Previous Page Next Page 
అందరూ దొంగలే పేజి 12

    "ఏంటది?" ఇన్స్పెక్టర్   మొహంలో  ఆశ్చర్యం.

    "మీరే చూడండి సార్....ఒరేయ్ చిన్నారావ్ నువ్వుకూడా రా...." అన్నాడు రాంబాబు సెల్ వైపు అడుగులువేస్తూ. చిన్నారావ్ అతన్ని  అనుసరించాడు.

    రాంబాబు సెల్ తాళం తీశాడు. ఇద్దరూ లోపలికి వెళ్ళారు.

    ఇద్దర్నీ  సెల్ లోని  దొంగ  జంగయ్య  నిర్లక్ష్యంగా  చూశాడు. రాంబాబు తన చేతిలోని కాగితాల్లో సగం చిన్నారావ్ చేతికిచ్చాడు. వాటిలో ఒక కాగితం కాస్త చదివిన చిన్నారావ్  సంతోషంతో కెవ్వున  అరిచాడు.

    "ఇప్పుడు వీడు నిజం చెప్పక  చస్తాడా?" అన్నాడు.

    ఇన్స్ పెక్టర్ అప్పారావ్ తన సీట్లో కూర్చునే జరుగుతున్న తతంగం కుతూహలంగా గమనిస్తున్నాడు.

    "ఏరా....నువ్వు దొంగిలించిన నగలు ఎక్కడ  దాచావో  చెప్తావా లేదా?" రాంబాబు జంగయ్యని అడిగాడు.

    "అయ్యబాబోయ్....నేనసలు  దొంగతనమే చెయ్యలేదంటే  నగలు ఎక్కడ దాచావని అడుగుతారేంటి?" నెత్తిన చెయ్యి పెట్టుకుంటూ అన్నాడు జంగయ్య.

    "ఓహో....అయితే  చెప్పదల్చుకోలేదన్నమాట....!" రాంబాబు  జంగయ్య వంక  చిలిపిగా  చూస్తూ అన్నాడు.

    "నాకు తెలీదు  బాబూ....తెలిస్తే  చెప్పనా?" అన్నాడు జంగయ్య.

    "అలాగయితే నీ ఖర్మ" అంటూ రాంబాబు తన చేతిలోని  కాగితాలు విప్పదీశాడు  చదవడానికి.

    "ఇవేంటో  తెల్సా....? కవితలు!! మా కాలనీలో  ఓ నీచ నికృష్టకవి  వీటిని రాశాడు....ఇవి నీకు చదివి వినిపిస్తే  దెబ్బకి దార్లోకి  వస్తావ్  అన్నాడు.

    "వినిపించండి సార్....కవితలు నేనెప్పుడూ  విన్లేదు" హుషారుగా అన్నాడు  జంగయ్య.

    "చావడానికంత  తొందరెందుకూ? కాస్త  ఓపిక  పట్టు!" అన్నాడు  చిన్నారావ్  జంగయ్యతో.

    రాంబాబు  గొంతు  సవరించుకుని ఓ  కవిత చదవడం మొదలు బెట్టాడు.

    "అదిగదిగో  పిల్లి
    ఆకాశంలో  జాబిల్లి
    గోడమీద  బల్లి
    మా ఊరు  సత్తుపల్లి...."

    ఆ వెంటనే జంగయ్య  హుషారుగా  అందుకని  ఇలా  అన్నాడు. "భలేవాడిని కన్నది నీ తల్లి....ఇట్టా ముగిస్తే బాగుంటుంది కద్సార్?!"

    "నీ బొందలా  వుంటుంది" జంగయ్యతో    అని "ఇప్పుడు నువ్వు మరింత నీచ నికృష్టమైన  కవిత వీడికి వినిపించు" అన్నాడు చిన్నారావ్ తో రాంబాబు.

    చిన్నారావ్ తన చేతిలో  వున్న కవితల్లో ఒకదానిని  చదవడం  మొదలుబెట్టాడు.

    "పార్కులో లవ్వు
    ప్రియురాలి నవ్వు
    ఒంట్లో కొవ్వు
    కరెంటు షాకు జివ్వు
    నలిగిపోయిన పువ్వు
    రోడ్డుమీద గోతులు తవ్వు...."

    వెంటనే రాంబాబు  మరో  కవిత  అందుకున్నాడు. దాని తర్వాత చిన్నారావ్....ఆ తర్వాత మళ్ళీ రాంబాబు....

    ఇలా ఒకరి తర్వాత ఒకరు కవితలు వర్సబెట్టి  చదవడం మొదలుబెట్టారు. "ఓ....క్" డోక్కున  శబ్దం.

    "హాయ్....హాయ్....కక్కుతున్నాడు-కక్కుతున్నాడు" సంబరంగా అన్నాడు  చిన్నారావ్.

    "తర్వాత  అసలు  నిజాన్ని  కక్కుతాడు" అన్నాడు రాంబాబు హుషారుగా.

    అ ప్రక్కన  కూర్చున్న   ఇన్స్ పెక్టర్   అప్పారావ్ మండిపడ్డాడు.

    "మీ బొంద....ఆ కక్కిన శబ్దం  నాది....మీరు, వాడిని కాదు....నన్ను హింస పెడ్తున్నారు....మీ కవితలు  ఆపకపోతే  ముందు  మిమ్మల్ని  లాఠీలతో  కుళ్ళబొడుస్తా."


                                                                                5


    జంగయ్య  పకపకా నవ్వాడు.

    "మీరేమో నా కోసం  కవితలు చదివితే  అవి సార్ కి దెబ్బకొట్టాయి" అన్నాడు నవ్వాపుకుంటూ.

    "చదివింది చాలు....ఇలా రండి" కోపంగా అన్నాడు  ఇన్స్ పెక్టర్  అప్పారావ్.

    రాంబాబు, చిన్నారావ్ సెల్ బయటికొచ్చి, సెల్ తలుపేసి, తాళం పెట్టి ఇన్స్ పెక్టర్  అప్పారావ్ దగ్గరకెళ్ళి  ఎదురుగా నిలబడ్డారు.

    "ఎవడ్రా ఈ కవితలు రాసింది?!" దాదాపు  అరుస్తున్నట్టుగా అడిగాడు ఇన్స్ పెక్టర్ అప్పారావ్.

    చిన్నారావ్ నాకు తెలీదు అంతా ఇతనికే తెలుసన్నట్టుగా  రాంబాబు వంక చూశాడు.

    "మా కాలనీలోనే  వెలుగుశ్రీ   అనే కవున్నాడు సార్! వాడే ఈ కవితలు రాశాడు సార్! చిన్నప్పటినుండీ  వాడు ఇలాంటి కవితలే  రాస్తున్నాడు సార్! మొన్నొకరోజు  ఇంటికొచ్చిన  ఓ  హార్ట్ పేషంట్ కి వెలుగుశ్రీ గాడు  కవితలు వినిపిస్తే  ఆ హార్ట్ పేషంట్ గుండాగి  చచ్చిపోయాడు సార్!" చెప్పాడు రాంబాబు.

    "ఇప్పుడు నన్ను చంపడానికి  తీస్కొచ్చారా  ఆ కవితలు?!" చికాకుగా అడిగాడు  ఇన్స్ పెక్టర్  అప్పారావ్.

    "అంటే క్రిమినల్స్ ని  హింస  పెట్టడానికేమైనా   పనికొస్తాయోమోననీ...." టోపీ తీసి బుర్ర గోక్కున్నాడు  రాంబాబు.

    "అఘోరించలేకపోయావ్....ఆ   వెలుగుశ్రీ గాడిని కాస్త  ఒళ్ళు  దగ్గరెట్టుకుని కవితలు రాయమను....ఇంకోసారి   ఇలాంటి పిచ్చిపిచ్చి  కవితలు రాస్తే వెలుగుశ్రీ  గాడి జీవితంలో వెలుగనేదే  లేకుండా చేస్తా....ఏదైనా తప్పుడు కేసు బనాయించి వాడిని బొక్కలో తోసి వాడికి, వాడు రాసిన కవితల్నే  వినిపించి చంపుతానని వార్నింగ్ ఇవ్వు!" అన్నాడు ఇన్స్ పెక్టర్  అప్పారావ్.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS