కామినికి ఆశ్చర్యం గొలిపే విషయం అదికాదు.
ఇన్నేళ్ళుగా ఈ విషయాన్ని చౌరసియా ఇంత రహస్యంగా ఎలా ఉంచగలిగాడా? అని.
ఆమె భర్త మినిష్టరు..... అంతేకాక ఒక నటిగా ఆమెని అందరూ గుర్తు పడతారు. ఏ మాత్రం ఈ విషయం పత్రికల వాళ్ళకిగానీ, ఎల్లో మాగ్ జైన్స్ కిగానీ తెలిసినా బాంబులా పేలుతుంది. అయినా బయటకి రాలేదు. చౌరసియా ఆ జాగ్రత్తలు తీసుకున్నాడు. కేవలం అతడు మాత్రమే అలాటి పనులు నిర్వహించగలడనేది నిర్వివాదాంశం.
ఒకసారి చిన్న ప్రమాదం జరిగింది.
అర్ధరాత్రిపూట ఆమె ప్రిస్మా ఏజెన్సీస్ ఇంటిలోకి ప్రవేశించటం డేవిడ్ అనే వ్యక్తి చూశాడు. డేవిడ్ ఆమె భర్త తాలూకు కారు డ్రైవర్. కామిని షూటింగ్ ల నిమిత్తమై అర్దరాత్రి.... తెల్లవారు ఝాములవరకూ స్టూడియోల్లో గడపటం అలవాటే. కానీ ఇటువంటి చోట వుండటమేమిటా అన్న ఉత్సుకతతో గూర్ఖాని అది ఎవరిల్లని అడిగాడు. అదే సమయానికి ప్రవేశిస్తూన్న చౌరసియా ఆ విషయం గమనించాడు. మరుసటిరోజు నుంచీ డేవిడ్ కనపడకపోవడనికి కారణం కేవలం ముగ్గురికే తెలుసు.
అంత జాగ్రత్తగా ఆ రహస్యాన్ని ఉంచుతూ వచ్చాడు చౌరసియా. ఇటువంటి అద్బుతమైన తెలివితేటలకే కామిని అబ్బురపడి అతడికి దగ్గరైంది.
నైట్ లైట్ వేసి ఆమెకు దగ్గిరయ్యాడు అతడు.
మంచో చెడో- మర్డరో బిజినెస్సో - ప్రొద్దున్నించీ సాయంత్రం వరకూ నిరంతరం పనుల్లో మునిగి తేలుతూ వుంటాడు చౌరసియా అతడికి ఆమె ఇచ్చే రిలాక్సేషన్ చాలా గొప్పది. చాలా కొద్దిమంది స్త్రీలకే పురుషుడిని "పూర్తిగా ఆనందపరచటం" అనే కళ తెలుస్తుంది. ఆమె లవ్- మేకింగ్ మూడు స్థాయిల్లో వుంటుంది. తను తృప్తి చెందటం, తన సంతృప్తిని అతడికి తెలియచెప్పటం ద్వారా అతడి మేల్-ఈగోని తృప్తిపర్చటం, అతడి కిష్టమైన పనులని రోజురోజుకీ మరింత ప్రతిభావంతంగా నిర్వర్తించటం! ఒక శాస్త్రీయ దృక్పథంతో ఇదంతా చేసినా, ఆమె చర్యల్లో ప్రొఫెషనలిజం కనపడదు. ఎప్పటికప్పుడు అతడికి కొత్తగా కనపడుతుంది. అతడితో చాలాసేపు రకరకాలుగా ఆడుకోవటం ఆమెకు ఇష్టం. Warming Up Acts ఆమెకు తెలిసినన్ని బహుశా ఎవరికీ తెలియవేమో వాళ్ళిద్దరి కలయికలో ఎప్పుడూ చురుకైన భాగం ఆమె తీసుకుంటుంది. ఆమె చేతివేళ్ళు మిషన్ లాగా కదులుతాయి. ఫోర్ - ప్లే జరిగినంత సేపూ ఆమె క్షణకాలంకూడా ఖాళీగా వుండదు. దాదాపు రెండు గంటలపాటు అతడిని ఉక్కిరిబిక్కిరి చేసి, తను చెమటతో తడిసిపోతుంది. ఆమెలో అంత ఆర్టు వుంది కాబట్టే నూటికి నూరుపాళ్ళు మెటీరియలిస్ట్ అయిన చౌరసియా కూడా ఆమెని వదలలేకపోయాడు. ఆమెపట్ల విపరీతమైన ఆకర్షణ, ప్రేమ పెంచుకున్నాడు. ఎక్కడ ఆకర్షణ ఉంటుందో అక్కడ ఈర్ష్య కూడా వుంటుంది. ఎంత సినిమానటి అయినా, ఎంతమందితో పరిచయాలున్నా కామినికి "ఈ విధమైన" పరిచయాలు మరేవీ లేవని అతడికి తెలుసు. అలాంటివేమైనా వుంటే అతడు ప్రాణాల్తో వదలడని ఆమెకీ తెలుసు. అలాంటి అవసరం ఆమెకు ఇంతవరకూ రాలేదు.
అతడామెని ఆక్రమించుకున్నాడు. అతడి భుజాలమీద ఆమె చేతులు యాంత్రికంగా పెనవేసుకుని వున్నాయి.
"మొన్న ఎప్పుడో మీ ఆయనతో కలిసి 'బంద్' కోసం వెళ్ళావుటగా" అన్నాడు.
"అవును" అన్నదామె క్లుప్తంగా.
అతడు తన కుడిచేతి వేళ్ళలోకి ఎడమ చేతివేళ్ళు జొనిపి, ఆమె తలచుట్టూ వేసి, కాస్త పైకి అడ్జస్టు అయ్యాడు.
"ఎవరో ఇన్ స్పెక్టరు బాగా గొడవ చేశాడుటగా-"
"అవునట-"
"ఏమిటి అతని పేరు?"
"ఏదో వుంది సరీగ్గా గుర్తులేదు."
మరో నిమిషం తర్వాత ఆమె పక్కనుంచి అతను లేచాడు. అరగంట తరువాత అతడు కార్లో ఇంటివైపు వెళ్తున్నాడు. రాత్రి రెండు దాటింది.
గత కొన్నాళ్ళుగా కామిని పక్కమీద అన్యమనస్కంగా వుండటం అతడు గమనించాడు. లవ్-మేకింగ్ లో స్త్రీకి, పురుషుడికీ తేడా వుంది. మనసక్కడ లేకపోయినా, పురుషుడు ఉత్సాహంగా పాల్గొనగలడు. స్త్రీ అలా కాదు, ఆమె చేతుల మధ్య వున్న పురుషుడిని మనసారా ఇష్టపడకపోతే, నిర్లిప్తంగా వుండిపోతుంది.
చౌరసియా విషయంలో అదే జరిగింది.
గత కొన్నాళ్ళుగా కామిని ఆ టైమ్ లో ఏదో ఆలోచనలో వుండటం, నిర్లిప్తంగా వుండటం గమనించాడు. ఆమె మనసు అక్కడ లగ్నమవటం లేదని గ్రహించాడు. కారణం ఏమై వుంటుందా అని ఆలోచించాడు. సాధారణంగా అసూయపరుడైన అతడి ఆలోచన వెంటనే ఇతర పురుషులవైపు వెళ్ళింది. ముందు- సినీరంగంలో వుండే హీరో లెవరైనా పరిచయమయ్యారేమో అనుకున్నాడు.
అప్పుడు తెలిసింది ఈ బంద్ సంఘటన!
రెండు రోజుల క్రితం ఆమె ఎవరినో ఎంక్వయిరీ చేసి "రాణా- యస్. పురంలో జాయినయ్యాడా" అని కనుక్కుంది. ఆ విషయం కూడా చౌరసియాకి తెలిసింది.
ఇప్పుడు-
చాలా క్యాజువల్ గా అడుగుతున్నట్టు - "అతని పేరు నీకు తెలుసా?" అని అడిగిన ప్రశ్నకి ఆమె "ఏదో వుంది. సరీగ్గా గుర్తు లేదు" అని సమాధానం ఇవ్వటం అతడికి అప్పటివరకూ వున్న అనుమానాన్ని నిజం చేసింది.
తన పక్కన పడుకుని-
తన చుట్టూ చెయ్యివేసి-
తను అనుభవిస్తూ వుండగా-
ఆ తమకంలో-
ఆ మత్తులో-
స్త్రీ - ఇంకో పురుషుడి గురించి ఆలోచిస్తూందని తెలియటం కన్నా అవమానం ఇంకొకటి లేదు. ఏ మొగాడూ అది సహించలేడు. చౌరసియా లాంటివాడు అసలే సహించలేడు.
7
విశాలమైన ప్రాంగణంలో పవిత్రతకు చిహ్నంగా గుడి.
దూరంగా చిన్న కోనేరు గట్టుమీద గన్నేరు చెట్లు.
అక్కడి వాతావరణం ప్రశాంతంగా వుంది.
"ఇక్కడ ప్రదేశాలన్నీ నీకు బాగా పరిచయం వుంది వుండాలే" అన్నాడు రాణా అలక్ నందాతో.
"గత పది సంవత్సరాల్నుంచీ ప్రొద్దున్నా, సాయంత్రం క్రమం తప్పకుండా వస్తున్నాను" అంది భక్తితో.
"మధ్యాహ్నంపూట కూడా రాకపోయావా?" అన్నాడు కసిగా.
"నిజంగానా?" అంది కళ్ళు పెద్దవి చేసి, ఇద్దరూ గుడిమెట్లు ఎక్కుతున్నారు.
"నీకు తెలుసో తెలీదో- మధ్యాహ్నప్పూట పడుకుని దొర్లితే బోలెడు పుణ్యం వస్తుంది."
"తప్పు, గుడిలో అలాంటి కల్మషపు మాటలు మాట్లాడకూడదు. అదిగో ఆ గంట చూశారా? తప్పుచేస్తే ఆ గంటని తలతో కొట్టుకోవాలి" అంది. రాణా ఆమెవైపు చిలిపిగా చూశాడు.
నవ్వుతూ "నీ మనసులోనే ఏదో వుంది. దొర్లటం అనగానే అది కల్మషమేనా? నేను చెప్పేది ప్రదక్షిణలు చేయటం గురించి, పక్కమీద దొర్లటం గురించికాదు" అన్నాడు.
ఇద్దరూ పూజారి ముందు నిల్చున్నారు. దేవుడి విగ్రహం నగలతో దేదీప్యమానంగా వెలుగుతోంది. ఆ రోజుల్లోనే పాతిక లక్షలుండేవిట! ఇప్పుడు కనీసం కోటిరూపాయలు ఖరీదు చేస్తాయి.
"ఏమ్మా? బావున్నావా?" అడిగాడు పూజారి.
"పొద్దున్నేగా వచ్చింది. సాయంత్రానికి ఏమవుతుంది?" అనుకున్నాడు రాణా మనసులో. పూజారి హారతి ఇచ్చాడు. పళ్ళెంలో దక్షిణ వేస్తూ "స్వామీ మీరు పురాణాలన్నీ చదివారనుకుంటాను" అన్నాడు రాణా ఆయనవైపు భక్తిగా చూస్తూ.
"చదివాను నాయనా!"
"వాత్స్యాయణ పురాణం చదివారా?"
"వాత్స్యాయన పురాణమా- శివ శివా- ఆ పేరే వినలేదే!"
"మీరు చదవకపోతే చదవలేదని చెప్పండి. అంతేకాని అసలటువంటి పురాణమే లేదని దబాయించకండి. అందులో కన్నెరికం పోవటం గురించి వ్రాశారు గుర్తుందా?"
"పురాణాల్లో కన్నెరికం గురించా?.... శంకరా...." అంటూ విగ్రహంవైపు తిరిగాడు.
అలక్ నంద ఇద్దరివైపు విచిత్రంగా చూస్తోంది.
"స్వామీ ఈ అమ్మాయికి కన్నెరిక గండం వుందని జ్యోతిష్కుడు పదేళ్ళ క్రితం చెప్పాడట. కన్నెరికం పోయిన మరుక్షణం చచ్చిపోతుందని అన్నాడట. కొందరమ్మాయిలకి ఆ గండం వున్నమాట నిజమే కానీ! వాత్సాయణ పురాణంలో దీనికి కొన్ని మినహాయింపులు ఇచ్చారు. జఘనంమీద పుట్టుమచ్చ.... ఆగండి! 'హా- శంకరా' అంటూ మళ్ళీ అటెళ్ళకండి. స్త్రీకి జఘన స్థానంలో పుట్టుమచ్చ వుంటే ఈ రూలు వర్తించదని వాత్స్యాయనుడు చెప్పాడు. అవునా?"
"జఘన స్థానంలో పుట్టుమచ్చా?"
"అవును స్వామీ!"
"జఘన స్థానంలో...."
"అబ్బా.... పవిత్రమైన గర్భగుడిలో నిలబడి మాటిమాటికీ ఆ మాటని ఉచ్చరిస్తావెందుకు స్వామీ?" అంటూ కన్నుకొట్టాడు. పూజారి అయోమయంగా చూశాడు. రాణా మొహం విషాదంగా పెట్టి మరొకసారి కన్నుకొట్టి "స్వామీ.....మీరూ ఒకప్పుడు వయసులో వుండి ఈ బాధలన్నీ అనుభవించిన వారే. వాత్సాయన పురాణ విషయంలో నన్నర్ధం చేసుకోండి" అన్నాడు దీనంగా.
"ఎక్కడో చదివినట్టే గుర్తు నాయనా!"
"చాలు స్వామీ చాలు. దేవుడికి కాదు- మీకు చేయిస్తాను నిత్య కళ్యాణ పూజ...." అంటూ అలక్ నంద వైపు తిరిగి "చూశావు కదా, వెళ్ళు' నా జఘనం మీద పుట్టుమచ్చ వుండేలా చెయ్యి స్వామీ' అంటూ గుడిచుట్టూ మూడు ప్రదక్షిణలు చేసిరా" అని తొందర పెట్టాడు.
ఆమె అర్ధంకానట్టు మొహం పెట్టి "జఘనమంటే...." అంది.
"అబ్బా అది నేను ప్రైవేటుగా వున్నప్పుడు చెపుతానులే. ముందు అర్జెంటుగా వెళ్ళిరా" అని పంపాడు.
ఆమె వెళ్ళిపోయాక "ఏమిటి నాయనా ఇదంతా?" అని అడిగాడు పూజారి.
"తప్పదుస్వామీ. ఈమె అమాయకత్వానికి తన మూర్ఖత్వం జోడించాడు. ఎవడో జ్యోతిష్కుడు. దాన్ని తొలగించే ప్రయత్నం.... దానికేం గాని మీరేమీ అనుకోనంటే నాదొక ప్రశ్న ఇన్ని లక్షల రూఅపయాల నగలు స్వామివారికి అలంకరించారు కదా. దొంగల భయం లేదా?"
"దీని తాళం ఒకటి నా దగ్గర, మరొకటి దేవాలయపు ట్రస్టీ దగ్గిర వుంటాయి. రాత్రింబవళ్ళు నలుగురు గార్డులు కాపలా కాస్తూ వుంటారు. ఇక భయమెందుకు?"
ఒక రౌండు అలక్ నంద తిరిగొచ్చింది. రెండో ప్రదక్షిణకు వెళ్ళింది.
"సంవత్సరం క్రితం మీ కొడుకుతో సహా నలుగురు గార్డులు హత్యా చేయబడ్డారు కదా."
పూజారి మొహం వాడిపోయింది. ఒక విషాద వీచిక తొంగిచూసింది. "అవున్నాయనా స్టూవర్ట్ పురానికి చెందిన రామస్వామి అనే దుర్మార్గుడు ఆ అయిదుగురినీ పొట్టన పెట్టుకున్నాడు".
"....కాదు" అప్రయత్నంగా అరిచాడు రాణా. అతడి అరుపు దేవాలయమంతా ప్రతిధ్వనించింది. అతడి మొహం ఎర్రబడింది. కాని అంతలోనే తమాయించుకున్నాడు.
