Previous Page Next Page 
నేస్తం నీ పేరే నిశ్శబ్దం పేజి 13

 

    మొన్నెప్పుడో ధన్వితో చిత్రమైన పందెం....

 

    ఈరోజు మధూళీ తో మొదలైన స్నేహం.

 

    ఏ సంఘటన బ్రతుకు దారిలో ఏయే మలుపులకి కారణమవుతుందో సామ్రాజ్యనికి తెలీదు, కానీ, చిరిగిపోయిన తన బ్రతుకు డైరిలోని మిగిలిన ఖాళి పుటలో యింకో కొత్త కధకీ ఆమె కారణం కాబోతోంది చిత్రంగా.

 

    

                                          *    *    *    *

 

    "ఏడే....ఎక్కడ వాడు?"

 

    నీలకంఠం ఆఫీసు నుంచి వస్తూనే కేకపెట్టాడు.

 

    నిజానికి గదిలోపలే వున్నాడు ధన్వి....ఏవో జాబ్స్ కి సంబంధించిన అప్లికేషన్స్ ఫిలప్ చేస్తున్నాడు. తండ్రి కేకని బట్టి తెలిసిపోయింది. ఈరోజు తాగటానికి ముందే తనమీద యుద్ధం ప్రకటించేట్టున్నాడు.

 

    "నిన్నేనే" వంటగదిలోనుంచి చేతులు తుడుచుకుంటూ వచ్చిన సావిత్రి అర్ధంకానట్టు చూస్తుంటే అరిచాడు మళ్ళీ "నీ కొడుకు ఎంత ప్రయోజకుడయ్యాడో తెలుసా?"

 

    ధన్వి అసంకల్పితంగా అలర్టయ్యాడు. తండ్రి గొంతు ప్రతిరోజూలా వినిపించడంలేదు. బయటికి వచ్చి అడిగేవాడే కాని, ధైర్యం చాలడం లేదు ఎందుకో.....వడలిపోయిన దేహంతో, కళ తప్పిన భర్త ఎందుకింత ఆవేశ పడుతున్నాడో తెలీడం లేదు. అదికాదు, అయన కంపించడం చూస్తుంటే ఇంకో క్షణంలో కుప్పకులిపోయేట్టుగా వున్నాడు.....

 

    "ఏమయిందండి.....? వాడు లోపలే వున్నాడు" అందోళనగా అడిగింది.

 

    "నిన్న రాత్రి వీడు మన వీధి మొదట్లో వున్న ఇరానీ కేఫ్ దగ్గర ఎవడితోనో గొడవపెట్టుకుని కొట్టుకునేదాకా వెళ్ళాడటె" నిస్త్రాణగా తల పట్టుకుని కుర్చీలో చతికిలబడ్డాడు. "ఎందుకే.....ఎవరో ఏదో అనుకుంటుంటే వీడు మధ్యలో కెందుకెళ్ళాలి?"

 

    "అసలు జరిగిందేమిటో చెప్పకుండా అరుస్తారెందుకు?"

 

    భర్తని సముదాయించే ప్రయత్నం చేసింది సావిత్రి.

 

    జరిగింది నాన్నకన్నా ముందే చెప్పాలనుకుంటూ బయటికి వచ్చాడు ధన్వి....

 

    "నేను చేబుతానమ్మా" ధన్వి తల వంచుకుని కాదు, చేయని తప్పుకి తనెందుకు తలవంచాలి అన్నంత ధీమాగా చెప్పడం మొదలుపెట్టాడు....."నిన్న రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో కేఫ్ కి వెళ్ళి టీ తాగుతున్నాను....మరో టేబుల్ దగ్గర ఓ అమ్మాయి, అబ్బాయి కూర్చుని మాట్లాడుకుంటున్నారు, ఇంతలో ఓ బాగా తాగి వున్న ఓ గ్యాంగ్ అక్కడికి వచ్చింది...."

 

    "ఆ గ్యాంగ్ ఆ అమ్మాయిని ఏదో కామెంట్ చేస్తే ఆమెతో వున్న అబ్బాయి ముందుకెళ్ళాడు.....అతడ్ని కొట్టారు. అంతే నీ కొడుకు ఓ సినిమా హీరోలా వెళ్ళి అమ్మాయిని , అబ్బాయిని రక్షించే ప్రయత్నంలో వాళ్ళతో తలపడి ఫైట్ చేశాడు" బేలన్స్ కధని తను చెప్పిన నీలకంఠం ఇప్పుడు ధన్విని చూస్తూ అన్నాడు. "ఏమనుకుంటున్నావ్రా? ఎవరెలా పొతే నీకెందుకు.....అసలు నువ్వు కొట్టిన వ్యక్తీ ఎవరో తెలుసా.....? నర్సింగ్ యాదవ్ తమ్ముడు.....నర్శింగ్ యాదవ్ అంటే పెద్ద గుండా, హంతకుడు."

 

    "నాన్నగారు ....."అర్దోక్తిగా తండ్రిని వారించాడు ధన్వి. "అక్కడ నేను గొడవచేసింది నేనేదో సాహసవంతుడన్ని నిరూపించుకోవటానికి కాదు.....అసలు ఖచ్చితంగా జరిగింది మీకు తెలుసా....నర్శింగ్ యాదవ్ తమ్ముడు కొట్టిన దెబ్బకి ఆ అబ్బాయి వచ్చి నా టీ కప్పు మీద పడ్డాడు. టీ ఒలికి నా షర్టుంతా తడిసిపోయింది. అంటే నేను తప్పనిసరిగా జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది.....నాకెందుకు అని సరిపెట్టుకుని వచ్చేయాలా?"

 

    "వచ్చేయాల్రా....." అసహనంగా అన్నాడు  నీలకంఠం. "బోడి షర్టు పాడైందని భాధపడేకన్నా , తిన్నగా ఇంటికి వచ్చి షర్టు మీ అమ్మకిచ్చి ఉతికించుకోవాల్సింది."

 

    "కాని ఆ క్షణంలో నేను ఆలోచించింది పాడైనా నా షర్టు గురించి కాదు.....మీద పడ్డ అబ్బాయి గురించి గానీ కాదు....నేను అర్జెంటుగా ఉతకాల్సిన ఆ గూండా గురించి."

 

    కొడుకు అంత స్థిమితంగా మాట్లాడ్డాన్ని సహించలేకపోతున్నాడు  నీలకంఠం. " నీకు తెలియదు, వాళ్ళు నిన్ను విడిచిపెట్టరు."

 

    "ఫేస్ చేస్తాను,"

 

    "అంతే తప్ప తప్పని ఒప్పుకోనంటావ్?"

 

    "నేను చేసింది తప్పే అయితే తప్పకుండా ఒప్పుకుంటాను."

 

    "సమాజంలో అరాచకాన్ని ఆపటానికి కంకణం కట్టుకుంటానంటావట్రా?" బాధగా అరిచాడు  నీలకంఠం.

 

    "లేదు నాన్నగారూ....." ధన్విలో ఉద్రేకంలేదు. చాలా ప్రశాంతంగా అన్నాడు. "సమాజాన్ని ఉద్ధరించడానికి నేను సంస్కర్తని కాదు....గూండాల్ని అదుపు చేయటానికి పోలిస్ వ్యవస్థలో ఒకడ్నికాను, ఈ దేశంలో ఒక పౌరుడ్ని సామాజికంగా నాకున్న హక్కులకి, స్వేచ్చకి భంగం కలిగితే రియాక్ట్ కావాలనుకునే మనిషిని, అందుకే నాదాకా వచ్చినప్పుడు మాత్రం నేను యికముందైనా యిలాగే రియాక్ట్ అవుతాను.....కాంప్రమైజ్ కాను....."

 

    "విన్నావటే" తలపట్టుకున్న  నీలకంఠం మరింత రెచ్చిపోయాడు. "నీ కొడుకు మాటాడుతున్నది వింటున్నావా? నా ఒక్కడితోనే కాదు, ప్రపంచంతో కూడా పేచీ పెట్టుకుని , సంఘాన్ని ప్రక్షాళనం చేసే పెద్ద విప్లవకారుడైపోతాడు....."


    "ఒరేయ్!" సావిత్రికి కళ్ళనీళ్ళు పర్వంతమౌతుంటే కొడుకుని సమిపించింది. "నువ్వు మాకు ఒక్కగానొక్క బిడ్డవిరా....."బావురమంది చీరచెంగుని నోటికి అడ్డం పెట్టుకుంటూ......" ఆ విషయం నీకు గుర్తువుందా...."

 

    "ఎందుకమ్మా.....నేనేదో కూడని తప్పు చేసినట్టు ఎందుకింత భాధపడతావ్......చిన్న విషయం గురించి మీరంతా ఎందుకింత రాద్దాంతం చేస్తున్నారు?"   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS