది. రాధ చనిపోయి ఆరు నెలలకు పైగా అయిపొయింది. ఈ కాలంలో నాన్నగారు మళ్ళీ వివాహ ప్రసక్తి తెచ్చారు కానీ నాకు వివాహం మీదకు ధ్యాస పోలేదు. అప్పటికే అమాయకులైన యిద్దరి స్త్రీల జీవితాలను నాశనం చేసిన నరరూప రాక్షసుణ్ణి నేను, హంతకుణ్ణి -- హంతకుణ్ణి--
ఏ విషయాన్ని కూడా అస్సలు ఆలోచించకుండా వుండడం అలవాటు చేసుకున్నాను. నా దృష్టి నంతా వ్యాపారం మీద కేంద్రీకరించాను. తత్పలితంగా అధిక లాభాలు వచ్చాయి.
ఓరోజు రామాన్ని చూడడానికి వెళ్ళితే అక్కడకు వచ్చిన ఒకావిడ "మళ్ళీ పెళ్ళి చేసుకో రాదు బాబూ, రాధా రాధా అంటూ విలపిస్తే ఏం లాభం..... చచ్చినవాళ్ళు తిరిగి వస్తారా.... లేక మనం వాళ్ళతో చావగలమా" అంది హోతోపదేశం చేసే ధోరణి లో . నేనావిడ మాటలను విననట్టు లోపలకు వెళ్ళిపోయాను. గదిలో గోడమీద రాధ ఫోటో....రాదా.....
"వాసూ" అన్న పిలుపుతో వులిక్కిపడి లేచాను. ఎదురుగా భాస్కరం వున్నాడనే లేచి కూర్చున్నాను. "ఏవిటి కలవరించుతున్నావు" అన్నాడు. అవును నా జీవితంలోని ఓ భాగం కలగా వచ్చి నాకు సంతృప్తి ని యిచ్చింది. ఆవేశాన్ని కలగ జేసింది." "కలోచ్చిందా" అన్నాడు భాస్కరం కుర్చీలో కూర్చుంటూ. తల వూపుతూ , 'అవునోయ్ రాధ కలలోకి వచ్చింది' అన్నాను.
"ప్చ్...." అన్నాడు భాస్కరం.
జీవితం అనేది ఎవరి చేతా శాసింపబడేది కాదు. దానిచేత శాసింపబడి వాళ్ళం మన మందరమునూ. " అన్నాడు భాస్కరం. అతను వేదాంతి కాదు. నన్ను సంతృప్తి పరచడానికే అలా అన్నాడు.
"అంత అయిపొయింది. ఇప్పుడే ముందిక. జీవితానికి లొంగనివాడనయ్యాను నేను. నన్ను శాసించలేక పొయిందానిది" అంటూ లేచాను.
* * * *
ఎనిమిదింటికి నేనూ, సూర్యం కలిసి పెళ్ళి చూపులకు వెళ్ళాము. సూర్యం నన్నాయనకు పరిచయం చేశాడు. అయన నాకేసి వింతగా చూసి, "మీరు మారాధ భర్తా' అన్నాడా శ్చర్యంగా. అని, నేను రాధ మేనమామను. మాటకు మేనమామ గాని, పెళ్ళికి రాలేదు. రాధని కడసారి కూడా చూడలేదు. కుటుంబాల మధ్య కలతల వల్ల ఆత్మీయతలు కలవరాని వయ్యాయి." అంటూ చిన్నగా తన కధ చెప్పాడు. రాధమేనమామ అవడం వల్ల పని మరీ సులభం అయ్యింది. మా పని చెప్పగానే అయన చాలా ఆనందించారు. "అమ్మాయిని మీరు చూద్దురు గాని" అన్నారు- వాళ్ళావిడను నాకు పరిచయం చేశాడు- అంతా కలిసి రాధ గుణగుణాల మీద కాస్సేపు చర్చించుకున్నాక సూర్యం ప్రేమించినమ్మాయి వచ్చింది. ఆమె పేరు శారద. పిల్ల ఫోటో లో కన్నా బాగుంది. అన్నీ సంతృప్తిగా జరిగాయి.
ఇంటికి వచ్చాక భాస్కరంతో , సుమతితో సంగతంతా చెప్పాను. వాళ్ళ ఆనందానికి అవధుల్లేవు. పెళ్ళి చూపులు నవీన పద్దతిలో సినిమా హాలులో జరిగే లాగ ఏర్పాటు చేశాను.
* * * *
భళ్ళున తెల్లారింది. బారెడు పొద్దెక్కింది.
పక్క మీంచి లేవబోయాను. పక్క గదిలోంచి భాస్కరం మాటలు వినిపిస్తున్నాయి. "అతన్ని లేపక. పదిగంటల వరకూ అతనికి నిద్ర అలవాటు. జమిందారు కదా? అరమణని యివాళ గాక పొతే రేపు చూస్తాడు." అంటున్నాడు. నేను ముసుగు తన్నేశాను. రమణను చూసే ధైర్యం నాకు లేదు. అతని కళ్ళలోకి చూసే సాహసం నాకు రాలేదు. నేను పిరికి వాణ్ణి.
