"అన్నయ్యా! నీకు అంత డబ్బులొస్తే మన ఇల్లును వూడ్చడానికి ఇద్దరు పనిమనుషులను పెట్టుకోవాలి. ఎప్పుడూ మన ఇల్లు అద్దంలా వుండాలి" అంది ఆమె.
"అలానే అదెంత పని చిటికెలో నెరవేరుస్తాను."
"అంతే కాదు, ఇంట్లో వాళ్ళు బయటకు కనపడకుండా డోర్ లకు కర్టెన్లు వుండాలి. మంచి క్వాలిటీవి తీసుకుందాం."
వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ వుండగానే ఆంజనేయులు భోజనం ముగించుకుని బయటకు వచ్చాడు. మంచం మీద కూర్చున్నాడు.
అప్పటికే నాగరాజు గుర్రు పెడుతున్నాడు. ఆరోజు వాడి అభిమాన హీరో సినిమా రిలీజైంది. మార్నింగ్ షో, మ్యాట్నీ వరుసగా చూసి వచ్చాడు.
శీనయ్య దగ్గుతో కుస్తీ పడుతూన్నాడు.
కాంతం వంటిల్లును సర్దుతూ వుంది.
ప్రభావతి గోడకు ఆనుకుని కూర్చుని వుంది. ఆమె ఈ లోకంలో లేనట్టు కళ్ళు ఎక్కడో చూస్తున్నాయి.
ఆంజనేయులు పడుకున్నాడుగానీ నిద్ర రావడంలేదు. ఏవేవో ఆలోచనలు మెదడులో అడ్డదిడ్డంగా పరుచుకుంటున్నాయి.
అలా దొర్లుతున్నాడు.
"అమ్మా...... అక్కో..... అయ్యా....." ఒక్కసారిగా ప్రభావతి అరవడం మొదలుపెట్టింది.
ఆంజనేయులు ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు.
కాంతం పరుగున కూతురి దగ్గరకు చేరుకుంది.
"ఏమైందే..... చెప్పమ్మా....."
ప్రభావతి ఆమె వైపు చూడడంలేదు. మరో లోకంలోకి చూస్తున్నట్టు తల పైకెత్తుకుని వుంది.
"అయ్యో....నన్ను చంపేస్తున్నారు..... ఒక్కరు కాదు, ఇద్దరుకాదు..... వందలమంది.... నాపైన పడుతున్నారు.... అయ్యో! రక్షించండి... చచ్చిపోతున్నాను..."
కాంతం, శారద ఆమెకు చెరోవైపు కూర్చుని పిలుస్తున్నారు.
కానీ ఆమెకు ఏమీ వినపడడంలేదు.
"అదిగో అటు చూడండి. తలుపులు వాటంతటవే తెరుచుకుంటున్నాయి. పాములు నాగు పాములు ...పడగలు విప్పి .....నిటారుగా నిలబడి నావైపే చూస్తున్నాయి. కాటువేస్తున్నాయి. అయ్యో చచ్చిపోతున్నాను. మీకు కనిపించడం లేదా కర్రలు పొడవుగా లావుగా కర్రలు వాటిని ఎత్తుకొస్తుంది ఎవరు. అమ్మా నన్ను రక్షించమ్మా."
ప్రభా నిద్రలో కలవరిస్తున్నట్టు మాట్లాడుతూనే వుంది. చుట్టూ చేరిన వాళ్ళకు ఏం చేయాలో పాలుపోవడం లేదు.
కాంతం, శారద ఆమెను కుదుపుతున్నారు గానీ ఫలితం లేకపోతోంది.
"ఒరేయ్! పెద్దోడా.....ఇది దెయ్యమేరా వెళ్ళి భూతలింగాన్ని పిలుచుకు రారా" అని కాంతం ఆంజనేయుల్ని చూసి ఏడుస్తోంది.
అతను మరోమాట మాట్లాడకుండ అక్కడినుంచి లేచాడు.
"ఇదేం దెయ్యమో- మా పిచ్చితల్లిని పట్టుకుని ఏడిపిస్తోంది. ఎప్పుడు ఎవరికి అపకారం చేశామో బంగారంలాంటి బిడ్డకు ఈ దెయ్యం పట్టుకుంది. స్వామీ ఆంజనేయులు తాతా... నీ గుడికి వస్తాం తండ్రీ.... నా బిడ్డను కాపాడవయ్యా....."
వెళుతున్న ఆంజనేయులుకు పిన్ని పెడుతున్న శోకాలు విన్పిస్తున్నాయి.
రోడ్డు మలుపు తిరిగాడు.
గత రెండేళ్ళనుంచీ ప్రభావతికి ఈ జబ్బో, ఈ దెయ్యమో పట్టుకుంది పదీ పదిహేను రోజులకోసారి ఇలా కలవరిస్తుంది. అప్పుడు మనిషి మన స్వాధీనంలో వుండదు. పిచ్చిపిచ్చిగా కలవరిస్తుంది. ఏడుస్తుంది. తనను ఎవరో కర్రలతో కొడుతూ చంపేస్తున్నారని, పాములు కాటువేస్తున్నాయనీ అంటుంది. అరుస్తుంది. భయపడిపోతుంది.
ఇది జబ్బు కాదనీ, ఖచ్చితంగా మోహినీ పిశాచి పట్టుకుందని భూతలింగం చెప్పాడు. ఆయన పక్కవూర్లో భూతవైద్యుడు, దెయ్యాలు, పిచాచాలను వెళ్ళగొట్టడంలో ఆయనకు మంచి పేరుంది. ఆయన ప్రభావతిని చూసి 'మోహినీ పిశాచి' పట్టుకుందని, వెళ్ళగొట్టడం కష్టమైనా తనకు అది చివరకు లొంగుతుందని అన్నాడు.
ప్రభావతి ఇలా ప్రవర్తించినప్పుడల్లా ఆయన రావడం, ఏవేవో మంత్రాలు చదవడం, క్షుద్రపూజలు చేయడం, తాయెత్తులు కట్టడం చేస్తూనే వున్నాడు. కానీ ఆమెను మోహినీ పిశాచి వదలడంలేదు.
భూతలింగం వైద్యంవల్ల ప్రయోజనం లేకపోవంతో ఆంజనేయులు తన చెల్లెలి జబ్బు గురించి వినయ్ కు చెప్పాడు.
అంతా విన్నాక వినయ్ అడిగాడు "ఆమెకు పెళ్ళి కాలేదా?" అని.
లేదన్నట్టు ఆంజనేయులు తల అడ్డంగా తిప్పాడు.
"అయితే ఇది దెయ్యం కాదూ, భూతమూకాదు. ఇదో మానసికమైన జబ్బు. ష్కీజోఫీనియా అని అంటారు. అంటే ఇల్యూషన్స్ అన్న మాట ఏవేవో వూహించుకుని భయపడడం, భ్రమలను నిజం అనుకోవడం. దీనికి మందు ఆమెకు పెళ్ళిచేయడమే. కర్రలు కనపడడం, తలుపులు వాటంతటవే తెరుచుకోవడం, పాములు కనపడడం- ఇవన్నీ సెక్చువల్ డిజైర్ ను తెలియజేస్తాయి. ఇవన్నీ నేను చెప్పేవి కావు - ఫ్రాయిడ్ అనే ఆయన తన పుస్తకాల్లో ఇవన్నీ రాశాడు. కలల మీద కూడా ఆయన చాలా పరిశోధనలు చేశాడు. మీకో కేసు స్టడీ గురించి చెబుతాను' అని వినయ్ ప్రారంభించాడు.
"ఇది జర్మనీలో జరిగింది. ఓ అమ్మాయి వుండేది. డాబా మీద ఆమె బెడ్ రూమ్ అవివాహిత. ఆమె బెడ్ రూమ్ కెదురుగ్గా ఆమె తల్లి దండ్రుల బెడ్ రూమ్ ఇక ఆమె పడుకోవడం చాలా వింతగా వుండేది. పరుపులోని దూదినంతా ఒక పక్కకు తోసేసేది అంటే పక్కన మరో వ్యక్తి పడుకున్నట్టు దూది వుండేదన్నమాట. ఎదురుగ్గా టేబుల్ మీద చిన్న టైమ్ పీస్ వుంచుకునేది. ఎదురుగ్గావున్న తల్లిదండ్రుల బెడ్ రూమ్ తలుపులు తెరుచుకునే వుండాలి. ఇవన్నీ ఇలా అమరకపోతే ఆమె నిద్రపోయేది కాదు వీటిల్లో ఏ ఒక్కటీ డిస్టర్బ్ అయినా లేచి కూర్చునేది.
"భలే విచిత్రంగా వుంది. ఇంతకీ ఎందుకిలా ప్రవర్తించేది!" అని ఆంజనేయులు అడిగాడు.
"ఆమె గురించి మొత్తం స్టడీ చేశాక ఆమె ఎందుకలా ప్రవర్తిస్తుందో సైకాలజిస్టులు చెప్పగలిగారు. ఆమె పరుపులోని దూదినంతా ఒక పక్కకు తోసెయ్యడానికి కారణం ఆమెకి ఓ తోడు కావాలి. దూదినంతా పక్కకు జరిపేయడం వల్ల పక్కన ఎవరో వున్నట్టు ఆమె భ్రమపడేది. ఎదురుగ్గా వున్న టైమ్ పీస్ చేసే శబ్దం ఆమె మెన్ స్ట్రేషన్ సైకిల్ కు ప్రతీక. ఇది ఆగి పోకూడదు. ఆగిపోతే తనకు గర్భం వచ్చినట్టు భయం. లెక్క ప్రకారం విన్పించే గడియారపు శబ్దం దీనిని తెలియజేస్తుంది. ఇక అదే సమయంలో తన తల్లిదండ్రులు సెక్సువల్ యాక్టులో పాల్గొనకూడదు. అంటే వాళ్ళ బెడ్ రూమ్ తలుపులు తెరుచుకునే వుండాలి. ఆమె ప్రవర్తన వెనుక ఇంత కథ వుందన్నమాట"
