4
చాలా దశాబ్దాల క్రితం కైబరు కనుమని క్రౌంచ రంధ్రం అనేవారు. యీ క్రౌంచరంధ్రం నించే ఆర్యులు భారతదేశంలో పాదంపెట్టారు. పంజాబు, బెంగాలుమీదుగా ఆర్యులు కళింగదేశంమీద కాలుపెట్టారు.
ఆ విధంగా కుల విచక్షణ లేని ద్రవిడ సంతతిలోకి కుల వ్యవస్థ కలిగిన ఆర్యసంతతి వచ్చిపడింది. అప్పటికి ద్రావిడులలో బ్రాహ్మణ ఆబ్రాహ్మణ విభేదాలు వుండేవి కాదు.
మరికొన్ని జాతులువారు ఘూర్జర ద్రావిడదేశాలమీదుగా దక్షిణాపధం వచ్చారు. వంగ బీహారదేశాల మీదుగా వచ్చినవాళ్ళూ, వీళ్ళూ కళింగాంధ్రదేశాల సంధిలోమళ్ళీ కలిశారు.
అట్లా కలసిన ఆర్యసంతతి వారే వైశ్యులు. ఆర్యులందరికి లాగానే వీరికీ యింటిపేరులుంటాయి. వీరు చాల ప్రాచీనకాలంలోనే దక్షిణవధాన సమాజంలో ప్రముఖమయిన స్థానం సాధించారని చెప్పుకోవటానికి 'శిల స్పాదికరం, మణిమేఖలై' కధలు నిదర్శనం.
మొదట మధు కామార్ణసరాజు, ఆ తరువాత 1038లో వజ్రహస్తుడనే రాజు వైశ్యులకు అగ్రహారాలు దానం చేసినట్లుగా దానశాసనాలు నేడు లభ్యం అవుతున్నాయి.
అట్లా వచ్చినవారే బొబ్బిలి వైశ్యులు వీరికి గవరకోమటులు అనే వర్ణంవారికీ 1794 పద్మనాభ యుద్దంలో హోరా హోరి పోరాటం జరిగింది. దీనినిబట్టి యిటీవలి వరకూ వీరు కత్తిపట్టి యుద్ధం చేశారని నిశ్చయంగా చెప్పవచ్చు. వీరిలో వైష్ణవులూ, శైవులూ వున్నారు.
వైష్ణవులకు యతిరాజమనవాశాదిపేర్లూ, చరమశ్లోకాలూ, బొళ్ళిక్కాలూ లేవు. అలాగే శైవులకు లింగధారణ, వణనియమ, శవఖననాలు లేవు. ఆర్ఘ్యము, జపము, వుపస్థానము వున్నాయి.
పెళ్ళిళ్ళలో 'కాలుగోటి' వుంది. 'పెతాళ్ళు' కూడ వుంది. బొబ్బిలి రాజ్యంలో వీరికి పురశ్రేష్టి సేనాపతి అనే బిరుదులుండేవి వీరి కుల వ్యవహారాలు గజపతిరాజుల వ్యవస్థని పోలివుంటాయి.
వీరిలో ప్రధమ రజస్వల అయిన పాపలకు యేడోరోజున శుద్ధి స్నానం చేయించేవారు, స్త్రీలకు (జాకెట్లు) కంచుకాలు లేవు. కుడిపైట వేసుకుంటారు. కుడిప్రక్కన కొప్పు పెట్టుకుంటారు. భర్త చనిపోయిన వారు జుట్టు తీసివెయ్యాల్సిన పనిలేదు. ఆడవాళ్ళకి కూడా దాయభాగం వుంది. అది బంగారం రూపంలో వుండేది. అంటే తప్పనిసరిగా "సాలం కృత కన్యాదానం" వుండేది అన్నమాట.
వీరి ఆచారాల్లో 'ఓడ వదలటం, పుట్ట తీయటం, పిండికూర' విచిత్రమయినవి. యిదంతా యెందుకంటే యిప్పటికీ బొబ్బిలిలో వాళ్ళు యీ విషయాన్ని పాటిస్తున్నారు.
బొబ్బిలి యుద్దంలో వీరు నిర్వహించిన పాత్ర యెవరూ చెరిపివేయటానికి వీలులేనిది. ఆ రోజుల్లో వీరి ఆడవాళ్ళుకూడా యుద్ధం నేర్చారు.
అలాంటి వీరవనితల వంశానికి యీనాటి ప్రతినిధి రాజలదేవి రాజలదేవికి రాజమాతకు మంచి స్నేహం. యెంత స్నేహమంటే హీరా దేవి తారాదేవిలతో మహాదేవి మల్లమ్మకు యెంత స్నేహమో అంత స్నేహం.
"మన కుటుంబాల మధ్య స్నేహం యీనాటిది కాదు" అంటూ వుంటారు రాజమాత.
రాజలదేవికి యీ విషయం తెలుసు. ఆమె పుట్టింది బొబ్బిలిలోనే పెళ్ళి చేసుకున్నదికూడ బొబ్బిలిలోనే మరొక వైశ్య కుటుంబంలోని వ్యక్తిని. బాగా వున్నవాళ్ళు కావటంనించి ఆమె భర్తకు చేసి తీరవలసిన పనులంటూ యేమీ వుండవు. పనులు లేకపోవటంనించి తీరిక యెక్కువ ప్రొద్దుపోదు. ప్రొద్దుపోదు కాబట్టి యేదో ఒక పని కల్పించుకోవాలి.
రాజలదేవి మొగుడు నృసింహదేవరావు. వాడుకలోకి నరిసిమ్మదేవారావు అయింది. ఆయన యెప్పుడు మద్రాసు, కలకత్తా పోతూవుంటాడు బొబ్బిలినించి విజయనగరంవస్తే సరిపోతుంది. అక్కడనించీ మద్రాసుకు కలకత్తాకు కావలసినన్ని రైళ్ళు పోతూవుంటాయి. ఆయన నగరాలకు పోయి యేమి చేస్తూ వుంటారో ఆ భగవంతుడికి తెలియాలి. రెండు మూడు రోజులు వుండివస్తారు. మళ్ళీ రెండుమూడు రోజులు విశ్రాంతి మళ్ళీ ప్రయాణం. యిలాగ వారంలో ఒక ప్రయాణమూ, ఒక విశ్రాంతీ అయిపోతుంది. అదేమని రాజలదేవి ప్రశ్నించదు.
భర్త వున్నడబ్బుతో యేదయినా వ్యాపారం చేస్తే బాగుంటుందని ఆమె ఆశ. అది తీరని ఆశ. ఆయనకు వ్యాపారంమీద బొత్తిగా చూపు లేదు. పొరుగూరు వచ్చిన వ్యక్తి త్వరగా పనులు ముగించుకుని అవతలకు పోవాలని చూచినట్లుగా వుంటుంది ఆయన వాలకం. జీవితం ఆయన దృష్టిలో ఒక మజిలీ.
తనకున్న సమయాన్ని సరదాగా ఖర్చుపెట్టుకోవటం యెలాగన్నదే ఆయన నిరంతరం ఆలోచిస్తారు. చాప చిరిగిపోయి, శిధిలమైపోయి చదరంత అయిపోయింది. అయినా ఆయనకు ఆ విషయం ఆలోచించవలసిందిగా కన్పించదు.
కళింగదేశంలో ప్రాచీనకాలంనించీ వైశ్యుల యింటి ఆడపడుచుకు పుట్టినింటివాళ్ళే గుడ్డలు కొని యివ్వాలి. బ్రతికినంతకాలమూ అలా యివ్వాలి. తల్లిదండ్రులు తాము పోయాక యీ ఆచారం జరుగుతుందో జరగదో అన్న భయంతో ఒక్కసారే ఆమెకు కొంత ఆస్థి యిచ్చి పంపుతారు. అలాగ వచ్చిన గడ్డనీరు అందివచ్చే చేను యాభై యెకరాలు వుంది ఆమెకు. దానిమీద వచ్చే ఆదాయం అంటుకనే ధైర్యం ఆమె భర్తకు లేదు. యెందుకంటే ఏ ఒక్కరోజూ అతడు ఆమె ముఖం చూచిన పాపాన పోలేదు. పుణ్యాత్ముడు కాబట్టి ఆమె ఆస్థిమీద దాడి చెయ్యకుండా తన డబ్బే ఖర్చుపెట్టుకుంటున్నాడు రాజలదేవి పొలం సంగతి బొత్తిగా పట్టించుకోడు.
రాజలదేవి ఆ పొలంమీద వచ్చే ఆదాయంతో కోబలాంటి యింటి నిర్వహణ చేస్తుంది. మొగుడు యెప్పుడూ పై అంతస్థులో వుంటాడు. ఆమెపైకి వెళ్ళదు. మొగుడు క్రిందికి రాడు. క్రిందికి వచ్చాడంటే పొరుగూరికి ప్రయాణం అయ్యాడని గుర్తు అంతేకాని అయిదు నిమిషాలు కూడా అక్కడ నిలవడు అలా నడుస్తోంది రాజలదేవి సంసార రధం.
