Previous Page Next Page 
అందరూ దొంగలే పేజి 14

    లింగారావ్ మాటలకి ఇన్స్ పెక్టర్ అప్పారావ్ అడ్డు తగిలాడు.

    "సరేగానీ పాపకి  ఎక్కడెక్కడ పుట్టుమచ్చలున్నాయో....లేదా శరీరం మీద ఏవైనా గుర్తులున్నాయో కాస్త చెప్తారా సార్?" వినయంగా అడిగాడు ఇన్స్ పెక్టర్.

    ఈ ప్రశ్న వినగానే అవతల నుండి పోలీస్ కమీషనర్ లింగారావ్ కోపంతో రంకెవెయ్యడం  మొదలెట్టాడు.

    "నువ్విలాంటి చావు తెలివితేటలు ప్రదర్శిస్తే నడిరోడ్డులో నీ బట్టలూడదీయించి, నీకు ఎక్కక్కడెక్కడ  పుట్టమచ్చలున్నాయో   జనంచేత వెతికిస్తా....కబడ్దార్...."

    "సారీ సార్" అన్నాడు ఇన్స్ పెక్టర్  అప్పారావ్.

    "నేను అన్ని పోలీస్ స్టేషన్స్ నీ అలర్ట్ చేశా....ఆ మంగులుగాడు మీ పోలీస్ స్టేషన్ వైపే వచ్చినట్టుగా అనుమానం వచ్చి నీకు ఫోన్ చేశా....నువ్వు వెంటనే బయలుదేరి రోడ్లన్నీ  సెర్చ్ చెయ్" అంటూ ఫోన్ పెట్టేశాడు కమీషనర్  లింగారావ్.

    ఇన్స్ పెక్టర్ కంగారుగా గది బయటికొచ్చి వసారాలో కునుకుతున్న కానిస్టేబుల్ 420ని  తట్టిలేపి "నువ్వు స్టేషన్ ని జాగ్రత్తగా చూస్కో....కమీషనర్ గారు నాకు అర్జంట్ పని అప్పజెప్పారు" అని వసారా మెట్లు దిగి అక్కడున్న మోటార్ బైక్ ఎక్కి ఒక్కకిక్ తో స్టార్ట్ చేశాడు.

    మోటార్ బైక్ ముందకు దూసుకెళ్ళింది.

    కానీ ఆ సమయంలో అక్కడికి నాలుగు సందుల  వెనకాలే గజదొంగ మంగులు భుజంమీద గోనెసంచితో  పోలీసుల్ని  తప్పించుకుని పరుగులు తీస్తున్నాడన్నా  విషయం ఇన్స్ పెక్టర్ అప్పారావ్ కి తెలీదు పాపం!



        *    *    *    *


    రాంబాబు ఇంకా మండిపడ్తూనే  వున్నాడు.

    "అసలు ఈ పది రూపాయలైనా  ఎందుకిచ్చినట్టు? మీ డబ్బుల్తో  నా కింత పిండం పడెయ్యండని చెప్పొచ్చుగా?" అన్నాడు.

    "బహుశా మన పిండం కోసం  ఆ పది రూపాయలిచ్చాడేమో...." అన్నాడు చిన్నారావ్ నెత్తిమీద  క్యాప్ సరిజేస్కుంటూ.

    రాంబాబుకి తిక్కపుట్టి చిన్నారావ్ డొక్కలో   మోచేత్తో ఓ పోటు  పొడిచాడు.

    చిన్నారావ్ బాధగా మూలిగాడు.

    వాళ్ళిద్దరూ "మై నాన్ వెజ్ ఫ్రండ్" హోటల్  సమీపిస్తుండగా ఓ సంఘటన జరిగింది.

    అడ్డచారల బనీను, మెడలో మఫ్లర్, గళ్ళ లుంగీతో, నడుంకి పటకా బెల్టుతో, గుబురు మీసాల్తో వున్న ఓ వ్యక్తి హడావిడిగా వాళ్ళకి ఎదురొస్తూ  రాంబాబుని డ్యాష్ కొట్టి అతని జేబులోని పర్సు కొట్టేశాడు.

    "ఏంటయ్యా ఆ హడావిడీ....? కళ్ళు కనిపించడం లేదా?" అంటూ ఆ వ్యక్తిని కసిరాడు రాంబాబు.

    "సారీ కానిస్టేబుల్ గారూ...." అని అన్నాడు ఆ వ్యక్తి.

    "కానిస్టేబుల్ కాదు....హెడ్ కానిస్టేబుల్!" హెడ్ దగ్గర వత్తిపలుకుతూ  అన్నాడు రాంబాబు
.
    "సారీ హెడ్ కానిస్టేబుల్ గారూ....మా అమ్మ  చావు  బతుకుల్లో వుంటే మందులు  కొనుక్కుని హడావిడిగా వెళుతూ చూస్కోక  మిమ్మల్ని డ్యాష్ కొట్టాను....నన్ను  క్షమించండి బాబూ....!" అన్నాడు  ఆ జేబుదొంగ.

    "ఒక్కే....ఒక్కే....ఈసారి ఆ డ్యాష్  కొట్టేదేదో  కాస్త చూసుకుని కొట్టు" అన్నాడు.

    ఆ జేబుదొంగ ఇద్దరికీ  నమస్కరించి  మెల్లగా  నడుచుకుంటూ ప్రక్క సందులోకి తిరిగి తను రాంబాబు  జేబులోంచి కొట్టేసిన పర్సుని  వెలిగే కళ్ళతో ఓసారి చూస్కోని  "వీడు హెడ్  కానిస్టేబుల్ కాదు....హెడ్ లేని కానిస్టేబుల్" అని మనసులో అనుకుని ఒక్కసారిగా పరుగుతీశాడు. 

    రాంబాబు, చిన్నారావ్ లు మరో నాలుగడుగులు వేసి  "మై నాన్ వెజ్ ఫ్రండ్" హోటల్ దగ్గరికి వచ్చేశారు.

    హోటల్  లోపలికి  వెళుతుండగా మరో  సంఘటన....

    పోలీసుల్ని తప్పించుకోవాలని పరుగులు పెడుతున్న గజదొంగ మంగులు సరిగ్గా అదే సమయానికి ఆ వైపుగా పరుగులుతీస్తూ రాంబాబుని డ్యాష్ కొట్టి, ఆగకుండా భుజంమీద మూటతోసహా  ముందుకు  పరుగులు తీశాడు.

    "అరె....వెధవలు....! వర్సబెట్టి ఇలా డ్యాష్ లు కొట్టేస్తున్నారేంటీ  వీళ్ళ మొహంమండా...." అని తిట్టుకున్నాడు రాంబాబు. చిన్నారావ్ కిసుక్కున  నవ్వాడు.

    హోటల్ లోకి వెళ్ళి కౌంటర్ దగ్గర  "ఒక మటన్ బిర్యానీ, ఒక చికెన్ సిక్స్ టీ ఫైవ్ పార్సెల్" అంటూ జేబులో చెయ్యి పెట్టాడు రాంబాబు.

    రాంబాబు మొహం పాలిపోయింది. అతని చేతికి పర్సు తగల్లేదు.

    కంగారుగా మిగతా జేబులు కూడా వెతికారు.

    "ఏమైంది?" అడిగాడు చిన్నారావ్.

    "నా పర్సు కొట్టేశారు! ఇందాక  చారల బనీనువాడు  డ్యాష్ కొట్టి  వెళ్ళాడుకదా....వాడే పర్సు కొట్టేసి వుంటాడు."

    "కాదు....వాడు చూడ్డానికి చాలా మర్యాదస్తుడిలా  వున్నాడు....పాపం....వాళ్ళమ్మకి కూడా ఒంట్లో బాగోలేదు. ఇప్పుడు భుజంమీద గోనెసంచీతో డ్యాష్ కొట్టి పారిపోయాడే....వాడే నీ పర్సు కొట్టేసింది" అన్నాడు చిన్నారావ్.

    "అవును....అందుకే అంత కంగారుగా పరిగెత్తాడు."

    "వాడు ఇప్పుడేకదా డ్యాష్ కొట్టాడు. ఇంకా  ఎక్కువదూరం పరిగెత్తి  వుండడు" అన్నాడు   చిన్నారావ్.

    "పద....వెధవని చితకబాదుదాం" అన్నాడు రాంబాబు.

    ఇద్దరూ హోటల్లోంచి  బయటకొచ్చి  చీకట్లోకి పరుగుతీశాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS