Previous Page Next Page 
అపరాజిత పేజి 15


                  
                          అపరాజిత మూడవభాగం
                                                                                   ---వాసిరెడ్డి సీతాదేవి
                                       10

    ఉత్తరం రాసి తీరా పోస్టుబాక్సులో వేశాక తను చేసింది అంత మంచి పని కాదేమో అనిపించింది మాధవికి. 'శకుంతలను తీసుకుని ప్రయాణం అవుదామను కుంటున్నాను' అన్న చివరి వాక్యం ఆమె బుర్రను పురుగులా తొలచసాగింది. తను త్వరపడలేదు కదా? అలా రాసి వుండాల్సింది కాదు. బావ ఆ వాక్యం చదివి ఏమనుకుంటాడు! ఇలాంటి విషయాల్లో ఆడది తొందరపడి అడుగు ముందుకు వెయ్యకూడదు. మగవాడు చెయ్యి చాచేంత వరకూ, ఆడది తన చేతిని అందించటానికి కలవరపడుతున్నట్లు కనిపించకూడదు. తను తొందరపడ్డది నిజమే! కాని బావ, తనను మౌనంగా కళ్ళతోనే ఆరాధించే బావ! తను అల రాసినందుకు ఏమీ అనుకోడు! బావ మనస్సులోని ఆర్ద్రత అతని ప్రతి మాటలోనూ కనిపిస్తుంది. తన ఉత్తరం చూసి బావ ఆనందంతో ఉక్కిరి బిక్కిరయి పోతాడు! మరుక్షణంలోనే రెక్కలు కట్టుకొని వచ్చి తనముందు వాలిపోతాడు.
    బావ తన జీవితంలోకి ఈ విధంగా ప్రవేశిస్తాడని ఏనాడైనా ఊహించిందా? అక్కయ్య చనిపోతుందనీ, అక్కయ్య కన్న బిడ్డ భారం తనమీద పడుతుందనీ కలలో నైనా తలచిందా?మనిషి అనుకొనేది ఒకటి-జరిగేది మరొకటి. మనిషి విధి చేతిలోని కీలుబొమ్మ. తను అనుకున్న దంతా జరిగితే అంతా తన ప్రయోజనమే ననుకొంటాడు. అలా కాకపోతే విధిని నిందిస్తాడు.
    మధు అనుకోకుండా తన జీవితం నిష్క్రమించాడు. మాధవిని మధు జ్ఞాపకం కలవరపెట్టింది.
    మధుకు తను ద్రోహం చెయ్యటం లేదు కదా? మధును తను ప్రేమించాననుకోవటం వట్టి భ్రమేనా? లేకపోతే మధును అంత త్వరగా ఎలా మర్చిపో కలిగింది? తను మధును మర్చిపోయిందా? లేదు! ఇంతకాలంగా మధును మర్చిపోయినట్లు, తనను తానే భ్రమ పెట్టుకొంది. మధు మొరటుగా తన మనస్సులోని సున్నిత భావాలను నొప్పించాడు. అందువల్లనే తన మనస్సు అతనిమీద విముఖత్వాన్ని వహించింది. మధ్యాహ్నం ఎండలా యవ్వనం తనను కాల్చేస్తూ వుండగా! మధుకలశంలా వున్న తన మనస్సు మొదటిసారిగా మధును చూసినప్పుడు తొణికింది. ఆనాడు......తను ఏనాటికీ మర్చిపోలేని ఆనాడు.....కనుచీకటి పడుతుండగా కాలేజీనుంచి తమ ఇంటికి వచ్చింది. వాకిట్లో పెదనాన్నతో మాట్లాడుతున్న పొడవాటి యువకున్ని తనకు తెలియకుండానే మంత్ర ముగ్ధలా చూస్తూ నిల్చుండిపోయింది కొద్దినిముషాలు తరవాత పెదనాన్న, పెద్దమ్మతో అతన్ని గురించి ఏదో చెబుతూ వుంటే తను శ్వాస బిగబట్టి, వళ్ళంతా చెవులు చేసుకోని వినసాగింది. ఆ అబ్బాయిపేరు మధుమాధవరావనీ, గది అద్దెకోసం వచ్చాడనీ విన్నది. తమ ఇంటికి అతను అద్దె కొస్తున్నాడని విని తన హృదయం ఇంద్రధనస్సే అయింది.
    మధు తిరిగిన గదిలోని గాలిని పీల్చటానికీ, మధు తాకిన వస్తువుల స్పర్శ సుఖాన్ని అనుభవించటానికి తన మనస్సు తహతహ లాడిపోయేది. అతను లేని సమయాల్లో ఆ గదిని ఊడ్చి, సర్ది, ఏదో సంతృప్తి పొందేది. మధు పేమాభిమానాలను పొంది అంతవరకూ జీవితంలో తను రుచిచూసిన చేదును మర్చిపోగలిగింది. మధు మొదటిసారిగా తన హృదయ కవాటాన్ని తెరిచాడు. వాకిట్లోనే నిలబడి పోయాడు. కాని బావ అనుకోకుండా తెరిచివున్న ద్వారంనుంచి లోపలకు ప్రవేశింశించాడు. అది చూసి మధు అలిగి వాకిట్లోనుంచే తిరిగి వెళ్ళిపోయాడు. బావ తనకు కావాల్సిన వస్తువుకోసం చేతులు చాచాడు. మధు తనకు సులభంగా లభ్యమయే వస్తువును వదిలేసి, అభిమానపడి వెళ్ళిపోయాడు.
    బావ! మధు! ఇద్దరి స్వభావంలో ఎంత వైవిధ్యం వుంది! మధు స్వభావం ఎత్తునుంచి కిందకు దూకే జలపాతం వంటిది. అందులోని ఆవేగం, చుట్టు పక్కల వాతావరణాన్ని ఉద్రిక్తపరుస్తుంది. ఉరకలు తీయిస్తుంది ఇట్టే ఆకర్షిస్తుంది. బావ స్వభావం నిర్మల ప్రశాంత సరోవరం లాటిది. జలపాతంలో వుండే ఉద్రేకం, ఆకర్షణా, రంగులూ, సరోవరంలో వుండవు. కాని అలసటతో దాహంతో దరిచేరిన బాటసారి దాహం తీర్చి, బడలికను పోగొట్ట గల శక్తి సరోవరానికి వుంది. జలపాతం దాహం గొన్న బాటసారిని ఆకర్షించలేదు. తను జీవితంలో అలిసి పోయింది. ఇరవై ఏళ్ల బ్రతుకులో ఏడు జన్మల బడలికను పొందింది. పసితనం లోనే బ్రతుకు భారం తెలుసుకొన్న తను చాలా కాలంగా అలిసిపోయి వుంది. తనకు వ్బదలిక తీర్చగల చల్లని ఆశ్రయం కావాలి. బావ అమృత హృదయుడు. అర్ధం చేసుకోగల సహృదయుడు. తనకు రక్షణ కావాలి. భద్రత కావాలి.
    ఆనాడంతా మాధవి మనస్సు పరిపరి విధాల మధనపడ సాగింది. వివేకం ఆమెను రాజారావు వైపుకు లాగుతూంటే, హృదయం మధు వైపుకు లాగుతోంది. బుర్రంతా ఆలోచనలతో చెదల పుట్టలా వుంది.
    సాయంత్రం గడపలో అడుగుపెట్టిన మాధవికి రాధ ఎదురైంది. చక్కగా ముస్తాబు చేసుకోని ఎక్కడికో బయలు దేరింది. రాధ వంటిమీద కనీసం నలభై రూపాయలైనా ఖరీదు చేసే టెర్లిన్ చీర వుంది. మాధవి చూపులు అప్రయత్నం గానే తను కట్టుకొని వున్న చీరమీధకు మరలాయి. పదిహేను రూపాయల ఫోనిక్స్ వాయిల్ చీర. అదీ బాగా పాత పడి తన బ్రతుకులాగే వెలవెల పోతూ వుంది అనుకుంది మాధవి. హైహీల్స్ టకటక లాడించుకుంటూ వెళ్ళిపోతున్న రాధను చూస్తూ నిలబడి పోయింది మాధవి. మాధవి లోపలకు వస్తూనే 'పెద్దమ్మా! రాధ ఎక్కడకు ఈ వేళప్పుడు వెళుతుంది?' అడిగింది పరమేశ్వరిని.
    'ఎవరో స్నేహితురాలు సినిమాకు రమ్మందట! ఆలస్యంగా వస్తానని చెప్పి వెళ్ళింది.' అంది చేటలో వున్న బియ్యం లోని బెడ్డలను ఏరివేస్తూ తల ఎత్తకుండానే పరమేశ్వరి.
    పరమేశ్వరి అమాయకత్వం మాధవికి చిరాకు కలిగించింది. ఏం మనుషులో! తల్లీ, దండ్రీ తమ పిల్లల ప్రవర్తనను గురించి ఎందుకు ఆలోచించరు? పెద్దమ్మకి అర్ధం కాకపోవచ్చు. కాని పెదనాన్న అంత తెలివితక్కువ వాడేం కాదు. తనకు శ్రమ లేకుండానే, ఆడపిల్ల తనకి కావాల్సిన వేవో తనే సంపాదించుకుంటోందని తెలిసీ తెలియనట్టు వుంటున్నాడా? మాధవికీ పెదనాన్న మీద అసహ్యం వేసింది.
    పెద్ధమ్మకు రాధ వ్యవహారం యేం బాగా లేదని చెప్పేస్తే! కాస్త అదుపులో వైనా పెడుతుంది. కాని పెద్దమ్మ మాట రాధ లక్ష్యపెట్టదు. అందువల్ల ప్రయోజనం ఏమీ వుండదు, పెద్దమ్మను బాధ పెట్టడం తప్పించి. ఆ మాట కొస్తే రాధ ఎవర్నీ లక్ష్యపెట్టడు. మళ్ళీ పుస్తకాలు తెగ చదువుతుంది. అప్పుడప్పుడు కధలూ అవీ రాస్తూ వుంటుంది. కాని లాభం ఏముంది? ఆడపిల్ల కు వుండవలసిన ఒద్ధికా, మర్యాదా బొత్తిగా లేదు. వాస్తవాన్ని వదలి ఎప్పుడూ ఊహా లోకాల్లో విహరిస్తూంటున్నట్లు కనిపిస్తుంది.
    బాత్ రూంలో మొఖం కడుక్కొని తువ్వాలుతో ముఖం తుడుచుకుంటూ లోపలికి వచ్చిన మాధవితో పరమేశ్వరి అంది కాఫీగ్లాసు అందిస్తూ.
    'మధూ! చూడమ్మా! నా చీరలు బొత్తిగా చిరిగిపోయాయి.'    
    'మొదటి తారీఖున తెస్తాలే పెద్దమ్మా!' అంది మాధవి.
    'అమ్మాయ్! నా పంచెలు కూడా బొత్తిగా చిరిగిపోయాయ్! చెప్పులు చూడు మరీ ఎలా తెగిపోయాయో!' అప్పుడే లోపలకు వచ్చిన శివశాస్త్రి అందుకున్నాడు.
    మాధవికి వళ్ళు మండిపోయింది. 'ఎలాగన్నా చావండి. ఇక ఈ సంసారాన్ని ఈదటం నావల్ల కాదు.' అనాలనుకుంది. 'అలాగే పెదనాన్నా!' అని మాత్రం అనగలిగింది. మాధవికి ఎందుకో చెప్పలేనంత దుఃఖం పొర్లు కొచ్చింది. అక్కడనుంచి గబగబా తన గదిలోకి వెళ్ళిపోయింది. మంచానికి అడ్డం పడింది. కళ్ళు మూసుకుంది. అందరూ తనను తను స్వార్ధం కోసం ఉపయోగించుకోవాలని చూసేవాళ్ళే తనకేం కావాలో అడిగేవాళ్ళు కానీ, అర్ధం చేసుకొనే వాళ్ళు కానీ లేరు. ఒకప్పుడు మధు ఉండేవాడు. కాని ఆ మధు కూడా తనను సరిగా అర్ధం చేసుకోలేకపోయాడు. మధులో అంత సహనం లేదు. పసివాడి మనస్తత్వం ఆలోచించి అర్ధం చేసుకోగలవాడు బావ ఒక్కడే.
    ఆ రాత్రి మాధవికి అన్నం తినాలని పించలేదు. పరమేశ్వరి ఎన్నిసార్లు భోజనానికి పిల్చినా వినిపించుకోనట్లే కళ్ళు మూసుకొని పడుకుంది. అలాగే నిద్ర పోయింది. తెలవారుతూనే శకుంతలను తీసుకొని తను బావదగ్గిరకి వెళ్ళిపోవటానికి నిశ్చయించుకున్నాకనే ఆమెకు నిద్రపట్టింది.
    తెల్లవారి లేచి మామూలుగానే అన్ని పనులూ ముగించుకొని కాలేజీకి బయలు దేరింది. తీరా ఉత్తరం రాసిందే కాని రాజారావు నుంచి సమాధానం లేకుండా బయలుదేరాలంటే ఏదో అభిమానం అడ్డుపడింది. తన ఉత్తరం చూడగానే రాజారావే వచ్చేస్తాడని ఆశించింది.
    మాధవి రాజారావు రాకకోసం ఎదురు చూసి నిరాశ చెందింది. వారం గడిచినా అతనినుంచి ఉత్తరమైనా రాకపోవటంతో అభిమాన పడసాగింది. తను తొందరపడి ఉత్తరం రాసినందుకు సిగ్గుపడసాగింది. మనస్సు పరిపరి విధాల ఆలోచించసాగింది.
    ఆ రోజు కాలేజీలో వుండగా పోస్టు మాన్ రెండు కవర్లు తెచ్చి ఇచ్చాడు. ఒకటి రాజారావు నుంచి వచ్చిన ఉత్తరం. రెండో కవరు సంతకం పెట్టించుకొని ఇచ్చాడు. అదికూడా రాజారావు నుంచే వచ్చింది. మాధవి కవరు విప్పి చూస్తే నాలుగు వేలకు బ్యాంక్ చెక్ వుంది. మాధవికి ఏమీ అర్ధం కాలేదు. రెండో కవరు తెరచింది. రాజారావు మాధవికి రాసిన ఉత్తరం. అంత పెద్ద ఉత్తరం, బ్యాంక్ చెక్, ఆమెలో ఏవేవో అనుమానాలు రేపాయి. ఆత్రంగా ఉత్తరం చదవసాగింది.
                    'మధూ!
    మధూ! బావ ఎదురుగా నిల్చొని పిల్చినట్లే అనిపించింది, అలా పిలుస్తున్నప్పుడు బావ కంఠం ఎంత మెత్తగా వుంటుందో! మాధవి ఉత్తరం మీదకు కళ్ళు తిప్పింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS