Previous Page Next Page 
ప్రేమించండి ప్లీజ్ పేజి 13


    ఓరోజు యధాప్రకారం కాలేజీ నుంచి ఇంటికొచ్చాడు. పశువులకు మేత వేసి చిన్నా చితకా పనులు పూర్తిచేశాడు. భోజనం తిని పడుకున్నాడు. అలిసిపోయిన శరీరం నిద్రను ఆశ్రయించింది.
    ఓ వేళప్పుడు గజ్జి ఎక్కువై మెలకువ వచ్చింది. చేతులనిండా గజ్జి. ఆ ఇంట్లో ఎప్పుడూ ఎవరో ఒకరికి గజ్జి వుండేది. గజ్జీ ఆ ఇంట్లోంచి ఎప్పటికీ వెళ్ళని అతిధి పర్మనెంట్ గెస్ట్.
    నిద్రలేచి నవ్వులతో మెలితిరిగిపోతున్న చేతుల్ని ఇష్టప్రకారం నలిపేసుకుంటున్నాడు ఆంజనేయులు. సరిగ్గా అప్పుడే ఇంటి వెనక నుంచి ఎవరో చిన్నగా మాట్లాడుకుంటున్నట్లు గుసగుసలు వినిపించాయి.
    చెవులను అటుకేసి నిలబెట్టాడు.
    "ఎయ్ చిన్నగా రవిక చినిగిపోతుంది."
    గొంతునుబట్టి ఆమె తన పిన్ని అని గుర్తుపట్టాడు. వెంటనే తండ్రి వైపు చూశాడు శీనయ్య పడుకుని నిద్రపోతున్నాడు.
    గుండెల్లో ఏదో తెలియని అలజడి ప్రారంభమై రక్తాన్నంతా గిలకొడుతోంది.
    పల్లెంతా చీకటి ముసుగును కప్పుకుని గుర్రుపెడుతోంది.
    "ఎన్ని రోజులైందో! ఎందుకు ఈ మధ్య రావడంలేదు. పిలిచినప్పుడంతా బెట్టు చేస్తున్నావ్. పొగరెక్కినట్టుంది."
    చిన్నగా నవ్వులు.
    ఆ గొంతుమగాడిది. తండ్రి కాకపోతే మరెవరు?
    ఆంజనేయులకు చెమటలుపట్టాయి. జరగకూడనిది జరిగిపోతున్నట్టు వళ్ళంతా అదురుతోంది.
    "ఏదీ వీలు చిక్కద్దా తెల్లారి లేచింది మొదలు పనితోనే సరిపోతుంది. నేనేమైనా గొప్పింటి ఆడదాన్నా సాయంకాలమైతే పడకలమీదకు సిద్దమైపోవడానికి గంపెడంత సంసారం. చాకిరీచేసి వంటింట్లోంచి లేస్తే ఎక్కడుంటుందో నిద్ర మీదొచ్చి పైన పడిపోతుంది దబ్బున మీలాగా"
    సన్నటి నవ్వు.
    ఆంజనేయులు మెల్లగా లేచాడు. ఇంటి చుట్టూ తిరిగి వెళ్ళాడు .
    గడ్డివాము మొదట్లో రెండు ఆకారాలు పెనుగులాడుతున్నాయి.
    అడుగు ముందుకు పడలేదు.
    "అవునుగానీ ఈ సారి మేం పదిగుంటల కయ్యలో పైరు పెట్టాలనుకుంటున్నాం. మొన్నొచ్చిన వడ్లు అయిపోయాయి. మీ మిషన్ నీళ్ళు వదిలితే నారు పోయాలంటున్నాడు మా ఆయన. ఏమంటావ్?" ఆమె అడిగింది.
    "అలాగేలేవే ఇప్పుడా ఆ గొడవ? ఎప్పుడైనా నీళ్ళు వదలనని అన్నానా!"
    ఆగొంతు గుర్తుపట్టాడు ఆంజనేయులు. అతను నారాయణ. వూర్లోకంతా పెద్ద రైతు. వయసు నలభైదాకా వుంటుంది.
    తన పిన్ని ఆయనతో గడపడం ఇష్టంలేక గట్టిగా కళ్ళు మూసుకున్నాడు ఆంజనేయులు, కానీ క్షణం కన్నా ఎక్కువసేపు అలా వుండలేకపోయాడు.
    కళ్ళు తెరిచాడు.
    ఆరెండు ఆకారాలు నేల మీదకు ఒరిగాయి.
    అతనికి ఎందుకో భోరున ఏడ్వాలనిపించింది. కానీ ఏడుపు రావడంలేదు.
    ఇక అక్కడ వుండలేక తిరిగి వెళ్ళిపోవడానికి వెనక్కు తిరిగాడు.
    ఎదురుగ్గా తండ్రి శీనయ్య.
    ఇక పిన్ని పని అయిపోయిందనుకున్నాడు. పిన్నిని తండ్రి చంపేస్తాడనిపించి వద్దు నాన్నా, అని చెప్పడానికి దగ్గరకు పరుగెత్తాడు.
    తండ్రిని కౌగలించుకున్నాడు. అంతవరకు ఎక్కడ దాక్కుందో ఏమోగానీ ఏడుపు కట్టలు తెంచుకుంది.
    శీనయ్య కంగారుగా అతన్ని లాక్కుని ఇవతలకు వచ్చాడు. మంచం వైపుకు తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు.
    ఆంజనేయులు అలా ఏడుస్తూనే వున్నాడు.
    శీనయ్య నింపాదిగా చుట్ట వెలిగించుకున్నాడు. కొడుకు కాస్త స్థిమిత పడ్డాడని అనిపించాక ఆయన చెప్పాడు. "ఆమె మీ పిన్ని అని, ఎంతో పాపం చేస్తొందని నీమనసు తట్టుకోలేకపోతోంది. ఆమె రాక్షసి అని కూడా అనిపిస్తూ వుండచ్చు. నేను ఆమెను నరికేస్తాననో, చావ కొడతాననో కూడా నువ్వు అనుకోవచ్చు. ఇలాంటివి కొడుకుకు చెప్పాల్సి రావడం బాధాకరమైనా కొన్ని సత్యాలు చెప్పక తప్పదు."
    శీనయ్య చుట్టను ఓ సారి పీల్చి మళ్ళీ ప్రారంభించాడు.
    "మనలాంటి కూటికి లేనోళ్ళ బతుకులు ఇలానే వుంటాయి. మనం బతికే బతుకు మనదికాదు. మనం మాట్లాడే మాటలు మనవి కావు. అదిగో మీ పిన్ని పక్కన పడుకున్న నారాయణ చౌదరి లాంటి వాళ్ళవి. మనం చదువుకోవాలో వద్దో వాళ్ళే నిర్ణయిస్తారు. నువు  ఏం బట్టలు కట్టుకోవాలో, ఎప్పుడు ఏడ్వాలో చెబుతారు. కడకు నీ కొడుకులు, కూతుర్లు పేర్లు కూడా నిర్ణయిస్తారు. మా అబ్బాయికి సతీష్ అని పేరుపెట్టావని నీవు చెప్పగానే 'నీ కొడుకెందుకురా ఆపేరు. వాడేం ఉద్యోగం చేస్తాడా, ఊళ్లేలుతాడా అని వెటకారం చేస్తారు. నువు వెళుతున్నప్పుడు వెనక నుంచి సూటి పోటీ మాటల్తో బాధపెడతారు. నువు చేసే కష్టానికి ధర ఎంతో నిర్ణయిస్తున్న వాళ్ళకి ఇదంతా పెద్ద పనికాదు మన చెల్లెళ్ళు, భార్యల శీలం కూడా వాళ్ళ దయాదాక్షిణ్యాలమీద ఆధారపడి వుంటుంది."
    శీనయ్య వుమ్మి వూసి గొంతు సవరించుకున్నాడు.
    "అలాంటి వాళ్ళలో ఒకడు నారాయణచౌదరి. మనం ఎదురు తిరిగితే-అతని సంతోషానికి మీ పిన్ని అడ్డుచెబితే- వాడు పిలిచినప్పుడు మహాంకాళిలా మీదపడితే - వాడు కొట్టడు, తిట్టడు. కీలెరిగి వాతపెడతాడు. మన పది గెంటల కయ్యకి నీళ్ళొదలడు కడకు చెరువు నీళ్ళు కూడా వాడి పొలాలనుంచి రానివ్వడు. పోలిసోడో, ప్రభుత్వం ఓడో మనకు సపోర్టు రారు. వాళ్ళు కూడా వాళ్ళ మనుషులే. దీంతో మన పొలం పండదు. మనందరం పస్తులతో మాడి చస్తాం. అందుకే మీ పిన్నికి ఇష్టం లేకపోయినా వాడి కోరిక తీరుస్తుంది. అది నీకోసం తప్పుచేస్తోంది. కన్న వాళ్ళకోసం అంత తిండి వేయడానికి తప్పు చేస్తోంది."
    ఆయన కళ్ళల్లోని చెమ్మ అంత చీకట్లోనూ స్పష్టంగా తెలుస్తుంది ఆంజనేయులకు.
    "వెళ్ళి పడుకో. మనలాంటివాళ్ళకు ఇష్టాఇష్టాలు వుండకూడదు. మనకు విలువైంది మనం కాదు- పరువుకాదు- ప్రతిష్టకాదు- గౌరవంకాదు- మనకు అత్యంత విలువైంది ప్రాణం అది నిలబడడానికి మనం దేనికైనా సిద్దపడాలి..... వెళ్ళు...... నిద్రపో."
    ఆంజనేయులు గెనంమీద జారి తూలిపడబోయి నిలదొక్కుకున్నాడు.
    గతమంతా చెదిరింది తిరిగి ఈ లోకంలోకి వచ్చాడు.
    ఇదంతా గుర్తొస్తుందనే అతను ఆ పొలం దగ్గరికి రాడు.
    వడివడిగా అక్కడి నుంచి అడుగులువేశాడు ఇల్లు చేరుకున్నాడు.
    అప్పటికే నాగరాజు, రామ్మూర్తి ఇంటికొచ్చేశారు.
    "శారదా కొన్ని రోజులు ఆగు. ఆతరువాత మన జాతకాలు మారిపోతాయి. నన్ను టిటిడి బోర్డు నెంబరుగా వేస్తానంటున్నాడు సుధాకర్ నాయుడు. ఆ పోస్టు వస్తేనా నా సామి రంగా..నీకు మంచి మంచి చీరలు కొనిస్తాను అక్కకు పెళ్ళి చేస్తాను. మన నాన్నను మదనపల్లి శానిటోరియంలో చేర్పిస్తాను" రామ్మూర్తి ఉత్సాహంగా చెబుతుంటే శారద శ్రద్దగా వింటోంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS