Previous Page Next Page 
అపరాజిత పేజి 14


    "కాళ్ళు చేతులు కడుక్కురా అంటూ ఒక అరిటిపండు, చిన్న బర్ఫీముక్క కాగితంలో పెట్టి పట్టుకొచ్చింది. పెద్దమ్మ.
    'ఎక్కడివి అవి?' అన్నది మాధవి. ఇంట్లో యింత కూరకొనలేక అవస్థ పడతోంటే పళ్ళు, మిఠాయి ఎక్కడి నుంచి వచ్చాయి?
    'రాధ తెచ్చింది.' అన్నది పెద్దమ్మ కొనడానికి దాని దగ్గర డబ్బు ఎక్కడిది-ఎవరిచ్చారు అనుకుని అనుమాన పడుతూ, శకుంతలని చాపమీద పడుకోబెట్టింది. అది నసుగుతూ ఏడున్న మొదలుపెట్టింది మాధవి పెరట్లోకి వెళ్ళింది.
    రెండు నెలల నాడు బావ వెళ్ళిన వారానికి ఒక ఉత్తరం వచ్చింది. తన పేరున-మనం మాట్లాడిన విషయాలు ఏం చేసావంటూ. తను జవాబు వ్రాయలేదు. మధుతో యీ గొడవంతా జరిగిన తర్వాత కూడా ఏమీ వ్రాయాలో తోచక వూరు కొంది. అతను దగ్గర ఉండగా మాట్లాడినప్పటికీ, ఉత్తరం వ్రాయాలంటే జంకు కలిగింది. మధుకి డబ్బు పంపించాలి. కంపెనీ చిరునామాకి తనే పంపడానికి వీలులేదు. మొత్తమంతా తండ్రి పేరేపంపాలి. డబ్బు పంపేయండని వ్రాయడానికి మనస్సొప్పలేదు.
    బైండింగు షాపు రెండు నెలల్లోనే మూత బడింది, షాపులో పెట్టిన కాగితాలు చెదతిన్నాయి. నోటు పుస్తకాలు పట్టుకెళ్ళిన వాళ్ళిద్దరూ దుకాణాలు కట్టేసుకుని పోయినారు. బాకీలు వసూలు కాలేదు. పనివాడు చిన్నసామాన్లు ఎత్తుకు పోయి నాడు. అరువుమీద తెచ్చిన కాగితం బాకీ కోసం నూరు రూపాయలు మాధవి జీతం లోంచే యిచ్చింది. ఇవన్నీ శివశాస్త్రి వ్రాశాడు కాబోలు, అల్లుడు కొంత డబ్బు పంపించాడు. ఆ మిషన్లు అవీ కొనేవాళ్ళని కుదిర్చాడు. వాళ్ళొచ్చి మిషన్లు పట్టుకు పోయినారు. ఆ అమ్మకం డబ్బు తన చేతులో పడేసుకుందామని శివశాస్త్రి చూశాడు కానీ, రాజారావు ముందే అది బందోబస్తు చేసుకున్నాడు.
    ఇంత యిబ్బందుల్లో వున్న రాధ స్నేహితులతో అంటూ, సినిమాలకు పోతూనే వుంది. అడపాతడపా పూలు, పళ్ళు ఏవో కొంటూనే వుంది. ఎక్కడిది డబ్బు దీనికి? పైగా మధుకి సర్ధడానికి కూడా తెస్తానంది- ఎక్కడినుంచో?
    కాస్సేపటికి అరుగు మీదకి వచ్చి నిలబడింది మాధవి. మధు గది ఖాళీచేసి వెళ్ళాక ఎవరికీ యివ్వలేదు మళ్ళీ. రాధ అక్కడే చదువుకోవడం, పగలు పడుకోవడం చేస్తోంది.
    తలుపుకి తాళం లేదు. బయట నుంచి గొల్లెం పెట్టి వుంది. వీధిలోకి వున్న యీ తలుపు యిల్లా వదిలేసిందేమిటని వెళ్ళి గొళ్ళెం తీసి, లకిపలికి వెళ్ళింది మాధవి, చాపమీద రెండు చీరెలు మాసినవి పడి వున్నాయి. బల్లమీద వున్న అద్దం దగ్గర దువ్వెన, మూతలేని పౌడరు డబ్బా పడి వున్నాయి, అంత కంగారుగా వెళ్ళవలసిన అవసరం ఏమీ వచ్చిందనుకుంటూ, ఒక చీరె తీసి మడత పెట్టసాగింది మాధవి. బల్లమీద పడివున్న కాగితం మీద దృష్టి పడింది. మడుస్తున్న చీరె వదిలేసి, ఆ కాగితం తీసి చూసింది. రాధకి ఎవరో వ్రాసిన వుత్తరం అది, క్రింద సంతకం లేదు. 'సాయంత్రం రా తప్పకరా, రెండు రోజులై  చూడక తోచడం లేదు' అని వ్రాసివుంది. ఎవరు వ్రాశారిది- అని అటూ యిటూ త్రిప్పి చూసినా ఏమీ అర్ధం కాలేదు. ఎల్లా వచ్చిందో కూడా తెలియలేదు. అది తీసుకుని గుప్పిట్లో మడిచి పెట్టుకుని యివతలికి వచ్చి తలుపు తాళం వేసింది మాధవి.
    ఏడు కావస్తున్నా రాధ రాలేదు. శివ శాస్త్రి వచ్చి పెందరాళే యింత అన్నం తిని పడుకున్నాడు. ఆయన ఏమీ పట్టకుండా ఎలా వుంటాడన్నది చాలా ఆశ్చర్యమైన విషయం. రాధ ప్యాసైందన్న సంగతి పెద్దమ్మ చెప్పిందో లేదో కానీ, ఆయన ఏమీ పట్టనట్లే వున్నాడు.
    మాధవి మళ్ళీ వీధి గుమ్మంలోకి వచ్చి మెట్లమీద నిలబడింది. అటు, యిటు చూస్తోంటే ఎడంవేపు వీధి చివర లైటు వెలుగులో రాధ వస్తున్నట్లు కనబడింది. ఆమె ప్రక్కన వున్న మనిషి- మగమనిషి లైటు స్తంభం దాటాక ఆగిపోయాడు. ఇద్దరూ ఐదారు నిముషాలు ఆగిపోయారు. రెండు అడుగులు వెనక్కివేసి చూస్తూ నిలబడింది మాధవి. అతను వెళ్ళిపోయాడు. వెనక్కి చూసి, రాధ గబ గబా నడిచి వచ్చి, మెట్లు ఎక్కుతూ గుమ్మం దగ్గరవున్న మాధవిని చూసింది. వెంటనే ఏమీ అనలేదు. గుమ్మం దాటి వెడుతూ, 'ఇక్కడ నిలబడ్డావేం?' అన్నది.
    మాధవి మాట్లాడలేదు. తనూ లోపలికి కదిలింది. భోజనం చేస్తున్నంతసేపు చాలా మవునంగా వుంది. పెద్దమ్మ రాధ రాగానే చెప్పింది, ప్యాసైనావుట అని. 'నాకు తెలుసు.' అన్నది రాధ. అంతకంటే మాటలో సంబరం కనబడలేదు.
    రాత్రి పడుకున్నప్పుడు మాధవి అడిగింది 'నిన్ను యింటి దగ్గర దిగబెట్టిన అతను ఎవ'రని? - ఆ చీకట్లో రాధ మాట్లాడకుండా వూపిరి వదలడం మాత్రం వినబడింది మాధవికి.
    'నా ఫ్రెండు. ఏం అల్లా అడుగుతున్నావు?' అన్నది చివరికి.
    'ఏ రకమైన ఫ్రెండు?- నీకు సినిమాలకి వెళ్ళడానికి అవీ యివీ కొనడానికి డబ్బు ఎక్కడిది?' కంఠం తగ్గించి మెల్లిగా అడిగింది మాధవి.
    కొంతసేపు మాట్లాడలేదు రాధ. ఆ తర్వాత 'నీ కెందుకు అవన్నీ?' అన్నది. ఇల్లా అంటుందేమోనని అనుమానం వుంది -కానీ, అడగాలి, తెలుసుకోవాలి. ఇంట్లో బాధ్యత వహిస్తున్న మనిషిగా తన సంబంధం వుంది అనుకున్నది మాధవి.
    'నీ బాగోగులు చూస్తున్న వాళ్ళకి తెలుసుకోవలసిన అవసరం వుందిగా!' అన్నది మాధవి. వెంటనే వచ్చింది జవాబు.
    'నీకు మధు ఏరకమైన ఫ్రెండు అనీ- అక్క పెళ్ళికి నీకు ఎందుకు అంత డబ్బిచ్చాడనీ నేనూ అడగొచ్చుగా?- బావతో ఆ మంతనా లేమిటనీ అడగొచ్చుగా?' అని.
    మాధవి పక్కమీద లేచి కూర్చుంది. పట్టరాని కోపం వచ్చింది ఆమెకి. ఎందుకిట్లా మాట్లాడుతున్నావు? ఈ మధ్య నీ తీరే వపోరిపోయింది! అని గట్టిగా అన్నది.
    ఎప్పుడూ ఒకలాగే వుంటారా మనుష్యులు? నువ్వు మారినట్టే నేనూ మారుతున్నా అన్నది రాధ.
    'నువ్వు, నేనపో ఒకటేనా? చీ! నీతో వాదించడం కంటే యిక్కన్నించి పోవడం నయం అన్నది. అని లేచి, ఆ చీకట్లో వాకిట్లోకి వెళ్ళింది.
    'అసల నువిక్కడికి రాకపోతే మరీ నయంగా ఉండేది, అమ్మ తీసుకు రాక పోతేనే నయం, అని మెల్లిగా రాధ అన్న మాటలు వెనకాల వినవచ్చి, వెన్నులో పొడిచి నట్లైంది మాధవికి.
    తను యిన్ని రోజులుగా సంపాదించి పెడుతోంటే కనబడటం లేదు. తనకొక శుభ్రమైన చీరె కూడా కొనుక్కోకుండా, దాని కాలేజీ ఖర్చులన్నీ పెట్టినదంతా ఏమీ రాణింపుకు లేదు. పదిహేనేళ్ళుగా తను యీ యింట్లో అసలు కూతుళ్ళకంటే ఎక్కువగా మెలగడం పొరబాటైంది.
    అక్క చనిపోయిన నాడు, తన మీద కళ్ళు తెరవని పసికూనని వదిలేసిన నాటి దుఃఖం, మధు తనని విదిలినచి రారేసి వెళ్ళిపోయిన నాటి అవమానం, చాలీచాలని
 డబ్బుతో తను సంసారం యీడ్చుకొస్తోంటే ఏమీ గుర్తింపులేని ఆ బాధ-అన్నీ కలిసి మున్నీరుగా ప్రవహించాయి ఆ చీకట్లో. మొట్ట మొదటి సారిగా తనకి తల్లి, తండ్రి లేరన్న బాధ గుబులు గుబులుమని క్రమ్ముకొంది. ఒక్క పెద్దమ్మ మినహా యింకెవరికీ యీ యింట్లో ఏమీకాదు తను. తన కోసం అంత త్యాగం చేయడానికి సిద్ధపడిన మధు కూడా దూరంగా వెళ్ళిపోయాడు తన తప్పేమీ లేకుండానే తనకి ఎవరూ లేరు యీ లోకంలో అని తలుచుకుని మరింత ఏడిచింది ఆమె.
    ఎంత సేపటికో వెళ్ళి మళ్ళీ తన పక్క మీద పడుకుంది. సావిట్లో ఉయ్యాల్లో శకుంతల నిద్రలో లేచి ఏడిచినట్లు విని పించి వెళ్ళి దాన్ని ఎత్తుకుంది. దాన్ని తీసుకొచ్చి ప్రక్కన పడుకోబెట్టుకుంది. తీయని వూపిరి తన శరీరానికి తాకుతుంటే ఆవళ్ళు తన చేతులలోకి, గుండెలలోకి మెత్తని వెచ్చదనం నింపుతోంటే నిద్ర పట్టింది ఆమెకి.
    మర్నాడు ప్రొద్దున్నే లేచి, కాలేజీకి వెళ్ళే ముందు బావకి పెద్ద ఉత్తరం వ్రాసింది. అన్నీ వ్రాశాక, మళ్ళీ చదువుకొన్నది. కాలేజీకి వెళ్ళాక, మళ్ళీ చదివి కవరులో పెట్టబోతూ, చివరికి-శకుంతలని తీసుకుని ప్రయాణమౌదామనుకుంటున్నాను'అని సందేహమైన వ్రేళ్ళతో చేర్చింది.

                                 *    *    *
                            (మూడవ భాగం ప్రారంభం రచయిత్రి, కుమారి వాసిరెడ్డి సీతాదేవి)


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS