Previous Page Next Page 
ఉదాత్తచరితులు పేజి 12

 

    గ్రామస్థులు గొప్ప, బీద తారతమ్యం లేకుండా ఇంటికి తెచ్చుకొన్న ధాన్యలక్ష్మిని పాతరలలో భద్రపరిచారు. వడ్లమిషన్ నుంచి వచ్చే శబ్ధాలు వాద్యాల సమ్మేళనం జరుగుతున్నట్లు అందరి ముఖాలు కళకళ లాడుతున్నాయి. మళ్ళీ వంట వచ్చేటంతవరకు సరిపడ్డ ధాన్యం ఉంచుకొని, మిగిలినది అమ్మగా వచ్చిన డబ్బును లెక్క చూచుకొంటున్నది ఓంకారి.
    మగదిక్కు లేని సంసారం. ఆస్తి పెరగలేదు. కాని, భూమి ధర పెరిగింది. ఇదివరకు ఎంత తిన్నా మిగిలింది ఎక్కువనిపించేది. అమ్మలు వీణ చదువుతో డబ్బు భద్రం చేయాలని, జాగ్రత్తగా వాడాలన్న తలంపు కలిగింది.
    నాగలక్ష్మి ఇన్నేళ్ళలో తన కంటూ ఏమీ ఖర్చు చేసుకోలేదు. కృష్ణారావు ఇచ్చే డబ్బుతోనే  అత్యవసరాలు తీర్చుకొంటుంది. ఇరవై సంవత్సరాలలో ఆ గ్రామం ఎంతో అభివృద్ది చెందింది. ఎన్నెన్నో వేడుకలు, సంతలు, నాటకాలు జరిగి ఉంటాయి.    
    గడపదాటి బయటికి రాలేదు నాగలక్ష్మి. గ్రామంలో ఆమెను చూచిన వాళ్ళు కొద్దిమంది. ఆమె గడిపిన జీవితం ఇంటి పరిధిని దాటి పోలేదు.
    ఓంకారి మనస్సు నాగలక్ష్మి చుట్టూ తిరుగుతుంది. కృష్ణారావును పెళ్ళి చేసుకున్న కొత్తల్లో ఓంకారి ఒడిలో తల ఉంచి, "అత్తమ్మా! మన సంప్రదాయాలను మలినపరచలేదు కదా! నేను చేసింది తప్పేమో ననిపిస్తుంది. నా కెందుకో భయంగా ఉంది" అనేది.
    అన్ని విధాల ధైర్యం చెప్పి ఓదార్చింది ఓంకారి. కాని, మానసికంగా బాధ పడుతున్నదని గ్రహించింది. కృష్ణారావు కొట్టడు. తిట్టడు. మంచివాడేనన్న నమ్మకం కలిగింది. కాని, మునుపటి హుషారు లేదు, ఆ నవ్వు మాయమైంది. తరవాత, తరవాత తెలిసింది నాగలక్ష్మి నల్లమందు వేసుకుని మత్తుగా నిద్ర పోతుందని. అది అలవాటుగా మారింది.
    'భగవంతుడా! నీవే ఈ ఆడవాళ్ళని కాపాడాలి' అనిరెండు చేతులెత్తి నమస్కరించేది ఓంకారి.
    కొడుకు రామారావును ఎప్పుడూ తలంచుకోదు. జ్ఞాపకాలనుంచి తరిమివేస్తుంది. వెంకట్రావుని తలవని క్షణం ఉండదు. 'ఏమి చేస్తే నీవు కనిపిస్తావు? నే నెలా రాను? నాగలక్ష్మిని, వీణను వదిలి ఎలా రాను? ఎప్పటికప్పుడు నా బాధ్యతలు నిన్ను చేరుకోనివ్వటం లేదు. ఒక్కసారి కనిపించవూ?' పూజలో కూర్చుని భగవంతుని ధ్యానంలో ఉన్న ఓంకారి పూజ ముగించేటప్పటికి తను అంతవరకు వెంకట్రావునే పూజించి, వెంకట్రావుకే తన విన్నపాలు విన్నవించుకొంది అని గ్రహించేది- కళ్ళు తెరిచి విగ్రహాలముందు లెంపలు వేసుకొనేది-"అపచారం, అపచారం" అంటూ.
    అపరాహ్ణం వేళ. ఎండదొర సరిగ్గా ఇంటిమీద నిలుచున్నాడు. ఎవ్వరో పిలిచినట్లు గదిలో నుండి వరండా లోకి వచ్చింది ఓంకారి. తలుపు తెరుచుకుని ఓ వ్యక్తి లోనికి వచ్చాడు. నిశ్చేష్టురాలై నిలుచుండిపోయింది. ఆ వ్యక్తిని చూచిన ఓంకారి.
    వణుకుతున్న చేతులు రొమ్ము మీదకు వచ్చాయి. "వెంకట్రావూ..." అంది అస్పష్టంగా.
    ఒరిగిపోతున్న ఓంకారిని చేతుల్లోకి ఎత్తుకొని మంచం మీద పడుకోబెట్టాడు.
    అతని కళ్ళలో నీళ్ళు. తననే కళ్ళార్పకుండా చూస్తున్న ఓంకారి చేతులు తీసుకొని, "నాన్నమ్మా!" అన్నాడా వ్యక్తి. వణుకుతున్న చేతులతో అతని ముఖం, ఒళ్ళు తడుముతూనే ఉంది మౌనంగా, ఆమె భావాలు వర్ణనా తీతం! తనకు ఏదో అపూర్వ స్పర్శ తగులుతున్నట్లు అనుభూతి పొందుతున్నాడు.
    నాగలక్ష్మి, "అత్తమ్మా!" అంటూ లోనికి వచ్చి గడపదగ్గర ఉండిపోయింది ఆ దృశ్యాన్ని చూస్తూ.
    నాగలక్ష్మి రాకతో అతను పైకి లేచాడు.
    ఓంకారి లేస్తూ, "నాగలక్ష్మీ..." అని మాటలు దొరక్క ఉండిపోయింది.
    దగ్గరగా వచ్చి ఓంకారి పక్కన నిలుచుంది.
    జన్మ ఇచ్చిన తల్లిని, తండ్రిని చూచుకోలేదు. తన తల్లే ఎదురుగా వచ్చిందనుకొన్నాడు. భాగ్యమ్మ చనిపోతూ రత్నావతి కొడుకుని పిలిపించి అతని జన్మ రహస్యం తెలిసింది. మొదట అతని ప్రాణం తల్లడిల్లి పోయింది. తేరుకొన్న మీదట రక్త సంబంధికులైన ఓంకారి నాన్నమ్మను చూడాలని మనస్సు ఉరకలు వేసినా, వచ్చి తనను పెంచి పెద్ద చేసిన తండ్రికి దుఃఖం కలిగించలేక రక్తపాశాన్ని బంధించాడు. అతని తండ్రి మరణానంతరమే ఇక్కడికి రాగలిగాడు. వెంకట్రావును ఎగాదిగా చూసింది నాగలక్ష్మి. సన్నగా నవ్వుతున్నట్లుండే ఆ పెదాలు, ఆ నిలుచున్న తీరు...లీలగా గుర్తుకు రాసాగాయి. ఓంకారిని గట్టిగా పట్టు కొన్న నాగలక్ష్మిని 'అమ్మా!" అన్న పిలుపు కదిలించి వేసింది. అప్రయత్నంగా చేతులు చాచింది. అమ్మ చేతుల్లోకి వెళ్ళిపోయాడు.
    ఏడుస్తున్న ఆడవాళ్ళని అతని బాహువుల క్రిందికి చేర్చుకొన్నాడు వెంకట్రావ్ అని పిలువబడుతున్న సహదేవ్! ఓంకారి ఇంట్లో పండుగ జరిగింది. సంతోష మనే దీపాలు వెలిగాయి.
    'వెంకట్రావూ! మనువడి రూపంలో కనిపించావా! నీ ప్రేమ గొప్పది! నా జన్మ తరించింది!' ఎన్నో ఏళ్ల తరవాత కలత లేని నిద్ర పోయింది ఓంకారి.
    
                                  *    *    *

    ఆరు నెలలకే వచ్చిన ఆర్గానిక్ పరీక్షలు వ్రాశారు వీణ, జుబేదాలు, సోఫియాకి థియరీ అయింది. ప్రాక్టికల్స్ మిగిలాయి. సోఫియాకి వచ్చిన టెలిగ్రామ్, అందుకొంది వీణ. 'మదర్ ఎక్స్ పైర్డ్' అని హాస్పిటల్ వాళ్ళు ఇచ్చిన టెలిగ్రామ్ చదివారు జుబేదా, వీణలు.
    ఒకరి ముఖాలు ఒకరు చూచుకొన్నారు. టెలా గ్రామ్ తీసుకొని పరీక్ష హాలుకు పరుగెత్త బోయిన వీణ చెయ్యి గట్టిగా పట్టుకొంది జుబేదా.
    "ఈ టెలిగ్రామ్ సోఫియా పరీక్ష పాడు చేయవచ్చు. పరీక్షలు అయిపోయాక ఇద్దాము."
    "అమ్మో! తను వెళ్ళి బాడీనైనా చివరిసారిగా చూసుకోవద్దూ?"
    "వీణా! ఇప్పుడు వెళ్ళికూడా లాభం ఉండదు. క్రిమేట్ చేసి ఉంటారు. తన పరిస్థితులకు పరీక్షలు ముందు ముగించుకోవటమే ఉత్తమం."
    దుఃఖం వచ్చేసింది ఇద్దరికీ.
    వీణ చేతుల్లో ముఖం దాచుకొని, "జాబ్! ఎలాటి పరిస్థితుల్లోనూ ఇలాటి టెలిగ్రాం నాకు వస్తే దాచకు. నేను క్షమించను!" అంది.
    "వీణా!"
    పరీక్షల ఒత్తిడికి ముఖం క్లాంతమైనా చతురలా వచ్చింది లోపలికి సోఫియా.
    "ఎలా చేశావు?" అంది జుబేదా.
    "మామూలే!" పుస్తకాలతోనే మంచం మీద వాలిపోయింది సోఫియా.
    వీణ బెరుకుగా జుబేదా వైపు చూచింది. నోటి మీద వేలుంచుకొని "ఇష్!" అంది జుబేదా.
    ఫ్లాస్కులో ఉన్న కాఫీ పోసి ఇచ్చింది సోఫియాకి జుబేదా.
    గ్లాసు అందుకొంటూ, "థాంక్స్!" అని ఆర్ద్రంగా జుబేదా వైపు చూచింది సోఫియా. "జుబేదా! మీకు నేను చాలా ఋణపడి ఉన్నాను! వచ్చే జన్మలో నా కూతుళ్ళుగా జన్మించి నా పని పట్టించండి" అని నవ్వుతూ, "వీణ మూగబోయిందేం?" అంది.    '    "నాన్నమ్మకి పుట్టుదా మనుకొందిగా!"
    "నాకుకూడా నాన్నమ్మకే పుట్టాలనుంది. అంత అదృష్టమా! నాన్న, అమ్మ లేనివారు గడ్డిపోచ కంటే హీనులై పోతారు. మా అమ్మ ఊరకనే జ్ఞాపకానికి వస్తున్నది. కోర్సు నెక్స్ట్ డిసెంబరుకు అయిపోతుంది. అమ్మను, డేవిడ్ ని తెచ్చుకొంటాను....మేమందరం కలిసి ఉండే ఆ మదినం కోసరమే ఎదురుచూస్తూ ఉన్నా..."
    జుబేదా, వీణలు ఊపిరి బిగబట్టి వినసాగారు.
    ఆ రోజు గడిస్తే చాలని తలంచారు.
    డైనింగ్ హాలునుండి తిరిగి వస్తూంటే సరోజ ఎదురైంది. "సోఫియా! టెలిగ్రామ్ వచ్చింది. ఏమిటి?" అంది.
    "టెలిగ్రామా! నాకా?"

                                         
    పోస్టుమాన్ హాస్టలంతా తిరిగితే నీ రూము నంబరు చెప్పి పంపాను."
    తెల్లబోయి నిలుచున్న వీణ, జుబేదాలను ప్రశ్నార్ధకంగా చూసింది సోఫియా.
    "టెలిగ్రామా! ఏ...ఏమో!" అంది జుబేదా.
    ముఖంలో ఏ భావమూ లేని సోఫియా గదిలోకి వెళ్ళి బల్లమీది పుస్తకాలు వెతకసాగింది. కనబడలేదు.
    "జూద్! ఏముంది టెలిగ్రామ్ లో? ఎందుకు దాచారు? ప్లీజ్!" అంది.
    జుబేదా వీణవైపు చూచింది. వీణ తల ఊపింది. బ్లౌజ్ లోపలనుంచి టెలిగ్రామ్ తీసి ఇచ్చింది జుబేదా.
    కెవ్వున కేక వేసి పడిపోతుందేమోనని ఒకరి నొకరు పట్టుకొని నిలుచున్నారు.
    కాని, టెలిగ్రామ్ చదువుకొని దానివైపే చూస్తూ, మడిచి బల్లమీదున్న చక్కని బైండింగ్ లో ఉన్న బైబిల్ లో ఉంచింది. బైబిలు పట్టుకొన్న ఆమె చేతులు వణికాయి.
    అమ్మ ఆత్మకు శాంతి కలగాలని ఏసయ్యని ప్రార్దించింది. చాలా రోజుల తరవాత ప్రార్దించింది.
    బల్లపై బైబిలు ఎప్పుడూ ఉంటుంది. కాని, చదువుతుండగా ఎవ్వరూ చూడలేదు. వీణ అడిగింది ఒకసారి-"బైబిలు చదవటం లేదే? ప్రతి సన్ డే చర్చికి వెళ్ళుతారు కదా- నీవు ఎందుకు వెళ్ళవు?" అని.
    "బైబిల్ లో క్రీస్తు గురించి చదువుతూ ఉంటే దిగులుగా ఉంటుంది. అందరినీ ప్రేమించమన్నారు. రోగగ్రస్తులను బాగుచేసి చనిపోయిన వారిని బ్రతికించిన విషయాలు నేరాలుగా ముళ్ళు తలలో గుచ్చారు. బైబిలు తెరిస్తే శిలువమీద వేలాడుతున్న క్రీస్తు కనిపించినట్లవుతుంది. చిన్నప్పటినుండి క్రీస్తు దేవుడని నమ్మకము. చనిపోయేటంతవరకు ఆ నమ్మకమేగా ఉంటుంది!" అని చెప్పింది సోఫీ.
    వీణ కోరగా సోఫియా వాళ్ళని చర్చికి తీసుకొని పోయింది. ఏక కంఠంతో ఆర్గన్ శ్రుతితో కీర్తనలు పాడుతుంటే మనస్సుకు ఏదో హాయి కలిగి హృదయం తేలికైంది. ప్రార్ధనలో కళ్ళు మూసుకుంటే శరీరం వణికింది వీణకు.
    "అదే భక్తి పారవశ్యం" అని జుబేదా చెప్పింది.
    రాళ్ళతో చెక్కిన విగ్రహాలను పూజించటం తప్పేమోనని తలంచింది వీణ.
    అలమారులో ఉన్న వెంకటేశ్వరస్వామిని అలంకరించి, దీపారాధన చేసి పూజించి తలలో పూవు తురుముకొని, నుదుట కుంకుమ దిద్దుకొంటున్న వీణను చూసిన సోఫియాకు విగ్రహారాధన మీదకు మనస్సు పోయేది. వెంకటేశ్వరస్వామి విగ్రహంలో క్రీస్తును చూచేది.
    భూమి గుండ్రంగా ఉంది. ఎటు తిరిగినా బయలు దేరిన స్థలానికే వచ్చినట్లు, ఏ మతాన్ని అనుసరించినా చివరకు ఆ భగవంతుని సన్నిధికే చేరుకొంటారు అని ఎన్నడో తేల్చిన సత్యాన్ని ఈనాడు వారు గ్రహించారు.
    ఆ రాత్రి మామూలుగా ఉండటానికి ప్రయత్నించింది సోఫియా. మరునాడు ఓరల్స్ కి ప్రిపేర్ అవుతున్నది. వీణ ఉండబట్టలేక సోఫియా దగ్గరకు వచ్చింది. వీణ వైపు చూచి నవ్వటానికి ప్రయత్నించింది. అది ఏడ్పుగా మారింది. ఎంతోసేపు ఏడ్చింది వీణ ఒడిలో ఆ గదిలో శోకదేవత తాండవించింది.
    ఎప్పుడు నిద్రపోయారో! ఏమో?
    'బ్రతికిన అమ్మ సుఖపడింది లేదు. భాగము పోగొట్టుకొని, బిడ్డను జైలు పాలు చేసుకొని మతిభ్రమించి జీవచ్చవంలా జీవించింది. సుఖదుఃఖాలకు, ఆకలిదప్పులకు అతీతమైన ఆ లోకాన్ని చేరుకొంది. అమ్మ గురించి ఇక ఏ దిగులూ లేదు. బ్రతికిన తన కోసమే ఈ దిగులు. ఏ అండా లేక నేలన ప్రాకుతూ పోతున్న తీగ వంటిది తన జీవితం. చివరికి ఎలా అంతమవుతుందో అని తలంచింది. ఆ మాటే వీణతో అన్నది సోఫీ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS