Previous Page Next Page 
అగ్ని పరీక్ష పేజి 13


    "ఈ గాయాలు అసలు మానితేగదా మీరు రేపడం అన్న ప్రశ్న. చెప్పనివ్వండి నన్ను. ఇన్నాళ్ళు నా భర్త యిలాంటివాడు అని కన్నవాళ్ళకి చెప్పుకోడానికి కూడా బిడియపడ్డాను. నా గుండెల్లో బరువు బాధ చెప్పుకుంటే తేలిక అవుతుందేమో-చెప్పాక కనీసం మీరయినా సానుభూతితో అర్ధం చెసుకుంటారేమో! "రాజేష్ గారూ అయినింట పుట్టాను నాన్నగారు డాక్టరు రెండు చేతులా కాకపోయినా బాగానే ఆర్జిస్తున్నారు. అన్నా, నేను నా తరువాత చెల్లి ముగ్గురు - అమ్మకూడా చదువుకుంది. ఆ రోజుల్లోనే బి.ఏ పాసయింది. చదువు, సంస్కారం, ఆప్యాయతలు అనురాగాల మధ్య అష్టఐశ్వర్యాలు లేకపోయినా అడిగింది లేదనకుండా అపురూపంగానే పెరిగాను. ఎమ్మే చదివాను-మా నాన్నగారు పచ్చని పసిమి, మేనత్త పోలికలు, నాన్నగారి రంగుతో చిన్నప్పటినుంచి అర్చన అందగత్తె అన్న మాట, చూసిన అందరినోటా విన్నాను. నా అందాలరాశి అని నాన్నగారు ముద్దులాడటం, మీ దిష్టే తగులుతుంది దానికి అని అమ్మ మురిపెంగా చూస్తూ మందలించడం, చూసిన ప్రతి అబ్బాయి నోరు తెరుచుకుని నిలబడిపోతే, అదోరకం గర్వం, ఆనందం వుండేవి-గంటల తరబడి అద్దంలో చూసుకుని మురిసేదాన్ని. అందానికి అలంకారం కూడా తోడు చేసుకుని ఈ ప్రపంచాన్నే జయించగలను నా అందంతో అన్న గర్వంతో పొంగిపోయే టీనేజ్ గర్ల్ మనస్తత్వంతో బంగారు కలలుకనే వయసది! ఆ అందంతో ప్రపంచాన్ని కాదు కదా కట్టుకున్న భర్తని కూడా జయించలేక పోతానని ఆనాడు అనుకోలేదు.
    "ఈయన తండ్రి డాక్టరు. నాన్నగారి స్నేహితుడు, తల్లి డాక్టరు చదువు సంస్కారం వున్నవాళ్ళు, కావాలని యింటికి వచ్చి మరీ నన్ను కోడలిగా చేసుకుంటానన్న వాళ్ళ సహృదయతకి, సంస్కారానికి మా వాళ్ళంతా సంతోషించారు. అబ్బాయి ఎమ్. టెక్ చదివి, ఎమ్.బి. ఏ కూడా చేసి నాలుగువేల జీతంతో వోల్టాస్ కంపెనీలో చేస్తున్నాడు. ఒక్కడే కొడుకు, ఒక కూతురు. యిల్లుకాక ఆస్థిపాస్థులు అన్నీ వున్నాయి అమ్మాయి అదృష్టం వాళ్ళ దగ్గిరకి వచ్చిన సంబంధం అని పొంగిపోయారు అందరూ. పెళ్ళిచూపులయ్యాయి. అంతవరకు ఏదో ఊహించి నేను అతన్ని చూడగానే డిసప్పాయింట్ అయ్యాను. అందం అటుంచి మొహంలో ప్రసన్నత, సౌమ్యత కనపబడలేదు. తల్లి తండ్రి ఎంతో మంచివాళ్ళు. సరదాగా జోక్స్ వేస్తూ నన్ను పలకరించుతూ అభిమానం చూపించారు. అందరి మాటలూ వింటూ అడిగిన దానికి జవాబిస్తూ కూర్చున్నాడు తప్ప, తనంతట తానుగా పలకరించడం, నవ్వుతూ మాట్లాడకపోవడం చూసి అతని సీరియస్ టైపు అన్పించి నిరుత్సాహపడ్డాను. వాళ్ళు వెళ్ళగానే అమ్మ నాన్న అడిగితే అబ్బాయి నాకు నచ్చలేదన్నాను. సీరియస్ గా ఉన్నాడన్నాను. "చాల్లే ఒక గంటలోనే అన్నీ తెల్సిపోయాయా నీకు,కానీ రిజర్వుడ్ గా వుంటారు కొందరు కొత్త వాళ్ళ దగ్గిర. అంతమాత్రానికి నచ్చలేదనడం ఏమిటి-అంతా నీలాగే వాగుడు కాయలుంటారా- పెళ్ళయ్యాక మార్చుకుందువుగానిలే" అమ్మ తేలిగ్గా అంది.
    "జానకీ, నిజానికి అబ్బాయి అందం విషయంలో అమ్మాయికి సరిపోడనుకో. కాని మిగతావన్నీ బాగున్నాయి. చాలామంచి చదువు, ఉద్యోగం, ఆస్థిపాస్థులు అన్నింటికంటే తెల్సినవాళ్ళు, ఫామిలి మంచిది. చదువు సంస్కారం వున్నవాళ్ళు అన్నీ కుదరాలంటే కష్టం అమ్మా అర్చనా నాన్నగారు నచ్చజెప్పబోయారు.
    'మగాడికి అందం కాదు కావల్సింది. కట్టుకున్నదాన్ని పోషించి ఆదరించే వాడయితే చాలు. అందంగా వుండి చేతకాని చవట దొరకటం కంటే చదువు, సంపాదన వున్నవాడే నయంకదా!' అమ్మ వాదన.
    "ఆలోచించమ్మా అర్చనా బలవంతంగా నిన్నేం కట్టబెట్టంలే. కానీ అన్నీ వున్నవాడు దొరకడం, అందులో అందం అన్న క్వాలిఫికేషన్ వున్నవాడు మనకి దొరకడం కష్టం అమ్మా-కావాలన్నప్పుడల్లా మనకు కావల్సినట్టు దొరకదు. తొందరేం లేదులే ఆలోచించుకో" అన్నారు నాన్న.
    'దాని మొహం-ఆలోచించేదేమిటండి. అంతమంచి వాళ్ళు దమ్మిడి కట్నం అక్కరలేదు పిల్లే అక్షరలక్షలు అని మన గుమ్మం ముందుకు వచ్చిన వాళ్ళని వదులుకుంటే రేపు విచారించాలి. అర్చనా అందం మనసుకి గాని శరీరానికి కాదు. మంచి మనసుంటే ఆడది అదృష్టవంతురాలు అవుతుంది-చదువు-మంచి హోదా మగాడికి అందాన్నిస్తుంది' అమ్మ సమర్ధింపు.
    "రెండు రోజులు అందరూ మాటలతో నన్ను మభ్యపెట్టేరు. నిజమేకాబోలు ఈ సంబంధం వదులుకుంటే రేపు యింతమాత్రం సంబంధం దొరక్కపోతే-నాలుగు వేల జీతం, మంచి మాడర్న్ యిల్లు, మాడర్న్ అవుట్ లుక్ వున్న అత్తమామలు, ఢిల్లీ కాపురం, కారు, హోదా యివన్నీ ఒకవైపు త్రాసులో వేస్తే అందం ఒక్కటీ రెండోవైపు తేలిపోయింది అతని లుక్స్ కంటే కూడా అతని రిజర్వ్ డ్ నెస్ నన్ను సందిగ్దంలో పడేసింది. కాని ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో అన్న బిడియం నన్ను గట్టిగా చెప్పనీయలేదు. అమ్మ అన్నట్టు పెళ్ళయ్యాక అతన్ని మార్చుకోడం నా చేతిలో పని అనుకున్నాను అందరి అభిప్రాయాలకి తలఒగ్గి, కాని అతన్ని అంచనా వేయడంలో నేను ఎంత పొరపాటు పడ్డానో తెలిసే సరికి చేతులు కాలాయి.
    "ఏం, ఆయన మీతో సరిగా లేరా, మొదట్లో కూడా సరిగా వుండేవారు కాదు? ముందునుంచి యింతేనా ఆయన?" మధ్యలోనే ఆరాటంగా ప్రశ్నలు వేశాడు రాజేష్.
    "ముందు నించీనా...మొదటి రాత్రినించే ఆయన సరిగా లేరు. సమ్ థింగ్ ఈజ్ రాంగ్ విత్ హిమ్ అన్నది ముందు రాత్రే అర్ధమైపోయింది నాకు. కొత్త భార్యతో మాట్లాడ్డానికి మాటలు కరవవుతాయా? సిగ్గు విడిచి చెపుతున్నాను రాజేష్ గారూ. నేను పుస్తకాలలో చదివి, సినిమాలలో చూసి ఫస్ట్ నైట్స్ అంటే ఏదేదో ఊహించాను. అంటే డ్యూయట్లు పాడతామని చెట్టాపట్టాలేసుకుని చందమామని చూసి మురిసిపోతామని కాదుగాని నా భర్త నా అందానికి దాసుడయి నన్ను తన ప్రేమానురాగాలతో ముంచెత్తుతాడని మాత్రం ఆశించాను. అది అత్యాశ ఏమో నాకు తెలియదు ఎందుకంటే అతి మామూలు ఆడవాళ్ళని సయితం కొత్తలో భర్తలు పొగిడి, ప్రశంసించి వశపరచుకోడానికి ప్రయత్నిస్తారని విన్నాను. చదివాను-అసలు అలాంటి ఆరాటమే నాకు ఆయనలో కనపడలేదు. ఆయన మొదటి రాత్రి మాట్లాడిన మాటలేమిటో తెలుసా?" 'నీవు అందమైన దానివని నీకు చాలా గర్వం అనుకుంటాను ఏం?' ఆయన వక్రంగా నవ్వుతూ అడిగిన ఆ ప్రశ్నకి తెల్లపోయాను. పెళ్ళయి ఒక రోజు కూడా అవలేదు కొత్త పెళ్ళి కూతుర్ని నా గర్వం సంగతి ఆయనకి ఏం తెలిసిపోయినదో ననిపించి వళ్ళు మండింది. ఆయన మనసులో హేళన గమనించే సరికి మనసు చివుక్కుమంది. ఆ ప్రశ్నే యింకో రకంగా, సామాన్యంగా నన్ను మురిపించి, మరిపించే రీతిలో అడగచ్చా కాస్త సరసం తెలిసిన మగాడైతే ఆయన అడిగిన తీరుకి నాకు, తెలియకుండానే నా మనసు నొచ్చుకుంది కాబోలు ఆయనకి తగినట్టే హేళనగా జవాబిచ్చింది నా నోరు. "అందం వున్నచోట గర్వం వెన్నంటే వుంటుంది-అందం లేనిచోట గర్వానికి తావేది?" అన్నాను నేనూ నవ్వి. ఆ మాటలో నా కందం వుందని, ఆయనకి లేదని నేనన్నానన్న అర్ధం తట్టింది గాబోలు మొహం మాడింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS