Previous Page Next Page 
అపరాజిత పేజి 13


    'ఏమీలేదు మన యింట్లో ఏవో చిక్కులు వుంటే అవి మనం మనం చూసుకోవాలిగానీ-తను ఏం చూస్తాడని నీ ఉద్దేశ్యం?'
    ఈ సంభాషణ ఏమిటో దారితోచకుండా వుంది మాధవికి. దీని వెనుకవున్న ఉద్దేశ్యం ఏమిటో, చర్చకి అవకాశం ఏమిటో తెలియడం లేదు.
    'చిక్కులున్నాయని నేను తనతో చెప్పానని ఎవరన్నారు?' అన్నది మాధవి.
    'అనాలా ఏమిటి? నువ్వు బాధపడడం, తను ఓదార్చడం, వానలో షికార్లు వెళ్ళడం అన్నీ యింట్లో అందరికీ తెలుసు - ఇంతకీ ఏమన్నాడు? ఆయన అప్పు ఈయన తీరుస్తానన్నాడా?' పచార్లు అన్నది చేస్తో అన్నది రాధ ఈ వాక్యాలు.
    మాధవి ముఖం ఎర్రబడింది. అవమానంతో మనస్సు భగ్గుమంది. నోరు మూయి అని అరిచి, లేచి ఒక్కదెబ్బ వేద్దామనుకుంది. కానీ - ఆమె మాధవి కనుక ఏమీ చేయక అల్లా కూర్చుండిపోయింది.
    'అతనిచ్చే డబ్బు నువ్వేమీ తీసుకోనక్కర్లేదు. అప్పు తీర్చడానికి నేను ఏదో ఒక ఏర్పాటు చేస్తాను.' అని అవతలికి వెళ్ళింది రాధ.
    మాధవి ఎంతోసేపు అల్లానే కూర్చుంది. మధుని కలుసుకోవాలనీ, కాలేజీకి వెళ్ళాలని అన్నీ మర్చిపోయి కూర్చుంది. ఇప్పుడు కళ్ళు తెరిచి నట్లున్న రాధలో యింతపొగరు దాగివుందని అనుకోలేదు. హఠాత్తుగా మండడం ప్రారంభించిన భాస్వరంలా వుంది ఆమె ధోరణి.
    ఎంతసేపని ఆలోచిస్తుంది? పెట్టె మూసి, లేచింది. పెద్ద నిట్టూర్పుతో నాలుగడుగులు వేశాక గుర్తుకు వచ్చింది తాను చీర మార్చుకుందామని వచ్చానని. మళ్ళీ వెనక్కి వెళ్ళి, పైనున్న చీరతీసుకుంది.
    కాలేజి చేరేటప్పటికి పదకొండు న్నరయింది. ఆ పూటకి సెలవుచీటీ వ్రాసి యిచ్చి లేబరేటరీలోకి వెళ్ళి కూర్చుంది.

                                   9

    సాయంత్రం యింటికి చేరేటప్పటికి వాన కురుస్తోంది. అరుగు మీద మధు నిలబడి ఉన్నాడు. ప్రక్కన ట్రావెలింగు బ్యాగ్ పెట్టి వుంది. ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు?
    తను మెట్లు ఎక్కుతోంటే చూసి, అతను గదివేపు తిరిగాడు. తననిచూసి మామూలు ప్రకారం నవ్వలేదని గమనించనేలేదు మాధవి. మొన్నటినుంచి అతనితో ఎన్నో మాటలు చెప్పవలసినవి మిగిలి పోయాయి. అంతేకాక, యీ ప్రయాణ మెక్కడికో అడగాలి.
    అతనివెనుకే నడిచి గదిలోకి వెళ్ళింది మంచంమీద పెట్టిన బ్యాగు మీద చేయి వేసి నిలబడింది. "ఎక్కడికి ప్రయాణం?" అన్నది. అతను మాట్లాడకుండా నిలబడి బల్లమీద ఏవో సర్దుతున్నాడు. ఒక క్షణం ఆగి అతనికి దగ్గరగా వెళ్ళి, "ఏమైంది కోపం వచ్చిందా?- ఎంత వాన వచ్చిందో? అక్కడికీ పరుగెత్తుకుని వచ్చాను తడుస్తూ మీరులేరు" అన్నది అతనివేపే చూస్తూ. ప్రక్కకి తిప్పుకున్న అతని ముఖంలో భావాలు కనబడడంలేదు. ఇంత సమీపంగా ఉన్నా కూడా వెలు కదిపి ఆమెను తాకలేదు. ఇబ్బందిగా అవతలికి జరిగి, "తడిసినట్లు న్నావు. ఇంట్లోకి వెళ్ళి బట్టలు మార్చుకో" అన్నాడు.
    "ఫరవాలేదు, నిన్నరాత్రి కూడా ప్రొద్దుపోయినా రాలేదు మీరు. ప్రొద్దున్న తాళం వేసివుంది. ఎందుకంత కోపం నామీద? మరి-ఒకమాట చెప్పనా? బావ మనకి సాయం చేస్తానన్నాడు."
    దీనికి జవాబుగా అతని వూపిరిలో కూడా కోపం ధ్వనించింది. ఆమె చెవులకి వినబడని ధ్వని అది.
    'మీతో ఎన్నోమాట్లాడాలి. మీరిప్పుడు ఎక్కడికి ప్రయాణమైనారో చెప్పరేం?' అన్నది మళ్ళీ మాధవి.
    "నువ్వు మాట్లాడినవన్నీ వినేందుకు నాకు తీరుబడి ఉండొద్దూ?" అన్నాడు. కొంచెం ఆగి, "రాజారావుగారు ఎవరికి సాయం చేస్తానన్నాడు? ఎవరు ఆ సాయం పుచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారు? -ఐనా, మీ రిద్దరూ చాలా మాట్లాడుకున్నారేమో కదా?' అన్నాడు.
    ముందు యీ నిష్టూరం అర్ధం కాలేదు కానీ, ఆ తర్వాత అర్ధమై తెల్లబోయింది మాధవి. ఏం మాట్లాడాము? అప్పు తీర్చడానికి డబ్బుంది, యిస్తానన్నాడు. భారం తీరుతుంది కదా అని చెప్పాను" అన్నది.
    అతనిప్పుడు ఆమెవేపు తిరిగాడు. "నీ భారం తీరుతుంది, తేలిగ్గా ఉంటావు కనక తనతో రావచ్చునన్నాడా? ఆ మూడువేల రూపాయల బదులుగా మూడు నెలల పాపని ఎత్తుకుని తనింటికి రమ్మన్నాడా?" అన్నాడు.
    తెల్లని ఆమె కళ్ళల్లో, కనుపాపలు బెదురుగా, భయంగా, బేలగా కదిలాయి. నీరసమైన హృదయం మరింత నీరుకారిపోయింది.
    "అల్లా ఎందుకంటాడండీ? పోనీ, డబ్బు పుచ్చుకోవద్ధంటే మానేస్తాను."
    "అయ్యో! ఎందుకు మానడం? పుచ్చుకో. మొన్న ఏదో తెలివి తక్కువగా డబ్బు యివ్వనక్కర్లేదు అని అన్నాను. కానీ- యిప్పుడు అవసరమే. ఇంటికి వెళ్ళగానే ముందు నిలవ దీసి అడుగుతారు. ఎంతకాలమని నావాళ్ళని చూసుకోకుండా యిక్కడి యీ కారాగారంలొ పడివుంటాను?" మాధవిని పూర్వం మమతతో చూసిన ఆ కళ్ళలో యినాడు అవహేళన, లాలించిన ఆ కంఠంలో యీనాడు తీవ్రత ఆవరించాయి.
    ఆమె నిస్సహాయతని చూసి అతను మళ్ళీ తన మాటలు ఆరంభించాడు. "డబ్బుతో మన సంబంధాన్ని కొలవాలని నేను అనుకోలేదు"

                                      


    "మరి నేను అలాగ కొలుస్తున్నానంటారా?" అన్నది అస్పష్టంగా ఆమె.
    "కాకపోతే మరేవిటి? ప్రతిసారీ అప్పు గొడవే కావాలి నీకు. అప్పు తీర్చడంకోసం అర్ధరాత్రివరకూ రాజారావుతో ఆంతరంగికాలు మాట్లాడడానికి సిద్ధపడ్డావు" అతను కుర్చీలో కూర్చున్నాడు.
    ఆమె అప్రయత్నంగానే మంచంమీద కూర్చుంది. "ఎందుకంత మాటలంటారు? నే నెప్పుడు మాట్లాడాను బావతో?"
    "గుర్తులేదా నేను చూశాను. మనిషిని కనక బాధపడ్డాను-ఐనా, యింక బాధ పడాల్సిన అగత్యం ఏముందిలే!" అన్నాడు.
    ఆమె తలవంచుకుంది. పార్కులో చూశాడు? చూస్తే మరి, తనని అడగలేదేం. సాయంత్రం పార్కుకి రాలేదేం అని? అక్కడే చీకట్లో తచ్చాడుతూ దొంగతనంగా తమ మాటలు పొంచి విన్నాడా? ఏం మాట్లాడింది తను? బావని పెళ్ళి చేసుకుంటానని చెప్పలేదే? తల ఎత్తింది. సంకోచంలేని చూపులతో అతనివంక చూసింది.
    "మరి శకుంతల సంగతి, మా యింట్లో వాళ్ళందరి సంగతీ తనమీద ఆధరపడి ఉన్నాయి కదా! అందుకని విషయాలన్నీ మాట్లాడవలసి వచ్చింది" అన్నది.
    మళ్ళీ అదేమాట-శకుంతల గొడవ నీకు దేనికి? కన్నవాడు ఆయన చూసు కుంటాడు. నీకు రక్త సంబంధమైనా లేని-ఆ అక్క నీకు అక్కకాదుగా? వింటున్నావా? ఆ పసికూన బాధ్యత అంతా నీదే అయినట్లు మాట్లాడతావేం? నువ్వు వెళ్ళి నా కష్టాలు తీర్చండని అతన్ని ప్రాధేయపడితే ఆ అలుసు తీసుకుంటున్నాడు. ఈ మధు ఒకడు డబ్బు మనిషి ఉన్నాడు కనక వీన్ని వదిలించుకోవడానికి మార్గాలు చెబుతున్నాడు. అతని సహాయం అక్కర్లేకుండానే వదిలి పోతున్నాను లే" అన్నాడు మధు. వదిలి ఎక్కడికి పోతున్నాడు? ఎంత మూర్కంగా ఆలోచిస్తున్నాడితను?
    "తను అనని మాటలన్నీ ఆయనకి ఎందుకు అంట గడతారు అన్యాయంగా? నీకు ఎందుకనో ముందునుంచీ ఆ పేరెత్తితే అంత చీకాకు. నాకు రక్తసంబంధం లేకపోయినా, నన్ను ఆ కూపంలోంచి యివతలికి తెచ్చిన పెద్దమ్మ నాకు నిజంగా అమ్మే-అక్కకి నే నిచ్చిన మాటనిబట్టి ఆ పాప బాధ్యత నాకుంది."
    "ఏమిచ్చావు మాట? దారేపోయే మనిషికి యిచ్చిన మాటలాంటిది అది. ఆనాడే గాలికి ఎగిరిపోయింది. దేశాలు తగలబడే విషయాలలోనే మాటలకి విలువలేదు. దీనికింత విలువ ఎల్లా వచ్చింది! అతగాడు మాటి మాటికీ వస్తూ, యీ విషయం కెలుకు తుండడంవల్ల యింతగా నీ పీక పట్టుకుంటుంది యీ విషయం. ఆవేశంలో ఎన్నైనా అంటారు. అవి పట్టుక్కూకుంటే సంసారాలు కూలిపోతాయి. బ్రతుకులు పెడద్రోవ పడతాయి." అతనివ్యక్తిత్వం పైపైకి వున్న పొరలు ఒక్కటొక్కటీ వూడిపోతున్నట్లుంది. ఆమెకి సుమకోమలమైన ఆ పెదవులు దాటి, వడగళ్ళలాంటి యీ మాటలు ఎల్లా వస్తున్నాయి?
    తన మనస్సులో వెచ్చగా నిద్రపోతున్న వలపు కొన్నిరోజుల క్రితమే నిద్రలేచింది. అప్పుడే బెదురుగా చెదరబోయింది. ఇప్పుడు తోచక, యీ వాదనల వలలో చిక్కుకుని తునకలై పోతోంది.
    "నే నిచ్చిన ఏ మాటకూ విలువ లేదంటారా?" అన్నది.
    అతను తన ధోరణి ఆపాడు, ఆపిచూశాడు నిశితంగా-లేదేమో! అవును, లేదు నాతో నీ జీవితం ముడి వేసుకుంటానని నువ్విచ్చిన మాటకి విలువలేదు మాధవీ!" తడిలేని కంఠంతో అన్నా డీ మాట. ఆమె కళ్ళు తడి అయ్యాయి.
    "మీరు అన్నారుకదా ఆ మాట? నా కోసం, నా సమస్యలు తీర్చడంకోసం పెద్ద బరువు మీద వేసుకున్నారు. అక్క పెళ్ళి అయిపోయి ఆ అడ్డంకి తీరిపోతుందని, మీరు అంత పని చేశారు. మరి దీనికంతకీ విలువలేదని ఎల్లా అంటారు?"
    "నేనూ అల్లాగే అనుకున్నాను మొదట్లో కానీ- యివన్నీ వదిలేసి నువ్వు డబ్బే ముఖ్య మని మాట్లాడుతున్నావు. ఆ డబ్బుకోసం నా కిష్టం లేకపోయినా రాజారావుతో సంబంధం పెంచుకుంటున్నావు" అన్నాడతను.
    మాధవికి ఉన్నట్లుండి ఆవేశం వచ్చింది. గదిలోకి క్రమ్ముకుంటున్న చీకటి, బయట పెద్ద చప్పుడు చేసే వర్షం తన మనస్సులోనే అయినట్లు అనిపిస్తోంది. "ఇంక అవన్నీ మాట్లాడకండి మీరు. ఎక్కడికో వెడుతున్నారు కదా, వెళ్ళిరండి" అన్నది.
    "రావడానికి వెళ్ళడంలేదు. రాకుండా ఉండడానికే వెడుతున్నాను, ఎంతసేపు తడిసిన బట్టలతో వణుకుతావు? వెళ్ళు"
    అతను తిరిగి రావద్దనుకుంటూ వెడుతున్నాడన్నమాట. పదునుగా గావుంది కానీ ఆమెకి గ్రుచ్చుకోలేదు. ఏదో గుబులేకానీ చీల్చే బాధకాదు మనస్సులోది. అతను వెడితే మరి సామాను-అతని డబ్బు పంపడానికి చిరునామా? అని స్పురించినా అడగడానికి ధైర్యం లేకపోయింది ఆమెకి.
    ఎవరో వచ్చి అరుగు మీద నిలబడినట్లు కనిపించింది. మాధవికి. గాలికి చేరబడిన తలుపుని పూర్తిగా తీసిచూసింది, రాధ గది తలుపు దగ్గరగా నిలబడి లోపలికి చూస్తోంది.
    "ఓ! నువ్వు వచ్చావా? ఆయన వెళ్ళారో లేదోనని చూడ్డానికి వచ్చాను" అంటూ వెనక్కి తిరిగి లోపలికి వెళ్ళింది.
    మాధవి లేచి నీరసమైన అడుగులతో యింట్లోకి వెళ్ళింది. అతనితో ఒక వీడ్కోలు మాట చెప్పాలిని ఆమెకిగానీ, చిట్లిపోయిన యీ బంధాన్ని అతికే ఒక చిరునవ్వు బహూకరిద్దామని అతనికిగానీ తోచలేదు.
    వాన జోరు తగ్గాక తాళం వేసుకుని మధు వెళ్ళిపోయింది ఎవరూ చూడలేదు.
    ఐదారు రోజుల తర్వాత శివశాస్త్రి పేరున వచ్చిన ఉత్తరంలో సామాను తన స్నేహితుడు పట్టుకెడతాడని వ్రాశాడని పెద్దమ్మ చెప్పింది. కొంత కుతూహలం, వెన్ను చరిచే డబ్బు  గురించిన బాధ్యత, ప్రేరేపించగా ఆ ఉత్తరం సంపాదించి మాధవి,
    మీరు నా కివ్వాల్సిన డబ్బు ఫలానా చిరునామా కి పంపండి అన్న విషయం కనబడింది. ఆ చిరునామా జాగ్రత్తగా వ్రాసుకుంది. అతను యీ వూళ్ళో ఉద్యోగమే మానేశాడా, లేకపోతే తండ్రికే ఆ డబ్బు  అందించాలనుకున్నాడో అని ఆమె కొంచెం ఆలోచించింది.
    
                                *    *    *

    రాధ పరీక్ష ప్యాసైంది. రిజల్స్టు కాలేజీలో వుండగానే తెలిసాయి మాధవికి. కొందరు స్టూడెంట్సు పోయి కనుక్కుంటోంటే, రాధ నెంబరూ యిచ్చింది, వాళ్ళు మూడు గంటలకువచ్చి రిజల్టు చెప్పగానే యింటికి వచ్చేసింది మాధవి. పెద్దమ్మ ఒక్కత్తీ, శకుంతలని ఆడిస్తూ కూర్చుంది. రాధలేదు. రాధ ప్యాసైందని మాధవి చెప్పగానే పెద్దమ్మ దేముడికి ఎన్నో దణ్ణాలు పెట్టింది. దానికి మంచి ఉద్యోగం రావాలనీ, కళ్యాణ ఘడియ రావాలనీ ఏవేవో కోరింది, ఆ దణ్ణాలు పెడుతూ.
    "రాధ ఎక్కడి కెళ్ళింది?" అన్నది.
    "ఏమో మరి, అన్నం తినగానే పోయింది" అన్నది పెద్దమ్మ. శకుంతల బోర్ల పడుకుని ముందుకు జరగడానికి ప్రయత్నిస్తోంది డబ్బా పాలు బాగా పడుతున్నాయేమో మంచివళ్ళు చేసింది అది. మాధవిని ఎత్తుకో మని చేతులు జాచి కేరింతలు కొడుతోంది. మాధవి దాన్ని ఎత్తుకుని, బొజ్జ చుట్టూ చేతులు వేసి గట్టిగా దగ్గరకు అదుముకుంది, దాని చిన్న చేతులని చెంపలకు రాసుకుని వాసన చూసింది. కమ్మని వాసన పాపాయి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS