Previous Page Next Page 
అందరూ దొంగలే పేజి 13

    "అలాగే సార్!" అన్నాడు రాంబాబు.

    రాంబాబు, చిన్నారావ్ లు ఇద్దరూ వెనక్కి తిరిగారు.

    "ఆగండి!" అన్నాడు ఇన్స్ పెక్టర్  అప్పారావ్ గంభీరంగా. ఇద్దరూ ముందుకి తిరిగారు.

    "అలా బయటికెళ్ళి  నా కోసం మటన్ బిర్యానీ తెండి."

    రాంబాబు చేతి వాచ్ వంక చూశాడు. రాత్రి 12_30 గంటలైంది.

    "సార్....ఇంత  అర్దరాత్రి వేళ  మీరిప్పుడు మటన్ బిర్యానీ తింటారా?! అసలు ఈ టైంలో తినడమే ఆరోగ్యానికి మంచిదికాదు.....అదీ మటన్ అంటే అసలు అరగదు సార్!" అన్నాడు రాంబాబు.

    "షటప్....ఏ టైములో....ఏది  తింటే అరుగుతుందో  ఏది తింటే అరగదో నువ్వేం చెప్పక్కర్లేదు....నోర్మూస్కుని  నేను చెప్పింది తే...." అన్నాడు ఇన్స్ పెక్టర్  అప్పారావ్.

    "యస్సార్!"

    ఇన్స్ పెక్టర్ జేబులోంచి  పర్సు తీశాడు.

    "చూడూ....ఒక ప్లేట్ మటన్ బిర్యానీ, ఒక ప్లేట్ చికెన్ సిక్స్ టీ ఫైవ్....ఒక ఫుల్ బాటిల్ మందు.....తెల్సుగా  మన బ్రాండేమిటో? ఇవన్నీ తీస్కురా."

    "అలాగే సార్!"

    ఇన్స్ పెక్టర్  పర్సులోంచి  పది రూపాయలు నోటు  తీసి రాంబాబు చేతిలో పెట్టాడు.

    రాంబాబు తన చేతిలోని పదిరూపాయలవంకా, ఇన్స్ పెక్టర్ అప్పారావ్ మొహం వంకా మార్చిమార్చి చూశాడు అయోమయంగా.

    "సార్! మీరు అయిదొందల నోటనుకుని పోరబాట్న  పది రూపాయల నోటిచ్చారు సార్!" అన్నాడు.

    "దానికే అన్నీ వస్తాయ్ లే....తీసుకురా...."  కరుకుగా అన్నాడు ఇన్స్ పెక్టర్  అప్పారావ్.

    రాంబాబుకి విషయం అర్ధమైపోయింది.

    "సార్....ఈ టైంలో హోటల్స్  ఏమీ వుండవు  కద్సార్....?! హి హి హి...." బలవంతంగా నవ్వుతూ అన్నాడు రాంబాబు.

    "మన స్టేషన్ నుండి రెండు ఫర్లాంగుల  దూరం వెళితే  అక్కడ రోడ్డుకి లెఫ్ట్  సైడ్ లో "మై నాన్ వెజ్ ఫ్రెండ్" అనే ఇరానీ హోటలుంది. అది రాత్రి రెండుదాకా ఓపెన్ వుంటుంది. ఆ ప్రక్కనే వైన్ షాప్ కూడా వుంటుంది....నా పేరు  చెప్పు....కాస్త డిస్కౌంట్  ఇస్తారు" అన్నాడు ఇన్స్ పెక్టర్.

    రాంబాబుకి ఈసారి మరో   బ్రిలియంట్  ఐడియా  వచ్చింది. 

        "సార్....నేను కాకుండా చిన్నారావ్ అయితే మంచి ఫుడ్ తెస్తాడు సార్!" అన్నాడు.

    చిన్నారావ్ కంగారుపడ్డాడు.

    "ఏమో  సార్....నాకైతే  అస్సలు  నాలెడ్జి  లేద్సార్....అయినా బిర్యానీ అంటే ఏంటి సార్?" అంటూ  అమాయకంగా అడిగాడు.

    "నాటకాలాడకుండా  ఇద్దరూ వెళ్ళండి" అన్నాడు  ఇన్స్ పెక్టర్.

    రాంబాబు, చిన్నారావ్  ఇద్దరూ స్టేషన్  బయటికొచ్చారు.

    "దరిద్రుడికి పది రూపాయలకి మటన్ బిర్యానీ, చికెన్ సిక్స్ టీ ఫైవ్, మందు బాటిల్ ఇన్ని  కావాలి....వీడిలాంటి  వాడు కనుకనే వీడిపెళ్ళాం  లేచిపోయింది" కసిగా తిట్టాడు రాంబాబు.

    "వాడు  నాశనమైపోతాడు  అన్నాడు  చిన్నారావ్.

    ఇన్స్ పెక్టర్ అప్పారావ్  చెప్పిన ఐటమ్స్ కి ఎంత  బిల్లవుతుందో దాన్ని వాళ్ళు చెరిసగం  భరించాలి! అదీ వాళ్ళ బాధ.

    రాంబాబు, చిన్నారావ్ లు ఆ చీకట్లో భారంగా  అడుగులు ముందుకు వేశారు.



                               *    *    *    *


    రాంబాబు, చిన్నారావ్ లు అటు వెళ్ళీ  వెళ్ళగానే  పోలీస్ స్టేషన్ లో ఫోన్ మోగింది.

    ఇన్స్ పెక్టర్ అప్పారావ్ రిసీవర్ ఎత్తి  "హలో...." అన్నాడు.

    "హలో....లింగారావ్ హియర్!" అంది   అవతలి నుండి   పోలీస్ కమీషనర్ లింగారావ్ గొంతు.
    "ఆ....చెప్పు....చోరీనా, మర్డరా?" తాపీగా అడిగాడు ఇన్స్ పెక్టర్ అప్పారావ్.

    "కాదు....కిడ్నాప్" అవతల్నుండి సీరియస్ గా పోలీస్ కమీషనర్.

    "సరేలే....ఇప్పుడు ఫోన్ చేస్తే ఏం  లాభం....? రేపు స్టేషన్ కొచ్చి రిపోర్ట్ ఇవ్వు" నిర్లక్ష్యంగా  అన్నాడు.

    "హలో! నేను మామూలు లింగారావ్ ని కాదు. పోలీస్ కమీషనర్ లింగారావ్ ని!" అరుస్తూ అంది అవతలి గొంతు.

    ఇన్స్ పెక్టర్ అప్పారావ్  కంగారుగా గబుక్కున లేచి   నిలబడి సెల్యూట్ చేస్తూ  "సారీ సార్....లింగారావ్ అంటే ఎవరో అనుకున్నాగానీ మీరని అనుకోలేదు సార్....కానీ అమ్మగార్ని కిడ్నాప్ చేసి, వాడేమి బావుకుందామని  అనుకుంటున్నాడో  నాకేం అర్ధంకావడం  లేద్సార్...." అన్నాడు.

    "కిడ్నాప్ చేసింది మా అమ్మనికాదు....ఆవిడపోయి  పది సంవత్సరాలయింది" చికాగ్గా పలికింది కమీషనర్ లింగారావ్ గొంతు.

    ఇన్స్ పెక్టర్  ఫకాలుమని నవ్వేశాడు.

    "మీరు భలేగా మాట్లాడ్తారు సార్....అమ్మగారంటే నా ఉద్దేశం ఆ అమ్మగారని కాద్సార్! మీ భార్యగారని సార్! హి హి హి"

    "కిడ్నాపైంది మీ అమ్మగారుకాదు. ఛీ ఛీ....నా భార్యకాదు. మా పాపని గజదొంగ మంగులు కిడ్నాప్ చేశాడు. అసలే నేను టెన్షన్ లో వుంటే వెధవ జోకులేస్తావా?" మండిపడ్డాడు కమీషనర్ లింగారావ్.

    "సారీ సార్! సిచ్యుయేషన్  లైట్ చేద్దామని నేనలా మాట్లాడా...." మెల్లగా అన్నాడు ఇన్స్ పెక్టర్  అప్పారావ్.

    "లిజన్! మా పాపని  గజదొంగ మంగులు కిడ్నాప్ చేస్కుని వెళ్ళి పోయాడు. వాడు పాత చిత్తుకాగితాలు ఏరుకునేవాడి  గెటప్ లో వున్నాడు. వాడి భుజంమీద ఓ గోనెసంచి వుంటుంది. దాంట్లో మా పాప వుంటుంది" చెప్తున్నాడు పోలీస్ కమీషనర్ లింగారావ్.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS