Previous Page Next Page 
జొన్నలగడ్డ రామలక్ష్మీ కధలు -1 పేజి 13

 

    ఆ యింట్లో కొండలరావూ , సీతారావమ్మ మిగిలారు.
    "నువ్వు లేకుండా -- ఈ సంసారమేలా గడుస్తుంది ?' అంటూ బాధపడింది సీతారావమ్మ.
    'అమ్మా! సంసారంలో యింతవరకూ నేను చేసిందేమీ లేదు. వృదాగా ఏదీ పోకుండా నిలబెట్టాను. మొదట్నించి మీరూ ఈమాత్రం జాగ్రత్తగా ఉన్నట్లయితే -- మనమిప్పుడింకా ఎంతో వైభవంగా ఉండేవాళ్ళం ...." అంది జానకి.
    "వెదకు -- ఇదంతా మీమవయ్య మూలంగా వచ్చింది"అంది సీతారావమ్మ తమ్ముడి మోసం గుర్తు చేసుకుని.
    'అమ్మా! నాకు మావయ్య మీద కోపం లేదు. మనం ఖర్చు పెట్టె పద్దతిలో ఆ యాభై వేలూ ఎప్పుడో పోయిండేవి. మావయ్య మూలంగానే ఇంటి పెత్తనం నాకు వచ్చింది. మనింటి పద్దతులు మారాయి...." అంది జానకి.
    అయితే రామచంద్రం ఆ యింట్లో మరో సంచలనం కలిగిస్తాడని అప్పుడు జానకికి కూడా తెలియదు.

                                                             5
    మోహనరావు జానకి వ్యక్తిత్వానికి ప్రత్యెక గౌరవమిచ్చాడు. అందువల్ల ఆమె తను కోరే కొత్త సంప్రదాయాన్ననుసరించ గలిగింది. వేరు కాపురానికి వెళ్ళాక ఆమె ఏటా పండుగలకు తన అత్తమామలతో పాటు తలిదంద్రులకూ కొత్త బట్టలు కొనేది.
    చెల్లెల్ని చూసి పెద్ద కూతురు కూడా కొండల్ రావుకు బట్టలు పెట్టడం మొదలు పెట్టింది. ఆడపిల్లలే తలిదండ్రుల నాదరిస్తుంటే తామూరుకుంటే బాగుండదని కొడుకులు కూడా తమ శక్తి కొద్దీ తలిదండ్రులకు కానుక లిచ్చుకోవడం మొదలు పెట్టారు.
    కొండల్ రావు కిప్పుడు పూర్వపు దర్జా లేదు. కానీ సుఖ సంతోషాలున్నాయి. అయన జీవితమే తమకొక ఉదాహరణగా భావించి పిల్లలు కూడా జాగ్రత్తగా మసలడం నేర్చుకున్నారు.
    ఈ పరిస్థితుల్లో మురళి ఇంజనీరింగు చదువు పూర్తయింది. అతడి కారణంగా కొండల్ రావు పరపతి మరింత పెరిగింది. అయన కుటుంబ సంప్రదాయాన్నీ , మురళి చదువునూ చూసి - ఎక్కడెక్కడినుంచో సంబంధాలు రాసాగాయి. అలా వచ్చిన వాటిలో రామచంద్రం సంబంధం కూడా ఉంది.
    సీతారావమ్మ తమ్ముణ్ణి చీదరించుకుని "నీతో సంబంధం చేసుకోవడ మంత తెలివితక్కువ వేరే ఉండదు" అంది.
    "మా రాదంటే మురళీ కిష్టం. రాధ కూడా మురళిని తప్ప చేసుకొనంటుంది" అన్నాడు రామచంద్రం.
    జరిగిందేమిటంటే రామచంద్రం పట్నంలో ఉంటున్నాడు. అక్కడే కాలేజీ హాస్టల్లో మురళి ఉండేవాడు.
    మురళి కీ, రాధకూ పరిచయమై- అది ప్రేమగా కూడా మారింది. పిల్లల చేత అవుననిపించుకున్నాకే రామచంద్రం పెద్దల దగ్గరకు వచ్చాడు.
    "నీ బుద్ది పొనిచ్చు కున్నావు కాదు, కుర్రాణ్ణి అమాయకుణ్ణి చేసి వల్లో వేసుకున్నావన్న మాట! అప్పుడు బావను యిలాగే మోసం చేశావు. ఈసారి నీ ఆటలు సాగనివ్వను ...." అంది సీతారావమ్మ కోపంగా.
    'అప్పుడు మోసం చేశాననేగా - నీకోపం! ఇప్పుడు యాభయి వేలూ కట్నంగా యిచ్చుకుంటే నీ కోపం పోతుందా?' అన్నాడు రామచంద్రం.
    "నువ్వు కట్నం కూడా యిస్తావా?' అంది సీతారావమ్మ.
    "అంటే నువ్వు నన్ను మోసం చేశావా?' అన్నాడు కొండల్ రావు.
    "బావా- నిన్నోకరు మోసం చేయాలా? మోసపోవడానికి నువ్వెప్పుడూ రెడీయే కదా!" అన్నాడు రామచంద్రం.
    "వాడి మాటలు నమ్మకండి. కట్నమిస్తానని మళ్ళీ మోసం చేస్తాడు. ఈ పెళ్ళి జరగదు....." అంది సీతారావమ్మ.
    "పెళ్ళి చేసుకునేది మురళి. కాదంటే వాడు మీ మాట వినడు. అవునంటే మీ మర్యాద దక్కుతుంది" అన్నాడు రామచంద్రం.
    సీతారావమ్మ కు రక్తం మరిగింది.
    "సరే - నేను వాడితోటే మాట్లాడుతాను" అందామె.
    రామచంద్రం వెళ్ళిపోయాడు.
    తర్వాత కొండల్ రావు, సీతారావమ్మ మురళిని పిలిచి పెళ్ళి గురించి మాట్లాడారు.
    "నేను రాధను తప్ప ఇంకెవర్నీ పెళ్ళి చేసుకోను. ఈ పెళ్ళి మీ కిష్టం లేకపోతె ఆజన్మ బ్రహ్మచారిగా ఉండిపోతాను" అన్నాడు మురళి.
    "నీ మామయ్య నీచుడు. దుర్మార్గుడు. అయిన వాళ్ళనే మోసం చేశాడు"అంది సీతారావమ్మ.
    "నేను పెళ్ళి చేసుకునేది మావయ్య ను కాదు. రాధను..."
    "ఈ పెళ్ళి కూడా వాడి మోసంలో ఒక భాగం...."
    "నేను నమ్మను...."
    'అయితే ఒక పని చేయి. మన బంధువుల్లో నీ మావయ్యను గురించి ఏం చెప్పుకుంటున్నారో తెలుసుకుని రా !" అంది సీతారావమ్మ.
    "ఎందుకు ?"
    "ఎటువంటి కుటుంబంతో నేను వియ్యమంచబోతున్నానో తెలుసుకుంటావని!" అన్నాడు కొండలరావు.
    మురళి ఏమనుకున్నాడో అంగీకరించాడు.
    రెండు వారాల్లో అతడి తల తిరిగిపోయింది. అతడు వెంటనే రామచంద్రాని కుత్తరం రాశాడు.
    రామచంద్రం లెక్కలు కట్టుకుని కొండల రావింటికి వచ్చాడు.
    "మావయ్యా! మన బంధు వర్గంలో నిన్నందరూ పరమ నీచుడని అనుకుంటున్నారు..." అన్నాడు మురళి.
    "దాన్ని బట్టయినా నా త్యాగం మీరర్ధం చేసుకోవాలి" అన్నాడు రామచంద్రం వెంటనే అక్కా, బావల వంక చూస్తూ.
    "త్యాగమా?' అంది సీతారావమ్మ.
    'అవును - త్యాగమే!"
    "ఎలా?"
    "నా కిచ్చిన యాభయివేలతోటి మీరు జానకి పెళ్ళి చేయాలనుకున్నారు. ఆ యాభయి వేలూ మీకు దక్కని మాట నిజం. కానీ ఇంట్లో ఏ మిబ్బంది వచ్చింది? జానకి పెళ్ళి కూడా అయి సుఖంగా కాపురం చేసుకుంటోంది ."
    'అయితే ?"
    "పిల్లిని ఓ గదిలో పెట్టి నాలుగు తలుపులూ వేశామంటే అది పులిగా మారుతుంది. బావా! నువ్వు లేని పోనీ దర్జాలకు పోయి - ఉన్నదంతా తగలేసుకుంటూన్నావు. ఎదారీ లేకుంటే తప్ప నీ పద్దతిలో మార్పు రాదు. నీకు కనీసం ఆ యాభయి వేలయినా మిగల్చాలని నీ దగ్గర అప్పడిగి తీసుకున్నాను. నీ డబ్బును పెంచాలని దాంతో షేర్లు కొన్నాను. యూనిట్లు కొన్నాను. అదిప్పుడు రెట్టింపు కు పైగా అయింది.
    ఆ డబ్బును నీ డబ్బుగా భావించి అందులోంచి ఒక్క పైసా కూడా ముట్టుకోలేదు. ఆ డబ్బంతా రాధ ద్వారా మీ కుటుంబాని కందజేయాలనుకున్నాను. నా ప్రయత్నంలో నేను కంద జేయాలనుకున్నాను. నా ప్రయత్నంలో నేను సఫలుడినయ్యాను. కానీ అందుకోసం ఎన్ని అపవాదులు వచ్చాయి? ఎలాంటి మాటలు పడ్డాను? నేను తలచుకుంటే రాధ కిప్పుడు లక్షకు పైగా కట్నమిచ్చి వేరే సంబంధం చూడగలను. కానీ నేనుపడ్డ మాటలన్నీ మీకోసం! అది వృధా కాకూడదు...." అన్నాడు రామచంద్రం.
    'అంతా అబద్దం. పెళ్ళి కోసం ఇప్పుడు ప్లేటు ఫిరాయిస్తున్నావు...." అంది సీతారావమ్మ.
    "అగవే" అన్నాడు కొండల్ రావు. అయన ఆలోచిస్తున్నాడు. రామచంద్రం ద్వారా యాభయి వేలూ పోయిండకపొతే ఆ డబ్బు జానకి పెళ్ళికి ఖర్చయేది . తర్వాత యిల్లమ్మాల్సి వచ్చేది . చివరికే ఆధారమూ లేక కన్న కొడుకుల మీద ఆధారపడి వారి చేత చీత్కరించబడవలసి వచ్చేది. జానకి తన కెదురు తిరిగిందంటే - అందుకు రామచంద్రమే కారణం .
    "ఏమిటండీ?" అంది సీతారావమ్మ.
    "మన చుట్టూ మంచివాళ్ళుగా కనిపించే నేరస్తులుంటారు. వాళ్ళు కన్నబిడ్డలు. అలాగే మన చుట్టూ నేరస్తుల్లా కనిపించే మంచివాళ్ళు ఉంటారు. రామచంద్రం ఏ ఉద్దేశ్యంతో నన్ను మోసం చేసినా అది మనకు మంచినే చేసింది. కాబట్టి రాధ మన కోడలవుతుంది " అన్నాడు కొండల రావు.
    వృధాగా పోవాల్సిన యాభయి వేలూ లక్షగా మారి కట్నం రూపంలో వస్తుంటే తననే ఒక నేరస్థుడిగా నిరూపిస్తూన్నట్లు ఫీలై కొండల రావా మాటలన్నాడన్న విషయం ఆయనకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు.
    అర్ధం లేని సంప్రదాయాలతో ఉన్నది తగలేసుకుంటూ ,లేని పోనీ మేహర్పానీలతో అప్పులపాలవుతూ బ్రతికే మధ్య తరగతి వాళ్ళు - తమలోని , తమ చుట్టూ వుండే నేరాలను గుర్తిస్తే - అవినీతికి దూరంగా ఉంటూ కూడా - సుఖజీవితాన్ని గడపగలుగుతారనడానికి కొండల రావు జీవితం ఒక ఉదాహరణ.
    
                                                                 ***


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS