Previous Page Next Page 
తామరకొలను పేజి 13


    "ఇంత తొందరగా నేనున్నా చోటు మర్చిపోయారా?"
    "మాత్ర తెచ్చాను" అంటూ, రమేశ్ సారిడాన్ రత్న-చేతికిచ్చాడు.
    "ఎలా తీసుకొను?"
    "నోట్లోవేసుకుని మింగేయండి."
    "నీళ్ళో?"
    "ఓహ్ మరిచిపోయాను. రండి; ఇక్కడే ఏదైనా హోటలుకు వెళ్ళి కాఫీ తీసుకుందాం."
    రత్న లేచింది.
    రమేశ్ మొండిగా: "ఈ మాత్ర తెచ్చానని నేను డాక్టరవబోను. మీరు అలా అనుకున్నారంటే పొరపాటే"
    చౌపాఠి ఇసుకలో నడిచి రోడ్డుపైకి వచ్చాడో అక్కడనుండి నడిచివెళ్ళి మెరీన్ డ్రైవ్ దాటి హోటల్ కి వెళ్ళారు.
    హోటల్లో 'చా'-కోసం కాచుకుని కూర్చున్నపుడు రత్న అడిగింది.
    "మీకు నేనంటే ద్వేషమా?"
    "ఛా, అలా అని ఎవరన్నారు? అలా ఎందుకనుకుంటున్నారు?"
    "మరి నామీద కసితీర్చుకుంటున్నట్టు నేను డాక్టరవను అంటారెందుకు? తన ముక్కు కోసుకుని అందరికీ చూసే మూర్ఖుడిలా మాట్లాడుతున్నారు. మీరు డాక్టరు కాకపోతే, మిగతావారికి నష్టమేమీ లేదు. మీకే అపారనష్టం."
    "నా లాభనష్టాల విషయం నాకు చెందింది."
    "అలాగే అనుకోండి. డాక్టర్ కానక్కర్లా మరేం చేస్తారు?"
    "ఇలాగే ఉంటాను."
    "అంటే మీ అన్నయ్య, తండ్రి-వీళ్ళమీద ఆధారపడి జీవిస్తారన్నమాట."
    రమేశ్ కాస్త ఆలోచించి చెప్పాడు: "ఉహుఁ. ఏదైనా ఆశ్రమంలో చేరిపోతాను. సన్యాసిగా బ్రతుకుతాను."
    రత్న చిరునవ్వు నవ్వి: "సన్యాసమా! ఇది మీలాంటివారికి కాదు" అంది.
    రమేశ్ ఇక సహనాన్ని కోల్పోయాడు. గట్టిగా.
    "ఏం? నాకంత సమయం లేదనుకున్నారా? నేను తల్చుకుంటే ఏదైనా చెయ్యగలను."
    "మీ ఆత్మవిశ్వాసాన్ని చూసి నాకు చాలా సంతోషంగా ఉంది. అదే ఆత్మవిశ్వాసంతోనే పరువు పూర్తి చేయండి. మనిషికి వైరాగ్యమూ కావాలి. నిజమే; నేనూ ఒప్పుకుంటాను. కాని, మీ మనసు వైరాగ్యపు దారి తొక్కడానికి అనువైనది కాదు."
    రమేష్ టేబుల్ మీదకు వంగి, రత్న-కళ్ళలోకి చూస్తూ:
    "నా జీవితం విషయంలో తను రెండు కింత శ్రద్ధ తీసుకుంటున్నారో తెలుసుకోవచ్చా?" అన్నాడు.
    రత్న కళ్ళు దించుకుంది. మెల్లిగా:
    "అది నా స్వభావం" అంది.
    "నే నొప్పుకోను. నా మొహం చూసి చెప్పండి. నా విషయంలో మీ కెందు కింత శ్రద్ధ?"
    "నిజం చెప్పమన్నారా?"
    "ఊఁ. చెప్పండి."
    "మీరంటే నాకున్న ఆసక్తివల్ల."
    "ఆసక్తి ఎందుకు?"
    "మీరంటే నాకు అభిమానం ఉంది; స్నేహమూ ఉంది.
    రమేశ్ జీవితంలో ఎన్నడూ అనుభవించని అపూర్వమైన ఆనందాన్ని అనుభవించాడు. అతడి గుండె కొట్టుకోడం అతడికే వినిపించింది. నుదుటి మీద స్వేదబిందువులు నిలిచాయి.
    "నా తలనొప్పికోసం మీ రెందుకంత అలవాటు పడ్డారో చెప్పగలరా? మీ వేదాంత రీత్యా 'ఆమె కర్మ ఆమె అనుభవిస్తుంది' అని ఊరుకోలేదేం?" రత్న ఎదురుప్రశ్న వేసింది.
    "మీరు బాధపడుతూంటే నేను చూడలేను."

                                          8

 

                  

    "మీ కర్మ సిద్ధాంతానికి మీ రిచ్చే విలువ ఇంతే నన్నమాట."
    "మీ ఒక్కరికి మాత్రం ఆ సిద్ధాంతం అన్వయించదు."
    "ఏం?"
    "మీ మీదున్న అభిమానమే దానికి కారణం."
    చేతిలో చేయి వేసుకుని లోపలకు వచ్చిన పార్సీ దంపతులవైపు చూస్తూ రత్న "వెడదాం" అంది.
    రమేశ్ యాంత్రికంగా బయలుదేరాడు.
    ఈవిధమైన నివేదనవల్ల తాత్కాలికంగా హృదయం తేలికపడినట్టనిపించినా భవిష్యత్తులో ఎదుర్కొనవలసిన మనో విప్లవం రత్నను భయపెట్టింది.
    రమేశ్ ఎన్ని రోజులని తమ ఇంట్లో ఉండగలడు? ఈరోజు కాకపోతే రేపు, ఎప్పుడో ఒకప్పుడు, అతడు వెళ్ళవలసినవాడే కదా! ఎప్పి విషయమో ఇప్పటినుండి ఆలోచించి మనస్సు పాడు చేసుకోవటం ఎందుకని రత్న అనుకున్నా, ఆరోజు తెచ్చిపెట్టే వ్యధ భయంకర స్వరూపం దాల్చి ఆమెను బెదిరించింది.
    రమేశ్ ఏం ఆలోచిస్తున్నాడోనని అతడి వైపు చూసింది.
    రత్నలా రమేశుడికి తన అంతరంగాన్ని ఎదురించవలసిన అవసరమే లేదు. అతని హృదయం బంధన రహితమైనది.
    ఆవిధమైన సంఘర్షణనుండి అతడైనా తప్పించుకున్నందుకు రత్న-మనస్సు సమాధాన పడింది.
    అంతరాత్మతో యుద్ధం చేస్తూ పరధ్యానంగా నడుస్తున్న రత్నను రెండుమార్లు రమేశ్ హెచ్చరించాడు. ఇంకోమారు పక్కన వస్తున్న కారును చూసుకోకుండా రోడ్డు దాటబోతున్న రత్న భుజం పట్టుకుని నిలిపి, మెల్లిగా గద్దించాడు.
    "ఇది మైసూరు కాదు రత్నా, బొంబాయి."
    రత్న తేరుకుని "ఏమిటి?" అంది.
    "ఇన్ని రోజులూ మీరు నాకు ట్రాఫిక్ గురించి హెచ్చరిక చేసేవారే; ఈరోజు నేను మిమ్మల్ని హెచ్చరించాల్సి వస్తోంది."
    "కారుకింద పడి చావాలని నా నొసట రాసి ఉంటే, ఎవరేం చెయ్యగలరు?"
    తను అన్నమాట తోనే తన్ను మాటిమాటికీ దెప్పుతున్న రత్నపైన రమేశుడికి బాగా కోపం వచ్చింది. అప్పటిదాకా తన చేతిలో ఉన్న రత్న చేతిపట్టును మరింత బిగించాడు.
    "ఇహ జాగ్రత్తగా నడుస్తాను" అంటూ చెయ్యి విడిపించుకుంది రత్న.
    దోవలో నడుస్తున్న ఓ చిన్నపిల్లను చూడగానే రత్నకు ఇంట్లో ఉన ఆశ గుర్తుకొచ్చింది. దాంతో అడుగులు కూడా వేగంగా పడసాగాయ్.
    రమేశుడితో స్నేహమూ, ఆత్మీయతా బలపడినట్టు అనిపించగానే, రత్న అతడి నుండి దూరమవాలని ప్రయత్నించింది. అతడి స్నేహాన్ని ఆమె కోరుతున్నా, కేవలం స్నేహంతోనే తృప్తిపొందక ఇంకా ఏదైనా కావాలని కోరుకునే తన మనస్సును మొదటి నుండి తన అధీనంలో ఉంచుకోవటమే ఇద్దరికీ మంచిదని ఆమెకు అనిపించింది.
    జీవితంతో అంత ఎక్కువ పరిచయంలేని రమేశ్, భవిష్యత్తుని గురించి అంతగా ఆలోచించే వాడే కాదు. రత్న స్నేహ సౌజన్యాలు తనకు దక్కాయి. అది అతని మనో మందిరపు మొదటి మెట్టు. అక్కడ అడుగుపెట్టిన అతడి కోర్కె-ఆమె స్నేహ విశ్వాసాలను ఎప్పటికీ తననిగా చేసుకోవాలనే వరకూ పోయింది.
    రత్న స్నేహ విశ్వాసాలు ఇప్పటికేమో అతనినే కాని, అవి తనొక్కడివే కావాలనే ఆకాంక్ష అతడిలో చెలరేగింది. దానిని సాధించలేని తన జీవితమే వ్యర్ధ మనిపించిదతనికి.
    పైకి ఎక్కిన కొలది అగాధంలోకి పడిపోతా నన్న ఊహే కలగలే దతనికి.
    శేషగిరి-ఇంటిలో రెండు రోజులుండి వెళ్ళిపోవలసిన అతిధి తను. కాని, ఏ విషయాన్నీ ఆలోచించలేని అతడి ముగ్ధ మనసు, ఇంకొక మనసనే గాలంలో చిక్కుకున్నప్పుడు భవిష్యత్తును గురించి ఆలోచించాలన్న ప్రయత్నమే చేయలేదు.
    కాని, పగలూ రాత్రీ ఇదే ఆలోచనతో కొలిమిలోని ఇనుములా కాలిపోతోంది రత్న. తనకు భర్త నుండి ఏవిధమైన రక్షణ కాని, సాంత్వనం కాని దొరకదని రత్నకు బాగా తెలుసు. ఆమెకు ఆసరా ఆశ ఒక్కతే.
    కాని, తన విషయాలకన్నా రమేశుడిని గురించిన బెంగే ఎక్కువగా ఉంది రత్నకు. అతడు అసలే దెబ్బతిన్నవాడు. చిన్నప్పటినుండి ఎంతో గారాబంగా పెరిగిన అతడికి, అనుకోకుండా తగిలిన వదిన-చావు దెబ్బతో అంతవరకూ ఉన్న శాంతి సౌఖ్యాలను కోల్పోయి జీవితంలోనే ఏ ఆసక్తీ లేకుండాపోయింది.
    మునుపటిలా జీవితంలో ఆసక్తి కలిగించాలనే ఆశతోనే పెద్దవాళ్ళు అతడిని బొంబాయి పంపారు.
    వారి ఆశలు ఫలించేటట్టే ఉన్నాయి.
    రమేశ్ ఇప్పుడిప్పుడే జీవితంలో ఆసక్తిని కనబరుస్తున్నాడు. కాని, ఈ ఆసక్తి పరిణామంవైపు అతడి దృష్టి పోనేలేదు.
    తెల్లవారాక నయినా స్వప్నాన్నుండి మేల్కొనక తప్పదుకదా!
    అలా అని రమేశుడి విషయంలో ఉదాసీనంగా ఉండలేకపోయింది రత్న. దీనికి మారుగా అతడిమీది ప్రేమ, కరుణ, విశ్వాసాలు రెండింత లయ్యాయి.
    ఒక శుక్రవారం రత్న!
    "ఈరోజు మహాలక్ష్మి దేవాలయానికి వెడదాం" అంది.
    "నాకు దేవుడంటే భక్తి లేదు."
    "దేవుడు కాదు-దేవత-" అంటూ సరిదిద్దింది రత్న.
    దేవుడిమీద భక్తితో కాకపోయినా, రత్నతో వెళ్ళవచ్చును కదా అని ఒప్పుకున్నాడు రమేశ్.    
    "ఆశా! గుడికి వెడదాం రా" అని పిల్చింది రత్న,
    ఆటలో మునిగిపోయిన ఆశా రానంది.
    ట్రాము, బస్సుల రద్దీనుండి దూరంగా ఉంది దేవాలయం. దేవాలయ ప్రాకారం దగ్గరకు రాగానే అక్కడ పూలు, అగరవత్తులు, కొబ్బరికాయలు అమ్ముతున్న పిల్లలు వీళ్ళను పిలువసాగారు.
    రమేశ్ ఒక పిల్లను చూసి "అక్కడ కొందాం" అన్నాడు.
    రత్న పూజా సామగ్రి తీసుకొంది.
    దేవాలయంలోకి వెళ్ళేముందు రత్న:
    "మీరు ఆ అమ్మాయి దగ్గరే ఎందుకు కోనాలనుకున్నారో తెలుసా?"
    "చెప్పండి."
    "ఆ అమ్మాయి మిగిలినవారికన్నా అందంగా ఉంది. ఇప్పుడయినా ఒప్పుకుంటారా-సౌందర్యం అందరినీ ఆకర్షిస్తుందని."
    దేవాలయంలో పూజ చేయించుకుని బయటకు వచ్చా రిద్దరూ.
    "దేవిని ఏం కోరుకున్నారు?" రమేశ్ అడిగాడు.
    "సముద్రం దగ్గరకు వెడదాం. అక్కడ అంతా చెపుతాను." అంది రత్న.
    దేవాలయం వెనుకభాగంలో రాళ్ళకు కొట్టుకుని హోరు పెడుతున్న సముద్రందగ్గరకు వెళ్ళారిద్దరూ. ఎండిన ఆకుపచ్చ రంగులో మన్న రాళ్ళ మీద నడిచి కొంతదూరం వెళ్ళారు.
    రత్న తొడుక్కున్న ఎత్తు మడమల జోళ్ళు పాచికట్టిన రాతి మీదికి అడుగు పెట్టగానే, జారి రత్న పడబోయింది. రమేశ్ ఆమెను గట్టిగా పట్టుకున్నాడు.
    "వదలండి; ఇక జాగ్రత్తగా వస్తాను" రత్న విడిపించుకోబోయింది.
    "మీరు పడి, కాళ్ళు విరక్కొట్టుకుంటే నాకే కదా చెడ్డపేరు" అన్నాడు రమేశ్.
    "మీ కెందు కొస్తుంది చెడ్డపేరు?"
    "మీరు నాకోసమే ఇలా వస్తున్నారు. నావల్ల మీకు కష్టం కలగరాదు."
    రత్న ఒక్క నిముషం ఆగి,
    "మనస్సు భగ్నమయ్యేటందుకన్నా, కాళ్ళు విరగటమే మంచిది" అంది.
    రమేశ్ తన ఛేతి పట్టు వదల్లేదు. రత్న మాటలు తనకు వినిపించనట్టే నటించాడు, ఇద్దరూ నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళి నీళ్ళ మధ్యలో ఉన్న ఓ రాతిపైన కూర్చున్నారు. సముద్రపు నీరు రాతికి కొట్టుకొని మళ్ళీ తొందరగా వెనక్కు వెళ్ళిపోతోంది.
    వాళ్ళలాగానే మరింకెంతోమంది అక్కడ రాళ్ళ పైన కూర్చుని ప్రకృతి-సౌందర్యాన్ని తిలకిస్తున్నారు.
    వాతావరణం అకస్మాత్తుగా గంభీరంగా మారిపోయినట్టు అనిపించి రమేశ్ :
    "దేవిని ఏం కోరుకున్నారు?" అని అడిగాడు.
    ఇసుకలో తలదూర్చి వాస్తవికత నుండి పారిపోవాలనుకునే నిప్పుకోడి-బుద్ధిలాంటిది రమేశుడిది.
    "అది నా రహస్యం; మీ కెందుకూ?"
    "నాకు చెప్పరానిదా?"
    "అలా అని కాదు గాని, మీరు అపార్ధం చేసుకోరు కదా?"
    "చేసుకోను; చెప్పండి."
    "రమేశుడికి మంచి బుద్ధిని ప్రసాధించు తల్లీ!" అని వేడుకున్నాను."
    రమేశుడు కోపంతో అలిగి దూరంగా జరిగి కూర్చున్నాడు.
    "నాలో అంత చెడ్డబుద్ధి మీకేం కనిపించింది?" రమేశ్ అడిగాడు.
    "ఈ సముద్రం ఎంతవిశాలంగా ఉందో. మీ చెడ్డబుద్ధి కూడా అంతే విశాలంగా ఉంది."
    రమేశుడు, అస్తమిస్తున్న సూర్యుడివంక చూస్తూ:
    "నాలో కొంచెం కూడా మంచి బుద్ధి లేదంటారా?" అని అడిగాడు.
    "ఉహుఁ ..... లేదు."
    "పోనీ ఆ చెడ్డబుద్దు లేమిటో చెప్పండి. కనీసం సరిదిద్దుకోవటానికి ప్రయత్నిస్తాను."
    "చెప్పనా ....... మొదటిది ....." అటూ, రత్న వేళ్ళు మడిచి చెప్పసాగింది.
    "మీది అతి సున్నిత హృదయం. ఇంత మృదుహృదయమైతే, జీవితంలో మనకు తగిలే దెబ్బలకు తట్టుకోలేం. మన మనసు-ఇదిగో ఈ రాయిలా ఉండాలి. అలలు ఎంత జోరుగా కొట్టుకున్నా ఈ రాయి పగిలిపోదు."
    "సరే, రెండోది" ఉత్సాహంగా అడిగాడు రమేశ్.
    "మీరు అందర్నీ చాలా తొందరగా నమ్మేస్తారు. కొంచెం మంచిగా మాట్లాడినంతమాత్రాన ఎవరి నైనా మంచివాళ్ళనుకోవడం పొరబాటు. కొస నాలిక నుండి వచ్చే పలుకులను హృదయాంత రాళంలో నుండి వచ్చాయని భావించటం మంచిది కాదు."
    "సరే. మూడవది?"
    "మీరు చాలా సెంటిమెంటల్ మనిషికి భావుకతా కావాలి. కాని, జీవితంలో అదే ప్రధాన పాత్ర వహించరాదు. ఆఖరిది: మీరు వదిలిపెట్టా లనుకుంటున్న వైద్య వృత్తిని మళ్ళీ స్వీకరించాలని నా కోరిక. మొదటి మూడు లోపాలను క్షమించినా ఈ ఆఖరిధాన్ని మాత్రం మన్నించడానికి వీల్లేదు."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS