.jpg)
నలువదికోట్ల తమ్ముల జీవితమ్ముల
కాయన మాట 'వేదాక్షరంబు'
భీరులనే కర్మవీరులఁ గావించు
ఆయన పిలుపు 'శంఖారవంబు'
సత్యంబు శాంత్యహింసలకు స్వాగతమిచ్చె
ఆయన బ్రతుకు 'మహా ప్రయాగ'
కొల్లాయితో పిచ్చిపుల్లాయి వలె నుండు
ఆయన దీక్ష 'లోకైక రక్ష'
అతఁడొక 'పవిత్ర ధర్మ దేవాలయంబు'
అతఁడొక 'విచిత్ర విశ్వవిద్యాలయంబు'
ఆ మహాశక్తి 'అంత యిం'తంచు తూఁచఁ
జాల, మతఁడొక పెద్ద 'హిమాలయంబు'.
నేతాజీ
నడిపించినావు! సైన్యములు వేలకువేలు
స్వాతంత్ర్య భారత సమరమునకు!!
జడిపించినావు ! చంచచ్చంద్ర హాసంబు!!
తెల్లవారల గుండె తల్లడిల్ల !!
విడిపించినావు! జీవితమెల్ల బలిచేసి
భరతపుత్రుల దాస్యబంధనములు!!
తుడిపించినావు! నీ యుడుకు నెత్తురుతోడ
పారతంత్ర్య కళంక పంకరేఖ !!
బాపుజీకి, పటేలుకు పనికిరాక
కరగి - కడలంటి - ఒక 'తరంగమవు' ఒక 'మ
హా ప్రవాహమ్మ'వై - తల్లి యడుగులంట
పొరలి ప్రవహించితివి సెబాసుర ! సుభాసు !!!
అల్లాల్లాడిన వాంగ్లశాసకుల రాజ్యస్తంభముల్ నీ 'చలో
ఢిల్లీ' యన్న మహానినాదమునకున్; డీకొట్టె నీ శక్తి 'లాల్
ఖిల్లా'లోని నిరంకుశత్వ పశుశక్తిన్; దేవతాహస్తముల్
చల్లెన్ నీ రణభేరిపై నవయుగస్వాతంత్ర్య పుష్పాంజలుల్ !!!
'ఆజాద్ హిందు' మహాప్రభుత్వమున కధ్యక్షుండవై యే మహా
రాజుల్ గాంచని కీర్తి గాంచి, పరిపూర్ణస్వేచ్చకై జీవితం
బాజన్మాంత మఖండ యజ్ఞమున 'స్వాహా' చేసి మా పూజ్య నే
తాజీవై దిశలన్ వెలార్చితివి స్వాతంత్ర్య ప్రభాత ప్రభల్ !!!
హిందూ ముస్లిము లేకకంఠమున 'జైహిం'దంచు నీ బావుటా
క్రిందన్ నిల్చి పురోగమించిరటె కేల్ కేల్ రాయుచున్, నేఁడిటుల్
హిందూస్థానము చీలిపోదుగద నీవే యున్నచో; నెత్తురుల్
చిందంబోవుగదా జగజ్జనని సుస్నేహార్ధ్ర వక్షమ్ముపై !
'దేశద్రోహి' యటంచు నిన్ను గని సందేహించెనా నీ మహో
ద్దేశంబున్ గ్రహియింపఁజాలని పరాధీన ప్రజాబుద్ధి; నీ
'యాశాజ్యోతి' స్వత్యంత్రభారతము నేఁడానందబాష్పాలతో
నీ శౌర్యోన్నతి కంజలించినది తండ్రీ; తప్పు మన్నింపరా !!
శాంతికి క్రాంతి నేరిపి, ప్రజా హృదయాబ్జములన్ సువర్ణ సం
క్రాంతులు జాలువాణిచి, జగత్తుకు వేడివెలుం గొసంగు "భా
స్వంతుఁడ" వీవు; తావక యశస్సులు భారతమాత మౌళిపై
దొంతరమల్లె లైనవి గదోయి! ప్రఫుల్ల పరీమళమ్ముతో !
నీ వీరత్వము, నీ దృఢవ్రతము, నీ నేతృత్వమున్, నీ ప్రజా
సేవౌత్కంఠ్యము, నీ పురోగమన వైచిత్ర్యంబు; నీ సాహస
శ్రీవాల్లభ్యము గాంచి పొంగి పులకించెన్ విశ్వ విశ్వంభరా
భావోద్యానము - నీ శుభోదయము సౌభాగ్యమ్మురా జాతికిన్!
తమ్ముల నిద్రలేపి, చిర దాస్య తమస్సులు వాపి, వెల్గులన్
జిమ్ము పథమ్ముఁ జూపి విలసిల్లెడు దివ్య 'సువర్ణ సుప్రభా
తమ్మవు' నీవు; నీ జయ పతాకము నీడల నిల్చినారు భా
వమ్ముల జాతివర్ణ మత వర్గ విభేదము మాని, యెల్లరున్!
'దాసోహ'మ్మని పశ్చిమప్రభుల పాదమ్ముల్ తలందాల్చు నౌ
దాసీన్యంబు సహింపఁజాలని పవిత్రక్షాత్ర కర్తవ్య దీ
క్షాసంరంభము పొంగి వెల్లువలు కాగా -తన్మహా విప్లవో
ల్లాసంబున్ జనముల్ 'సుభా' సనుచుఁ బిల్వంజొచ్చి రుత్కంఠమై
'జైహిం'దన్న మహా నినాదము ప్రజాస్వాతంత్ర్య మంత్రమ్ముగా
వ్యాహారింతురు భారతీయ లికముం దాచంద్రతారార్కమున్;
మా హృత్పద్మవనాంతరాంతర గళ న్మారంద ధారా పరీ
వాహంబుల్ పయనించు తావక మహత్త్వశ్రీ పదస్పర్శకున్ !!
సింగారమ్ములు చిందు మంగళ సుధాశ్రీకమ్ము లౌ నీ కనుల్ -
అంగారమ్ములు చిమ్మె స్వార్ధపరతాహంకార శీర్షాలపై;
బంగాళ మ్మది నీ మహోదయమునన్ భావిప్రపంచమ్ములో
బంగారమ్ములు పూయురా! విజయ శోభా వైభవోపేతమై !!
"పొంగెడు గుండెలో పొరలిపోయెడు క్రాంతి కవోష్ణ రక్తమే
చెంగలువల్ గులాబులుగ చేసెను తల్లికి పాదపూజ మా
బంగరు బోసుబా" బనుచు, భారతభాగ్యవిధాత గాంధి క
న్నుంగవ నీరుపెట్టెను అనుంగు సహోదరు నిన్ దలంచుచున్.
నీ తేజోమహిమంబు మా హృదయమందే కాదు, విశ్వ ప్రజా
చేతోవీథుల కాంతిరేఖలు వెలార్చెన్; ఖండ ఖండాంతర
ఖ్యాతంబుల్ భవదీయ పౌరుష యశోగాథల్ లిఖింపంబడున్
స్వాతంత్ర్యోజ్జ్వల 'వీరభారతకృతిన్' సౌవర్ణవర్ణాలతో !!
