Previous Page Next Page 
శతదినోత్సవం పేజి 12

 

    ఇంతటి విశ్లేషణ ముందే ఉండి ఉంటే ఇంటర్మీడియట్ పూర్తీ చేసి ఉండేది మంగ, కాని, ఈ లోగిల్లో అడుగుపెట్టాక, పైగా కిన్నెరతో సాన్నిహిత్యం,పెంచుకున్నాక కట్టూ, బొట్టూ , బాషా, ఆలోచనల్లో ఎదిగి ఇలాంటి ఓ అనుమానం రేకెత్తించింది కిన్నేరలో.


    "వదిలేయండి అమ్మాయిగారు! ఇరవై నాలుగు గంటల్లో తిన్న ఇంటి వాసాలు లెక్క పెడుతున్న ఆ మనిషిని పట్టుకుంటాను" అంది ఓ సవాలుగా. వెంటనే రిస్ట్ వాచి చూసుకుని "చాలా టైమైంది" అంటూ, దేనికి టైమైందో చెప్పకుండా గది దాటి బయటికి వెళ్లిపోయింది.


    మంగను ఆగమని కేకేయాలనుకుంది కిన్నెర. అలా పట్టుకోవడం అవసరం లేదని చెప్పాలనుకున్నది, కాని, అప్పటికే మంగ వెళ్లిపోవటంతో మనసు మార్చుకుంది.


    అసలు కిన్నెర కావాలి అనుకుంటే మంగను వెంటనే పిలవగలదు. పిలిచి ఆ ప్రయత్నం విరమించుకోమని చెప్పనుగలదు. కాని, ఆ పని చేయలేకపోయింది. కారణం దోషిని శిక్షంచి తీరాలన్న ఆలోచన కాదు, అలా రాస్తున్న వ్యక్తి ఎవరో తెలుసుకోవాలని.


    తెలుసుకున్నాక ఏం చేయాలో ఆమె అప్పటికి నిర్ణయించుకోలేదు. ఊరికే తెలుసుకోవాలనుకుంటుంది అంతే!


    ఘనత వహించిన గతం అడ్డు వస్తూంది కాని, లేకపోతే ఆ కవితలు అద్భుతంగా ఉన్నాయని తనూ మంగ ముందు అంగికరించేదే!


    అసలు ప్రేమ కోసం తపించిపోవడం అన్నది ఏ స్థాయిలో ఉండేది ఆమె చాలా పుస్తకాలలో చదివింది.


    పాపం, తనకోసం ఎవరో ఓ వ్యక్తి ఇంతగా తపించడం ఈరోజు తెలుసుకుంది.


    అది అందరి ముందూ అంగికరించక పోయినా, మనసుకు కాస్త ఉల్లాసాన్ని కలిగిస్తుందన్న విషయం ఇప్పుడిప్పుడే అర్ధవుతుంది.


    ఒక అలవాటుకు మనసు దాసోహమవటమో, లేక బానిస కావడమో అప్పటికి కిన్నేరకు తెలీని విషయమే అయినా, మరుసటి రోజు లైబ్రరీ నుంచి తెచ్చుకున్న నవల్లో 'కవిత' రోజులా కనిపించకపోయేసరికి అదోలా అనిపించింది.


    సాయకాలం పిలవకుండానే గదిలోకి వచ్చిన మంగ "ఈరోజు ఎప్పటిలా జరగలేదు అంటే కారణం నేనే చిన్నమ్మాయిగారూ! మీ గది ముందే కాపలా కాసేనంటే నమ్మండి" అంది గర్వంగా.


    చాచి చెంప పగలకోట్టాలన్నంత ఆవేశం ముంచుకొచ్చింది కిన్నేరకు.


    ఏమిటి మనసు చిత్రమైన ఒత్తిడికి గురవుతుంది? క్షణాలు గడుస్తున్న కొద్ది తన అయువే కర్పూరంలా రాలిపోతున్నట్టు అనిపిస్తూందేం?


    గుండె పొరల్లోకి ప్రవేశించి చిత్రమైన గంధర్వగానంలా జోకొట్టే కవితా పంక్తులు ఈరోజు చదవకపోయేసరికి పడమటి దిక్కులో కనిపించే అందమైన సంధ్య కాంతి కూడా అశాంతిని కలిగిస్తుందేమిటి?


    ఏ స్వేచ్ఛకో సంకెళ్ళు పడినట్టు, అలవాటులేని , ఏ మనస్తాపం హారన్నో మెడలో వేసుకున్నట్టు మనసెం ఇంత దిగులుపడిపోతుంది.?


    ఆ రాత్రి సరిగ్గా అన్నం తినలేకపోయింది. డాబా మీద పచార్లు చేస్తూ నిశిరాత్రి గాలి అలల్ని అనందించలేకపోయింది. సెంటు పరిమళం జుగుప్సగా ఉంది.


    ఏ రాత్రికో బెడ్ రూంలో అడుగుపెట్టింది కాని, ఎంత రాత్రి గడిచినా నిద్ర పట్టక అసహనంగా అటూ ఇటూ దొర్లుతుంది.


    నిద్రపోతున్న ఆరోగ్యవంతుడు నిద్రలో సగటున పక్కకు ఒత్తిగిల్లేది ముప్పై అయిదు సార్లని కదూ ఆ రోజు ఓ పెళ్ళి కొడుకుని శాస్త్రియంగా చెప్పి కంగారు పెట్టింది.


    మరి ఇప్పటి కే వందసార్లో తను ఒత్తిగిల్లిందే! అంటే తను ఆరోగ్యవంతురాలు కాదా? లేక మనసు అనారోగ్యానికి గురై పోతుందా?

    
    అంతవరకు తను పెళ్లి చూపుల్లో చూసిన ఒక్కో పెళ్లికొడుకు రూపాన్ని గుర్తు చేసుకుంది.


    చాలామంది గుర్తుకురాకపోయినా , అందంగా ఉన్న ఒకరిద్దరు కళ్ళముందు మెదిలారు. అది కూడా తనను కదిలించిన అందం కాదు.


    పదేపదే తలపుల్లో తిరుగాడే రూపమే అందానికి చిహ్నమైతే , అసలు అలాంటి వ్యక్తి ఒక్కడూ ఇంతదాకా తనకు తారసపడలేదు.


    "నీ ఆలోచనల అగ్ని పుష్పాలు నన్ను కాలినా ఉనికిని భస్మంగా మార్చితే......


    అనక నీ కలల కర్పూర పేటికలో నా స్మృతుల బూడిదని దాచుకోవాల్సి ఉంటుంది.....


    అశ్రుపుష్పాల శ్రద్ధాంజలితో ఏడు జన్మల పాటు నా కోసం ఎదురుచూడాల్సి వస్తుంది!"


    ఎందుకమ్మా......పిచ్చి నేస్తం! ఇంతకాలం ఎక్కడున్నావో తెలీని నువ్వు నా కనుకొలకుల్లో నిలిచి ఎందుకింత ఆరడి పెడుతున్నావ్?


    చెంపల పైకి జారిన నీటి బొట్టుని కసిగా తుడుచుకుంది.


    తను వృధాగా జీవితాన్ని నెట్టుకోస్తుందా?


    భవ్య మాటలు గుర్తుకొచ్చాయి.


    ఆ రోజు ఆ మాటలు కోపాన్ని రప్పించినా, ఇప్పుడెందుకో సవ్యంగానే, సమంజసంగానే తోస్తున్నాయి.


    ఆవేశంగా లేచింది.


    ఛఛ! ఎందుకు తనిలా ఆలోచిస్తుంది?


    కిటికీలో నుంచి బయటకు చూసింది.


    బయట నిశ్శబ్దం.


    ఎక్కడో ఆ నిరవ నిశీధిలో కవిత రాసిన వ్యక్తి తన గురించే కలతపడుతూ నిద్రలేని జాగరణని రణంలా మార్చుకుంటు.....


    ఉక్రోషంగా వెనక్కు మరలింది.


    ప్రపంచంలో అతి శక్తివంతమైన ఆయుధం అంటే ఇంతకాలము 'మారణాస్త్రం' అని చదువుకుంది కాని, మనిషిని ఓడించేది మనసు అని ఖచ్చితంగా ఇప్పుడిప్పుడే అర్ధమవుతుంది.


    ప్రారంభం జరిగితే చాలు. వైరస్ లా మెదడును తొలిచే పదం పేరే ప్రేమయితే ఆ మరుసటి రోజు కూడా లైబ్రరీ పుస్తకంలో లేని కవిత కిన్నేరను మరింత గాయపరిచింది.   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS