Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యం-1 పేజి 14


    
                                      ఆగస్టు విప్లవము
    
    అది యొక విశ్వ విప్లవ మహా శివరాత్రి !! పరాజితప్రజా
    హృదయము పొంగులెత్తి ప్రవహించిన వెచ్చనివేళ యద్ది !! అ
    య్యది పరదాస్య శృంఖలములందు కృశించెడి భారతాంబ క
    భ్యుదయముహూర్త! మట్టిటుల నూగెను నాఁడు ప్రభుత్వసౌధముల్!
    
    అయ్యది తమ్మి మొగ్గరమునం దభిమన్యుఁడు రాజరాజుపై
    కయ్య మొనర్ప క్రోధమున ఖడ్గము దూసిన క్రాంతిలగ్నమే !!
    అయ్యది వీరభారత మహత్తరశక్తి పరప్రభుత్వమున్
    వెయ్యిముఖాలతో కలచివేసిన విశ్వవిహారయాత్రయే !!
    
    పారావారమునే దురాగ్రహముతో బంధింప నుంకించిరా
    కారాగారములోన !! విప్లవ తరంగాల్ పొంగి మిన్నంటి తద్
    ద్వారమ్ముల్ పడఁగూల్చి బంధములు బ్రద్దల్ సేసి స్వేచ్చాఝరీ
    పారంపర్యము నింపునం చెఱుఁగరో పాశ్చాత్యభూమింజయుల్ !!
    
    లేచిపోయినవి పోలీసుల టోపీలు
        వందలువేలు రాబందులట్లు
    కాలిపోయినవి సర్కారు కచ్చేరీలు
        ఖరదూషణాదుల కాష్ఠమట్లు
    తెగిపోయినవి తంతితీగెలు భారతీ
        యుల పారతంత్ర్య శృంఖలములట్లు
    తరలిపోయినవి క్రిందకు రైలుపట్టాలు
        పాశ్చాత్యరాజ్య సౌభాగ్యమట్లు
    
    ఒకటి యనుటేమి నాఁటి మహోద్యమమున
    రేగిపోయిన ప్రజల యుద్రేకమునకు
    అల్లకల్లోలమై దద్దరిల్లిపోయె
    తెల్ల దొరల ప్రభుత్వ మందిరము లెల్ల.
    
    భారత వీరవిప్లవ విపంచిక భావిచరిత్రకారుఁ డే
    తీరున మేళవించునొగదే! యువయోద్దల వేడిరక్తపుం
    జాఱలు చూచి యశ్రువులు జాఱవొ కన్నుల, వేడివేడి ని
    ట్టూరుపు లెట్టులాపుకొనునో! ఎటులన్ స్వరముం బెకల్చునో!
    
                                    కాంగ్రెస్ రథము
    
    ధన్యజీవనుఁడు "దాదాభాయి నౌరోజి"
        ఘనకీర్తి "బాలగంగాధరుండు"
    తనయంత కొమరుని గనిన "మోతీలాలు"
        ప్రాజ్ఞుండు "మాళవ్య పండితుండు"
    సౌజన్యవారాశి "రాజేంద్రబాబు"సు
        ధీమాన్యుఁ "డబ్దుల్ కలామజాదు"
    ఉత్తేజితమనస్వి "చిత్తరంజనదాసు"
        శౌర్యవార్నిధి "సుభాస్ చంద్రబోసు"
    
    "అనిబిసెంటు" "బాపూజీ" "జవ్ హరు" "పటేలు"
    "కృపలనీ" ఎక్కినట్టి కాంగ్రెసు రథమ్ము
    నీ వధిష్టించితివి నేఁడు నేర్పుమెఱయ
    నడపి పట్టాభి! ప్రజల మన్ననలఁ గొనుము !!
    
                                      భగత్ సింగు
    

    చెంగున దూఁకెరా కుపిత సింహ కిశోరముభంగి మా 'భగత్
    సింగు' బ్రిటీష్ మహాగజము శీర్షముపై; నవభారతమ్ములో
    పొంగులువాఱె విప్లవ సముద్రము కట్టలుదాటి; ఎత్తెరా
    మంగళహారతుల్ భరతమాతకు తద్రుధిరారుణాంశువుల్ !!
    
    ని న్నురిదీసి మా యెడద నిప్పు రగిల్చిన కూటనీతి సం
    పన్నులు శ్వేతజాతి పరిపాలకు; లీ హృదయాగ్ని కీల లిం
    కెన్ని యుగాలకైన శమియించునె ! నీ స్మృతు లంకితమ్ములై
    యున్నవి మా దృగంతముల నొక్కొక వెచ్చని బాష్పబిందువై !!
    
    బాంబులు ప్రేలెరా బ్రిటిషు బాబుల గుండెలలో భవచ్చరి
    త్రంబు స్మరించు మాత్రనె; స్వతంత్ర పథాన పురోగమించు నీ
    వెంబడి పర్వులెత్తినవి విప్లవశక్తులు; నీ కవోష్ణ ర
    క్తంబులు మా లలాట ఫలకమ్ములపై తిలకమ్ము లయ్యెరా !!
    
                                             
    పాశవశక్తితో ప్రజలపైఁ బడు నీచ నిరంకుశత్వమున్
    నాశమొనర్ప దీక్షగొనినావటె! భారతభూమి విప్లవా
    వేశము పొంగులెత్త ప్రభవించిన రోచిరుదాత్త వీచికా
    రాశి వటే! తెలుంగు కజరామరణంబులు నీ చరిత్రముల్!
    
    క్షాత్రము రూపుగైకొనిన సాహసికున్ గాంచి భారత
    క్షేత్రమునందు పొంగి పులకించినదోయి త్రిలింగజాతి; సు
    క్షత్రియవీర! నీ విజయ శంఖము బ్రద్దలుసేసె శాత్రవ
    శ్రోత్రములన్! భవత్పదము సోకుట మన్యము ధన్యమయ్యెరా !
    
    రాచరికంపు రక్కసి కరమ్ములు సాచి అమాయిక ప్రజన్
    దోచు పరప్రభుత్వమును దోచిన రాజుల చిన్నవాఁడ వీ
    రోచితమైన తావక మహోద్యమ మాంధ్ర పురా పరాక్రమ
    శ్రీ చరణమ్ములందు విరజిమ్మె నవారుణ విప్లవాంజలుల్ !!
    
    గాము దొర లిర్వు రంగరక్షకులు గాగ
    విండ్లు గొని భిల్ల సైన్యాలు వెంబడింప
    ధర్మకౌక్షేయకమ్ము హస్తమునఁదాల్చి
    దుమికితివి తల్లిదాస్య బంధములు ద్రెంప !
    
    దోపిడీల్ సేయు 'దొంగలదొర' వటంచు
    ప్రేలుకొనుగాక తెల్లమొగాలు నిన్ను;
    దేనిపై దోపిడీ చేసితివి? దురాగ్ర
    హమ్ముపైన !! నిరంకుశత్వమ్ముపైన !!
    
    జీవితేశ్వరు నిన్ను దర్శింపలేక
    ప్రణయవతి ప్రాణమే సమర్పణమొనర్చె;
    ఆమెతోడ సమైక్యమ్మునంది 'రామ
    రాజ' వెల్ల 'సీతారామరాజ' వైతి !
    
    పౌరుషము, పట్టుదల, దేశభక్తి, ధైర్య
    సాహసమ్ము లనన్యాదృశ్యములు గాగ
    తెలుఁగుగుండెలు వెలిగించితివి, స్వతంత్ర
    యజ్ఞమున నిండు బ్రతుకు 'స్వాహా' యొనర్చి !!
    
    దోసిలియోగ్గి ప్రార్ధనలతో దోడ్కొనిపోయిరంట పో
    లీసులు! దేవదేవునివలెన్ పరిచర్య లొనర్చిరంట! నీ
    దాసుల మంచు తావక పదమ్ముల సన్నిధి నాయుధమ్ములన్
    రాసులుపోసిరంట! బళిరా! భవదీయ మహాప్రభావముల్ !!
    
    కళవరప్పుడే మిరపకాయ టహా'కు ప్రభుత్వ మిల్టరీ
    దళములు; నీ విజృంభణకు తల్లడిలెన్ పశుశక్తి; సర్వదా
    తళతళలాడు నీ సుచరితమ్ములు భారతభారతీ మహో
    జ్జ్వల మకుటాగ్రమందు విలసద్రుచి రంజిత రత్నపుంజముల్ !!
    
                                  తెలుఁగు వెలుఁగులు
    
    నాగార్జునాద్రి నున్నని పాలరాలపై
        శ్రీలు చిందించె మా శిల్పబాల
    విద్యానగర మంజులోధ్యాన వీథుల
        నవ్యతల్ నెరపె మా కావ్యకన్య
    త్యాగరాయల ప్రేమ రాగ డోలికలలో
        కమ్మగా నూగె మా గానలక్ష్మి
    ఏకశిలాపురీ ప్రాకార శిఖరాల
        విహరించె మా వీర విజయరాజ్ఞి
    
    దిక్కు దిక్కులా కీర్తిచంద్రికలు నింపి
    వెలుఁగులు వెలార్చుకొనియె మా తెలుఁగుతల్లి
    నా పురా వైభవానంద నందనమున
    నవ్వుకొన్నవి నవ వసంతమ్ము లెన్నొ !!


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS