Previous Page Next Page 
భార్యా గుణవతి శత్రు పేజి 13

 

      అతను ఈ మాటలన్నీ పైకి అనకపోయినా వాటి భావం మాత్రం అతని మొహంలో కనబడుతోంది.    
    సౌదామినికి అర్ధమయింది. తన కోసం అంతదూరం ఆలోచిస్తున్న అతనిమీద అభిమానం ముంచుకొచ్చేసి, గాలి చొరనంత దగ్గరగా అతనికి హత్తుకుపోవాలనిపించింది. అయితే ఆడపిల్ల కాబట్టి అంతపని చెయ్యలేక, "సరే! మీ ఇష్టం!" అంది ఇష్టంగా అతనివైపు చూస్తూ.    
    తను వాడుకగా ఇన్ స్టాల్ మెంట్స్ మీద బట్టలు కొనే షాపుకి తీసుకెళ్ళాడు బాలూ. "మూడు చాలు" అని ఆమె అంటున్నా వినిపించుకోకుండా "నేను షాపంతా కొనేసే మూడ్లో వున్నాను. నన్నాపకు" ఆరు చీరెలూ కొనేశాడు.    
    వాళ్ళు ఇంటికి తిరిగి వస్తూ వుండగా పెద్ద పెద్ద చినుకులతో వాన మొదలయింది.    
    వానలో బాగా నానిపోయి ఇల్లు చేరారు.    
    ముద్దలా తడిసిపోయిన తన ముద్దుల భార్యని చూస్తుంటే అతని మనసు నిలవడం లేదు.    
    అతని రాకకోసమే పొంచి ఉన్నట్టు పక్కింటి మళయాళీ పెద్ద మనిషి వచ్చేశాడు. మళయాళీలకు ట్రేడ్ మార్కులాంటిదైన మీసం ఆయనకి కూడా వుంది. బాలూ తలని తన చీరె కొంగుతో తుడుస్తున్న సౌదామిని తలుపు చప్పుడు వినగానే దూరంగా జరిగింది.    
    బాలూకి తనని తాను పరిచయం చేసుకున్నాడు ఆయన.    
    "న ఆపేరు బేబీ జాన్ కుట్టి. మా యింటికి రండి! కాస్త మాట్లాడుకుందాం" అన్నాడు.

     నలభైఏళ్ల వయసున్న ఆ బేబీ జాన్ ని ఎగాదిగా చూసి, సైలెంటుగా మండిపడుతూ వెనక నడిచాడు బాలూ.    
    బాలూని తన సరసన కూర్చోబెట్టుకుని అడిగాడు బేబీ జాన్.    
    "యాడ పణి చేస్తారు మీరు?"    
    "ఏమిటంటారు?"    
    "పణి! పణి? యాడపణి మీకు?"    
    "నేను గిటార్ వాయిస్తాను".    
    "యాడ?"    
    "వెస్టెండ్ హోటల్లో".    
    ఆయన కొద్దిగా నోరు తెరిచాడు. తను విన్న సమాచారం పొగడదగినదో, తెగడ దగినదో ఆయనకు అర్ధంకాలేదు. గిటార్ వాయించడం అంత మర్యాద అయిన పని కాదని ఆయన ఉద్దేశ్యం.    
    వెస్టెండ్ హోటల్లో వెయిటర్ గా పనిచేస్తున్నా విశేషమే అనుకోవాలి.    
    "వెస్టెండ్ హోటళా? నేనూ చూసిణా" అన్నాడు.    
    పెద్ద పెద్ద హోటల్స్ చూశామని చెప్పుకోవడం కూడా స్టేటస్ సింబల్ కింద చలామణి అవుతుందని తెలుసు 'బాలూకి.    
    "అలాగా" అన్నాడు నవ్వుతూ.    
    "ఒక్కసారి వెళ్ళిణా తర్లఫోణ్ కంప్లయింట్ అటెండ్ సెయ్యడానికి."    
    "ఏమిటంటారు?"    
    "తర్లఫోణ్" అన్నాడు చేతిని రిసీవర్ లా చెవి దగ్గర పెట్టుకుని అభినయిస్తూ.    
    ఆయన ఎన్నిసార్లు టెలీఫోన్ అని చెప్పినా అది తర్లఫోన్ అన్నట్లే వినబడుతోంది బాలూకి. ఇక ఆ టాపిక్ వదిలేసి-

    "మీతో కలిసి బంధువుళెవరూ రాళేదేమి?" అన్నాడాయన ఆరాగా.    
    "మాకెవరూ లేరండీ!"    
    "అయ్యో పాపం బళ్ళికుదురువైపు కూటా ఎవరూ ళేరా?"    
    "లేరండీ!"    
    సానుభూతిగా చూశాడాయన. "మీది ళవ్ మ్యారేజ్ అనుకుంటా.... అవునా?"    
    "అవునండీ."    
    అది వినగానే ఆయన ఉత్సాహం పుంజుకున్నాడు. "ణేణు కూడా చిణ్ణతణంలో ప్రేమించాణు తెళుసా! కానీ బెళ్ళి చేసుకోళేక పోయాణణుకో."    
    "అలాగా అండీ!"    
    ఆయన భూతకాలంలో భగ్నమైన తన ప్రేమను గురించి చెబుతుంటే వర్తమానంలో కాలిపోతున్న క్షణాలని దిగులుగా లెక్కపెడుతూ కూర్చున్నాడు బాలూ.
    మాటల మధ్యలో పదిసార్లు లేచాడు బాలూ. ఆయన పదిసార్లూ కూర్చోబెట్టేశాడు. గొప్ప వాగుడుకాయ అయినా, ఆయన మంచి మనిషేనని గ్రహించాడు బాలూ.    
    ఫైనల్ గా ఆయన్ని వదిలించుకుని ఇంటికి వచ్చేసరికి సౌదామిని మంచి నిద్రలో వుంది.    
    ఇష్టాలు చాలా రకాలు.    
    గాఢనిద్రలో వున్న ఆమెని లేపేసి, సుఖాలు అందుకోమని ఒక రకం ఇష్టం తొందర చేస్తుంటే, ఆమె మీద అతనికి వున్న మరో రకం ఇష్టం, సుఖనిద్రలో వున్నా ఆమెని డిస్టర్బ్ చెయ్యవద్దని మందలించింది.    
    మాతృ గర్భస్థ శిశువులా ముడుచుకు పడుకున్న సౌదామిని పక్కనే కూర్చొని, ఆమె మొహంమీద వదులుగా పడుతున్న జుట్టుని సున్నితంగా సవరిస్తూ ఉండిపోయాడు. అలాగే నిద్రపట్టేసింది అతనికి.    
    వాన చినుకులు మొహంమీద పడుతున్నట్లు వుంటే మెలకువ వచ్చింది బాలూకి.    
    చటుక్కున కళ్ళు తెరచి చూశాడు.    
    అప్పుడే తలంటి పోసుకుని మంచులో తడిసిన ముద్ద మందారంలా వున్నది ఆమె. తడిగా వున్న జుట్టు కొనలని పట్టుకుని అతని మీదకు విదిలిస్తోంది.    
    "గుడ్ మార్నింగ్" అంది చిరునవ్వుతో.    
    ఇలాంటి సుప్రభాతం ఎప్పుడూ ఎరగడు బాలు. హర్షాతిరేకంతో వళ్ళు పులకరించినట్లయింది.    
    వంటగదిలో నుంచీ వెచ్చటి ఫిల్టర్ కాఫీ సువాసన మృదువుగా సోకుతోంది.    
    "హాయ్ ఎంత బాగుళ్దీళోగం" అన్నాడు పెద్దగా ఆవలిస్తూ.    
    నవ్వింది సౌదామిని. "ఆవలించి అన్నా మాట్లాడండి. మాట్లాడి అన్నా ఆవలించండి. లేకపోతే పక్కింటివాళ్ళ యాస ఒక్కరోజులో మీకు వచ్చేసిందనుకుంటారు."    
    ఆ మాట వినగానే ఒక్క ఉదుటున లేచి కూర్చున్నాడు బాలు.    
    అతని భయాన్ని గమనించి "ఇంతవరకూ యెవరూ రాలేదు లెండి" అంది సౌదామిని.    
    "అమ్మయ్య" అని, ఏదో గుర్తొచ్చినట్టు మళ్ళీ అన్నాడు బాలు. "ఇదిగో సౌదామినీ నిజమైన ప్రేమ అంటే ఒకళ్ళకోసం ఒకళ్ళు మహత్తరమైన త్యాగాలు చెయ్యడమే. రాత్రి నీ కోసం బృహత్తరమైన త్యాగం చేసేశాను తెలుసా?"    
    "ఏమిటీ!" అన్నట్లు ఒక్క క్షణంసేపు ప్రశ్నార్ధకంగా ముడిపడ్డాయి ఆమె కనులు. తర్వాత ఆమె పెదిమలు నవ్వుతో విడివడ్డాయి. "అర్ధమయిందిలెండి త్యాగయ్యగారూ! థాంక్స్ యెలా చెప్పుకోను నేను?" అంది.    
    "ఇలా" అని ఆమెను తన దగ్గరికి లాక్కోబోయాడు.    
    ధన్నుమని తలుపు తెరుచుకుంది. భూమికి మూరెడు పైన ఒక జానెడెత్తున్న శాల్తీ టూత్ బ్రష్ చేతిలోనూ, బొటనవేలు నోట్లోను పెట్టుకుని ప్రత్యక్షమయ్యింది.    
    హడలిపోయి, "ఇదెవరు?" అన్నాడు కంగారుగా.    
    కవిత కుట్టి గదిలోని సామగ్రినంతటినీ జాగ్రత్తగా పరిశీలించి, తన చేతిలోని టూత్ బ్రష్ బాలుకి అందించి, అతని చేతిలోని సిగరెట్ ప్యాకెట్ తను లాక్కుంది. సిగరెట్లు లాగి అవతలపడేసి, లోపల వున్న తగరం తీసుకుని, దానితో గంధపు గిన్నె చెయ్యడం మొదలెట్టింది తాపీగా.    
    వెంటనే ముందు జాగ్రత్తగా అగ్గిపెట్టెను దిండుకింద దాచేశాడు బాలు.    
    పాప గంధపు గిన్నె చెయ్యడం పూర్తి అయింది. బాలు దగ్గరి బ్రష్ అందుకుని, "నువ్వు మళ్ళా కొత్త ప్యాకెట్ గొన్న దర్వాద న్యాన్ వస్తాను" అని వెళ్ళిపోయింది.    
    కోపాన్ని ఆపుకుంటున్నాడు బాలు. సౌదామిని పెదిమల మీద లేతనవ్వు మెరుస్తోంది.    
    "నవ్వుతావేం, అది సిగరెట్లు పాడుచేస్తుంటే నీకు కోపం రావడం లేదూ?"    
    "మనమేం సిగరెట్లని బాగుచేస్తున్నామా ఏమిటి? సిగరెట్లనీ, డబ్బునీ కలిపి తగలెయ్యడం లేదూ?" అంది మృదువుగానే.    
    దెబ్బతిని "అమ్మో నీతో జాగ్రత్తగానే వుండాలి" అన్నాడు.    
    "అవును, జాగ్రత్తగానే వుండాలి. మీరే కాదు. మనం యిద్దరమూనూ! ఈ విషయంలోనే కాదు, అన్ని విషయాల్లో కూడా! ఇప్పుడే కాదు కీవితాంతం కూడా ఇద్దరం కలిసి అంచెలంచెలుగా అన్నీ సాధించేసి ఆకాశాన్ని అందుకోవడానికి జీవితాన్ని ఒక అవకాశంగా ఉపయోగించుకోవాలి. అంతేగానీ సిగరెట్ లా నిర్లక్ష్యంగా తగలేసుకోవడానికి కాదు" అంది, మృదుత్వమూ, గట్టితనమూ రెండూ సమపాళ్ళతో కలిపిన గొంతుతో.    
    మొదటిసారిగా ఆమె మాటలని సీరియస్ గా విన్నాడు బాలు. అంతా విన్న తర్వాత చిరునవ్వుతో చెప్పాడు. "నీలో రెండు పరస్పర విరుద్దమైన లక్షణాలున్నాయి సౌదామిని."    
    ఏమిటన్నట్టు చూసింది సౌదామిని.    
    "ఒకటి, నువ్వు చాలా తక్కువగా మాట్లాడతావు. రెండు, మాట్లాడ దలుచుకుంటే మాత్రం చాల పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు. అవునా" అని సిగరెట్ పాకెట్ కిటికీలోంచి బయటికి విసిరేస్తూ "ఈ క్షణంనుంచీ సిగరెట్ మానేస్తున్నాను" అన్నాడు సిన్సియర్ గా.    
    చిరునవ్వు నవ్వి, ఈసారి తనంతట తానే అతనికి దగ్గరగా జరిగింది సౌదామిని.    
    బాలూకి దొరికిన కొద్దిరోజుల శెలవా అతి వేగంగా ఖర్చయి పోయినట్లని పించింది. ఆ రోజు రాత్రి ఎనిమిదయ్యాక అతను బార్ కి బయలుదేరుతుంటే "అన్నం తిని వెళ్ళరా" అంది సౌదామిని.    
    "రాత్రిపూట మనకు బార్ లో ఫ్రీ మీల్స్ వదిలి వెయ్యడమెందుకు? ఖర్చు కలిసివస్తే నీకు త్వరలో మంచి తంజావూరు వీణకొనియ్యవచ్చుగా."    
    "ఫ్రీ మీల్స్ యిస్తే ఫర్వాలేదుగాని ఫ్రీ డ్రింక్స్ అయితే మాత్రం ఇబ్బంది!"    
    నవ్వుతూ వెళ్ళిపోయాడు బాలూ. కారుచీకటిగా వున్న బార్ లో ప్రవేశించాడు అతను. సాధారణంగా బార్ లలో ఎప్పుడూ డిమ్ లైటింగ్ వుండేటట్లు ఏర్పాటు చేస్తారు. ఆ మసక వెలుతురే సగం మత్తెక్కిస్తూ వుంటుంది.    
    డైస్ మీద ఎక్కాడు బాలూ అతడు లీడ్ గిటార్ వాయిస్తాడు. బేస్ గిటార్ వాయించే కుర్రాడూ, డ్రమ్మర్సూ వెనుక నిలబడి వున్నారు. సింథిసైజర్ వాయించే గిరిధారి కొంచెం ఎడంగా నిలబడి వున్నాడు.    
    గిటార్ కీ సరిచూసుకున్నాడు బాలు. గిరిధారి వైపు చూసి, తల పంకించే, తీగెలు మీటడం మొదలెట్టాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS