మేష్టారి కూతురు
జొన్నలగడ్డ రామలక్ష్మీ

కడుపులో ఎలుకలు పరుగెడుతున్నాయి నాకు.
అప్పటికి పట్నం వచ్చి పదిరోజులైంది.
నాన్నగారి స్నేహితుడొకాయన ఉద్యోగమిప్పిస్తానని పట్నం రమ్మంటే వచ్చాను. తీరా చూస్తె ఆ కంపెనీ వ్యవహారమంతా తిరకాసు గా వుంది. సరాసరి నన్ను స్మగ్లింగ్ కే ఉపయోగించుకోవాలనుకుంటున్నారు వాళ్ళు!
నాన్నగారి స్నేహితుడి కిది చెప్పాను. ఆయన నవ్వి "వాళ్ళు నీకు జీతమిస్తారు. నువ్వు పని చేస్తావు. నీ పనిలో తప్పుంటే అది నీది కాదు వాళ్ళది" అన్నాడు.
"తప్పు గురించి కాదండి -- జైలు పాలైతే ...." అన్నాను.
"ఆకంపెనీ ఉద్యోగుల్లో జైలు పాలయిన వారెవ్వరూ లేరు. ఆ విషయం నీకు హామీ యివ్వగలను" అన్నాడాయన.
'ఇంకో ఉద్యోగమేదీ దొరకదా?" అన్నాను నిస్పృహగా.
"ఇది చాలా మంచి ఉద్యోగం. ఊళ్ళో నీకు పలుకుబడుంటుంది. జీతం బాగా వస్తుంది"అన్నాడాయన.
"తక్కువ జీతం వచ్చినా , పలుకుబడి లేకున్నా బాధ లేదు. ఇంకో ఉద్యోగం దొరికే అవకాశముందా?" అనడిగాను.
ఆయన ముఖం ఎర్రబడింది. "యిది నేను నీ కిప్పించగల ఉద్యోగం . దీనికి బోలెడు పోటీ వుంది. మీ నాన్న నాకు స్నేహితుడు కాబట్టి సాయంగా నీ పేరు రికమెండ్ చేశాను. ఇంకో ఉద్యోగం కావాలంటే నీ ప్రయత్నం నువ్వు చేసుకో."
'అలాగే ప్రయత్నిస్తాను " అన్నాను.
ఏమనుకున్నాడో అయన "ఒక్క నిముషమాగు ...మీ నాన్నతో ఫోన్లో మాట్లాడుదువు గానీ " అన్నాడు.
అయన మా ఉళ్ళో నాన్నగారు పనిచేస్తున్న ఆఫీసుకు ఫోన్ చేసి విషయం విపులంగా చెప్పి "మీరు మీ అబ్బాయితో మాట్లాడతారా?" అన్నాడు. తర్వాత ఫోన్ నా కందించి "మీ నాన్న నీతో మాట్లాడతాట్ట "అని చెప్పాడు.
ఫోన్లో ప్రారంభిస్తూనే "వెధవ కబుర్లు చెప్పక వెంటనే ఉద్యోగంలో చేరు. లేకపోతే మళ్ళీ నా గడప తోక్కక్కర్లేదు " అన్నాడు నాన్నగారు.
నేను నాన్నగారికి ఉద్యోగం గురించి వివరించాను.
"అన్నీ తెలుసు నాకు. ఈరోజుల్లో ఎవ్వరూ మడికట్టు క్కూర్చోవడం లేదు. తెలివితక్కువగా ఆలోచించకు. నేను చెప్పింది గుర్తింది కదా! వుద్యోగంలో చేరకపోతే ఇంటికి రానక్కరలేదు."
నేను ఫోన్ పెట్టేశాను.
"ఏమంటున్నాడు మీ నాన్న ?" అన్నాడాయన.
నేను నిజం చెప్పాను.
"మీ నాన్న నీ బాగుకోరి అంతా చెప్పాడు...."
"నిజమే కానీ నాకు కొన్నాళ్ళు గడువు కావాలి...."
"సరే ....పది రోజులు గడువిస్తున్నాను.... ఆ తర్వాత ఆ ఉద్యోగం వేరెవరికో వెళ్ళిపోతుంది...."
"థాంక్స్!" అన్నాను.
ఆయన వెంటనే "ఎక్కడుంటావ్ - ఇన్ని రోజులూ- మా యింట్లో వుండు " అన్నాడు.
"ఇప్పుడు మకాం మారిస్తే నా స్నేహితుడు నోచ్చుకుంటాడు అవసరమైతే తప్పకుండా మీ ఇంటికే వస్తాను" అన్నాను.
అయన నొక్కించలేదు.
నిజానికి ఊళ్ళో నాకే స్నేహితుడు లేడు బాగా దూరపు బంధువు లింట్లో మకాం పెట్టాను. వాళ్ళ పరిస్థితి ఆర్ధికంగా బావులేదు. నేను వారికి భారమే! అయినా అక్కడున్న స్వేచ్చ నాకు నాన్నగారి స్నేహితుడింట్లో కనబడలేదు. అంతస్థుల్లో అయానకూ నాకూ చాలా భేదముంది. అలాంటి భాగ్యవంతుల యింట్లో నేను తేలికగా యిమడలేదు.
నా బంధువులకూ నేను భారం కాకూడదన్న ఉద్దేశ్యంతో రోజూ బయట ఏదో గడ్డి తిని - స్నేహితులింట్లో భోం చేస్తున్నట్లబద్దం చెబుతున్నాను. అలవాటు లేదని అబద్దం చెప్పి కాఫీ, టీలు కూడా తాగడం లేదు. ఆ విధంగా చేయడం వల్ల వాళ్ళు గిల్టీగా - ఫీలైనా నన్నిభిమానించడమే కాక ఎన్నాళ్ళైనా తమ యింట్లో వుండవచ్చునని మనస్పూర్తిగా అన్నారు.
నేనుద్యోగం కోసం తిరుగుతున్నాను. రెకమెండేషన్ నున్నా వుద్యోగాలు దొరకని ఈ రోజుల్లో ఒంటరిగా నేను ప్రయత్నిస్తే ఏం దొరికుతుంది?
నాకు నాన్న అన్న మాటలకు పట్టుదల వచ్చింది. అందుకే మానాభిమానాలు విడిచి తెగ తిరిగాను. ఫలితం కనబడ్డం లేదు.
డబ్బై పోయింది. ఇప్పుడు నాకు యింటికి వెళ్ళాలన్నా టికెట్ డబ్బుల్లేవు.
కడుపులో ఎలుకలు పరుగెడుతున్నాయి. రెండు రోజుల్నించి సరిగా తిండి లేదు.
ఆకలి బాధ భరించలేక చివరకు ఓ హోటల్లో దూరాను. చాలా పెద్ద హోటలు వెళ్ళి ఓచోట కూర్చున్నాను. కావలసినవన్నీ తెప్పించుకుని కడుపు నిండా తిన్నాను.
సర్వరు బిల్లు తెచ్చిచ్చాడు. ఆర్రూపాయలైంది.
బిల్లు జేబులో వేసుకున్నాను. జేబులో మహా వుంటే ఓ రూపాయుంటుంది. అయినా నేను భయపడకుండా మరో మూలకు వెళ్ళి కూర్చున్నాను.
చాలా పెద్ద హోటలది. ఇంకో సర్వరు నా దగ్గరకు వచ్చాడు.
టీ అడిగాను. సర్వరు తెచ్చిచ్చాడు. టీ తాగేక బిల్లిచ్చాడు.
అక్కడ టీ ఖరీదు అరవై పైసలు.
జేబులో అరవై పైసలకు పైనే ఉంది.
కౌంటర్లో బిల్లు చెల్లించి బయటపడ్డాక తేలికగా ఊపిరి పీల్చుకుని "ఈరోజుకు ఆకలి గండం గడిచింది" అనుకున్నాను.
అప్పుడు నా మనసు "నువ్వు చేసిన పనేమిటి?" అనడిగింది.
ముందు నాకు పెద్దగా ఏమీ అనిపించలేదు. కానీ లోతుగా ఆలోచిస్తే అసలు విషయం స్పురించింది.
ఈరోజు ఆకలిబాధకు తాళలేక నేను మోసం చేసి హోటల్లో టిఫిన్ తిన్నాను. అంటే నేను తిండి దొంగతనం చేసినట్లు లెక్క.
ఒకరోజు ఆకలి నన్ను దొంగను చేసింది. ఈ ఆకలి యింతటితో నన్ను వదిలి పెట్టదు. ఈరోజు చిన్న దొంగ తనం....రేపు పెద్ద దొంగతనం....
"ఇంతకంటే ఆ ఉద్యోగమే మేలు కదా!' అంది మనసు.
అక్కడైతే కనీసం నేను నా కోసం తప్పు చేయడం లేదు.
వున్న బాధల్లా ఒక్కటే ....చిన్నప్పుడు మా ఊళ్ళో నాకు రామయ్య మేష్టారు చదువు చెప్పారు. అయన పూర్తీ పేరు సీతారామయ్య. ఆయనంటే పెద్దలు కూడా వణికే వారు. పిల్లలు చేసిన తప్పుకు తీవ్రంగా దండించేవాడాయన దండన అయిపోయాక వారిని దగ్గరగా చేరదీసి లాలించి తప్పులోని తప్పు గురించి అరటి పండు వలచినట్లు వివరించే వాడు. అయన చెప్పిన పాఠాలు నాకు బాగా వంట బట్టాయి. అందువల్లే నేను తప్పు చేయలేను. కానీ యిప్పటి పరిస్థితి వేరు....
అప్పుడే నా మనసు తప్పుదారి తొక్కుతోంది.
హోటలు తిండి నా కడుపు నింపింది కానీ నాకు తృప్తిగా లేదు. అయితే బుర్ర చురుగ్గా పనిచేయడం మొదలుపెట్టింది.
ఈ ఉద్యోగానికి నేనెందుకు భయపడుతున్నట్లు?
ఇందులో చేరడం వల్ల తాత్కాలికంగా నాన్నగారికి సంతోషం కలుగుతుంది. నాకేమో కొందరు అవినీతి పరుల జాతకాలు తెలుస్తాయి.
సమయం చూసి వాళ్ళ అవినీతి బయటపెడితే.
ఒకే దెబ్బకు రెండు పిట్టలు...అటు ఉద్యోగం....ఇటు ఆశయం....
నేను జాగు చేయకుండా నాన్నగారి స్నేహితుణ్ణి కలుసుకొని ఉద్యోగం నా కిష్టమే నని చెప్పాను.
అయన నవ్వి -"నీ నిర్ణయం నీ తెలివిని తెలియజేస్తోంది. అయితే అందుకు నేనిచ్చిన పదిరోజులు గడువు పూర్తిగా ఉపయోగించుకున్నావు. నీలో చురుకు పాలు తక్కువ ...." అన్నాడు.
నా చురుకుతనం గురించి మున్ముందు తెలుస్తుందిలే-- అనుకున్నాను మనసులో. అయన వెంటనే మా నాన్నగారికి విషయం ఫోన్లో చెప్పి "నువ్వు మీ నాన్నతో మాట్లాడతావా?" అన్నాడు.
తల అడ్డంగా ఊపాను.
కొడుకు అవినీతికి పాల్పడలేదని -- గుమ్మం తోక్కవద్దని శాసించారు నాన్నగారు. అటువంటి తండ్రి ఇంటి గుమ్మం మళ్ళీ తోక్కకూడదనే నాకు అనిపిస్తోంది.
2
ఉద్యోగంలో చేరాక వారం రోజులు మాములుగా గడిచాయి. అనవసరంగా నేనవేశపడ్డానా అన్న అనుమానం కూడా కలిగింది. అయితే ఎనిమిదవ రోజున నన్ను బాస్ పిలిచి -- "ఈ రోజు నువ్వు మన మెయిన్ బ్రాంచికి వెళ్ళి గోవిందరాజుల్ని కలుసుకోవాలి. అయన నీ కప్పగించినపని శ్రద్దగా చేయాలి" అన్నాడు.
బుద్దిగా తలూపాను.
ఆఫీసు కార్లో మెయిన్ బ్రాంచికి వెళ్ళాను. సరాసరి గోవిందరాజులు గదికి వెళ్ళాను.
అది ఎయిర్ కండిషన్లు గది - గదిలో వున్నాడు గోవిందరాజులు.
నేను వెళ్ళేసరికి అటు యిటు పచార్లు చేస్తున్నాడు అసహనంగా. నిన్ను చూడగానే - "గుడ్ ...వచ్చావా?" అన్నాడు.
చెయ్యెత్తు మనిషి . దబ్బపండు చాయ. యాభై ఏళ్ళుఉంటాయేమో -- పుల్ సూట్లో చాలా అందంగా ఉన్నాడు.
చూడగానే ఎక్కడో చూశానని పించింది.
"నేను చెప్పేపని శ్రద్దగా వినాలి. తెలివిగా చేయాలి. నువ్వు కొత్తగా వుద్యోగంలో చేరావు కాబట్టి చెబుతున్నాను. ఒక విధంగా ఇది నీ నిజాయితీకి పరీక్ష లాంటిది. పోలీసు లకు పట్టుబడ్డావనుకో -- నేరం నీమీదే వేసుకోవాలి. అప్పుడు కంపెనీ నీ తరపున పనిచేసి నిరపరాధివని ఋజువు చేస్తుంది. నేరం కంపెనీ మీద వేశావనుకో . అది నువ్వు ఋజువు చేయలేవు సరిగదా .... నేరం నీదేనని ఋజువై జైలు పాలవుతావు. వుద్యోగం పోతుంది. భవిష్యత్తు నాశన మవుతుంది...."
