Previous Page Next Page 
ప్రేమించండి ప్లీజ్ పేజి 15


    ఆంజనేయులు మొత్తం విని షాక్ తిన్నాడు. మనిషి ప్రవర్తన మీద అతని కోర్కెల ప్రభావం ఎంతుంటుందో తెలిసింది.
    "కలలన్నీ కూడా ఇంతే. ఎక్కడో మన మనసు లోపలి పొరల్లో నిక్షిప్తమైన కోర్కెల ప్రతిరూపమన్న మాట కలలు. మరో తమాషా విషయం చెప్పనా. ఆడపిల్ల కలల్లో ఎప్పుడూ ప్రియుడు తప్ప మరో పురుషుడు రాడు. కానీ మగపిల్లల విషయంలో దీనికి పూర్తి డిఫరెంట్. ప్రేయసి తప్ప మిగిలిన అమ్మాయిలంతా వస్తారు. వాళ్ళతో సంభోగించినట్టు, ముద్దులాడినట్టు కలలుగంటారు.
    ఆంజనేయులుకు ఇప్పుడు అదంతా గుర్తొచ్చింది. వినయ్ చెప్పిన వన్నీ నిజాలే. తన చెల్లెలుకు ముందు పెళ్ళి కావాలి. ఇరవై ఎనిమిదేళ్ళు వచ్చినా ఇంకా పురుష స్పర్శ ఎరుగదు. నాలుగురోజులు భోజనం తినకుంటే మనిషి స్వాధీనంలో వుండగలదా? అలానే ఇదీ.
    కానీ ఇది తను ఒప్పుకోడు ఒప్పుకుంటే వెంటనే చెల్లెలకు పెళ్ళి చేయాలి ఎలా చేస్తాడు తను? పూట గడవడమే కష్టమైన తాను పెళ్ళి చేయగలడా? ఇంపాజిబుల్. అందుకే తనకు ప్రభావతి జబ్బేమిటో తెలిసినా తెలియనట్టు నటిస్తాడు ఇంట్లోవాళ్ళు మోహినీ పిశాచంటే తల వూపుతాడు. భూతలింగం మంత్రాలు చదువుతుంటే మౌనంగా పరీక్షిస్తాడు తన అశక్తతను దాచుకోవడానికి తానూ దెయ్యంమీద నెపం నెట్టేస్తున్నాడు.
    గెనం మీదనుంచి పాదం జారటంతో పడబోయి నిలదొక్కుకున్నాడు. ఆలోచనలు చెదిరాయి.
    దూరంగా భూతలింగం వూరు కనిపిస్తోంది. చీకటి ముగ్గుమీద పెట్టిన వేపపూతలాగా దీపాలు.
    ఇప్పుడెళ్ళి భూతలింగాన్ని లేపాలి. అతను తనను చూస్తూనే 'మళ్ళీ దెయ్యం వచ్చిందా?' అని అడుగుతాడు. అది అబద్దమని ఇద్దరికీ తెలుసు. అతను కడుపు నింపుకోవడానికి అబద్దమాడుతాడు. తను కడుపు కొత్త భరించలేక అబద్దం చెబుతాడు. నిజానికి ఇద్దరిదీ కడుపుకు సంబంధించినదే.
    ఆంజనేయులు వూరు సమీపించాడు.
    మనిషి అలికిడి అప్పుడే కనిపెట్టినట్టున్నాయి. రెండు మూడు కుక్కలు మొరుగుతున్నాయి.
    వాటికి దూరంగా జరుగుతూ నడవడం మొదలు పెట్టాడు.
    భూతలింగం ఇంటి దగ్గరకు చేరుకున్నాడు.
    "భూతలింగం - భూతలింగం-"
    తలుపు తెరుచుకుంది.
    "ఎవరూ?"
    "నేను.....ఆంజనేయుల్ని."
    "నువ్వా. మళ్ళీ దెయ్యమా?"
    "ఆఁ"
    "వస్తున్నా."
    భూతలింగం ఇంట్లోకి వెళ్ళి వచ్చాడు. చేతిలో ఓ సంచి వుంది.
    "పద"
    సారాయి వాసన ఒక్కసారి చుట్టూ పరుచుకుంది.
    ఆంజనేయులు ముక్కను ఓసారి రాపాడించుకున్నాడు.
    ఇద్దరూ నడుస్తున్నారు.
    దారిలో భూతలింగం వేపమండల్ని పెరికి చేతిలో పెట్టుకున్నాడు.
    ఇంటికి చేరుకున్నాడు.
    ప్రభావతి ఇంకా స్వాధీనంలోకి రాలేదు. అవే మాటల్ని, అవే భయాల్ని వ్యక్తపరుస్తోంది.
    కాంతం భూతలింగాన్ని చూస్తూనే ఎదురొచ్చింది. రెండు చేతుల తోనూ నమస్కరించింది.
    "ఆ మాయదారి దెయ్యం మళ్ళీ వచ్చింది నా బిడ్డను పీక్కుతింటోంది" అంది ఏడుపు మధ్య.
    అర్ధమైనట్టు ఆయన నవ్వాడు.
    "ఈ మోహినీ పిశాచీ స్పెషల్ టైప్. పట్టిందంటే ఓ పట్టాన వదలదు. కానీ నా దగ్గర దాని ఆటలు సాగవు" అని ఇంటిలోపలి కెళ్ళాడు.
    ఇంటి మధ్యలో కూర్చున్నాడు. భుజంమీదున్న ఎర్రటి టవల్ ను నడుముకు కట్టుకున్నాడు. వీభూదిని తీసుకుని ముఖం నిండా పూసుకున్నాడు. నుదుటను పెద్ద కుంకుమబొట్టు పెట్టుకున్నాడు.
    మూలాన వెలుగుతున్న కిరోసిన్ దీపపు కాంతిలో ఆయన భయంకరంగా కన్పిస్తున్నాడు.
    "దానిని ఇలా లాక్కురండి" అని హూంకరించాడు. పూజ ప్రారంభం కాగానే ఆయనకు దెయ్యం తప్ప మనుషులు కనిపించరట. అందుకే ఆయన ప్రభావతిని పేరుతో కాక దెయ్యంలాగానే పిలిచాడు.
    ప్రభావతిని కాంతం, శారద చెరోపక్క పట్టుకున్నారు.
    ఆమె లోనికి రానని మొరాయిస్తోంది. శక్తినంతా కూడ దీసుకుని ప్రతిఘటిస్తోంది. కాళ్ళతో, చేతులతో తోసెయ్యడానికి ప్రయత్నిస్తోంది.
    "డానికి నన్ను చూస్తూనే భయం. దాన్ని ఈరోజు వూరికే వదలను. జుట్టుకోసేస్తాను రక్తం కక్కిస్తాను నా తడాఖా చూపిస్తాను" భూతలింగం మోహినీ పిశాచీనే డైరెక్టుగా హెచ్చరిస్తున్నాడు.
    కాంతం, శారద లాగడంతో ప్రభావతి జుట్టు ముడి వీడింది. ఎర్రటిబొట్టు చెమటలో తఃదిసి నుదుటి నుంచి నెత్తురు కారుతున్నట్టుంది కళ్ళు తుఫానులో పెట్టిన దీపాల్లాగా అల్లల్లాడుతున్నాయి.
    ఆమెను బలవంతంగా భూతలింగం ముందు కూర్చోబెట్టారు. అప్పటికే ఆమెను నిస్సత్తువ కమ్మేసింది. రెప్పలు మూతలు పడుతున్నాయి. అయితే తలమాత్రం వూగుతోంది.
    భూతలింగం సాంబ్రాణి పొగ వేశాడు. చుట్టూ వున్న వాళ్ళు ఒక్కసారిగా ఉక్కిరి బిక్కిరయ్యారు.
    ఆయన ఏవో మంత్రాలు చదువుతూ మధ్య మధ్యలో సాంబ్రాణి వేస్తున్నాడు. అప్పుడు పొగ పైకిలేచి ఇల్లంతా బూజు పట్టినట్టు పరుచుకుంటోంది.
    ప్రభావతికి ఏమైందో తెలియడంలేదు గానీ మెల్లగా మూలగడం ప్రారంభించింది. దాంతో భూతలింగం మరింత బిగ్గరగా మంత్రాలు ఉచ్చరిస్తున్నాడు.
    "పోతే వగలమారీ, దూరంగా పారిపోతే పాతాళభైరవీ - వెళ్ళు...... వెళ్ళకపోతే నీకు బడితపూజే గతి" అని పక్కన పెట్టుకున్న వేప మండల కట్టను తీసుకుని ఝుళిపించాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS