"మరి ఎందుకు నాన్నా గోపిని ఇంటినుండి తరిమేశావ్?"
"ఎందుకా? కొత్తగా పెళ్ళైన ఆ జంట మన మధ్యన వుంటే సుఖంగా వుండలేరని బాబూ! పాపం... రాధ తన భర్తకి తనే స్వయంగా సేవ చెయ్యాలని అనుకుంటుంది. కానీ అన్నపూర్ణ రాధకి ఆ అవకాశం ఇవ్వకుండా తనే గోపీకి పళ్ళు తోముతుంది, తనే గోపీకి స్నానం చేయిస్తుంది, అన్నం తినిపిస్తుంది, అన్ని సేవలూ చేస్తుంది. అందుకే బాబూ నా గుండె రాయి చేస్కుని వాళ్ళని ఇంటనుండి తరిమేశాను....అందుకే.
పరంధామయ్య నేలమీద పడి కుప్పలా కూలిపోయి ఘొల్లుమన్నాడు.
11
గోపి హుషారుగా రిక్షా తొక్కుకుంటూ యింటికి వెళుతున్నాడు. ఎందుకో ఇందాక తండ్రిని కలిసిన దగ్గర్నుండీ అతని మనసు వూరూర్కే పులకించిపోతూంది.. తను త్వరగా ఇంటికి వెళ్ళాలి! తన భార్యకీ, తల్లికీ తను తండ్రిని కలిసిన విషయం చెప్పాలి. తండ్రి ఇచ్చిన రెండురూపాయలూ వాళ్ళకి చూపించి వాళ్లని ఆశ్చర్యంగా, ఆనందంలో ముంచెత్తివెయ్యాలి!!
ఇలా ఆలోచిస్తూ రిక్షా హుషారుగా తొక్కుతున్నాడు.
కానీ హఠాత్తుగా అతను వూహించని సంఘటన ఎదురైంది.
రాయుడి తాలూకు నలుగురు రౌడీలూ పొదచాటునుండీ బయటికి బిలబిలా వచ్చి రోడ్డుకి అడ్డంగా నిలబడ్డారు.
గోపి రిక్షాని సడెన్ బ్రేక్ వేసి ఆపాడు..అలా సడెన్ బ్రేక్ వెయ్యడంవల్ల ఆ కుదుపుకి ఒక్కసారిగా పైకెగిరి క్రిందిపడి, మళ్ళీ నేలమీదినుంచి లేచి బట్టలకంటిన దుమ్ము దులుపుకొని రౌడీలవంక చూసి, "నాకేం దెబ్బ తగల్లేదుగా" అన్న భావం వచ్చేలా ఈజీగా నవ్వేశాడు.
ఏంటి?... నలుగురూ పొదలచాటునుండి బయటకు వచ్చారు? నెంబర్ టూ వెళ్ళి వస్తున్నారా?" అడిగాడు గోపి రౌడీలని.
"ఛీ.. యేం కాదు... నీకోసం దారికాచి అలా దాక్కున్నాం అంతే" అన్నాడు ఒక రౌడీ.
"దారి కాచారా? ఎందుకూ?" అడిగాడు గోపి.
గోపి అమాయకత్వానికి నలుగురు రౌడీలూ మొహమొహాలు చూస్కుని ఫకాలుమని నవ్వారు.
"దారి ఎందుకు కాశామా? చెప్తా... చెప్తా... ముందు నీ జేబులో డబ్బులు తియ్.." అన్నాడు రెండో రౌడీ.
"రౌడీసులూ..." బాగా, ఆవేశంగా అరిచాడు గోపి. "ఇది నేను ఎంతో చెమటోడ్చి రిక్షాతొక్కి సంపాదించిన డబ్బు... ఈ డబ్బు మీ రాయుడికున్న కోట్ల రూపాయలకన్నా విలువయినది... తెల్సా?"
"అలాగా... ఎందుకూ?" ఆశ్చర్యంగా చూస్తూ అయోమయంగా ప్రశ్నించారు నలుగురు రౌడీలూ.
"ఎందుకంటే ఈ డబ్బులో దేవుడులాంటి మా నాన్నగారు ఇచ్చిన రెండు రూపాయలు కూడా కలిసివున్నాయ్... మా నాన్నగారు ఇచ్చిన పవిత్రమైన రెండు రూపాయలు!" పవిత్రమైన రెండు రూపాయలు అన్నదగ్గర వత్తి పలుకుతూ అన్నాడు గోపి.
"ఛా! ఇది మరీబాగుంది... పోయిన్సారేమో మీ అమ్మ పోపులడబ్బాలో దాచుకున్న పవిత్రమైన డబ్బు అన్నావ. ఇప్పుడేమో మీ నాన్న ఇచ్చిన పవిత్రమైన డబ్బు అంటున్నావ్. చూస్తుంటే మీ ఇంట్లోని ప్రతిపైసా పవిత్రమైనదిలానే వుంది. హ్హ....హ్హ...హ్హ...."నవ్వాడు మొదటిరౌడీ.
మిగతా ముగ్గురు రౌడీలు కూడా ఘొల్లున నవ్వారు హేళనగా.
వాళ్ళు అలా నవ్వేసరికి ఆవేశం పొంగుకొచ్చింది.
"దేవతల్లాంటి మా అమ్మా నాన్న పవిత్రమైన డబ్బులగురించి చులకనగా మాట్లాడతార్రా? ఒరేయ్ మిమ్మల్నేం చేస్తానో చూడండి..." అంటూ గోపి నలుగురు రౌడీలను చితకబాది కాలువలోకి తోసిపారేశాడు.
రౌడీలు కాలువ ఈదుకుంటూ అవతలి ఒడ్డుకు చేరుకున్నారు.
"హు.... చివరికి మనం ఊహించినట్టే జరిగింది. బాగా కాజాలు తినిపించి పంపించాడు" అన్నాడు నలుగురిలో కాస్త తెలివైన రౌడీ.
గోపి అక్కడినుండి ఇంటికి హుషారుగా రిక్షా తొక్కుకుంటూ వెళ్ళాడు. ఇంట్లో వెళ్ళగానే గోపికి ముందుగా సరస్వతి ఎదురొచ్చింది.
అంతే...
గోపి అమాంతం ఆమెను పైకి ఎత్తుకుని గిరగిరా తిప్పసాగాడు.
సరస్వతి బెంబేలు ఎత్తిపోయి గోలగోలగా అరిచింది.
` "ఒరేయ్ ఏంట్రా ఈ పిచ్చిచేష్టలూ!"
"పిచ్చి చేష్టలు కాదమ్మా...ఆనందం! నా మనసు ఆనందంతో ఊగిపోతుందమ్మా" అన్నాడు గోపి మరింత స్పీడ్ గా తిప్పేస్తూ.
"నీ ఆనందం మంటెట్టా. నా కళ్లు తిరుగుతున్నాయ్. నీ తిప్పటం మాని నన్ను క్రిందికి దింపరా బడుద్ధాయ్" నెత్తి కొట్టుకుంటూ అంది సరస్వతి.
ఆమె అలా గగ్గోలు పెడుతున్నా గోపి ఆమె మాట వినకుండా ఇంకాస్సేపు ఆమెని గిరగిరా తిప్పి నేలమీదకు దించాడు. ఆ దెబ్బకు కళ్ళుతిరిగిన సరస్వతి నేలమీద గోడకు ఆనుకుని కూర్చుండిపోయింది.
అంతలో రాధ అక్కడకు వచ్చింది.
"ఎంతసేపైందండీ మీరొచ్చి?" అని గోపీని అడిగింది.
సరస్వతి నెత్తీనోరూ కొట్టుకుంటూ రాధతో అంది "ఒసేవ్ కోడలుపిల్లా! వాడిదగ్గరకు వెళ్ళకు, వాడసలే ఆనందంగా వున్నాడు"
కానీ అప్పటికే జరగాల్సిన ప్రమాదం జరిగిపోయింది. గోపి రాధని లటుక్కున అందుకొని పైకెత్తి సరస్వతిని తిప్పినదానికి డబుల్ స్పీడులో గిరగిరా తిప్పి సరస్వతి ప్రక్కనే నేలమీద కూలేశాడు. బుర్ర తిరిగిపోతుండగా కాస్సేపు అలానే నేలమీద కూర్చుని మెల్లగా తేరుకుని ఇద్దరూ లేచి నిలబడ్డారు.
"హద్దులు మీరిన నీ ఆనందానికి కారణం ఏమిటండీ?" రాధ కూడా అడిగింది.
"సృష్టి చలా విచిత్రమైనది రాధా... ఈ సృష్టిలో తండ్రి, కొడుకుల బంధం మరీ పవిత్రమైనది! ఆ బంధం పైకి డీలాడీలాగా అనిపించినా చాలా గట్టిది రాధా" ఆవేశంగా అన్నాడు గోపి.
"హేవండీ! మమ్మల్నిద్దర్నీ గిరగిరా తిప్పారుకదా! మీ బుర్రతిరుగుడు ఇంకా తగ్గినట్టు లేదు. కాస్సేపు విశ్రాంతిగా కూర్చుని తర్వాతే చెప్పండీ" అంది రాధ గోపివంక జాలిగా చూస్తూ.
"బుర్రతిరుగుడు కాదు రాధా..నిజంగానే చెప్తున్నాను... విధి సృష్టికన్నా చిత్రమైనది రాధా .... ఎదుకు ఎప్పుడు మనుషుల్ని విడదీస్తుందో, ఎందుకు ఎప్పుడు మనుషుల్ని కలుపుతుందో అస్సలు అర్థమే కాదు..." ఆనందంగా పకపకా నవ్వుతూ అన్నాడు గోపి.
"అబ్బా. సర్లేబాబూ... అసలు విషయం చెప్పు. మమ్మల్నెందుకు గిరగిరా తిప్పావ్?' విసుగ్గా అడిగింది సరస్వతి.
"హమ్మా!" గోపి ఒక్కసారిగా గావుకేక పెట్టి బాధగా జుట్టు పీక్కున్నాడు.
ఆ కేకకి రాధా, సరస్వతి ఉలిక్కిపడ్డారు.
"తల్లి అంటే దైవస్వరూపురాలమ్మా. తల్లిఅంటే అదోకరమైన మమతల కోవెలమ్మా.అటువంటి దైవస్వరూపరాలైన, మమతల కోవెలైన తల్లి అలా విసుక్కోవచ్చామ్మా?" చొక్కా కాలరు నలిపేస్కుంటూ సైడ్ యాంగిల్లో తల పైకెత్తి అన్నాడు.
"తప్పయిపోయింది బాబూ, తప్పయిపోయింది" సరస్వతి ఛెళ్.. ఛెళ్ మని చెంపలు వాయించుకుంది. ఇప్పుడు చెప్పుబాబూ అసలేమైంది?" చిరునవ్వులు చిందిస్తూ అడిగింది సరస్వతి.
"హమ్మా. నాకు నాన్నారు కనిపించారమ్మా..." ఆనందంగా అన్నాడు గోపి.
"బాబూ! నేను ఎంతో కష్టపడి ఎన్నో ఏళ్ళుగా పోపులడబ్బాల్లో డబ్బులు దాచుకుని కూడబెట్టి రిక్షా తొక్కుకుంటూ బ్రతకమని ఆ డబ్బులు నీకిస్తే నువ్వేమో రిక్షాలో గుర్రుకొట్టి నిద్రపోతూ కలలు కంటున్నావా బాబూ?" బాధతో మెలికలు తిరిగిపోతూ అంది సరస్వతి.
"అమ్మా. నేను నాన్నారిని కలలో కాదమ్మా నిజంగానే చూశాను" ఆనంద భాష్పాలు రాలుస్తూ అన్నాడు గోపి.
"ఆ... నిజంగానే చూశావా?" ఆశ్చర్యంగా, ఆనందంగా అడిగింది సరస్వతి.
"ఆ. మావయ్యగారిని నిజంగానే చూశారా?" రాధకూడా ఆనందంగా అడిగింది.
"చూడడమే కాదు. ఆయన నా రిక్షాకూడా ఎక్కి నాకు రెండురూపాయలు ఇచ్చారు." అంటూ జేబులోంచి పరంధామయ్య ఇచ్చిన రెండురూపాయల నోటు తీసి చూపించాడు.
ఆ రెండు రూపాయల నోటుని చూసి రాధ, సరస్వతి ఇద్దరూ ఆనందభాష్పాలు బొటబొటా కార్చారు. వాళ్ళిద్దర్నీ చూసి గోపికూడా ఆనందభాష్పాలు కార్చడం మొదలుబెట్టాడు.
అలా ముగ్గురూ కాస్సేపు ఆనందభాష్పాలు కార్చిన తర్వాత సరస్వతి సిగ్గుపడుతూ అంది "ఆయన బాగున్నారా బాబూ?"
"బాగున్నారమ్మా" సమాధానం చెప్పాడు గోపి.
