Previous Page Next Page 
ఆఖరి మజిలీ పేజి 13

 

    ఇందిర హాస్పిటల్ కి వెళ్ళిపోయింది. అప్పుడే స్నానం చేసి తీరుబడిగా రవీంద్రుని పుస్తకం పట్టుకుని కూర్చుంది నీరజ. దొడ్లో ఎక్కడో సుందరమ్మ కునుకు తీస్తున్నది. పాప నిద్రపోతున్నది. నీరజ పుస్తకం చదువుతున్నదన్న మాటే గాని ఆలోచనలన్నీ సురేంద్ర చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. పుస్తకం మూసి పక్కన పెట్టి కళ్ళు మూసుకుని సోఫాలో వెనక్కు వాలి కూర్చున్నది.
    "నీరజా!" ఉలిక్కిపడి కళ్ళు తెరిచేసరికి ఎదురుగా సురేంద్ర నిలబడి ఉన్నాడు. క్షణకాలం బిత్తర పోయి అంతలోనే తేరుకుని "రండి! ఏదైనా పని మీద వచ్చారా?" అంది.
    సురేంద్ర కళ్ళలో విషాదం గూడు కట్టుకున్నది. ఆ కళ్ళు పేలవంగా ఉన్నాయి.
    సురేంద్ర నిలబడే ఉన్నాడు.
    "ఇప్పుడిప్పుడే ఇందిర రాదు. మీరు సాయంకాలం వస్తే కలుస్తుంది"
    "నేను ఇందిర కోసం రాలేదు. నీకోసం వచ్చాను నీరజా!' అని క్షణం ఆగి ఆమె ముఖం లోకి చూసి దగ్గరగా వచ్చి కూర్చున్నాడు.
    నీరజ లేవబోయే లోపల ఆమె చేతులు గట్టిగా పట్టుకుని కూర్చోబెట్టాడు. "ఏమిటీ అఘాయిత్యం. ఇంట్లో ఎవ్వరూ లేరనా" విసురుగా లేచి నిలబడింది నీరజ.
    "నీరూ! నిన్ను మరచిపోవాలని విశ్వ ప్రయత్నం చేశాను. ఇంకా చేస్తూనే ఉన్నాను. చివరకు తాగటం కూడా అలవాటు చేసుకున్నాను. కాని, నీరజా ...నువ్వు లెందీ నేను బతకలేను. నన్నాన్యాయం చెయ్యకు-- నిద్రలోనూ, మెలకువ లోనూ నువ్వు తప్ప నాకింకేమీ కనబడటం లేదు. నిన్ను విడిచి బతకటం అసంభవం " ఉద్రేకంగా చెప్పుకుపోతున్న సురేంద్ర ను కళ్ళు పెద్దవి చేసి చూస్తూ నిలబడిపోయింది నీరజ.
    "ఒక్కమాట చెప్పండి ! సరోజ బ్రతికుంటే మీరిలా వచ్చేవారా! నన్ను రమ్మని అడిగే వారా...."
    దెబ్బతిన్నట్టు చూశాడు సురేంద్ర. నీరజ కళ్ళు తడితడిగా మెరుస్తున్నాయి.
    "నీరజా .....! కాని, నువ్వు - నువ్వు నన్నర్ధం చేసుకోలేవు. సరోజ బ్రతికుంటే ఏం చేసేవాడివి? అని అడిగితె నేనేం చెప్పగలను? ఇప్పుడెం చెయ్యాలి -- అనేది కదా ప్రస్తుతం ఆలోచించవలసినది"
    "వద్దు. నేను రాలేను-- నన్ను బాధపెట్టకండి దయచేసి" ప్రశాంతంగా అంది నీరజ.
    "ఇట్లాగే తాగి తాగి ఏదైనా రోగం వచ్చి చచ్చిపోతాను! అనాడన్నా నన్ను క్షమించి నా కోసం బాధపడ్తావా! అప్పటికీ క్షమించవా! కాని, నీరజా ఇంత పెద్ద శిక్ష విధించటానికి నీ మనేసేలా ఒప్పింది?"
    నీరజ మాట్లాడలేదు. ఇంతలో పాప లేచి ఏడవటం మొదలు పెట్టింది. లోపలి కెళ్ళి పాపను ఎత్తుకు వచ్చింది.
    "పాపకేం పేరు పెట్టాలను కుంటున్నారు?" ప్రసంగం మార్చాలని అడిగింది నీరజ.
    "నీరూ...."
    "దయచేసి అలా పిలవకండి. అట్లా పిలిపించుకునే అదృష్టాన్ని నేను కోల్పోయాను"
    "సరే, ఒక్క విషయం నిజంగా నీకు నా మీద కోపం లేదా"
    "మీ మీద కోపం ఎందుకు? జాలి -- అంతే"
    "జాలా! సరేయితే నన్ను హృదయ పూర్వకంగా ఇదివరకు లాగానే ప్రేమిస్తున్నావా?"
    "ప్రేమకు నిర్వచన మేమిటి?' ప్రశాంతంగా అడిగింది నీరజ.
    "మీ మీద ప్రేమ ఉన్నట్టయితే నేను మీ దగ్గరకు రావటమే సాక్ష్యం-- అంటారా.
    సురేంద్ర సమాధానం చెప్పకపోయే సరికి తనే అంది నీరజ.
    "పోనీ నువ్వు చెప్పు -- ప్రేమకు నిర్వచనం " సురేంద్ర అన్నాడు.
    నీరజ మౌనంగా నవ్వి ఊరుకుంది.
    "మాట్లాడవేం?' ఆశ్చర్యంగా అన్నాడు సురేంద్ర.
    "నేను మీకొక కధ చెప్పనా! ఒక గురువు గారి దగ్గర ఇద్దరు అన్నదమ్ములు శిష్యులుగా ఉన్నారు. అధ్యయనం పూర్తీ కాగానే వారి తండ్రి వారిని బ్రహ్మ పదార్ధం గురించి అడిగాడుట. అందులో ఒకడు "బ్రహ్మాండం" గా చెప్పాడు. రెండోవాడు మౌనమునే భజించేనట అంటే బ్రహ్మ పదార్ధానికి వ్యాఖ్యానం మౌనమన్నమాట! తండ్రి ఇతడ్ని మెచ్చుకున్నాడు. ఇది ఉపనిషత్తులోని గాధ. అందుకే బ్రహ్మ పదార్ధానికి నిర్వచనం చెప్పగలిగితే ప్రేమకు నిర్వచనం చెప్పొచ్చు"

                       
    నీరజా!"
    "పవిత్రగ్రంధం బైబిల్ లోని "సేరోమీ" యువరాణి కధ మీకు తెలుసుననుకుంటా సౌందర్యానికి వ్యాఖ్యానం అయిన ఆమె వృద్దుడైన ఒక "బాస్టిస్ట్" (మత బోధకుడు) ని ప్రేమిస్తుంది. "సేలోమీ" అతనితో తన ప్రేమను వ్యక్తం చేస్తుంది. కాని అయన ప్రవరాఖ్యుడు "ఒక్కసారి నీ మూర్ఖాన్ని ఆఘ్రాణించనీ!" అంటుంది. తిరస్కరిస్తాడు. "ఒక్కసారి నీ ఫాలాన్ని చుంబించనీ!' అంటుంది. కన్నెర్ర చేస్తాడు. తన తండ్రి చక్రవర్తి. బాస్టిస్ట్ అంటే అతనికి భయం. చివరకు తండ్రి అతి కష్టం మీద ఒప్పిస్తుంది. సేలోమీ అతన్ని ప్రేమించింది. ప్రార్ధించింది. పూజించింది. క్రైస్తవ ఉపాఖ్యానాల్లో సౌందర్య రాణి "సేలోమీ" కీర్తి చిర ప్రతిష్టితమై విరాజిల్లుతున్నది."
    "ఈ కధలన్నీ ఏమిటి? నాకు మతి పోతున్నది - నాకు తెలిసింది చాలా కొంచెం నీరజా. నువ్వు పూర్వం లాగే నాదగ్గరకు రావాలనే కోరిక తప్ప నాకింకేమీ తెలియదు. ఈ మధ్య మనసు మొద్దు బారిపోయింది. సుఖానికి, దుఃఖానికి మనసు ఒకే రకమైన అనుభూతిని పొందుతున్నది." అతని గొంతు దుఃఖంతో పూడుకు పోయింది.
    "హృదయాన్ని సుఖస్పందనం నుంచీ దుఃఖ స్పందనం నుంచీ - అంటే ద్వంద్వాల నుంచీ విముక్తి చేసుకోవటం నిజంగా ఎంత దృష్టం. మీలో కలిగిన ఈ మానసిక పరిణామానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఆధ్యాత్మిక దశలో "సాధకులు" అనేక జన్మలు గానే దేనికై సాధన చేస్తారో అట్టిది కేవలం ఒక సంఘటన తెచ్చి పెట్టగలిగినందుకు భగవంతుడికి మనం కృతజ్ఞతాబుద్దులం కావాలి- ఏమండీ! బౌతిక జీవితంలో తగిలిన ప్రతి ఒక్క ఎదురు దెబ్బ మానవుని మానసిక అలౌకిక ఆధ్యాత్మిక ప్రగతికి ఒక్కొక్క సోపానం కాగలదు"
    "ఏమిటి? నీరజా! ఫిలాసఫీ మాట్లాడుతున్నావు. నాకీ కవిత్వం కాదు , కావలసింది"
    అతని మాటలకు నీరజ పకపకా నవ్వింది.
    "ఏమండీ! ఇంగ్లీషు లో "యూఫిమిజమ్ " అని ఓ అలంకారం ఉంది. అసహ్యమైన దానిని సహ్యంగా చెప్పటం -- అట్లాగే "నువ్వు చెప్పే దంతా నా కర్ధం కాలేదు. అంతా వట్టి నాన్సెన్స్ చెత్త" అని చెప్పటానికి బదులు "నీది కవిత్వమూ వేదాంతమూను" అంటే చాలు -- ఆ పని హాయిగా ముగుస్తుంది"
    "ఏమో అనుకున్నాను కాని, నీరజా నువ్వు చాలా గట్టిదానివి"
    "ప్రేమకూ, ప్రణయానికి - స్త్రీ పురుషులు ఒకచోటే కలిసి జీవించక్కరలేదండి. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మీరు నన్ను ప్రేమిస్తున్నారు. ఇది ప్రణయం. ఇది ఒక మహా భావం. అంటే అలౌకికమైన, అభౌతికమైన అనుభవం.
    అయితే ఈ రెండూను రెండు బౌతిక మూర్తులు. అసలీ ఇవి రెండు కాదు. ఒకటే - ఐక్యత చెందిన మూర్తి. ఒక దివ్య తేజస్సు. అది అలౌకిక మైన, అభౌతిక మైన లేదా అతీంద్రయమైన అనుభవం -- కాబట్టి అది శాశ్వతం. అంటే భగవత్తత్వం. ఈ ఐక్యం ఘటించిన స్థితి అనగా ఆ అద్వైతభావం -- ఇదీ ప్రణయం! ఏది "అధైత్వమో" అదే భగవంతుడు. బహుశా "ప్రణయం. భగవంతుడు" అంటే ఇదే అర్ధమేమో ననుకుంటాను"
    "ఆ ప్రణయ స్థితిని అందుకోవాలంటే మనమేం చెయ్యాలి!" నీరసంగా అడిగాడు సురేంద్ర.
    "ఈ ప్రణయ స్థితిని అందుకోవాలంటే , ఆ లౌకిక మైన "నేను' నువ్వు' అనే వాటిని 'మనం త్యాగం చెయ్యాలి. అంటే ఆ సంకుచితత్వం, ఆ అహంభావం, ఆ అహంకారం -- మనం త్యాగం చెయ్యాలన్న మాట. అప్పుడు 'సంయమనం' సిద్దిస్తుంది.
    భగవంతుణ్ణి మనం 'సంయమనం' తో అందుకోగలం గాని, ఆవేశంతో కాదు. అంటే ప్రణయం అనేది ఆవేశానికి అతీతమైన అనుభవం."
    "ఇన్ని కబుర్లు చెప్పావు -- బాగానే ఉంది -- ఈ ప్రణయ సిద్దాంతం అంతా తను ప్రేమిస్తున్న వ్యక్తిని భర్తగా అరాధించాలనే కదా!"
    "తప్పకుండా! ఆరాధన లో నాకు సంపూర్ణ విశ్వాసం ఉన్నది. ప్రేయసిగా, ప్రియుడిగా స్నేహితుడిగా . స్నేహితురాలిగా -- భగవంతుడిగా. భక్తుడి గా - ఏదైనా సరే అరధనలోని అంతర్యం అవగాహన కావటానికి బలమైన సంస్కారం చాలా కావాలను కుంటాను. ఎందుకంటె దీనికి 'అబ్ జేక్టివ్ రిఫ్లక్షన్స్ ' ఎలా ఉన్నా 'సబ్ జేక్టివ్ ' గా మనవ వ్యక్తిత్వాన్ని మహోదాత్త పరిధిలో ప్రకాశవంతంగా వుంచుతుంది."
    "అంటే నేను సంస్కారం లేని వాడిననా" అతని ముఖం ఎర్రగా కందిపోయింది.
    "అదే చెప్తున్నాను- ఆవేశం పనికి రాదని. అత్యున్నతమైన మానవత్వాన్ని, ఏదో ఇరుకు ఊహలతో చిన్న అనుభవాలతో , క్షుద్రమైన భావాల మధ్య ఇరికించవద్దంటున్నాను. మనవ వ్యక్తిత్వపు ఔన్నత్యం ముందు ఎవరెస్టు ఎత్తు ఎంత? దాని గాంబీర్యం ముందు సముద్రుని లోతు ఎంత? ఇప్పుడు చూశారా -- మనం ఇందాకటి నుంచీ భార్య భర్తలుగా కాక, స్నేహితులుగా -- ఆత్మీయులుగా ఎన్ని విషయాలు మాట్లాడుకున్నాం. పూర్వ జీవితంలో అంటే మనం భార్యా భర్తలుగా నటించే రోజుల్లో ఇలా ఎన్నడయినా మాట్లాడుకున్నామా-- అందుకే జీవితంలో తగిలే ప్రతి ఎదురు దెబ్బ మనకి ఒక్కొక్క గంబీర సత్యాన్ని తెలియ జేస్తుంది-"
    "నీరజా! మనం భార్యా భర్తలుగా నటించామా?' ఆశ్చర్యంగా అన్నాడు సురేంద్ర.
    "క్షమించండి భర్తగా మాత్రం మీరు నటించారు. నేను మాత్రం కోపంతో ఈ మాట అనడం లేదు. ఏ వ్యక్తీ నైతే మనం మానసికంగా భర్తగా గాని, భార్యగా గాని ఆరాధిస్తామో ఆ ఒక్క వ్యక్తీ స్పర్శ తప్ప -- ఇంకే స్పర్శ అయినా ఆ మనస్సుని గాని, శరీరాన్ని గాని ఉద్రేకపరచలేవు. సరోజ తో మీరు శారీరకంగా - అంటే నా దృష్టి లో మానసికంగా కూడా కొంత అనుభవాన్ని పొందారు. అప్పటి వరకూ నేను సామాన్య స్త్రీల లాగానే ఆలోచించాను. సరోజతో మీరు నా ఎదురుగా నిలబడిన క్షణంలో నాలో ఏదో సంచలనం కలిగింది. వైరాగ్యపు గాలి తగిలి మనసు వేరే మార్గంలోకి తిరిగింది. మీరు శారీరకంగా ఎక్కడ ఉంటేనేం -- మానసికంగా నా దగ్గరే ఉన్నారు. నేను మిమ్మల్ని నాలో బంధించుకున్నను!"
    ఇందిర రావటంతో నీరజ మధ్యలోనే ఆగిపోయింది.
    "ఎంతసేపయింది మీరు వచ్చి?" సురేంద్ర ను చూస్తూనే సంతోషం తో అడిగింది ఇందిర.
    "చాలాసేపే అయింది. వస్తాను నేను" అని లేవబోయాడు.
    "అరె! నేను వచ్చి మీ ఏకాంతాన్ని చేడగోట్టానేమో?"
    "ఇందూ!" నీరజ మందలింపుగా అంది.
    మీ ముఖాలు చూస్తుంటే ఒక నిర్ణయానికి వచ్చినట్టున్నారే"
    'ఆ వచ్చినట్టే! నేను చెప్పలేదు ఇందిరా! ఒక్కొక్కప్పుడు నీరజ కొన్ని విషయాల్లో మొండని - తనే గెల్చింది -- ఈ నీచుడి దగ్గరకు...."
    "అబ్బ! ఊరుకోండి. ఎందుకంత మాటలు -- ఇందాకటి నుంచీ నేను మాట్లాడిన దానికి తాత్పర్యం అదా" బాధగా అంది నీరజ.
    'అంటే! నీ నిర్ణయం మరలేదన్న మాట " కోపంగా అంది ఇందిర .
    ఇందిర కోపం చూసిన నీరజ చిరునవ్వు నవ్వింది.
    "ఇందిరా, నేను వెళ్ళొస్తాను" అంటూ లేచాడు సురేంద్ర.
    "ఆగండి -- భోజనం చేసి వెళ్దురు గాని" అంది ఇందిర.
    "వద్దు, నాకాలిగా లేదు" అంటూ నీరజ వంక చూశాడు సురేంద్ర. ఏ రకమైన భావమూ లేకుండా ప్రశాంతంగా ఉంది నీరజ.
    "ఇందూ వడ్డించమను- వస్తారు" అంటూ లోపలి కెళ్ళిపోయింది.
    సుందరమ్మ గారు వడ్డిస్తుంటే ముగ్గురూ మౌనంగా భోజనాలు ముగించారు. సురేంద్ర హాలులో వచ్చి కూర్చున్నాడు.
    నీరజ వక్క పొడి తీసుకుని కొంత సేపటికి తర్వాత హాలులోకి వచ్చింది. సురేంద్ర హల్లో లేడు. ముందు వైపు వరండా లోకి వెళ్ళింది. రెండు జేబుల్లోనూ చేతులు పెట్టుకుని బయటకు చూస్తూ నిలబడ్డాడు సురేంద్ర. కిటికీ లో నుంచి బయటకు చూస్తూ నిలబడిన సురేంద్ర ముఖం ఒక పక్క నుంచి మాత్రమే కనబడుతున్నది. పాలు కారుతున్నట్టున్న తెల్లని చెంపలు, ఇంకా పసి తనం చిందులాడుతూ అమాయకంగా ఉండే ఆ ముఖం -- నీరజ మనసు బాధతో మెలికలు తిరిగి పోయింది వస్తున్న కన్నీటిని అదిమి పట్టి రండి వక్కపొడి వేసుకుందురు గాని" అంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS