Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యం-1 పేజి 15


                                   పురుషోత్తముఁడు
    

    [భారతదేశచరిత్ర భారతీయులే వ్రాయక
    పోవడం మన దురదృష్టం. మొదటినుంచీ
    మన వారికి పరబ్రహ్మమీదే గాని భౌతిక
    ప్రపంచం మీద విశేషాభిమానం లేకపోవ
    డమ దీనికి కారణ మనుకుంటాను.
    
    ప్రపంచ విజేతగా సుప్రతిష్ఠితు డౌదామన్న
    కాంక్షతో పురోగమించిన గ్రీకు దేశాధిపతి
    అలెగ్జాండరు భారతభూమిలో పురుషోత్తము
    నీతో ప్రతిఘటించి పరాజితుడై తిరోగ
    మించాడు.
    
    ఈ యథార్దాన్ని కప్పిపుచ్చి స్వార్ధపరులైన
    గ్రీకు చరిత్రకారులు తమ గ్రంథాల్లో అలె
    గ్జాండరును విజేతగానూ పురుషోత్తముని
    పరాజితునిగానూ చిరతించారు. ఆంగ్లచరిత్ర
    కారులు కూడా వీరికి తాళం వేస్తూ ఆ అభి
    ప్రాయాన్నే మనకు అందించారు.
    
    విమర్శనాదృష్టి లేని మన చరిత్రాధ్యాపకులు
    అలెగ్జాండరు దండయాత్ర దగ్గరనుండి
    ఆగష్టు విప్లవందాకా ఈ అసత్య అనర్ధక
    బీజాలనే మన విధ్యార్దుల హృదయక్షేత్రాల్లో
    నాటుతూ ఉంటారు.]
    
    క్షాత్రతేజస్సు భారతక్షేత్ర మెల్ల
    కాంతులీనిన స్వర్ణ సంక్రాంతు లవ్వి;
    భరతపుత్రుల కీర్తిసంపదల పంట
    గాదెలకు పోసికొన్న యుగాదు లవ్వి !!
    
    హైందవ పతాక లాకాశమందు కెంపు
    లారవోసిన యరుణోదయమ్ము లవ్వి;
    భారతసవిత్రి సౌభాగ్య భాగ్య రేఖ
    నవ్వినాట్యాలుసేయు దినమ్ము లవ్వి !!
    
    నాఁడు పాంచాల మేలుచున్నాఁ డపార
    శౌర్యమూర్తి, దిగంత విశ్రాంత కీర్తి;
    మత్త మాతంగ యూధ సంపత్తి వెలయ
    నుత్తమ గుణోన్నతుఁడు పురుషోత్తముండు.
    
    ఆ పురుషోత్తమప్రభు మహత్తరచిత్తము ధైర్యలక్ష్మికిన్
    గాపురమయ్యె, వాని కడకన్నులు ప్రాక్తన భాగ్య రాశికిన్
    దీపిక లయ్యె, దిగ్విజయదేవికి తత్ ప్రతిభా ప్రతాపముల్    
    నూపుర యుగ్మ మయ్యె, సుమనోజ్ఞము లాతని భారతీయతల్ !!
    
    "రంగులు చిందుసుందర కరమ్ములతో నవ మోహనాంగులై
    యంగడి రాశిపోసికొని యమ్ముదు రంట మణుల్ సతీమణుల్;
    బంగరు కొండలున్; రజిత పర్వతముల్, గల వంట భారత
    ప్రాంగణమం" దటంచు బహుభంగుల చారులు విన్నవించినన్ -
    
    గండరగండఁడై భరతఖండమునెల్ల జయించు కాంక్ష, ను
    ద్దండ తురంగ సైన్య సముదాత్త జయాభ్యుదయుం, డఖండ దో
    ర్ధండ పరిస్ఫురద్ యవన రాజ్య రమా రమణీయుఁడ 'య్యల
    గ్జాండరు' వచ్చె భూవిభులు కాన్కలతో నెదు రేగుదేరఁగన్.
    
    వచ్చుచునున్న యయ్యవనవాహిని కడ్డమువచ్చి స్వాగతం
    బిచ్చెను వీర భారత నరేంద్రుఁడు క్షాత్రకులోచితంబుగన్;
    రెచ్చి పరాక్రమించి యెదిరించి రణం బొనరించినారు గో
    ర్వెచ్చని రక్తధారలు స్రవింపఁగ గ్రీకులు భారతీయులున్.
    
    అక్షీణప్రతిభా బలాఢ్యము, రణవ్యాపార పారీణమౌ
    లక్షా యిర్వదివేల సైన్యము జయోల్లాసంబునం దోడురాన్
    దక్షత్వమ్మునఁ బోరు గ్రీకు ప్రభువం దర్శించి జీలంనదీ
    వక్షం బెంతయు తల్లడిల్లె; భవితవ్యం బెంత సందిగ్ధమో!
    
    తమ తుండమ్ములఁజుట్టుచున్, ధరణిమీఁదన్ గొట్టుచున్, శత్రుసై
    న్యములన్ ధ్వంస మొనర్చె భారత మహేంద్రస్వామి మత్తేభ యూ
    ధము, పాంచాల యశోధురంధర సముద్యద్ యుద్దభేరీ నినా
    దము లాక్రాంతదిగంతరాళములు బ్రద్దల్ సేసె బ్రహ్మాండమున్.
    
    భారత వీర సైనికుల బాణ పరంపర గ్రీకు రక్తపుం
    ధారల స్నానమాడినది, తల్లడమంది చమూ సమూహముల్    
    పాఱె, హఠాత్తుగా యవనభాగ్యవిధాత తురంగ మంతలో
    ధారుణిఁ గూలె, ఆర్య వసుధాపతి బల్లెపు బాకు పోటునన్.
    
    ఆశ నిరాశయై, వివశుఁడై వశుఁడయ్యె నఖండ సంగరా
    వేశము దక్కి గ్రీకు పృథివీపతి భారత చక్రవర్తికిన్;
    దేశజిగీషమై అరుగుదెంచి పరాజితుఁడైన శౌర్య వా
    రాశి సికందరుం గని దరస్మితుఁడై పురుషోత్తముం డనెన్ -
    
    "శూర శిరోమణీ! రిపునిషూదన! విశ్వజిగీషమై యసా
    ధారణులైన గ్రీకు సరదారులతో చనుదెంచినారు; మా
    భారతభూమిలో మెరకపట్టి భవజ్జగదేక జైత్ర యా
    త్రా రథ మాగిపోయెను - కదల్చగలే రడుగైన ముందుకున్!
    
    హిందూ గ్రీకులు వియ్య మందుకొని సాహిత్యమ్ము విజ్ఞానమున్
    సౌందర్యమ్మును పంచిపెట్టినవి విశ్వమ్మెల్ల; స్వార్ధమ్ముతో
    హిందూస్థానము గెల్వవచ్చితిరి మీరీనాఁడు, మా ముంగిటన్
    బందీలైతిరి!! మారిపోయినవి మీ మా పూర్వబాంధవ్యముల్!

    లక్ష సువర్ణ ఖండములు లంచ మొసంగి, రహస్య వైఖరిన్
    తక్షశిలాధినాథుని మనస్సును మాఱిచి నేర్పుగా భవ
    త్పక్షము త్రిప్పుకొంటిరి; ప్రపంచ విజేతల రాజనీతికిన్
    లక్షణ మిట్టిదా! విజయలాలస యింతటి గ్రుడ్డిదయ్యెనా!
    
    పట్టపగల్ నదిం గడప ప్రౌఢిమ చాలకగాదె గ్రీకు స
    మ్రాట్టుల అర్ధ రాత్రి అపమార్గమునం బడి పోయినారు; మీ
    పట్టుదలల్ విదేశముల పైఁబడిదోచుటయా! చరిత్రలో
    నిట్టి విచిత్రముల్ వినిచెనే భరతావని యెన్నడేనియున్?
    
    ఆ రజనీ హృదిన్ రణ రహస్యము లెట్టి విచిత్ర వేషముల్
    మారుచుకొన్నవో గగనమండలమే యెఱుఁగున్; ఘనాఘనా
    సార మెఱుంగు; నంధతమసం బెఱుగున్; ఎఱుగున్ నదీ పయః
    పూరము - నాఁటి ప్రొద్దుపొడుపుల్ భరతోర్వికి సుప్రభాతముల్ ?
    
    భారతభూమిలో పిఱికిపందకు స్థానము లేదు, లేదు మా
    పౌరుష వాణికిన్ శిథిలభావము, శత్రువు యోగ్యుఁడైనచో
    గౌరవమిచ్చి గౌరవము గైకొను పద్దతి మాది, తెల్పుఁడే
    తీరున నేఁడు మిమ్ము గుఱుతింపు మటందురొ" యంచు బల్కినన్.
    
    "వీరులు మీరు, నేను నొక వీరుఁడ, వీరు మఱొక్క వీరుఁ డే
    తీరున గౌరవించునొ అదే క్రియ గాంచుఁ"డటంచు ధీర గం
    భీర గళమ్ముతో పలికి మిన్నక నిల్చిన 'గ్రీకు రాజ కం    
    ఠీరవు' గాంచి ముచ్చటపడెన్ పురుషోత్తమచక్రవర్తియున్.
    
    బంధవిముక్తుఁ జేసి ప్రియ భావముతో యవనేశునిన్ సుహృ
    త్సంధి నియుక్తు జేసె నృపసత్తముఁ డాపురుషోత్తముం; డిటుల్
    సంధిలె మైత్రి నాగరక జాతులు రెంటికి; నిట్లు గ్రీకు గ
    ర్వాంధ తమస్సు "లాఱుపది" యైనవి భారత భాను దీప్తికిన్.
    
    గ్రీకు చరిత్రకారులు లిఖించిన స్వాతిశయార్ధ గాథలే
    గైకొని ఆంగ్ల పండితులు కట్టుకథల్ రచియింప, వానికే
    తోకలు చేర్చి గ్రంథముల దూర్చిరి బానిస భారతీయ చా
    ర్వాకులు !! సత్యసూక్తి నుడువం డొకఁడున్ సవిమర్శకమ్ముగన్.
    
    భండన పాండితిం గని ప్రపంచము గెల్వఁదలంచు గ్రీకు మా
    ర్తాండుఁడు నేఁటి కొక్క భరతక్షితిపాలున కోడె నన్న బ్ర
    హ్మాండము మున్గిపోయినటులై కథ నడ్డము ద్రిప్పినా - 'రల
    గ్జాండరు' జేతయా! విజితుఁడా 'పురుషోత్తముఁ'డింత మోసమా!
    
    'ప్రాకట శౌర్య ధైర్య పరిపాకులు, వీరరసప్రతీకులౌ,
    గ్రీకులు కాందిశీకు లయి కేల్గవ మోడ్చిరి వీర భారత
    శ్రీ' కను దుర్యశమ్ము తమ శీర్షముపై ఁబడకుండ చల్లఁగా
    లోకము కన్నుగప్పి, రెటులో మసిపూసిరి వాస్తవమ్ముపై !!
    
                                      వేమనయోగి
    
    యోగిరాజువొ కవిరాజువో వచింపు!
    మా యతిగణాలు ప్రియమొ ఈ యతిగణాలొ?
    భూతియో గీతియో ప్రీతి? చేతిలోని
    దాత్మబోధామృతమొ కవితామృతమ్మొ!!
    
    తళుకు లీనెడు చెక్కుటద్దాలమీఁద
    జాఱిపోలేదు కోరమీసాల సొగసు;
    తఱుఁగనేలేదు మంజులాధరములోని
    రక్తిమ; మ్మింతలోన విరక్తియేమి?
    
    పాలుగాఱెడు నీ ఫాలఫలకమందు
    చెఱగిపోలేదు రాజ్యలక్ష్మీ పదాలు
    పసిడిమేడలు విడనాది పల్లెటూళ్ళ
    వైపునకు సాగిన విదేమి నీ పదాలు?
    
    "కవియో! యోగియొ! తత్వదర్శకుఁడొ! సాక్షాద్దక్షిణామూర్తియై
    శివుఁడే వచ్చెనొ కొండవీటి కిటులన్ శిష్యాళితో"నంచు ని
    న్నవలోకింపఁగ పల్లెపట్టు ప్రజలంతా వచ్చుచున్నారు; నీ
    వెవరయ్యా? తెలుగుంబొలాలపయి విన్పించెన్ భగవద్గీతికల్!
    
    గోచీ పెట్టెను పెట్టలే దనుటకున్ గొట్లాట; తిమ్మన్నకున్
    ప్రాచీనుం డని, కాదు తిక్కనకు నర్వాచీనుఁడం చేదియో
    పేచీ; యీ సిగపట్ల గోత్రముల కబ్బే నేను పోలేను; నీ
    వాచామాధురి నీ నిరర్గళ కవిత్వస్ఫూర్తిఁ గీర్తించెదన్.
    
    తెలుఁగుదనమ్ము  ఆటవెలఁదిన్ జతగూర్చు కవిత్వతత్వ వే
    త్తల తలమానికంబవట!! తావక నిర్భయ నీతి దీపికల్
    వెలుఁగులు చిమ్మె జానపదవీథుల, మా తెలుఁగమ్మ గుమ్మముల్
    కళకళలాడె నీ కృతులు గట్టిన పచ్చని తోరణాలతో !


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS