Previous Page Next Page 
స్వర్గంలో ఖైదీలు పేజి 13


    "నోనో......నువ్వు చెప్పేది నా కూతురికి వర్తించదు. అది నా కంటే నిన్ను ఎక్కువగా ఎప్పటికీ భావించదు. వర్షా..... చెప్పు......నేను కాదంటే కూడా అతనితో ఈ గడపదాటి వెళ్తావా? మీ అమ్మని శాశ్వతంగా వదులుకుంటావా? చెప్పమ్మా?.....చెప్పుతల్లీ!" కన్నీటితో అడిగింది.
    "చెప్పు వర్షా......నన్ను వదిలేసుకోవడానికి రెడీగా ఉన్నావా? నన్ను ప్రేమించడం లేదా?" సంజయ్ అడిగాడు.
    వర్ష ఇద్దరిలో ఏ ఒక్కరికీ ఔననీ, కాదని చెప్పలేక భోరుమని ఏడుస్తూ క్రింద కూలబడిపోయింది. ఇంత విషమపరీక్ష వస్తుందని ఆమె ఊహించనేలేదు! ఒకవైపు ప్రియమైన తల్లీ......ఇంకొక వైపు ప్రాణంతో సమానమైన ప్రియుడూ!
    "తల్లీ.......ఏడవకమ్మా!" విద్యకూతుర్ని దగ్గరికి తీసుకుంది.
    "మీ పట్టుదల వల్ల మీ అమ్మాయిని ఎంత బాధపెడ్తున్నారో చూడండి ఆంటీ! ఇంకొక్కసారి కూల్ గా ఆలోచించండి" అన్నాడు సంజయ్.
    "యూగెట్ అవుట్ ఫస్ట్!" వాకిటి వైపు వేలుపెట్టిచూపిస్తూ అరిచింది విద్య.
    "వర్షా.....నీ నిర్ణయం కూడా అదే అయితే నేను వెళ్ళిపోతాను" చెప్పాడు సంజయ్.
    వర్ష కన్నీళ్ళతో అతనివైపు బాధగా చూసింది.
    "నీనోటితో ఒక్కమాటచెప్పు....... నన్ను వదులుకోవడానికి నువ్వు సిద్దంగా ఉన్నావా?" అడిగాడు.
    "నామాట కాదని నీతోవస్తుందనే వెర్రి ఊహలు పెట్టుకోకు!" కోపంగా అంది విద్య.
    "ఇంతజరిగినా నువ్వు పెదవివిప్పి ఒక్కమాట మాట్లాడలేదు. అంటే నన్ను అవమానించడం నీకూ ఇష్టమేనని భావించాల్సొస్తుంది!" పరుషంగా అన్నాడు.
    వర్షతల అడ్డంగా ఊపింది. కానీ దుఃఖం తప్పమాట బైటికి రాలేదు!
    "ఇంకా ఏం చెప్పాలి? వెళ్ళి ఆలోచించుకొని నీ నిర్ణయం మార్చుకుంటే నాకు ఫోన్ చెయ్యి" అంది కఠినంగా విద్య.
    "నో.......నేను ఇల్లరికం ఉండడంజరగని పని! వర్షా నీ నిర్ణయం ఏమిటో ఫోన్ చేసిచెప్పు.....బై!" అతను విసురుగా అనేసి దూకుడుగా వెళ్ళిపోయాడు.
    వర్షకి తన దేహంలోంచి ఎవరో లాఘవంగా గుండెని వేరుచేసి పట్టుకుపోతున్నట్లుగా అనిపించింది.
    'సంజయ్' అన్న పదం గుండెల్లోంచి తన్ను కొచ్చినా కన్నీళ్ళతో తననిచూస్తున్న తల్లిని చూడగానే పెదవుల మధ్యనే ఆగిపోయింది! తల్లిభుజం మీద వాలిపోయింది.
    విద్య కూతురి వీపు నిముర్తూ "బాధపడకు తల్లీ......నిజంగా నీమీద ప్రేమున్నవాడైతే వెంటనే తిరిగొస్తాడు!" అంది.
    తల్లి ఏం చెప్పినా నమ్మే వర్ష 'నిజంగా వస్తాడా' అన్నట్లు చూసింది. కానీ క్రిందటి రోజు రాత్రి తల్లికి ఇచ్చినమాట ప్రకారం ఆమె నిర్ణయాన్ని తల్లి మీదే వదలి ఆ భారాన్ని గుండె పగిలేటట్లు మోస్తూ కూర్చుంది.
    ఆ రాత్రి ఫోన్ మోగినప్పుడల్లా అతనేనేమోనని వర్ష మనసు కొట్టుకుంది! కానీ కాదు..... ఎంత నిర్ధయుడు!
    తనని తృణప్రాయం వదులుకుని వెళ్ళిపోయాడు! తనింత నరకం అనుభవిస్తుంటే, అతనికి చీమకుట్టినట్లు కూడా లేదా? నిన్న సాయంత్రం తనులేకుండా బ్రతకలేనన్నట్లు మాట్లాడాడు. ఇప్పుడు ఎలా బ్రతుకుదామనుకుంటున్నాడు.
    అతని అభిమానం తనపట్ల ఉన్న అనురాగం కన్నా గొప్పదా? ఎన్ని ఆశలు కల్పించాడూ? ఇప్పుడెలా......మొన్నటివరకూ ఏమోకానీ రేపటినుండీ అతని తలుపులు లేకుండా, అతన్ని చూడకుండా ఎలా ఉండడం?
    వర్షకి ఎటుచూసినా సంజయ్ వచ్చి చిరునవ్వుతో చేతులు జాపినట్లుగా, ఏ అలికిడి అయినా అతనువస్తున్నట్లూ భ్రమ కలుగుతోంది.
    అర్ధరాత్రి దాటుతోంది. అతను ఫోన్ చెయ్యలేదు. ఇంక మనసు నిలుపుకోవడం ఆమెకి కష్టం అయిపోయింది. నెమ్మదిగా లేచిమునివేళ్ళమీద నడుస్తూ వెళ్ళి తల్లి గదిలోకి తొంగిచూసింది! విద్య నిద్రపోతోంది.
    ఆమె అడుగుల శబ్దం కాకుండా జాగ్రత్తపడ్తూ ఫోన్ వైపు నడిచింది. ఆమె ఓ సారి కళ్ళు మూసుకుని సంజయ్ తో ఏం మాట్లాడాలో ఆలోచించుకుంది. 'నీకు నాకన్నా నీ అహమే ఎక్కువా? నువ్వు లేకుండా నేను ఎలా బ్రతకనూ? మీ ఇద్దరూ నాకు కావలసినవారు, ఒకర్ని వదులుకోవలన్న నిబంధనే పెడ్తేనేను చచ్చిపోతాను!' అనుకుని ఆమె ఫోన్ వైపు చెయ్యిజాపింది.
    కానీ ఆమె తీసేలోపే అది గణగణమని మోగింది!
    ఆమె గుండె ఒక్క క్షణం లయతప్పింది. గభాల్నఅందుకుని 'హలో' అంది.
    "వర్షా.....ఐ లవ్ యూ!" సంజయ్ అన్న మొదటి మాట అది.
    "సంజయ్.....ఐటూ!" వర్ష ఏడ్చేసింది.
    "అయితే నా మాట విను. వెంటనే బైటికిరా.....నేను బైక్ మీద వస్తాను. ఇద్దరం వెళ్ళిపోయి పెళ్ళి చేసుకుందాం. కమాన్ క్విక్...." అతను తొందర తొందరగా చెప్పాడు.
    "కానీ సంజయ్....." ఆమె మాటపూర్తిచేసేలోగానే" నువ్వు వస్తున్నావు.....అంతే!" అతను ఫోన్ పెట్టేశాడు.
    వర్షకి ఏం చెయ్యాలో పాలుపోలేదు. కిటికీ తెర తొలగించిచూసింది. సంజయ్ మోటార్ సైకిల్ లైట్ వీధి మొదలులో కనబడింది! అప్రయత్నంగా అనాలోచితంగా బైటికివెళ్ళింది.
    సంజయ్ మోటార్ సైకిల్ స్టాండ్ వేసి హడావుడి గా గేటు తెరుచుకొని వస్తూ, ఎదురుగా వస్తున్న వర్షని ఢీ కొట్టాడు. మరుక్షణం ఆమెని గాఢంగా కౌగలించుకుని మొహం అంతా ముద్దులు పెడ్తూ "ఐ లవ్ యూ...." లవ్ యూ డియర్!" అన్నాడు.
    వర్ష అతని కంఠాన్ని పెనవేసుకుని "సంజయ్.....నన్నువదిలి వెళ్ళిపోతావా?" అని ఏడుస్తూ అడిగింది.
    "లేదు.....నాతోపాటు తీసుకెళ్ళడానికి వచ్చాను.....పద....." ఆమెని అలాగే నడిపించుకుపోతూ అన్నాడు.
    వర్ష గేటు దాటింది.
    సంజయ్ మోటార్ సైకిలెక్కి "కమాన్......ఎక్కు......క్విక్....." అన్నాడు.
    వర్ష అతని వెనక కూర్చోబోతుండగా, వరండాలో లైటు వెలిగింది.
    "వర్షా"
    ఉలిక్కిపడి తల్లివైపు చూసి మ్రాన్పడిపోయింది.
    విద్య వరండా మెట్లమీదే గుండె పట్టుకుని "వర్షా.......నన్నువదిలి......వెళ్ళిపోతున్నావా" అంటూ క్రింద కూలిపోయింది.
    "అమ్మా......" వర్ష ఒక్క అంగలో తల్లిదగ్గరికి పరిగెత్తింది. విద్య ఊపిరి అంధక గిలగిలాతన్నుకుంటోంది. ఆమె మొహం నీలంగా మారిపోతోంది. "సంజయ్.....కాల్ డాక్టర్.....అమ్మకి ఏమో అయిపోయింది!" వర్ష బెంబేలుగా అరిచేసింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS