"లేకుంటే -?" భయంగా , అనుమానంగా అడిగాడు కులభూషణ్.
"లేకుంటే అన్న ప్రసక్తి లేదు. మనం మళ్ళీ తప్పక కలుసుకుంటాం" అనేసి వేదాంతం అక్కణ్ణించి కదిలాడు.
అతడి ఎయిర్ బ్యాగ్ అక్కడే ఉండిపోయింది.
కులభూషణ్ తానున్న చోట్నించి కదలలేదు.
చూస్తుండగా వేదాంతం అతడి కనుమరుగయ్యాడు.
వేదాంతం వదిలిన ఎయిర్ బ్యాగ్ అక్కడ లేకపోతే అంతవరకూ జరిగింది కలో నిజమో అతడికి తెలిసేది కాదు.
జలజ వచ్చి పలకరించక పొతే అలా తానెంత సేపు నిలబడేవాడో కూడా అతడికి తెలియదు.
"నీకోసం ఎదురు చూసి ఎదురు చూసి నువ్వు నన్ను మోసం చేశావని కోపంతో ఇక్కడికి వచ్చాను. మరెవ్వరితోనో ఇక్కడ కులుకుతుంటవని అనుమానించాను. కానీ నువ్వు నన్ను మోసం చేయలేదు.....థాంక్ గాడ్ ....ఒక్కడివే ఉన్నావు ...." అంది జలజ.
కులభూషణ్ ఈ లోకంలోకి వచ్చాడు.
జలజ అతడి నానుకుని ఉంది.
ఆశగా అతడి కనులలోకి చూస్తోంది.
ఆవేశంతో ఆమె పెదవులదురుతున్నాయి.
మితిమీరిన కోరికతో ఆమె శరీరం సన్నగా వణుకుతోంది. కులభూషణ్ ఆమెకు దూరంగా జరిగాడు. జలజ కదలలేదు. ఆమె ఇంటికి వెళ్ళి దుస్తులు మార్చుకుని వచ్చినట్లు అతను గ్రహించాడు. ఆమె పల్చటి నైట్ గౌను లో ఉంది. కార్లో తానోక్కతీ డ్రైవ్ చేసుకుని వచ్చి ఉంటుంది. అయినప్పటికీ మరీ ఇలా....
జలజ అతడినే చూస్తోంది. వెయ్యి మాటలు చెప్పలేని విశేషాల నామె చూపులు స్పష్టంగా చెబుతున్నాయి.
కులభూషణ్ చిరాగ్గా ఆమె వంక చూసి -- 'జలజా! ప్లీజ్ ....నా మనసేమీ బాగోలేదు , వెళ్ళిపో " అన్నాడు.
ఆమె కదలకుండా అలాగే చూస్తోంది.
"వెళ్ళిపో జలజా!' అన్నాడతడు మళ్ళీ.
"నేను వెళ్ళను "
"నాకిష్టం లేదని చెప్పాను...."
"నేను నిన్నుబలవంతం చేయను. కానీ ఈ రాత్రంతా ఇక్కడే ఈ పవిత్ర దేవాలయంలో ఉండి నన్ను నేను పవిత్రం చేసుకుంటాను" అందామె.
"అయితే నువ్విక్కడే ఉండు. నేను గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుని పడుకుంటాను ...."
"లోపలకు నేను రాకూడదా?"
"రాకూడదు . అందుకే నిన్ను వెళ్ళిపొమ్మన్నాను ...."
జలజ అదోలా నిట్టూర్చి --"ఒకే భూషణ్ ! నేను గదిలో కూడా రాను. ఇక్కడే ఉంటాను సరా ?" అంది.
'ఇక్కడుండి ఏం చేస్తావు ?"
"నీ పిలుపు కోసం ఎదురు చూస్తుంటాను "
"నేను పిలవను ."
"తెల్లరేలోగా నువ్వు నన్ను తప్పక పిలుస్తావని నా నమ్మకం" అంది జలజ చిలిపిగా అతడి వంక చూస్తూ.
'అయితే ఐదు గంటల దాకా నీకు టైమిస్తున్నాను. ఉదయం అయిదయ్యే సరికి నా పిలుపు నీకందక పొతే నేను లేచేలోగా నువ్విక్కడి నుంచి వెళ్ళిపోవాలి " అన్నాడు కులభూషణ్.
"సరే"
కులభూషణ్ వెళ్ళి గది తలుపులు వేసుకున్నాడు. జలజ అక్కడే ఓ కుర్చీలో కూర్చుంది. పట్టుదల, కోరిక ఆమె నిద్రను చంపేసాయి. స్త్రీ సహజమైన సహనంలో ఆమె ఎంతసేపైనా ఎదురు చూడ గలిగేలా ఉంది.
ఆమె అలాగే కూర్చుని మధ్యమధ్య తన చేతి గడియారం చూసుకుంటోంది.
ఎలక్ట్రానిక్ వాచిలో నిమిషాలు, గంటలు పరిగెడుతున్నాయి. జలజ క్షణమొక యుగంలా లేదు. గడిచిపోతున్న ప్రతిక్షణమూ తనను ఓటమికి దగ్గర చేస్తున్నదన్న అనుభూతి ఆమెకు భీతి గోల్పుతోంది.
తన వాడనుకున్న పద్మభూషణ్ , తన త్రిక్కులకు లొంగిపోయే కులభూషణ్ తనెంత పాతబడినా ఏదో కొత్త దనం అనిపిస్తుందని మెచ్చుకునే కులభూషణ్ ఈ రోజింత కోరకరాని కొయ్య ఎలాగయ్యాడు? అతడి ఈ మార్పు తత్కలికమా ? శాశ్వతమా ?
సంపద కోసం, బొగభాగ్యాల కోసం నాశించి తను ముసలి భర్తను వివాహం చేసుకుంది. కులభూషణ్ పరిచయమయ్యాక తనకే విధంగానూ లోటు లేదనిపించింది.
తను కోసకంటితో చూస్తె వెంటపడి దాసోహమనే వారెందరో ఉన్నారు. అయితే తను నీతి బాహ్యురాలు కాదు. కులభూషణ్ అంటే ఆమెకు ప్రేమ ఏర్పడింది. అతడి కోసం ఏమైనా చేయాలన్పిస్తుంది. తనకు కావలసినన్నీ భర్త ద్వారా పొందుతుందామె. కానే ఆమె అతడ్ని ప్రేమించలేదు. కులభూషణ్ ని సంతోష పెట్టడంలో ఆమెకు తృప్తి ఉంది.
తనతడ్ని వివాహం చేసుకోవాలను కోవడం లేదు కానీ అతడ్ని తన వాడను కుంటోంది.
చెడినదనుకునే ఆడదానిలో కూడా నీతి, రీతి ఉంటుంది.
తన్ను తిరస్కరించిన అతడి పిలుపు కోసం ఆ రాత్రి ఆమె నిద్ర పోకుండా గది బయట కూర్చుని ఎదురు చూస్తోంది.
అతడు దేవుడు, ఆమె మనిషి అయుంటే అది భక్తీ అనిపించుకునేది. అతను భర్త ఆమె భార్య అయుంటే అది అనురక్తి అనిపించుకునేది. అతడు ప్రియుడు, ఆమె ప్రియురాలు అయితే ఈ సందర్భం ఆమె పై జాలిని పుట్టించేది. తన ప్రాణమిత్రుడు విశ్వనాద్ మరణించిన కారణంగా తన మనసు బాగోలేదని అతడొక్క మాట చెప్పి ఉంటే ఆమె వెళ్ళిపోయేదేమో!
అయితే కులభూషణ్ విశ్వనాద్ చావుకు ప్రచారమిచ్చే ఉద్దేశంలో లేడు. అతను వేదాంతం రాకకోసం ఎదురు చూస్తాడు.
టైము రాత్రి మూడు గంటలైంది. అపుడు కులభూషణ్ గది తలుపులు తెరుచుకున్నాయి. వెనువెంటనే జలజ ముఖం విప్పారింది.
"నా ప్రేమ వృధా పోలేదు" అనుకుందామె. గుమ్మంలో కులభూషణ్ ప్రత్యక్ష మయ్యాడు. ఒక్క పరుగున జలజ అతడ్ని చేరింది. కులభూషణ్ గుమ్మం దగ్గిరే ఉన్నాడు.
"నేనే అటు వస్తున్నాను. నువ్వెందు కిలా వచ్చావు ?' అన్నాడతడు.
"నా ఆత్రుత నీకెలా జార్ధమవుతుంది ?నీ పిలుపు కోసం ఎదురు చూస్తున్నాను.' అంది జలజ.
"ఇప్పుడు నేను నిన్ను పిలవలేదు"
తెల్లబోయిందామే.
"జలజా! నేను నిన్నవమానిస్తున్నానని పొరబడకు. ఈనాటి నా ప్రవర్తన కేదో ఒకరోజున నీ దగ్గరకు వచ్చి సంజాయిషీ ఇచ్చుకుంటాను. నావల్ల నీ మనసుకు కష్టం కలిగితే నన్ను క్షమించు" అన్నాడు కులభూషణ్.
'అలాగానొద్దు. నీ పిలుపు కోసం నేను క్షణం కూడా నిద్రపోలేదు...."
"నిద్ర నాకు పట్టలేదు. అయితే నా కారణం వేరు."
"మరీ తలుపులేందుకు తీశావు ?"
"ఇది చూడు " అన్నాడు కులభూషణ్.
అపుడు చూసింది జలజ అతడి చేతిలోని ప్లాస్టిక్ సంచీని.
"ఏమిటది ?' అంది.
"తెల్లారేదాకా నువ్విక్కడే ఉండే పక్షంలో ఈ దుస్తులలో బైటకు వెళ్ళడం బాగుండదు. ఇందులో మంచి బట్టలున్నాయి.' అని సంచి బైట పెట్టి తలుపులు మూసుకున్నాడు కులభూషణ్.
జలజ ప్లాస్టిక్ సంచి తీసి చూసింది. అందులో ఒక చీర, లంగా ఉన్నాయి. ఆమె ఇక అక్కడ క్షణం కూడా ఎదురు చూడలేదు. ప్లాస్టిక్ సంచీని అక్కడే వదిలి వెంటనే వెళ్ళిపోయింది.
***
అర్ధరాత్రికి ఊరి చివర చేరుకున్నాడు వేదాంతం.
అలౌకికానందస్వామి ఆశ్రమం అక్కడ్నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దారి మాత్రం సుగమం కాదు.
ఆ దారి రెండు కొండల మధ్య నుంచి వెడుతుంది.
సన్నని కాలి బాట అది. అలా రెండు కిలోమీటర్లు నడిచేక దారి ఒక కొండ చుట్టూ తిరుగుతుంది. అక్కడ కొండ గుహలో ఉంది స్వామి ఆశ్రమం. కొండ గుహలో ఆశ్రమం ....కొండవతల పెద్ద లోయ.
జీవితమంటే విరక్తి పుట్టినవారు ఆత్మహత్య చేసుకుందుకక్కడి వరకూ వెడుతుంటారు. అయితే అలా వెళ్ళిన చాలామంది అలౌకికానందస్వామి ప్రభావానికి గురై మనకు మార్చుకుని వెనక్కు వచ్చేశారు. స్వామి ప్రభావానికి లాంటి ప్రచారకులెందరో ఉన్నారు.
స్వామి ఎన్నడూ ప్రజల మధ్యకు రాడు. అయన వయసు వివాదాస్పదం. ఆశ్రమానికి దారి భక్తులకు మాత్రమే పరిమితం. అయన నిషేదించిన వేళలలో ఆ దారిలో ప్రయాణం నిషిద్దం.
సాయంత్రం ఆరు తర్వాత ఉదయం ఎనిమిదికి ముందు ఆ దారిలో ఎవ్వరూ పయనించరు. అలా పయనించిన వారు స్వామి శాపానికి గురవుతున్నారు. స్వామి శాపాన్ని లెక్కచేయని కొందరూ వెళ్ళి అయిపు లేకుండా పోయారు. వెనుక వచ్చిన వారు కొందరు లేకపోలేదు కానీ వారి సంఖ్య స్వల్పం.
