Previous Page Next Page 
ఎండమావులు పేజి 13

 

    ఆరోజంతా ఆలోచించుకుంది శ్రీలక్ష్మి. ఎంత ఆలోచించినా ఒక నిర్ణయానికి రాలేకపోయింది. ఆమె నరనరాల్లోనూ వైదిక సాంప్రదాయం జీర్ణించిపోయింది. మడితోగాని మంచి తీర్ధమైనా ముట్టుకోదు. వితంతువుకు రాత్రిళ్ళు భోజన మేమి టని ఏ పండో ఫలమో తిని ఉంటుంది. అదీ కాకపోతే కాసిని మజ్జిగ తాగి పడుకుంటుంది. తల్లికంటే ముందుగానే పూజ పునస్కారాలు ముగిస్తుంది. అబద్ధమనే మాట శ్రీలక్ష్మి తన జీవి తంలో ఎప్పుడూ ఆడలేదు. అబద్దమాడితే గౌరవాది నరకయాతనలు అనుభవించటమే గాక పసుపు కుంకుమకు కూడా నోచుకోనివారవుతారనే మూఢ విశ్వాసము గలది. వర్ణాశ్రమ ధర్మాలనూ, పెద్దల మాటలనూ ఏ పరిస్థితుల్లోనూ తీసి వెయ్యదు. ఎవరయినా వర్ణాశ్రమ ధర్మాలను పాటించకపోతే తనకు ఆ వ్యక్తి యందున్న చనువును బట్టి రకరకాలుగా చివాట్లు పెడుతుంది. 'నవ్వుతూ ఆపని చేశావ్, ఏడుస్తూ అనుభవిస్తావ్ లే' అంటుంది. గౌతమిని చూస్తే శ్రీలక్ష్మికి ఒకవైపు కోపము, ఒకవైపున జాలి. గౌతమికి మడి ఆచారాలు తెలియవు. శరీర శుభ్రతకు స్నానమూ, ఉతికిన వస్త్రమూ కట్టుకుంటే చాలుగాని 'మడి' అనే ప్రత్యేక వాతావరణం కల్పించ నక్కర్లేదంటుంది. ఈ మడి ఆచారాలు పూర్వకాలంలో ఎప్పుడో నీ మహర్షులో, ఏ ఆశ్రమవాసులో జవేతపోనిష్టా గరిష్టులైనవారు ఏర్పరచిన నియమాలు తప్ప వేరే ఏమీ కాదంటుంది. ఈ కాలానికి అవి పనికిరా వంటుంది. నైతిక పతనం చెందనంత వరకూ, సుఖ లాలసత్వం తృప్తిగా అనుభవించటం కోసం కళంకితులు కానంతవరకూ స్త్రీ పురుషులు శిష్టా చాలాన్ని పాటిస్తున్నట్లుగానే భావించవచ్చు నంటుంది గౌతమి. ఈ రకమైన చర్చలతో ఎప్పుడూ తనను రెచ్చగొట్టే మాటకు మాట సమాధానం చెప్పే గౌతమినే వదినెగా స్వీకరించింది కాని, ఎంత మనస్సుకు నచ్చచెప్పుకున్నా స్వాతిని వదినెగా భావించలేకపోయింది శ్రీలక్ష్మి.
    ఈ విశాల ప్రపంచంలో ఎక్కడో తన అన్న కృష్ణమూర్తి ఉన్నా డనుకున్నా ఏ పరిస్థితుల్లోనూ స్వాతిని తల్చుకునేది కాను శ్రీలక్ష్మి. అటువంటిది ఈనాడు తన అన్న జానకిరాం ఆ తీరుగా మాట్లాడినందుకు తనలో తను కుమిలిపోయింది. మెల్లి మెల్లిగా జానకిరాం వాళ్ళను తనతో కలుపుతాడేమోననే అనుమానం కలిగింది శ్రీలక్ష్మికి. అదే నిజమయితే ఈ ఇంట్లో తను ఒక్కరోజు కూడా ఉండలేదు. గుక్కెడు నీళ్ళు త్రాగటానికి ఇష్టపడదు. వర్ణసంకరపు వాళ్ళ పక్కన తన బొందిలో ప్రాణ మున్నంతవరకూ కూర్చోలేదు. వాళ్ళతో మాట్లాడలేదు. ఈ స్వాతి కన్న ఆ గౌతమి ఎన్నో రెట్లు నయం. ఆ గౌతమి లేకపోవటం చేతనే జానకిరాం అన్నయ్య ఇట్లా దారి తప్పుతున్నాడేమోనని అనుమానపడింది. ఇదే నిజమైతే ఇంక ఈ యింటి గడప ఎవ్వరూ తొక్కరు. ఇది జరక్కుండా చూడాలి. జానకిరాం అన్నయ్యని పతితుడు కాకుండా కాపాడాలి. గౌతమి వదినె రావాలి. ఈ ఇంటి పరువు ప్రతిష్టలు దక్కాలి!
    ఇట్లా ఆ రోజల్లా ఆలోచించింది శ్రీలక్ష్మి. శ్రీలక్ష్మి రెండో రోజునే తల్లితో చెప్పింది ఈ విషయం. ఆవిడ నోరు నొక్కుకుంది. ఈ సంగతి బైటికి పొక్కనివ్వద్దని కూతుర్ని మందలించింది. భర్త లేకుండా చూసి జానకిరాంను అడిగింది "అన్నయ్య ఎట్లా ఉన్నాడురా" అని.
    జానకిరాం భయపడుతూ శ్రీలక్ష్మి వైపు చూశాడు ఎందుకు చెప్పా నన్నట్లుగా
    శ్రీలక్ష్మి మాట్లాడలేదు,
    "ఎప్పుడో పదేళ్ళవాడు వెళ్ళిపోయిన అన్నయ్య ఎట్లా ఉంటే మనకెందుకమ్మా, వాడేం మనకు పెట్టి పొయ్యటం లేదు. వాడి బ్రతుకు వాడు బ్రతుకుతున్నాడు" అన్నాడు జానకిరాం ముభావకంగా.
    "పోనీలేరా. నువ్వు చెప్పింది నిజమే. వాడు వర్ణసంకర వివాహం చేసుకున్నా, మనతో సంబంధ బాంధవ్యాలు తెంచుకున్నా వాడు నా కొడుకు కాక పోడు. ఫలాని శాస్త్రిగారి కొడుకని లోకం చెప్పుకుంటూనే ఉంటుంది. వాడిని దూరం చేసుకున్నా, వాడిమీదగల కనిపెంచిన మమకారం దూరం కాదు. మమక్రం మనస్సులో ఉండేది కనక దాన్ని ఎవ్వరూ తీసివెయ్యలేరు" అన్నదావిడ కళ్ళుతుడుచుకుంటూ.
    తల్లి మనస్సు గ్రహించిన జానకిరాం మనస్సులో నవ్వుకున్నాడు.
    "అవునమ్మా మనుష్యులకు జాతి మత భేదాలుండొచ్చు గాని మనస్సుకు జాతి మత భేదాలు లేవు. మనిషి దూరమయినా మనస్సునీ, మమతనీ దూరం చేసుకోలేం. ఈ సత్యాన్ని ఈనాటికి గ్రహించినందుకు చాలా ఆనందంగా ఉన్నదమ్మా. ఇన్ని సంవత్సరాల నుంచీ ఎన్నడూ అన్నయ్య ప్రసక్తి తీసుకురాని దానిని, ఇవాళ అన్నయ్యను గురించి కుశల ప్రశ్నలు వేస్తున్నావేమమ్మా" అన్నాడు.
    తల్లి ఈ ప్రశ్నకు సమాధానం ఏం చెపుతుందో నని శ్రీలక్ష్మి ఆసక్తిగా తల్లి ముఖంలోకి చూడసాగింది.
    "ఇన్ని సంవత్సరాల నుంచీ వెళ్ళంది వాడింటికి నువ్వు మాత్రం ఎందుకు వెళ్లావురా జానకీ. ఏకోదరులైన మీకే అంత ప్రేమ, వాత్సల్యాలుంటే నవమాసాలు మోసి, కానీ, పెంచి, పెద్దచేసిన ఈ కన్నతల్లికి ఎంతాపేక్ష ఉంటుందో నువ్వే ఆలోచించు. మీ అందరికీ, ప్రత్యేకంగా మీ నాన్నకు జడిసే ఇన్నాళ్ళూ వాడి ప్రస్తావన పైకి తీసుకురాలేదు, వాడిమీద నాకున్న ప్రేమ వాత్సల్యాలని నాలోనే ఇముడ్చుకుని వాటికి సమాధి కట్టాను. అన్నయ్యను చూట్టానికి నువ్వు వెళ్ళి వచ్చావంటే వాడి విషయం అడిగాను. ఏమయినా వాడికి ఈ ఇంట్లో స్థానం ఏనాడో పోయింది. పోగొట్టుకున్న స్థానం మేం బ్రతికుండగా తెచ్చుకోలేడు" అన్నాదావిడ.
    తల్లి నిశ్చయానికి శ్రీలక్ష్మి సంతోషించింది. తానే జయించానన్న సంతోషంతో జానకిరాంవైపు చూసింది. "తల్లి దంద్రులైన మీరు అన్నయ్యకు స్థానం ఇవ్వకపోయినా, తమ్ముడుగా నేను సర్వదా అన్నయ్యకు కృతజ్ఞుడినే. ఈ అభిప్రాయాన్ని నేనెన్నడూ మార్చుకోలేను" అన్నాడు జానకిరాం.
    కొడుకు అభిప్రాయానికి తల్లి మనస్సులో సంతోషించింది. ఈ రీతిగానైనా వాడి యోగ క్షేమాలు కనుక్కునే అవకాశం కలిగినందుకు ఆమె హృదయం ఆనందంతో తొణికిసలాడింది.
    అమ్మ కూడా కొడుకుమీద మమకారంచేత జానకిరాం పక్షమే వహించిందా అని అనుమాన పడింది శ్రీలక్ష్మి. ఏమైనా కడుపుతీపి అట్లాంటిదని సమర్ధించుకున్నా వైదిక సాంప్రదాయాలకు విరుద్ధంగా కట్టుకోవటం శ్రీలక్ష్మికి ఎంత మాత్రం ఇష్టంలేకపోయింది.
    "నిన్ను గురించి వదినె ఎంతో వినయ విధేయలతో గౌరవభావంతో మాట్లాడిందమ్మా. ఏ గుళ్ళోనో, ఏ స్నానాల రేవువద్దనో, ఏ పురాణం దగ్గరో నిన్ను అనేకసార్లు చూసిందిట. అలాంటి అవకాశం కలిగినప్పుడల్లా వెయ్యి కళ్ళతో చూసి నట్లుగా నిన్ను చూసి మనస్సులోనే ఈ అత్తగారికి నమస్కరించేదిట. నువ్వంటే వదినెకు ఎంతో...."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS