Previous Page Next Page 
బాంధవ్య బంధితులు పేజి 13


    "నా ఇంటర్మీడియెట్ ఫలితాలు తెలిసిన రోజు మా నాన్న సంతోషం చూచాక ఆయన కోరిక కాదనే సాహసం నాకు లేకపోయింది. ఆయనను నిరుత్సాహపరిచేఅంత మొండితనం నాలో లేకపోయింది. నాకు మెడిసిన్ కు సీటు వచ్చేలోపలే నా చదువు పూర్తి కాగానే హాస్పిటల్ పెట్టేందుకు స్థలం, భవనం కట్టేందుకు ప్లానుకూడా నిర్ణయించసాగారు.
    "కాని కాలేజీలో చేరవలసిన ముందురోజు రాత్రి నాలో నేను ఎంతో ఖచ్చితమయిన నిర్ణయం చేసుకుని, ఎంతో మొండితనంతో మా నాన్నగారికి చెప్పాలని నిశ్చయించుకున్నాను, నేను డాక్టర్ని అవలేనని, ఈ చదువు మొదలు పెట్టలేనని. కాని అంత మొండి నిర్ణయంతోను బయటపడేటప్పటికి, మా నాన్న మాట్లాడుతున్నారు అమ్మతో నా భవిష్యత్తును గురించి. "చూస్తూ ఉండు. ఏడెనిమిదేళ్ళు తిరిగివచ్చేసరికి మనవాడు లెక్కపెట్టవలిసిన వ్యక్తులలో ఒకడవుతాడు. ఆ నమ్మకం నాకుంది." అంటున్నారు. ఆయన కంఠంలో గర్వం, అభిమానం తొణికిసలాడుతున్నాయి. ముఖంలో ఆనందం వెల్లివిరుస్తూంది. ఆ సమయంలో ఆయన ముఖంలో వెలుగొందుతున్న ఆనందాన్ని చూస్తూ ఆయన కోరిక కాదనలేకపోయాను. ఆయన నమ్మకాన్ని కూలదోయలేకపోయాను. వచ్చినవాణ్ణి వచ్చినట్లే వెనక్కి వెళ్ళిపోయాను. ఆయన కోరిక నా శాయశక్తులా తీర్చడానికి ప్రయత్నించాలని నిర్ణయించుకున్నాను. కాని .... అనూరాధా, నాకు మొదటిరోజే తెలుసు. నేనుమాత్రం మెడిసిన్ కి పనికిరానని. డాక్టర్ కావాలనుకునే వ్యక్తి మృత్యువుతో పోరాడాలి! అహోరాత్రులు కృషిచేయాలి! ముఖ్యంగా క్షణాలమీద ఈ నిశ్చయం తీసుకోవాలి. తాను చేస్తున్న పనిమీద సంపూర్ణమయిన నమ్మకం ఉండాలి. అంతేగాని ఇది మంచిదా, అది మంచిదా అన్న మీమాంసలో ఊగిసలాడే వ్యక్తి డాక్టరవలేడు. తనకు తాను నిర్ణయించుకోలేక, ఎదుటివారి నిర్ణయాలకు తలఒగ్గేవాడు డాక్టరవలేడు. డాక్టరయ్యాక జయాన్ని, అపజయాన్ని విమానంగా తీసుకోగలిగే శక్తి ఉండాలి. ఈ వృత్తి ఆరంభించాక కష్టనిష్టూరాలు తప్పవు. ఒకరికి తగ్గి కులాసాగా ఉంటే దేవుడని మొక్కుతారు. ఇంకొకరికి తగ్గక మరణిస్తే చాతకాక చంపాడంటారు. ఇవి ఏ డాక్టరుకైనా అనుభవమయ్యే విషయాలే! కాని మొదటి రెండుమూడేళ్ళలో వచ్చే ప్రతి విమర్శలు డాక్టర్ భవిష్యత్తుకు మెట్లవుతాయి. వీటిని తట్టుకునే శక్తి నాలో లేదు. మృత్యుముఖంలో ఉన్నవాన్ని ఎదుర్కోనలెను. మరణించిన అతనికి ఆయువు తీరిపోవడం కారణమయినా, అది నా తప్పా కాదా అని ఆత్మవిమర్శ చేసుకోకుండా ఉండలేను. నేను మృత్యువు నెదుర్కోలేను. నేను డాక్టర్ని కాలేను" అన్నాడు వివిధ కంఠధ్వనులు గతులు మారుతూంటే.
    "కాని..."
    "అడ్డుతగలకు, అనూరాధా. నాలో ఉన్న బలహీనత నీకు అర్ధంకాదు. నా బలహీనత, పసితనంలో ఏర్పడ్డ నా భావాలు, భయాలు నేను మార్చుకోలేను. అవి తేలికగా తీసిపారెయ్యలేను. నాకు చావులమీద ఇంత విపరీతభావాలు ఎందుకు వచ్చాయో మీకు తెలియదు!
    "అది మీ చిన్నప్పుడు. దాదాపు ఏడెనిమిదేళ్ళు ఉంటాయనుకుంటాను. మా తాతగారు పొలం పనులకు ఓ పల్లెటూరు వెళుతూ నన్నూ తీసుకువెళ్ళారు. కాని తీరా అక్కడకు వెళ్ళాక ఆ ఊళ్ళో కలరా విపరీతంగా వ్యాపించిందని తెలిసింది. ఇంక మా తాతగారి ప్రాణాలు గిజగిజలాడిపోయాయి. ఒక్కగా నొక్క మనమన్ని అటువంటి భయంకరవ్యాధి దరిదాపులకు తెచ్చారు! పోనీ, వెంటనే తిరిగివెడదామంటే దారిలో ఏవో గడ్డు అడ్డాలు వచ్చి అదీ వీలుకాకపోయింది.
    సుమారు పదిరోజులు అక్కడే ఉండిపోయాను. ఆ పదిరోజుల్లోనూ ఎన్ని మరణాలు సంభవించాయో లెక్కలేదు! ఇవాళ మా తాతగారితో మాట్లాడాలని వచ్చిన మనుష్యులలో రెండు రోజుల్లో మరణ శయ్యపై పయనించినవారున్నారు. అక్కడ ఉన్నన్నాళ్ళు 'వారు పోయారు, వీరు పోయారు' లన్న మాటలు తప్ప మరో వార్త వినలేదు. ఆ క్షణంలో చావంటే ఎంత భయం కలగచేసిందో తెలపడానికి మాటలు చాలవు! ఏ రోడ్డుమీద శోకదృశ్యం తప్ప మరో రూపంలేదు. మా తాతగారి ఇంటిదగ్గిరనుండి ఎలాగో అలా నన్ను తీసుకువెళ్ళాలని నిశ్చయించుకున్నారు. సగం బండిమీద, సగం కాలినడకా అయినా, ఇంకో ఇద్దరిని తోడు తీసుకుని బయలుదేరారు. చివరికి ఆ ఊరు దాటుతూండగా కనీసం ఏడెనిమిది భవనాలైనా చూచిఉంటాను. ఇంక అక్కడనుండి వచ్చాక భయంతో రాత్రి నిద్రపట్టేదికాదు. అర్ధరాత్రి పెద్దగా కేకవేస్తూ లేచేవాన్నిట! ఎప్పుడో కొంచం నిద్రపట్టినప్పుడు మంచానికి అతుక్కుపోయి బాధతో నలిగిపోతూన్న రోగులో, కట్టెలలో మండిపోతూన్న మనుషులో కనిపించేవారు! ఆ దెబ్బతో సుమారు సుమారు నెలరోజులు మంచంలో పడ్డాను! ఆ నెలరోజులు చచ్చిపోతానేమో అన్న భయం ఎక్కువయిపోయింది! డాక్టరు పూటపూట పొడుస్తున్న ఇంజక్షన్లు తీసుకుంటున్న కొద్ది డాక్టరంటే విపరీతమైన కోపం మండిపోయేది! అందరిని అంతంచెయ్యాలన్నంత కసిగా ఉండేది!
    "దానికి తగ్గట్టే సంవత్సరం తిరగకుండా మా తాతగారు పోయారు! ఆయన బాధతో మెలికలు తిరిగిపోతూ ఏదైనా మత్తుమందు ఇమ్మని ఎంత అడిగినా, ఆ వయస్సులో మత్తులు ఇవ్వకూడదనేవాడు డాక్టర్. 'ఛీ! ఈ డాక్టరవడంకంటే కనాకష్టమయిన ఉద్యోగం ఇంకొకటి లేదు. చేతిలో మందు ఉండి, ఎలా పనిచేస్తుందో తెలిసి ఉండి కూడా బాధపడుతున్న వ్యక్తిని చూస్తూ ఉండిపోవాలి. నేను చచ్చినా డాక్టరును కాను!' అని ఆ రోజుకు ఆ రోజే నాలో నిర్ణయం జరిగిపోయింది!    
    "నేను పెరుగుతున్నకొద్దీ నాలోని పసితనపుభయాలు, కోపాలు కాలంలో సమసిపోయినా నా నిర్ణయాలు మాత్రం మారలేదు. నేను డాక్టర్లంటే అసహ్యించుకునే స్థానంలో ఏదో తెలియని విలవ పెరిగింది. నాలో భగ్గుమనే కోపం స్థానంలో అంతులేని గౌరవం పెరిగింది. అందుకే ఇప్పుడు డాక్టర్లంటే ఎంతో గౌరవం! ఏ డాక్టర్ని చూచినా ఎనలేని విలవ ఇస్తాను. నేను పారద్రోలలేని బలహీనతను తరిమి నేను చెయ్యలేని పనిని సాధించిన వ్యక్తి మీద నాకు ప్రత్యేకమయిన అభిమానం."
    అతని కంఠ స్వరంలో తీవ్రత తగ్గి సౌమ్యంగా మారిపోయింది. చల్లగా వీస్తున్న గాలిలోకూడా నుదుటినిండా చిరుచమటలు పట్టాయి. అంతవరకు అతని చేతుల్లో నలుగుతున్న రాధ చేతిని గమనించిచటుక్కున వదిలేశాడు. అప్పటిదాకా అతని సౌమ్యత, ఆవేశస్థితి చేతిలో తెలుస్తూంటే అనుభవించి బయటికి వచ్చిన ఆ చేతికి చల్లని గాలి తగిలి జివ్వుమన్నట్లయింది.
    "కాని..... శ్రీనివాస్ ...మీరు మృత్యువును ఎదుర్కోలేనంటారు. కాని వైద్యవిద్యారంభమే శవాలతో మొదలవుతుంది కదా!"
    "కావచ్చు, రాధా. కాని, చనిపోయిన శరీరానికి, చావుముఖంలో ఉన్న ప్రాణికి భూమ్యాకాశాల కున్నంత తేడా ఉంది. ఈనాటి మందుల ఫలితంగా నూతన మార్గాలలో విహరిస్తున్న విజ్ఞానంద్వారా చావుముఖంలో పడ్డ వ్యక్తి వెనక్కి వస్తున్నాడు. కాని చనిపోయిన వ్యక్తికి ఇక మార్పేమీ లేదు. ప్రాణంలేని దేహానికి, ఒక రబ్బరు బొమ్మకు ఇంక తేడా లేదు. బహుశః ఈ భావనే నన్ను మెడిసన్ చదువు పూర్తి చెయ్యనిచ్చిందేమో!'
    "విజ్ఞానం ఎన్ని నవ్యమార్గాలలో విహరిస్తూన్నా ఒక్కటిమాత్రం మనం నమ్మితీరాలి, శ్రీనివాస్. అదే కర్మసిద్ధాంతం. ప్రతి వ్యక్తి ఎప్పుడో అప్పుడు మరణించాలి. వైద్యం అన్నది కేవలం మనిషి జీవితకాలాన్ని మరికొంచం పొడిగించడానికి, పెరిగిన జీవితం చివరివరకు సౌఖ్యంగా గడపటానికి మాత్రమే ఉపయోగ పడుతుంది. అంతేగాని మరణంనుండి ఏ వ్యక్తి తప్పుకోలేడు. అది సర్వసామాన్యం కదా!"
    "మీరు అన్నది కాదనలేదు. కడుపులో ఉన్న ప్రతి బిడ్డా బయటకు రావడం ఎంత సహజమో, తిరుగుతూన్న ప్రతి మనిషి ఎప్పుడో అప్పుడు తిరిగి పోవడం సర్వసామాన్యం. అంతమాత్రాన బిడ్డ పుట్టినప్పుడు సంతోషించకుండా, మనిషి పోయినప్పుడు విచారించకుండా ఉండగలమా! కాని ఈ సున్నితమయిన భావాలు శ్రుతిమించినప్పుడే నాలాటి దురదృష్ట వంతులకు బాధ!"    
    "ఆ మాట ఎందుకు అనాలి, శ్రీనివాస్. మీరు దురదృష్టవంతులెందుకు కావాలి? మరొక్కసారి ఎందుకు ప్రయత్నించకూడదు? ఈసారి మీకు పూర్వం లేని నిబ్బరం కలుగుతుందేమో!"
    "లేదు, అనూరాధా, లేదు. అదే ఆశతో మూడుసార్లు ప్రయత్నించాను. మూడుసార్లు ఎదురుదెబ్బే తగిలింది. నా చిన్నప్పుడు మా ఇంటిపక్క లక్ష్మి అనే అమ్మాయి ఉండేది. నేను పెరిగి డాక్టరయ్యేటప్పటికి ఆ అమ్మాయికి పెళ్ళయిపిల్లలుకూడా పుట్టారు. నేను హౌస్ సర్జను చేస్తూండగా, ఆ అమ్మాయి హాస్పిటల్ లో చేరింది. చేరేనాటికే ఆ అమ్మాయి ఆరోగ్యం అంత ఆశాజనకంగా లేదు."

                                 *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS