5
ఒకరోజు మీర చదువుకుంటూండగా కృష్ణయ్య గారు లోపలి కొచ్చారు.
"ఏం చేస్తున్నావమ్మా?"
"కెమిస్ట్రీ చదువుకుంటున్నా పెదనాన్నా"
"పరీక్షలు దగ్గర కొచ్చాయికదూ?"
"అవును అందుకే ఇంత చదువూ......"
"ఏం చదువులోనమ్మా ఎంత చదివినా వంటింట్లో గరిట పట్టటం తప్పదుగదా?"
తను చెప్పబోయే విషయానికి పీఠిక వేశారు కృష్ణయ్యగారు.
"అది నిజమేగాని పెదనాన్నా. కాని ఆడవాళ్ళు గరిట పట్టి తీరాలని, నిసర్గ నియమమేమీ లేదుగా! మేమూ చదువుకుని, ఉద్యోగాలు చేసుకుంటే, గరిటెందుకు పట్టాలి చెప్పండి"
"ఉద్యోగాలలో చేరినంతమాత్రాన, ఎన్నిరోజులు పెళ్ళి పెటాకులు లేకుండా ఉండగలరు? పెళ్ళి చేసుకున్నాక పరిస్థితులు ఎటుపోయి ఎటువస్తాయో ఎవరు చెప్పగలరు?"
పెదనాన్న ఏం చెప్పబోతున్నాడో తెలియక మీర, "నిజమే" అని ఒప్పుకుంది.
"మీరా, నేనొక్క టడగాలనుకొంటున్నా. నువ్వు నామాట కాద్నవన్న నమ్మకం నాకున్నదనుకో....."
"చెప్పు పెదనాన్నా"
"నా స్నేహితుడి కొడుకు శామన్న ను నువ్వు చూశావుగదూ?"
మీరకు ఆశ్చర్యం వేసింది.
"చూడకేం పెదనాన్నా, మొన్న వచ్చినవారేగాని నేను టికెట్టు కూడా అమ్మాను, ఆయనకి."
"ఆ అతనే నిన్నతనికిచ్చి పెళ్ళి చేద్దామనుకుంటున్నా."
మీర చేతిలోని పెన్సిలు క్రిందపడింది. నుదుటి మీద రేఖలు స్పష్టంగా కనిపించాయి. ఆమె చెవులో వూగుతున్న నీలపు రాళ్ళ జాకాలు కూడా తమ యజమానురాలి అభిప్రాయాన్ని వినటం కోసం స్తబ్ధంగా ఉండిపోయాయి.
మీర నోటినుండి మాట రాలేదు. ఆమె లోని మార్పును గమనించనట్టుగానే కృష్ణయ్య గారు చెప్పుకుపోయారు.
"ఇలా చూడమ్మా శాము ఎక్కువ చదువుకో లేదు. నిజమే. కాని అతని కున్నంత మంచి బుద్ధి ఎంత మందికుంటుంది చెప్పూ? చూడ్డానికి రాజకుమారుడిలా ఉన్నాడు. ఇంట్లో అత్తా, మామ ఆడ పడుచుల గొడవలేవీ లేవు. కావలసినంత ఆస్తి ఉంది. అంత పెద్ద ఇంటికీ, ఆస్తికీ మహా రాణిగా సుఖంగా ఉండవచ్చు. ఇంతకన్నా ఏం కావాలో చెప్పు."
మీర కళ్ళు నేలవేపే చూస్తున్నాయి. మాట్లాడే శక్తి రాగానే.
"నాకు ఇపుడిపుడే పెళ్ళి చేసుకోవలని లేదు పెదనాన్నా" అంది.
"అలా అంటే ఎలాగమ్మా? నీకూ పదిహేడేళ్ళు వచ్చాయా? ఇంకా పెళ్ళి చేయకపోతే బావుంటుందా? చూసేవాళ్ళేమంటారు? తల్లీ తండ్రిలేని పిల్లను తెచ్చాడు. పెళ్ళి పెటాకులు చేయలేనివాడు, తగుదునమ్మా అని ఎందుకు తెచ్చుకోవాలీ? అని నన్నాడిపోసుకోరూ? ఇంతవరకూ నిన్ను పోషించి విద్య చెప్పించినందుకు నాకీ ఉపకారం చేసిపెట్టమ్మా" అన్నారు కృష్ణయ్యగారు.
మీర బుగ్గలమీదుగా కన్నీరు ప్రవహించసాగింది.
"కానీ......కానీ.....ఆయన ఒప్పుకున్నారా పెదనాన్నా?" మీర కంఠం వణికింది.
"వూ అతను ఒప్పుకున్నాకనే నిన్నడుగుతున్నాను."
"కానీ పరీక్షలు ఇంకో వారం రోజులే ఉన్నాయ్."
"నాకా మాత్రం తెలీదనుకొన్నావా? పరీక్ష లయ్యాకనే ముహూర్తం పెట్టిస్తాను. నువ్వు మట్టుకు దయచేసి ఒప్పేసుకో. కుర్రవాడికేం లోటు చెప్పు. అందానికి కొదువా? ఆస్తికి కొదువా? ఇక చదువంటావా? ఇప్పుడు మన సమాజంలో విద్యకున్న విలువ నీకు తెలిసిందేకదా డబ్బుకున్న విలువ విద్యకులేదు. అతనూ ఎస్సెల్సీదాకా చదువుకున్నాడు."
"పెదనాన్నా నేను మెడికల్ కాలేజీలో చేరాలనుకున్నాను."
కృష్ణయ్యగారు కొంచెం కంగారుతోనూ, ఆశ్చర్యంతోనూ అన్నాడు :
"మీరా, నా ఆర్ధిక పరిస్థితి నీకు తెలియింది కాదు. అంతా తెలిసి కూడా నువ్విలా మాట్లాడటం బాగాలేదమ్మా. ఎంతో తెలివిగల పిల్లవి అనుకుంటున్న నువ్వు కూడా ఇలా అనుకోవటం నా కెంతో ఆశ్చర్యంగా ఉంది. మన తాహతును మించిన కోర్కెలు నీ తలలో నింపిందెవరు? ఆ గోపీయే అయుండాలి. నేనూ పెద్ధవాడినయిపోతున్నానా? నీ పెళ్ళిచేసి ఆ బరువు వదిలించుకుంటే నాకు నిశ్చింతగా ఉంటుంది. నీకు నామీద ఏమాత్రం కృతజ్ఞత అన్నది ఉంటే ఇక ఎదురు చెప్పకు" అన్నారు. ఆఖరి వాక్యం పలికేటప్పుడు ఆయన కంఠం మరింత కఠినమయింది. విసురుగా గదిలోనుండి వెళ్ళిపోయారాయన.
మీర నీరసంగా రోదించసాగింది. చిన్ననాటినుండి అత్యాశతో పోషిస్తూ వచ్చిన ఆశాలతను ఇలా మధ్యలోనే త్రుంచివేయవలసి రావటం ఆమెకు పాలిచ్చి పెంచిన బిడ్డను తానే స్వయంగా కత్తితో పొడిచినట్టే అనిపించి బాధపెట్టింది.
మధుర సంగీతంలో సాగుతున్న జీవితంలో మొదటిసారిగా అపస్వరం వినిపించింది.
ఇహముందుకు నడవలేకపోయింది. ఇంతవరకూ తను 'అనాథ' అన్న భావన లేకుండా పెరిగింది. ఇపుడు మొదటిసారిగా తల్లీ తండ్రీలేని లోటు పెద్దగా కనిపించసాగింది.
"అమ్మా......నువ్వే ఉండి ఉంటే?"
వెంటనే గోపాల్ గుర్తు కొచ్చా డామెకు.
నీళ్ళలో మునిగిపోతున్నవాడికి గడ్డిపోచ దొరికినా ఆశ్రయింప చూపినట్టు మీర గోపాల్ సహాయాన్ని నమ్మి ధైర్యం తెచ్చుకుంది. వెంటనే ఉత్తరం రాసింది.
"ప్రియమైన అన్నయ్యకు,
అన్నయ్యా, నే నిప్పుడో పెద్ద కష్టంలో చిక్కుకున్నాను. నువ్వు తప్పితే నాకు సహాయం చేసే వాళ్ళెవరూలేరు. పెదనాన్న నాకు పెళ్ళి స్థిరపరిచాడు. నా కిపుడపుడే పెళ్ళి చేసుకోవాలని లేదు. చిన్నప్పటినుండి నీ మాట పాటించటమే నా ధ్యేయంగా పెట్టుకొన్నాను. ఆ ధ్యేయాన్ని సాధించటంలోనే, నా జీవితపు సార్ధకత ఐక్యమై యున్నది. డాక్టరై ప్రజలకు సేవ చేయాలన్న కాంక్ష నా రక్తంలో జీర్ణించుకు పోయింది. ఎలాగయినా నా పెళ్ళి ఆపించు. వరుడు చదువు లేని పల్లెటూరివాడు. నాకన్న తక్కువ చదువు కున్నవాడు. ఈ పెళ్ళి తప్పిచ్చావంటే నీకు ఆజన్మాంతం కృతజ్ఞురాలై ఉంటాను.
మీర."
ఉత్తరం పోస్టుచేసి జవాబుకోసం ఎదురు చూడసాగింది. ఒక వారం రోజుల తరువాత గోపాల్ నుండి రెండు ఉత్తరాలు వచ్చాయి. కృష్ణ య్యగారిఉత్తరాన్ని ఆయన చేతిలోపెట్టి, తన ఉత్తరం తీసుకుని గదిలోకి పరిగెత్తింది మీర. కవరు చించేటప్పుడు ఆమె గుండె దడదడలాడింది. ఏం రాశాడో అన్నయ్య అనుకుంటూ చదివింది.
"మీరా, నీ ఉత్తరం అందింది. నీ ఇష్టానికి వ్యతిరేకంగా నాన్న నీకు పెళ్ళి తలపెట్టాడని విని బాధ కలిగింది. నాకు తోచినట్టుగా నాన్నగారికి రాశాను. కానీ ఇంత దూరంనుండి ఆయన మనసు మార్చటం అంత సులభంగా అనిపించదు. ఉత్తరాల మూలకంగా చయ్య గలిగినంత చేస్తాను. డాని మీద దైవేచ్చ నేను నీకు ఏవిధమైన భరోసా ఇవ్వలేను.
గోపాల్."
ఈ ఉత్తరం చూశాక మీర ఆశలన్ని అడుగంటాయి. ఈ ప్రపంచంలో నావారంటూ ఎవరూలేరు! అనుకుంది మనసులోనే ఉత్తరం పుస్తకంలోపెట్టి బయటికి వచ్చింది. వంట గదిలో కమలమ్మగారితో మాట్లాడుతూన్న కంఠం వినబడింది.
"మనం వీళ్ళను పెంచి పెద్ద చేసినందుకు వీళ్ళు చేసే నిర్వాక ఇది. మీర ఉత్తరం రాసిందేమో ఈ పెళ్ళి తన కిష్టం లేదని, వాడింత పెద్ద ఉత్తరం రాశాడు, బలవంతపు పెళ్ళిళ్ళవల్ల జరిగే అవాహుతాలను గురించి నాకు. వేలెడున్నాడో లేదో, వీడూ నాకు బుద్ది చెప్పటమే?"
ఇదే సమయమని కమలమ్మగారు దెప్పిపొడిచారు.
"మీరని చదివించొద్దని చిలక్కి చెప్పినట్టు చెప్పానా? విన్నారూ? చిన్నప్పుడే పెళ్ళి చేసుంటే ఎవరినితెచ్చి చేసినా వోరు మూసుకొని చేసుకునేది. 'చదువూ', 'నాటకం', 'వేషం' అంటూ ముద్దు చేసి నెత్తి కెక్కించుకున్నారు. ఇపుడెందుకు వింటుంది? ఏమైనా చేసుకోండి, మీరాయె, మీ కూతురాయె."
ఈ మాటలతో కృష్ణయ్యగారి పరిస్థితి అగ్గిమీద ఆజ్యం పోసినట్టయింది.
"ఎలా నా మాట వినదో నేనూ చూస్తాను. ఇందులో నీ ప్రమేయం ఏమీలేదు. ఈ పెళ్ళి విషయంలో తల దూర్చవద్దు" అని, "ఈరోజు ఉత్తరం రాస్తాను గోపీకి, పెళ్ళి సలక్షణంగా జరుగుతుంది" ఖచ్చితంగా అన్నారు కృష్ణయ్యగారు. మీర చప్పుడు కాకుండా అక్కడినుండి వెళ్ళి పోయింది.
మీర మనసును మబ్బు ఆవరించింది. మనసుకు శాంతి లేకుండా పోయింది. మోహంలో ఎప్పుడూ వెలుగుతున్న మందహాసం మాయమయ్యింది.
పరీక్షల్లో ఏమి రాసిందో తనకే తెలియదు. పరీక్షలయ్యాక ఆఖరిరోజు, విద్యామందిరంనుండి బయటికివచ్చి, తలెత్తి భవనంవేపు చూసింది మీర. ఇక తనకూ విద్యా మందిరానికి దూరమయినట్టేనన్న విషయం ఖచ్చితమై పోయింది. దీర్ఘంగా నిట్టూర్చింది.
"మీరా ఎలా రాశావ్" అంటూ నర్మద బయటికి వచ్చింది.
"ఓ మాదిరిగా చేశానంతే" మీర కంఠంలో ఉత్సాహమేలేదు.
"నువ్వలాగే అంటావులే. తరువాత ఫస్టుక్లాసులో పాసవటం మాకుతెలీదూ?"
"ఎలా రాశార్రామీరూ?" అంటూ చంప, రాజ్యలక్ష్మీ, వచ్చిపడ్డారు.
"ఏదో రాశాంలెద్దురూ"
"ఇదేంటే చంపా చెయ్యంతా సిరా?"
"ఏమిటో పెన్ను కక్కుతోందే, నా కొత్త చీర క్కూడా కొద్దిగా ఇంకయ్యింది" అంటూ తన చీరకొంగు వైపు చూసుకుంది.
"నీ కెంత ధైర్యమే తల్లీ! పరీక్ష రోజు కొత్త చీర చచ్చినా కట్టుకోలేను నేను."
"పరీక్షలుకదా మొహం ఎలాగూ కళగా ఉండదు చీరయినా కాస్త కళగా ఉండనిమ్మని కొత్త చీర కట్టుకున్నా."
"చాలా బావుంది నీ సిద్ధాంతం! మీర ఈరోజు 'సాహసీ-అయారే' సినిమా వచ్చింది. ఫిల్మ్ ఇండియాలో తెగ పొగిడేశాడు. ఈరోజు అందరం వెడదాం."
"ఈరోజు సరేసరి. ఫిల్మ్ ఇండియా, దాని ఎడిటర్ అంటే పడిచస్తుంది" అంటూ రాజాను ఏడిపించింది చంపా.
