Previous Page Next Page 
చిత్రం భళారే విచిత్రం పేజి 12

    ఆ రోజు...
    సెంటర్ లో సోడా తాగి రిక్షా గూడులో కాళ్ళు బార్లా చాపుకుని బీడి ముట్టించాడు గోపి. అతను బీడిపొగ నోటినిండా పీల్చి బయటికి దట్టంగా వదుల్తున్నాడు.
    అలా పొగ వదులుతూ వదులుతూ ఆకాశం వంక చూస్తూ ఊహాలోకాల్లోకి తేలిపోతూ రాధని ఒక అప్సరసగెటప్ లో ఊహించుకున్నాడు. తనని  ఒక రాజకుమారుడికి గెటప్  లో ఊహించుకున్నాడు.
    అతని ఊహల్లో...
    రాధ చిన్న బాడీ వేస్కుంది. అది తళుక్కు తళుక్కు మని మెరుస్తూ ఉంది. అలాగే తళుక్కు తళుక్కున మెరిసే ఒక తెల్ల లంగా బొడ్డుకు బెత్తెడు కింద కట్టుకుంది.
    రాధ తల మీద చిన్న కిరీటం ...  దాన్నిండా ముత్యాలూ, వజ్రాలూ...
    రాధ వయ్యారంగా నడుస్తూ రాజకుమారుడు గెటప్ లో ఉన్న గోపీని కింద పెదవి కొరికి రమ్మన్నట్టు పిలిచింది.
    గోపి నేను రాను అన్నట్టుగా తల వూపాడు.
    హంతే!
    రాధ కొంపలు మునిగినట్టు గాల్లో ఇంతెత్తున గెంతి పాట అందుకుంది.
    "రారా... నీ యవ్వా   
    ఈ జాగేలరా....
    సయ్యాటలాడాలిరా
    ఈ వేళరా...
    గోపీ కూడా రాధ కంటే ఎత్తుకి చెంగున ఎగిరి పాట అందుకున్నాడు.
    "వస్తాను.... నీ యక్క
    ఆగాలిలే
    ఒళ్ళంత చెమటోడి
    ఆడాలిలే"
    ఇద్దరూ క్లాసికల్ డ్యాన్స్ చేస్తూ ఉన్నట్టుండి కాళ్ళూ చేతులూ వంకరగా పెట్టి పోలియో రోగుల్లా దేకుతూ, పాకుతూ బ్రేక్ డ్యాన్స్ మొదలుపెట్టారు.
    అలా... అందంగా ... వికారంగా డ్యాన్స్ చేశారు.
    తన ఊహలోని ఏ డ్యాన్స్ పరవశంగా చూస్తూ ఉండిపోయాడు గోపి.
    పాటా, డ్యాన్సూ అయిపోయినా అతను అలా కూర్చుండిపోయాడు ఒక విధమైన ట్రాన్స్ లో.
    "ఏయ్ రిక్షా" ఎవరో గట్టిగా పిలిచేసరికి అతను ఈ లోకంలోకి వచ్చాడు.
    కంగారుగా చేతిలోని బీడీ పారేసి రిక్షా దిగి తలపాగవిప్పి ఓసారి గట్టిగా విదిలించి రిక్షా సీటు దాంతో తుడిచి "రండి సార్! కూర్చోండి" అని తలెత్తి ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి ఒక్కక్షణం ఆశ్చర్యపోయాడు గోపి.
    ఎదురుగా తన కన్న తండ్రి.
    గోపి మొహం చూసిన ఆయన కూడా కొన్ని క్షణాలు ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత చెప్పలేనంత ఇబ్బంది పడిపోయాడు.
    గోపి ఒక్కసారిగా చెవుల్దాకా నవ్వేసి "నాహాన్నా..." అన్నాడు ఆనందంగా.
    "ఆ.... ఆ... సరేసరే రిక్షా కట్టు" అన్నాడు పరంధామయ్య తన మొహంలోని భావాలని అతనికి కనపడనీయకుండా జాగ్రత్తపడుతూ.
    "ఎక్కడికి వెళ్ళాలి నాన్నా ?" ప్రేమనంతా గొంతులో అనవసరంగా పలికిస్తూ అన్నాడు గోపి.
    "గాంధీ బొమ్మ దగ్గరకు పద" రిక్షా ఎక్కుతూ అన్నాడు పరంధామయ్య.
    గోపి హుషారుగా రిక్షా సీటు మీదికి ఒక్క గెంతు గెంతాడు.
    రిక్షా ముందుకు కదిలింది.
    పరంధామయ్య కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.
    గోపి హుషారుగా రిక్షా తొక్కుతూ ఓ సారి వెనక్కి తిరిగి తండ్రివంక చూశాడు.
    పరంధామయ్య చటుక్కున తల పక్కకి తిప్పేశాడు తన కళ్ళలోని నీరు కనపడకుండా.
    అవి కన్నీళ్ళు కావు.
   ఆనంద భాష్పాలు.
    తన కొడుకు ప్రయోజకత్వానికి కారుస్తున్న ఆనంద భాష్పాలు.
    "అన్నయ్యా, వదినా ఎలా ఉన్నారు నాన్నా" అడిగాడు గోపి.
    "బాగానే ఉన్నారు" ఎటో చూస్తూ సమాధానం చెప్పాడు పరంధామయ్య.
    "దీప..."
    "దీప కూడా బాగుంది."
    ఇద్దరి మధ్య నిశ్శబ్దం.
    తండ్రిని చూసిన ఆనందంతో గోపి మనసులో హఠాత్తుగా కొన్ని సితార్లు మోగాయ్.
    పరంధామయ్య కంగారుగా రోడ్డుకి అటూ ఇటూ చూశాడు. అతడికి ఏమీ కనిపించలేదు.
    వెనక్కి తిరిగి చూశాడు.
    ఉహు! అక్కడ ఏమీ కనిపించలేదు.
    మరి ఈ సితార్లమోత ఎక్కడినుండి వస్తుందబ్బా! అనుకున్నాడు.
    గోపి తండ్రి కన్ ప్యూజన్ గమనించి ముసిముసిగా నవ్వి తర్వాత అన్నాడు ఆ సితార్ల మోత ఎక్కడనుండో కాదు నాన్నా. నా గుండెలోంచి వస్తుంది. నిన్ను చూసిన ఆనందంలో అవి అలా యడా పెడా మోగిపోతున్నాయ్ నాన్నా."
    పరంధామయ్య ఉబ్బితబ్బిబ్బు అయిపోయాడు.
    కానీ అది గోపికి కనిపించనివ్వలేదు! బెట్టు!!
    గాంధిబొమ్మ వచ్చేసింది.
    పరంధామయ్య రిక్షా దిగాడు.
    "నీ పని అయ్యేదాకా ఇక్కడ ఉండనా నాన్నా?" అడిగాడు గోపి.
    "వద్దులేరా. నువ్వెళ్ళిపో." జేబులోంచి డబ్బులు తీస్కోడం ఏమిటి నాన్నా." అన్నాడు మొహమాటంగా.
    "ఉంచు. ఏం పరవాలేదు." అంటూ గోపి జేబులో రెండు రూపాయల నోటు దోపాడు పరంధామయ్య.
    గోపి సిగ్గపడ్తూ "హిహిహి" అని నవ్వాడు.
    పరంధామయ్య శూన్యంలోకి చూస్తూ గోపి భుజంతట్టి ముందుకు వెళ్ళిపోయాడు.
    పరంధామయ్య సుడిగాలిలా ఇంట్లోకి ప్రవేశించాడు.
    "శంకరం, అన్నపూర్ణా ఇలా రండర్రా..." అంటూ గట్టిగా అరిచాడు.
    ఆయన అరుపులకు శంకరం, అన్నపూర్ణా కంగారుగా హాల్లోకి పరుగెత్తుకుని వచ్చారు ఏం కొంప మునిగిందో అని అనుకుంటూ.
    కానీ పరంధామయ్య మొహంలోని ఆనందం చూడగానే వాళ్లు తేలికగా ఊపిరి పీల్చుకున్నారు.
    "ఏంటి నాన్నా అట్లా అరిచావ్?" తండ్రిని అడిగాడు శంకరం.
    "ముందు ఇద్దరూ నోరు చాపండి"
    "ఆ..." ఇద్దరూ నోళ్లని నీటిఏనుగులా చాపారు.
    పరంధామయ్య వాళ్ళనోట్లో స్వీట్ పెట్టాడు.
    "స్వీటు మరి నాకో.." అంటూ దీప అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చింది.
    పరంధామయ్య దీప నోట్లోకూడా స్వీట్ పెట్టాడు.
    "ఏంటి నాన్నా ఈ ఆనందం?" అడిగాడు శంకరం.
    "మన గోపీ ప్రయోజకుడయ్యాడ్రా శంకరం" ఆనందభాష్పాలు ధారాపాతంగా కారుస్తూ అన్నాడు పరంధామయ్య.
    "అవునా నాన్నా, తమ్ముడు కలెక్టర్ అయ్యాడా?" ఆనందంగా అన్నాడు శంకరం.
    "ఛీ.. కలెక్టర్ ఏంటీ? నా మరిది తాసీల్దారే అయి వుంటాడు" అంది అన్నపూర్ణ.
    "మీ ఇద్దరూ తప్పే. మన గోపీ రిక్షావాడు అయ్యాడ్రా... రిక్షావాడు అయ్యాడు!" ఛాతీ పొంగించి గర్వంగా అన్నాడు పరంధామయ్య.
    "మనిషి శ్రమించు పనిచెయ్యాలని, శారీరక శ్రమ చెయ్యడం తప్పేమీకాదని" బాధపడ్డాడు.
    "నాయనా గోపీ! ఎంత ప్రయోజకుడివి అయ్యావు బాబూ నువ్వు" ఆనందంతో గిలగిల్లాడిపోతూ అంది అన్నపూర్ణ.
    "నాన్నా .. అయితే మనం గోపీని మన ఇంటికి పిలిచేస్కుందామా.. ఆ తొక్కే రిక్షా ఏదో మనింటిదగ్గరే తొక్కుకుంటాడు" అన్నాడు శంకరం.
    "అవును తాతయ్యా... బాబాయ్ ని మన ఇంటికి తీస్కొస్తే నన్ను చక్కగా రిక్షాలో రోజూ స్కూలుకి తీస్కెళతాడు" సంబరంగా అంది దీప.
    పరంధామయ్య మొహం క్షణంలో వివర్ణమైంది.
    "వీల్లేదు... వీల్లేదు... వీల్ల్లేదు... గోపీ ఈ ఇంటికి రావడానికి వీల్లేదు....." హిస్టీరికల్ గా అరిచాడు పరంధామయ్య.
    "ఎందుకు వీల్లేదు నాన్నా... గోపీ పనీపాటా లేకుండా తిని తొంగుంటున్నాడనేగా ఇంటినుండి వెళ్ళగొట్టావ్.
 గోపీ ఇప్పుడు రిక్షా తొక్కుతూ ఈ ఊరంతటకీ ప్రయోజకుడయ్యాడు......" అన్నాడు శంకరం.
    పరంధామయ్య గుండెలు బాదుకుంటూ బాధపడ్డాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS