"రో..." అని ఆగి శ్రీచరణ్ వైపు చూసింది. అతని పెదవులు కొంటెగా నవ్వుతున్నాయి.
"ఛీ.....ఛీ.....నోట్లోనుంచి "బూతు తప్ప మరోటి రాదా?" అంటూ తన గదిలోకి వెళ్ళింది.
తనెంత తొందరపడి అంది. తనని ఉడికించడానికి కాకపోతే తనను రెచ్చగొట్టి అలా అనిపిస్తాడా? అతనితో జాగ్రత్తగా వుండాలి అనుకుంది.
"ఇదిగో ... ఇంటి పాల బిల్లు... మర్చిపోవద్దు. మళ్ళీ రేపా వడివేలు వచ్చి నా దగ్గర ఉప్మాతిని, కాఫీ తాగి వెళ్తాడు. అనవసరంగా నాకు అదో బొక్క ఎందుకైనా మంచిది లెక్కచూసి యిచ్చేయ్....ఆనక స్నానం చేసి, బోల్డు మరచిపోయి, బ్లౌజు హుక్కుపెట్టుకునే నెపంతో పైట వదిలేసి, ఎగ్జిబిషన్ పెట్టి, నా మూడ్ డిస్టబ్ చేయొద్దు. ఇప్పుడే చెప్తున్నా...." అంటూ అరిచాడు ప్రనూష గది దగ్గరికి వచ్చి.
ప్రనూషకు వళ్ళు మండిపోయింది.
కానీ, తప్పు తనది. వెంటనే హ్యాండ్ బ్యాగ్ లో నుంచి డబ్బు తీసి, అద్దెకు, పాలకు ఎంతివ్వాలో లెక్కచూసి, తన వాటా డబ్బులు ఓ కవర్లో పెట్టి, బయటకు వచ్చి శ్రీచరణ్ చేతిలో కవర్ పెట్టి....
'ఇక దయచేయండి...." అంది.
"దయచేయక, ఇంతోటి మీ అంతఃపురంలోకి వచ్చి తిష్టవేసే అవసరం మాకేం లేదు. అన్నట్టు ఆ వడివేలుగాడికి బస్సు చార్జీలు కూడా యివ్వాలి. ఇచ్చావా....నొక్కేశావా?" అడిగాడు శ్రీచరణ్.
విసురుగా హ్యాండ్ బ్యాగ్ లో నుంచి పది రూపాయల కాగితం తీసిచ్చి, శ్రీచరణ్ చేతిలో పెట్టి "యిదిగో....మిగిలిన చిల్లరతో బఠాణీలు కొనుక్కో." అంది.
'అబ్బో నువ్విచ్చిన డబ్బుల్తో బఠాణీలు...పుల్లారెడ్డి కాజా ఏం వద్దా? యింతోటి కరెన్సీకి అదొక్కటే తక్కువ...." అంటూ పది రూపాయల నోటు తీసుకుని, అటూ ఇటూ....పరిశీలనగా చూస్తూ....
'ఫర్లేదు యింట్లో అచ్చేసిన దొంగనోటులా లేదులే..." అని తన గదిలోకి వెళ్ళాడు.
ఓ అరగంటసేపు వాన వచ్చి వెలిసినట్లయింది ఆ యింట్లో....
అరగంట తర్వాత....
స్టార్ మూవీస్ లో హర్రర్ మూవీ వస్తుంటే చూస్తున్నాడు శ్రీచరణ్. సడన్ గా అతని నాసికాపుటాలు అమోఘంగా పనిచేయడం మొదలుపెట్టాయి.
ఒక్కసారిగా గుభాళింపు.
మల్లెల వాసన మత్తెక్కిస్తూ నడిచొస్తున్న ఫీలింగ్.
'ఆహా!' అనుకున్నాడు.
ఆ వాసన తన గదిలోకే వస్తున్నట్టనిపించింది. తలెత్తాడు.
ఎదురుగా....ప్రనూష!
తెల్లటి వాయిల్ చీరలో, సింపుల్ గా వున్నా మత్తెక్కించేలా అనిపిస్తోంది శ్రీచరణ్ కు.
"ఎంతందం...ఎంతందం...." అనుకోకుండా ఉండలేకపోయాడు. ఈ అందమైన మనిషి హాయిగా ఏ జీన్సో, మిడ్డీనో వేసుకుంటే ఇంకెంత బావుంటుంది' అని కూడా అనుకున్నాడు.
"ఏంటీ....సరాసరి నా గదిలోకె వచ్చావు. నువ్వు దోచుకుందామనే" అన్నాడు అలాగే చూస్తూ ప్రనూషతో.
"అబ్బా.....నువ్వో అపురూప జగదేకవీరుడివి...దోచుకుందామని వచ్చాను. అయినా నీ దగ్గరేముంది దోచుకోవడానికి పనికిరాని సెకండ్ హ్యాండ్ డొక్కు టీ.వీ. బేవార్స్ గా వచ్చిన సింగిల్ కాట్ మంచం తప్ప....
'అయినా నువ్వు మామూలుదానివా...అలాంటి లాంటి మామూలివి దోచుకుంటావా?
"మరేం ఉందో నీ దగ్గర దోచుకోవడానికి...." వ్యంగ్యంగా అంది ప్రనూష.
'నా శీలం లేదూ.....నా యవ్వనం లేదూ..." అన్నాడు శ్రీచరణ్.
ఒక్క క్షణం అతనేమంటుందీ అర్ధం కాలేదు.
అర్ధమయ్యాక నవ్వాలో, ఏడ్వాలో అర్ధంకాలేదు.
'ఛీ.... ఛీ.....నేను ఎలా కనిపిస్తున్నాను...." అంది ప్రనూష.
'ఏమైనా....అర్ధరాత్రుళ్ళు మగాళ్ళ పడగ్గదుల్లోకి దూసుకువచ్చి, వంటరిగా వున్న మగాడి శీలం దోచుకునే ఢాకూరాణీలా కనిపిస్తున్నావు..." ప్రనూషను మరింత ఏడిపించాలనే అన్నాడు శ్రీచరణ్.
"అలా అవడానికి సిగ్గేయడం లేదా?" అంది ప్రనూష.
"ఓస్....అది నా దగ్గరుంటే, ఒకే ఇంట్లో నీతో పాటు అద్దెకెందుకుంటాను."
"నీతో మాట్లాడటమంత బుద్ది తక్కువ మరోటి లేదు..." కోపంగా అంది ప్రనూష.
'హమ్మయ్య యిప్పటికి ఒక నగ్నసత్యం కనిపెట్టావు..." అన్నాడు శ్రీచరణ్.
ప్రనూషకు వళ్ళు మండిపోతోంది. అయినా తమాయించుకుంది.
శ్రీచరణ్ కు తప్పనిసరిగా ఓ విషయం చెప్పాలి. ఈరోజు మధ్యాహ్నం తన ఆఫీసు అడ్రస్ కు లెటర్ వచ్చింది. అది తన తండ్రి రాశాడు.
తనూ, తల్లీ చెల్లెలు కలిసి ఇక్కడకు వస్తున్నట్టు ఓ వారం రోజుల పాటైనా వుండాల్సి వస్తుందట.
"అదీ విషయం మా నాన్న అమ్మ చెల్లెలు వస్తున్నారు" చెప్పింది కాసేపు వాగ్వివాదానికి విరామం ఇచ్చాక.
"అయితే నన్నేం చేయమంటావు? ఎదురెళ్ళి వాటేసుకుని తీసుకురమ్మంటావా?" అడిగా శ్రీచరణ్.
"నువ్వేం వాటేసుకోవాల్సిన అవసరం లేదు" ఉక్రోషంగా అంది ప్రనూష.
"పోనీ, కౌగిలేసుకోనా? మీ నాన్నయితే ఛీ....యాక్..... మీ అమ్మయితే ఓల్డ్ ఏజ్ బావోదు....మీ చెల్లెలైతే....మాంచి కస్సెక్కేలా వుంటుంది......ఫర్లేదు" అన్నాడు శ్రీచరణ్.
"సిగ్గు లేకపోతే సరి అలా మాట్లాడ్డానికి..."
"సిగ్గా...అదెలా వుంటుంది చెప్మా..."
"ఇదిగో ఈ సెటైరే వద్దు....రేపు మీ బామ్మవస్తే, నేనూ అలానే చేస్తా..." బెదిరిస్తూ అంది.
గతుక్కుమన్నాడు శ్రీచరణ్. అన్నంతపనీ చేసేయగలదు. వ్యవహారం శృతిమించకముందే జాగ్రత్తపడాలి.
"సర్లే.... మీ అమ్మనీ, నాన్ననీ, రిసీవ్ చేసుకోవాలి. అంతేగా..."
"అంతేకాదు కొన్నాళ్ళు....అంటే వాళ్లున్నంత కాలం డబుల్ బెడ్ రూమ్, డబుల్ కిచెన్ రూమ్ నాటకావనికి తెరవేయాలి.
"హమ్మో....సింగిల్ బెడ్ రూమ్ లో నీ పక్కన....వాటెజోక్ మై శీలం..." అన్నాడు శ్రీచరణ్.
