"అబ్బే! అదేం లేదు. సుధీరకు కాఫీ యివ్వు మీనాక్షి!" అన్నాడు భానుమూర్తి.
మీనాక్షి కాఫీ పోసి సుధీర కిచ్చింది.
"మీనాక్షి కాఫీ బలే చేస్తుంది , బావా!" కాఫీ చప్పరిస్తూ అంది సుధీర.
"నువ్వూ నేర్చుకో ...నేర్పిస్తుంది!" అన్నాడు కాఫీ గ్లాసు ఖాళీ చేసి క్రింద పెట్టుతూ.
"ఇప్పుడా? ఊహు ...ఆడబిడ్డ అధికారాన్ని చూపి తనే నేర్పిస్తుందిలే!" ఓరగా మీనాక్షి ముఖంలోకి చూస్తూ అంది సుధీర,
"నేను అధికారం చూపడమా? నా మీద అధికారం చూపకుంటే చాలు!" గోడ నానుకుని రాగం తీసింది మీనాక్షి.
"అబ్బ! సరసమే అర్ధం చేసుకోకుంటే ఎలాగే మీనాక్షీ!' మీనాక్షి ముఖంలోకి చూసి నవ్వుతూ అంది సుధీర.
"మొరటు వాళ్ళకు సరసాలేలా అర్ధమౌతాయి ?" అంది చురచురా చూస్తూ మీనాక్షి.
"ఇంకా ఏం మొరటు? మెట్రిక్ పరీక్షకు కూర్చోబోతున్నావు? సాహిత్య పఠనం లో పూర్తిగా మునిగి తెలుతున్నావు!"
"ఆ! మునగడమే! తేలడం లేదు." పెదిమల మధ్య నవ్వును బలవంతంగా ఆపుకుని అంది మీనాక్షి.
"ఆ నవ్వును పైకి రానివ్వరాదూ? ఏం? చూడకూడదేమిటి? లేక ముత్యాలు రాల్తాయా? ఏరుకోములే!"
"నీతో నేమిటి?" అంటూ ముఖం త్రిప్పుకుని పెరట్లో కెళ్ళి తనలో తనే నవ్వుకుంది మీనాక్షి.
సుధీర గలగలా నవ్వి - "మీనాక్షి కొంచెం మారింది బావా!" అంది.
"ఏమో! ఆ మార్పు నాకు కనిపించడం లేదు. ఆ మాటల్లో కరుకుదనం , ఆ ముఖంలో చిట్లింపూ అలాగే వున్నాయి. ' కాస్త విచారంగా అన్నాడు భానుమూర్తి.
"మాటల్లో కరుకుదనం అలాగే వుందనుకో. అది కొంచెం అలవాటువల్లా, కాస్త ఉద్దేశ్యపూర్వకం లా వచ్చింది. కానీ నువ్వు గమనించావో లేదో మీనాక్షి యిప్పుడు నవ్వ గలుగుతుంది."
భానుమూర్తి మలినమైన ముఖంలో ఒకే ఒక కాంతి రేఖ తళుక్కున మెరిసి మాయమైంది. అందరూ నవ్వుతారు. లేక నవ్వెందుకు ప్రయత్నిస్తారు. కానీ హృదయపూర్వకంగా నవ్వడం అందరికీ చేతగాదు. అది ఒక దివ్య ఔషధం లాంటిది. హృదయంలో పేరుకుని ఉన్న మలినాలను కదిగేస్తుంది. మానవత, మమకారాలనే కోమల లతా పరిపోషణకు బలమైన ఆలంబన. వాడి కృశించిపోయిన మీనాక్షి స్నేహలత యీ ఆలంబనం వల్లనే పచ్చని రంగును పొంది చిగిర్చేందుకు సిద్ద్దంగా ఉంది.
"కూర్చో! సుధీ! అలా నిల్చున్నావెం?" అన్నాడు భానుమూర్తి గడప మీద నుండి లేస్తూ.
"నీతో ఓ విషయం చెప్పాలని వచ్చాను." కుర్చీలో కూర్చుంటూ అంది సుధీర.
"ఏమిటీ?' సుధీర కెదురుగా కుర్చీలో కూర్చుని అడిగాడు భానుమూర్తి.
అంతలో విశాల పుస్తకం తీసుకుని హాలులో వచ్చింది.
"మీ యింటికి రావాలనుకుంటున్నాను. నువ్వే వచ్చావు."
"పుస్తకం యిచ్చేద్దామని...." నసిగింది విశాల.
"కూర్చోండి!' భానుమూర్తి కుర్చీచూపాడు.
సుధీర ప్రక్కగా కుర్చీలో కూర్చుంది విశాల.
"ఏమిటో చెప్పాలన్నావుగా? చెప్పు" అన్నాడు సుధీర ముఖంలోకి చూస్తూ భానుమూర్తి.
మీనాక్షి లోపలి నుండి వచ్చి విశాలను పలకరించి, అక్కడే గోడ నానుకుని నిల్చుంది.
"రేపు బస్సు వర్కరసంతా సమ్మె చేస్తారట. ఉదయం మేనేజరు చెప్పాడు. అమ్మ కేం చేయాలో తోచక నీ దగ్గరకు పంపింది."
"ఎందుకు సమ్మె చేస్తున్నారట?"
"అకారణంగానే!"
"ఊహూ...అలా ఎప్పటికీ జరగదు." భానుమూర్తి తల అడ్డంగా తిప్పాడు.
"ఏమో? మేనేజరు అలాగే చెప్పాడు."
"నువ్వెలా నమ్మావు?"
"అందుకేగా నీ దగ్గర కోస్త?"
"నా మటుకు కేం తెలుసు?"
"వెళ్ళి కనుక్కోమనే చెప్పడం."
భానుమూర్తి బరువుగా విశ్వసించి - "ఈ పెట్టుబడి విధానం ఎప్పటికి పోతుందో? బస్సులన్నీ పూర్తిగా జాతీయం చేసేందుకు యింకా యీ జాప్య మెందుకో అర్ధం కావడం లేదు. ఈ దోపిడీని అరికట్టడం యిష్టం లేదు గాబోలు!" అన్నాడు.
"ఇక్కడ ఎవ్వరూ ఎవ్వర్నీ దోచుకోవడం లేదు" అంది సుదీర కఠినంగా.
"దాని కింకో పేరుందని నాకేం తెలుసు?" అన్నాడు.
"ఏం పేరేమిటి?' రోషంగా అంది సుధీర.
"వ్యాపారం!" ఫకాలున నవ్వి అంది విశాల.
"డబ్బున్న వాళ్ళను చూస్తె కుళ్ళు!" అంది విశాల ముఖంలోకి చూస్తూ సుధీర.
మీనాక్షి అంతా అర్ధం చేసుకొనేందుకు ప్రయత్నిస్తూంది.
"ఇదో, అమ్మాయ్! మీ సంపద చూసి యిక్కడేవరూ కుళ్ళు కోవడం లేదు. ఉన్న మాటంటే నువ్వు ఉలుక్కోవలసిన అవసరం లేదు" అన్నాడు భానుమూర్తి.
"ఏమిటో ఉన్నమాట?" చురచురా చూస్తూ అంది సుధీర.
"మూడువేల పెట్టుబడి ఆరు లక్షలుగా ఎలా మారింది?"
"లాభాలు వచ్చాయి."
"డబ్బే డబ్బును సృష్టించదుగా? రూపాయి రెండు రూపాయలు కావాలంటే ఎంతో కష్టపడాలి. పోనీ, నీ సంగతన్నా తెలుసా?"
సుధీర మాట్లాడలేదు.
"మాట్లాడవేం?"
"నువ్వానే దేమిటి? ఈ సమ్మెను బలపరుస్తా నంటావా?"
"అలాగ నేననలేదు. పోనీలే. నీ కంత కష్టం కలిగించే విషయాన్ని గురించి నేను మాట్లాడ్డమెందుకు?' నిష్టూరంగా అన్నాడు భానుమూర్తి.
కృష్ణ వేణమ్మ వరండా లో నుండి కేక వేయడం చేత విశాల వెళ్ళిపోయింది.
చంద్రశేఖరం బెరుకు బెరుగ్గానే హల్లో అడుగుపెట్టాడు.
"రావోయ్ , శేఖరం! అలా కూర్చో." భానుమూర్తి సాదరంగా ఆహ్వానించాడు.
"వెళ్ళాలి సార్!"
"అదేమిటయ్యా! వెళ్ళేందుకు కేవరయినా వస్తారా?" నవ్వుతూ అన్నాడు.
చంద్రశేఖరం కూర్చున్నాడు.
కుంపటి మీద పెట్టిన అన్నం చూసేందుకు వెళ్ళింది మీనాక్షి.
"ఊ.... యిక చెప్పు!"
"నాలుగు రోజులు సెలవు కావాలి , సార్!"
"ఎందుకో?"
"మా అమ్మకు బాగాలేదని , అర్జెంటుగా రమ్మనీ సాయంత్రం ఉత్తర మొచ్చింది...." చేతులు నలుపుకుంటూ అన్నాడు చంద్రశేఖరం.
"దాని కింత దూరం రావాలా? అలాగే తీసుకో. ఎప్పుడు బయల్దేరుతున్నావు?"
"ఓ గంటలో. ఆరు గంటల ట్రయిన్ కు."
"అయితే త్వరగా వెళ్ళు."
"ఒకవేళ నాలుగు రోజుల్లో రాలేకపోతే...." నసిగాడు చంద్రశేఖరం.
"లీవు పోడిగిద్దువు గానీ..... వెళ్ళు. ఏం గాభరా పడకు. డబ్బేమన్నా కావాల్నా?"
"ఆహా...వద్దు ....సార్!"
"అదేమిటోయ్! యీ రోజు యిరవై అయిదో తేదీ. ప్రయాణానికి కావలసిన డబ్బుందా? తర్వాత మళ్ళీ యిబ్బంది పడాల్సి వస్తుంది."
చంద్రశేఖరం ఏమి మాట్లాడలేదు. భానుమూర్తి లేచి గదిలోకి వెళ్ళాడు డబ్బు కోసం.
చంద్రశేఖరం యధాలాపంగా సుధీర వేపు చూశాడు. కళ్ళవరకూ పేపరు అడ్డం పెట్టుకుని చంద్రశేఖరం వేపు చూస్తున్న సుధీర చివాల్న కనురెప్పలు క్రిందకుదించుకుంది. చంద్రశేఖరం తల తిప్పుకున్నాడు.
భానుమూర్తి గదిలో నుండి తిరిగి వచ్చి -
"ఐయామ్ వెరీ సారీ , శేఖరం! నా పర్సు గూడా ఖాళీగా వుంది" అని బాధగా అన్నాడు.
"పర్వాలేదు . అందుకు మీరేం చేస్తారు?" కుర్చీలో నుండి లేస్తూ అన్నాడు చంద్రశేఖరం.
"నేనిస్తా నుండండి!" అంటూ తన హాండ్ బాగ్ తెరిచింది సుధీర.
చంద్రశేఖరాని కాక్షణంలో ఏం చెప్పాలో తోచలేదు. తీసుకోవడమా? లేక నిరాకరించడమా? ఏం చెప్పాలి? అలా దైదీభావ మానసుడై ఉండగానే "ఇదిగో!" అంటూ మూడు పది రూపాయల కాగితాలు శేఖరం చేతికి అందించింది సుధీర.
"వద్దు' అని చెప్పాలను కున్నాడు చంద్రశేఖరం. అందుకే చెయ్యి గూడా చాపలేదు.
"తీసుకోవోయ్! ఫర్వాలేదు. పరాయి వాళ్ళేవరూ కాదులే! నే నిస్తున్నట్లే అనుకో." అన్నాడు భానుమూర్తి.
శేఖరానికి చెయ్యి చాపక తప్పింది కాదు. తీసుకుంటూ సుధీర కళ్ళల్లోకి చూశాడు. తన్ను చూసి విరగబడి నవ్వి పరిహాసం చేసే ఆ కన్నులు ఆ క్షణం పరిహాసానికి బదులు పరితాపాన్నీ, సానుభూతిని క్రుమ్మరిస్తున్నాయి.
"థాంక్యూ!- వెళ్తాను, సార్!" అంటూ గబగబ అడుగులేసుకుంటూ వెళ్ళిపోయాడు.
"మా ఆఫీసులో క్లర్కు. పేరు చంద్రశేఖరం." సుధీర వేపు చూస్తూ అన్నాడు భానుమూర్తి.
"తెలుసు." ముక్తసరిగా అంది సుధీర.
"ఎలా తెలుసు.' అని భానుమూర్తి అడగలేదు. ఎలా తెలుసా సుధీర చెప్పనూ లేదు.
"చాలా మంచివాడు" అన్నాడు ఏదో ఆలోచిస్తూ భానుమూర్తి.
"అలాగా!" అంది సుధీర ఊహ లోకంలో విహరిస్తూ.
"పద్యాలు చాలా చక్కగా రాస్తాడు. అయితే తగినంత ప్రోత్సాహం లేదు."
"ఊ.....ఒక్క అవలక్షణమూ లేదన్న మాట!" నిర్లక్ష్యంగా నవ్వుతూ అంది సుధీర'.
"ఉహు...వెతికి చూద్దామన్నా కనిపించదు. ఒక్క బీదరికం తప్ప!" సన్నగా నవ్వుతూ అన్నాడు భానుమూర్తి.
'అది చాలు' అనుకుంది సుధీర మనసులో.
ఆరోజు కొండ మీద అంతగా మాట్లాడించి, పరిహాసం చేసిన తను యీ రోజు ఒక్క మాటా మాట్లాదనందుకు అతను ఎన్ని అర్ధాలు తీసుకుని ఉంటాడో? అసలు తన్ను గురించి ఎలా ఆలోచిస్తాడో? ఎలా ఆలోచించినా తన కొచ్చే నష్టమేమిటి? అతని యిష్ట ప్రకారం అతన్ని ఆలోచించుకొని! అందుకు తనింతగాఆలోచించడ మెందుకు? ఉహు.... ఆలోచించకుండా ఎలా ఉండడం?
దారిద్ర్యం మనుషులను ఎంత పిరికి వాళ్ళను చేస్తుంది! ఎన్ని మంచి గుణాలుంటేనేం? దాని ముందు అవి జోహారు అంటూ తల వంచుకోవలసిందే! ప్చ్! పాపం! వాళ్ళమ్మ కేలా ఉంటుందో? ఎలా ఉంటె తనకేం?
దర్బలుడూ , దరిద్రుడూ అయి ఈ యువకుణ్ణి గురించి అసలు తనింతగా ఆలోచించడం ఏం బాగుంది? అది బావ పట్ల అపచారమే అవుతుంది. ఎందుకని? తనేం చేసిందని? దరిద్రుల పట్ల సానుభూతి చూపడం తప్పా? బావ మటుకు ఆ మాట ఎలా అనగలడు? అలాగయితే బావా దరిద్రుడే.... టేబిలు మీద తలవాల్చి కళ్ళు మూసుకుంది బరువుగా.
సంధ్యాదేవి త్వరత్వరగా తన ప్రియుని కలుసుకునేందుకు వెళ్ళుతుంది. నిశాకాంత అని చూసి ఓర్చుకోలేకపోయింది. తను కప్పుకున్న నల్లని వస్త్రాన్ని లోకం మీదకు విసిరింది - కోపంగా.
భానుమూర్తి లేని లైటు వేశాడు.
"సుధీ! అలా వున్నావేం?" ఇక ఉండబట్టలేక అడిగేశాడు.
"ఏం లేదు." తలెత్తి అంది సుధీర.
"ఏం లేకపోవడమేమిటి? అంత మౌనంగా నువ్వెప్పుడన్నా వున్నావా అసలు? వంట్లో బాగాలేదా?
"బాగానే వుంది."
"మరి?"
"ఏం లేదు. నే వెళ్తాను." లేస్తూ అంది.
"ఇంటి వరకూ రానా?' సుదీర ముఖంలోకి పరిశీలనగా చూస్తూ అన్నాడు.
'అక్కర్లేదు. కారుందిగా? వెళ్తాను" అంటూ వంటింటి దగ్గరకి వెళ్ళి , "వెళ్తున్నా మీనాక్షీ!" అంది సుధీర.
వంట పనిలో మునిగి వున్న మీనాక్షి తలెత్తకుండానే ఊకోట్టింది.
సుధీర వెళ్ళిపోయింది.
