కొండల్ రావు రామచంద్రం కు అప్పివ్వడాని కంగీకరించాడు.
అదృష్టవశాత్తు పొలానికి మంచి నేరం వచ్చింది ఎకరాని కిరవై రెండు వేలు.
కొండల్ రావు మొత్తం నాలుగెకరాలు అమ్మేశాడు. అయ్యన్న కి పన్నెండు వేలు బాకీ తీర్చి -- ఆపైన యాభై వేలు రామచంద్రానికి అప్పుగా కూడా యిచ్చాడు. పది హీను వేలు కొడుక్కి డొనేషన్ గా కట్టాడు. మిగతా డబ్బు కూడా వృధా చేయకుండా కొండుకు చదువు ఖర్చులకి పనికొస్తుందని బ్యాంకులో వేసి ఉంచాడు.
అయన ఉత్సాహంగా కూతురికి సంబంధాలు చూడసాగాడు. అప్పుడన్ని విధాల మంచి సంబంధమొకటి వచ్చింది.
అబ్బాయి యింజనీరు . బాగా ఆస్తిపరుడు. లాంచనాలతో సహా కట్నం పాతికవేలే అడిగారు.
రామచంద్రం తిరిగి వస్తాడు కదా. అని కొండల్ రావు ధైర్యంగా ఉన్నాడు. కానీ జానకి పెళ్ళి చూపులైన రెండు వారాలకే రామచంద్రం నుంచి పిడుగు లాంటి ఉత్తరం వచ్చింది.
"బావా!
వ్యాపారంలో గట్టిదెబ్బ తిన్నాను. నీకు నా ముఖం చూపించ లేను. నీ బాకీ తీర్చాలంటే నా జీవితం ధారపోయాలి. ప్రస్తుతానికదే నా జీవిత ధ్యేయం. కానీ అదినెరవేరడాని కేనేళ్ళుపడుతుందో నాకు తెలియదు. అక్కయ్యకి విషయం చెప్పకు. దానికి నేనంటే అవమానం.
నావల్ల నీ కన్యాయం జరిగినా - చల్లని మనసున్న నీకు భగవంతుడి సాయం ఎప్పుడూ ఉంటుంది. సెలవు .
నీ
రామచంద్రం."
కొండల్ రావు ఉత్తరాన్ని భార్యకు చూపించాడు. సీతారవమ్మ వెంటనే బయల్దేరి తమ్ముడి వద్దకు వెళ్ళి నానా మాటలూ అంది. రామచంద్రం ఆమె తిట్లన్నీ భరించి 'అక్కా! దేవుడు నామీద పగబట్టాడు. నారోజులు బాగోలేవు" అని ఊరుకున్నాడు.
"సిగ్గులేని వెధవ!" అని కసిగా తిట్టింది సీతారావమ్మ. ఆ తిట్లామెకు యాభయి వేలూ తెచ్చి పెట్టలేదు. ఆమె యింటికి తిరిగి వెళ్ళింది.
ఇంట్లో అంతా దిగులుపడి పోయారు.
"ఇల్లమ్మేస్తాను...."అన్నాడు కొండల రావు.
అప్పుడు మొదటిసారిగా ఆ యింట్లో జానకి నోరు విప్పి -" ఇల్లమ్మిన డబ్బుతో నేను పెళ్ళి చేసుకోను" అంది.
"నోర్ముయ్ - ఇది నీకు సంబంధించిన విషయం కాదు" అంటూ కసిరింది తల్లి.
జానకి తల్లి నెదిరించబోయి - తండ్రి మరింత కఠినంగా మందలించడం తో నోరు మూసుకుంది. అయితే గుట్టు చప్పుడు కాకుండా తను చేయాల్సింది చేసింది.
ఇంటి పరిస్థితులు వివరిస్తూ పెళ్ళి కొడుక్కు ఉత్తరం రాస్తూ -- కట్నం లేకుండా పెళ్ళి చేసుకోమని కోరిందామే. దానికి బదులుగా - ఈ సంబంధం వదులుకుంటున్నట్లు పెళ్ళి కొడుకు తండ్రి కొండల్ రావుకు ఉత్తరం రాశాడు" ఉత్తరంలో జానకి ప్రవర్తనకు ప్రత్యేకంగా నిరసించాడు.
కొండలరావు కూతుర్ని పిలిచి నానా మాటలూ అన్నాడు.
"నేనూ చదువుకుంటున్నాను. ఉద్యోగం చేస్తాను. పెళ్ళి చేసుకోకుండా -- కట్నముంటే టాప్ప నన్ను పెళ్ళి చేసుకోననే మగ వెధవలకు దూరంగా ఉంటాను" అంది జానకి. ఎలా పెళ్ళి చేసుకోవో చూస్తానని తల్లి అంటే ప్రతి పెళ్ళి కొడుక్కూ ఇలాగే ఉత్తరాలు రాస్తానని తల్లిని బెదిరించిందామె.
కూతురు బెదిరింపులకు లొంగదని తెలిసేక తలిదండ్రులామెను మంచి మాటలతో లొంగదీసు కోవాలను కున్నాడు. కుటుంబం అప్పుడేన్ని కష్టాల్లో ఉన్నదీ చెప్పుకుని, ముందు ముందు జానకి పెళ్ళి మరింత కష్టమవుతుందన్నారు.
అయితే అప్పుడు జానకి పెద్ద బాంబు పెల్చ్జింది.
"మీది పాత తరం. మీ పద్దతిలో మన చుట్టూ నేరస్థులేర్పడ్డారు. ఆ కారణంగా మనకున్నదంతా దుర్వినియోగమవుతోంది. మీరు చెప్పిన కష్టాలూ, ఇబ్బందులూ మీ వల్లనే వచ్చాయి. నాది కొత్త తరం. మన చుట్టూ వున్న నేరస్థుల మనసుల్లో పరివర్తన తీసుకుని వచ్చి మన పరిస్థితులు మెరుగు పర్చడానికి - కొన్నాళ్ళ పాటు ఇంటి పెత్తనం నాకివ్వండి. ఇల్లమ్మకుండానే రెండు మూడేళ్ళ లో నా కట్నం డబ్బులు నిలవేస్తాను ...." అందామె.
దీని మీద ఇంట్లో పెద్ద రాద్దాంతం జరిగింది. కొండల్ రావు మాత్రం కూతురి మాటలు సవాలుగా తీసుకున్నాడు.
కటింగులన్నీ పోనూ తనకు వచ్చే నెల జీతం పన్నెండు వందలూ కూతురి చేతికే యిస్తే - అన్నీ ఆమెకే తెలిసి వస్తాయని అయన అనుకున్నాడు.
"అందుకే - 'సరే నీ యిష్టం !" అన్నాడు కొండల్ రావు.
4
జానకి వెంటనే రంగంలోకి దిగింది.
ఆమె లంకంత కొంపను నాలుగు వాటాలు చేసి ఒక వాటాలో తను, తల్లి, తండ్రి ఉండేలా ఏర్పాటు చేసి, మిగిలిన మూడు వాటాలు అద్దె కిచ్చింది.
మొదట్లో ఇల్లు ఇరుకనిపించినా నెలకు ఆరువందల దూపాయల అదనపు ఆదాయం అద్భుతమని పించింది కొండల రావుకి. పెద్దింట్లో ఉంచి చిన్నంట్లోకి మారడం లో చాలా ఖర్చులు అదా అయ్యాయి. ముఖ్యంగా కరెంటు ఖర్చు. ఒకప్పుడు నెలకు వందరూపాయలు దాటేది -- ఇప్పుడు పాతిక్కి లోపే అయింది. ఇంటి కవసరమైన ఫర్నిచరుంచుకొని మిగతాది అమ్మేస్తే -- మూడు వేల రూపాయలు వచ్చాయి. చిన్నిల్లు కావడం వల్ల పనిమనిషి కూడా మానిపించేయడం లో మరో పాతిక రూపాయలు అదా అయ్యాయి.
అటుపైన వారికి పెద్ద పెరడుంది. గతంలో ఉండే పూలమొక్కల స్థానంలో జానకి కూర మొక్కలు, పొడులు వేసింది.
జానకి తెలివితేటలకు తలిదండ్రులు ముచ్చట పడ్డారు. అందుకు జానకి "ఇందులో నా తెలివి తేటలేమీ లేవు. మీది గమ్యం తెలియని పయనం. నాకు నా గమ్యం తెలుసు" అంది.
ఇంటికి అక్క వచ్చింది. భోజనం పెట్టి ఆదరించడం మినహాయించి ప్రత్యేకమైన కానుకలేవీ యివ్వరాదందిజానకి. దీని మీద కొండల్ రావు పెద్ద రాద్దాంతం చేశాడు. ఆ రాద్దాంతం చూసి జానకి అక్క ఏమీ తీసుకోనని తండ్రికి చెప్పేసింది.
కూతురు మనసుకు కష్టం తోచిందని గ్రహించి -- "నువ్వు పెత్తనం పేరుతొ -- అయిన వాళ్ళను నాక్కాకుండా చేస్తున్నావు" అన్నాడు కొండల రావు జానకి తో.
"నువ్వు కష్టంలో ఉన్నప్పుడాదుకునేందుకు వాళ్ళు అయినవాళ్ళు కారు. నీకు శక్తి లేక ఏమీ యివ్వలేక పొతే ఆ కోపంలో వాళ్ళు నీకు కానివాళ్ళ పోతారు. అలాంటి వాళ్ళను అయిన వాళ్ళనడమే సిగ్గు చేటు ...."అంది జానకి.
ఈ మాటలే జానకి అక్కతో కూడా అంది.
అక్క ఆశ్చర్యపడి -- "ఇలా నేనెప్పుడూ ఆలోచించ లేదు. జీవితం ఓ పద్దతిలో వెళ్ళిపోతోంది" అంది.
"నువ్వు నేరస్తురాలివి. నాన్న నిన్నలా తయారు చేశాడు" అంది జానకి.
అక్క అసంతృప్తిగా -- "నీకు పెళ్ళయ్యాక నువ్వెలా గుంటావో చూస్తాను గా" అంది.
'అక్కా! ఇది నువ్వు సవాలుగా తీసుకోకు. మన ఆలోచనల్లో మార్పు రావాలి. కొన్నేళ్ళు పోయాక -- నేనూ నువ్వు చేసిన తప్పే చేస్తే -- మీరందరూ నన్ను తప్పు పట్టి బుద్ది చెప్పాలి తప్ప -- హేళన చేసి ప్రతీకారం తీర్చుకోవాలను కోకూడదు..."అంది జానకి వెంటనే.
చాలామంది ఆడపిల్లలకు లాగే జానకి అక్క కూడా -- అంతదూరం ఆలోచించదల్చుకోలేదు. అందువల్ల ఆమె క్రమంగా పుట్టింటికి రాకపోకలు తగ్గించింది.
తలిదండ్రులకి పాకెట్ మనీగా నెలకు వందరూపాయ లిచ్చేది జానకి. ఇంటి ఖర్చులన్నీ తనే చూసుకునేదామే. పండుగ బట్టలు కూడా తనే కొనేదామే. ఎటొచ్చీ ఆమె కొనే బట్టలు తక్కువ ఖరీదువి.
ఇంటి అద్దె, అదా చేస్తున్న పనిమనిషి జీతం, ఇతర నిల్వలు -- ఆమె బ్యాంకు లోనో , పోస్టాఫీసులో నో దాచేది. ఆ విధంగా -- మొదటి సంవత్సరం లోనే పదివేల రూపాయలు నిలవేసిందామె.
దర్జా కొనసాగనందుకు కొండల రావుకు అసంతృప్తిగా ఉన్నప్పటికీ -- జానకి నిలవేస్తున్న డబ్బు -- అయన బలాన్ని పెంచుతోంది.
జానకి బియ్యే ప్యాసయింది. బియ్యీడి చేసింది.
కొండల్రావు రిటైరయ్యేసరికి బియ్యే బియ్యీడీ గా సిద్దంగా ఉన్న జానకి కి- కమిటీ స్కూలు వారు అయన స్థానంలో ఉద్యోగమిచ్చారు.
ఇప్పుడు జానకి నిజంగా ఆ యింటి యజమానురాలయింది.
అప్పుడు సీతారావమ్మ భర్తను పోరాడం మొదలెట్టింది.
జానకి తను పెళ్ళి చేసుకోనంది.
"కూతురి జీతాని కశపడి పెళ్ళి చేయడం లేదని -- అంతా మమ్మల్నాడిపోసుకుంటారు. ఆ విధంగా మమ్మల్ని నేరస్థుల్ని చేయకు...." అన్నాడు కొండల్ రావు.
అలాంటి అపవాదుకు తండ్రి తట్టుకోలేడని జానకికి తెలిసింది. అందుకే ఆమె మోహన్ రావుతో పెళ్ళికి ఒప్పుకుంది.
ఆ ఊళ్ళోనే ఉంటున్నాడు మోహనరావు. జానకి తన కుటుంబాన్ని దిద్దుకుంటున్న తీరును చూసి అతడు ముచ్చట పడ్డాడు. తలిదండ్రుల కుత్తరం రాశాడు.
సంబంధం కుదిరింది. జానకి పెళ్ళైపోయింది.
