Previous Page Next Page 
సంధ్యాకళ్యాణం పేజి 12

       
    "చీకటైపోతూంది మరి! ఇంటికి ఎలా వెళ్ళాలి? చీకటైతే ఎలుగుబంట్లు గుహల్లోంచి బయటకి వస్తాయట!"

    హడలి పోయినట్టుగా గొల్లున ఏడవసాగింది సంధ్య.

    "ఏడిస్తే నీ ఏడుపు విని మరీ తొందరగా వచ్చేస్తాయి!"

    సంధ్య నోరు టక్కునమూసి బిక్క చచ్చిపోయినట్టుగా చూడసాగింది.

    ఇందాక ఆ పిల్ల ఏడుపు చాలాదూరం వినిపించడంతో ప్రసాద్ పరుగు పరుగున చేరుకున్నాడు.

    తండ్రిని చూసి పారిపోయాడు అరుణ్.

    "ఏమ్మా? ఇక్కడికెందుకు వచ్చారు?"

    "మంచి మంచి సీతాఫలాలు కోసుకోవచ్చునని అరుణ్ బావ తీసుకువచ్చాడు మామయ్యా!" మళ్ళీ బావురుమని చెప్పింది.
    "ఉండు! వాడి పనిపడతాను! చిన్న పిల్లని వాడితో కోతిలా గుట్టలూ, పుట్టలూ త్రిప్పుతాడా!" సంధ్యని ఎత్తుకుని ఇంటిముఖం పట్టాడు ప్రసాద్.

    ఆ రాత్రి అరుణ్ కి దేహశుధ్ధి బాగానే అయింది!

    ఆ కోపంతో వారం రోజులవరకు సంధ్యతో మాట్లాడలేదు అరుణ్. రెండురోజులవరకు తనకూ అంత పట్టనట్టుగావున్న తరువాత అరుణ్ వెంటపడి తిరగసాగింది సంధ్య. అయినా అరుణ్ కోసం సడలలేదు.

    "బావా, ఎందుకు మాట్లాడవు నాతో? ఏం చేశానని నా మీదకోపం?"

    అరుణ్ మాట్లాడకుండా మూతి త్రిప్పుకొన్నాడు.

    "బావా, నువ్వు మాట్లాడకపోతే నాకేం తోచడంలేదు!" సంధ్య డగ్గుత్తికతో అంది.

    "నేను మాట్లాడకపోతే అంత బాధపడేదానివి నన్నెందుకు కొట్టించావు?" ఖస్సుమన్నాడు.

    సంధ్య ఖిన్నురాలైంది. "నేను కొట్టించానా?"

    "మరి? ఇద్దరం కలిసి గట్టుకువెళ్ళాం. నీకు పడని దెబ్బలు నాకే ఎందుకు పడ్డాయి? అరుణ్ బావ నన్ను తీసుకెళ్ళాడూ అని నువ్వు చెప్పబట్టేగా?"

    "నువ్వేగా గట్టుకు మంచి మంచి పళ్ళుంటాయని నన్నూరించావు?"

    "ఊరిస్తే? బుద్ధిమంతురాలివిగదా, రాకుండా ఉండాల్సినదానివి! నాతో వచ్చిందెందుకు? దెబ్బ తగిలించుకుందెందుకు? నన్నుతన్నించిందెందుకు?"

    "తప్పైపోయింది బావా! ఇంకోసారిలాగ నీమీద చెప్పను."

    "అయినా నీతో నాకేం దోస్తి? ఆడపిల్లలతో స్నేహంచేస్తే ఇలాగే తన్నులు తినాలి. ఇకనుండి నీకూ నాకూ చెల్లు" ఖచ్చితంగా చెప్పేశాడు.

    దుఃఖం తన్నుకు వచ్చేసింది సంధ్యకు. బావురుమని ఏడుస్తూ తల్లి దగ్గరికి వచ్చి ఫిర్యాదు చేసింది. "అమ్మా! బావ నాతో ఇక మాట్లాడడట! అస్సలు నా జట్టే ఉండడట!" పూడుకుపోయిన స్వరంతో చెప్పింది.

    "ఎందుకనే?"

    "బావని నేను కొట్టించానట! నేనెందుకు కొట్టించాను?"

    "నేనడుగుతాను పద. జట్టుండనంత తప్పేంచేసిందయ్యా మా పిల్లని?" నవ్వుతూ ఎదురింటివైపు బయల్దేరింది రుక్మిణి.

                      *        *        *

    ఒకరోజు మధ్యాహ్నం ఉత్సాహంగా పరిగెత్తుకు వచ్చింది రుక్మిణి దగ్గరకు జానకి. "ఇవాళ గొప్ప శుభవార్త రుక్మిణీ! మా పెళ్ళయిన క్షణం నుండి ఈ క్షణంకోసం ఆయన ఎంత ఎదురు చూశారో? ఇన్నేళ్ళకి వచ్చింది ఆ క్షణం! మా మామగారు ఉత్తరం వ్రాశారు. తన ఆరోగ్యం ఎంతమాత్రం బాగుండలేదని, వచ్చెయ్యమని! మా ఆయన అప్పుడే ప్రయాణసన్నాహం మొదలుపెట్టాడు."

    రుక్మిణిగుండెలో గుబులు పెద్ద పెద్ద రెక్కలు విప్పుకొన్నట్టుగా అయింది.

    "వెళ్ళిపోతున్నారా? ఇంత తొందరగానా?" అనడిగింది పాలిపోయిన ముఖంతో.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS