"ఏమిటి తల్లీ! నా దగ్గర దాస్తున్నావు! చెప్పు ఫర్వాలేదు!" అని నింపాదిగా అడిగాడు.
"మరి.... నన్ను.... చూసి ప్రేమించాడట! .....అందుకు అబద్దాలాడయినా, పీకల మీదికి వచ్చినా.... ధైర్యం చేసి వున్నాడట!' అని అనేసి సిగ్గుపడిపోయి తలవంచుకుంది.
"ఇంపాసిబిల్ .... నిన్ను ప్రేమించడమా! నా కన్ను కప్పి యింత గ్రంథనాంగుడయి ... ఎంత గుండెలు తీసినపని. నన్నొక ఫూల్ ని చేశాడే!" అని కోపంతో అన్నాడు.
"ఇకనేంరా! అన్నయ్యా! మరేం తప్పు లేదులే. మనం కలపవలిసేది భగవంతుడే కలిపాడన్న మాట!" అని అంది శాంతమ్మ ఒక ప్రక్క నవ్వుతూ, మరో ప్రక్క విచార పడుతూ.
"చెల్లీ నిన్ను చూడగానే నాకూ ఆ అభిప్రాయమే కలిగింది. .... నా గిరిజకి తగినవాణ్ణి యింక వెతకవలసిన అవసరం తప్పిందను కున్నాను కాని- యిప్పుడు తెలిసింది? ....... క్షమించు....నీ కొడుక్కి నా కూతుర్ని వ్వలేను? అని మొహమాటం లేకుండా అనేశాడు. ఆ మాటలు విని బిత్తరిల్లిపోయింది శాంతమ్మ.
"అదేవిటి అన్నయ్యా! అలాగనేస్తున్నావు?.....నా కొడుక్కేం పిల్ల దొరక్కపోదు గాని - ఎట్లాగో దైవికంగా, చాలాకాలం తర్వాత కలుసుకున్నాం, తెగిపోయిన సంబంధాలు మళ్ళీ కలపాలని, విడిపోయిన వాళ్ళం తిరిగి ముడిపడాలని. అభిమానం, ప్రేమ చచ్చిపోకుండా మళ్ళీ చిగురింప చేయాలని నేనామాట అన్నాను. నువ్విలా త్రుంచి పారేస్తావనుకోలేదు?"
"నాకు అలానే వుంది! .... కాని యిలాంటి అసభ్యపు పని చేస్తాడని అనుకోలేదు. నువ్వే చెప్పు! నీకే కూతురుంటే ఇలాంటి వాడికా యిచ్చేది? .... చూశావా నా కూతురెంత బుద్ధి మంతురాలో అలాటి వాడికెలా బుద్దిచెప్పాలో - అలానే చెప్పింది!"
"ఏదో చిన్నతనం, ఆమాత్రం దానికి కొంప లేం మునిగిపోయాయి?"
"నువ్వేమనుకోకు చెల్లీ అటువంటి మోసగాడికి. దౌర్భాగ్యుడికీ నే పిల్లనివ్వలేను! వాడు నీ కొడుకే అవడం విచారికరం!" అని అనేశాడు ఎంత చెప్పినా వినకుండా, దానికి శాంతమ్మకి పౌరుషం వచ్చింది-
"అప్పటికీ యిప్పటికీ నీ మొండితనం మాత్రం పోలేదు అన్నయ్యా! ఉత్తిపుణ్యానికి వదినని ఆడిపోస్తామేగాని చచ్చి ఏ స్వర్గాన్నుందో అదే నయం. చేసేవన్ని ఈ మగవాళ్ళే చేస్తారు. మళ్ళీ ఆడదానిమీద తోసేస్తారు.....నాదే బుద్ధి పొరపాటు. లేకపోతే. మొగాడికి ఆడపిల్ల ని ఇయ్యి అని బ్రతిమలాడుకొనడం ఏమిటి. నేనలా అనకపోయే మాటుంటే నువ్వే అడిగేవాడవు?....యిక నీ యిష్టం.....నేవెళుతున్నాను. మళ్ళీ ఎలాగో భగవంతుడు కలిపాడనుకున్నాను. కాని, మనకా యోగంలేదు ..... ఈసారి పూర్తిగా సంబంధాలు తెగిపోయాయనే అనుకో!"
అని కోపంతో లేచి వెళ్ళి పోబోయింది.
"దానికీ దీనికి సంబంధం ఏమిటి చెల్లీ!" అని ఎటూ పాలుపోక అన్నాడు!
"మరి దేనికి" నాకొడుక్కీ నీ కూతురికి సంబంధమే లేనినాడు నీకూ నాకూ మాత్రం వున్న సంబంధం ఏమిటి? ఆ నాటితోనే అన్నే తీరిపో యినాయి అనుకున్నాను" అని వెళ్ళిపోతూంది. దాసుగారికి గొప్ప సంకటావస్థ వచ్చిపడింది."
"చెల్లీవెళ్ళిపోకు!" అని అరిచాడు. అయినా ఆమె ఆగలేదు. ఏమీ చేయలేక చూస్తున్నాడు.
"అత్తయ్యకు రమ్మను నాన్నా" అని గిరిజ అంది.
"నేనేం వద్దన్నానుటే? అదే కోపం తెచ్చుకొని వెళ్ళిపోతూంటేను. ఏం చేసేదమ్మా?
అలాగే అని రమ్మను నాన్నా!" అని అంది. ఆ మాటలు విని దాసు ఆశ్చర్యపోయి కూతురి వంక చూశాడు. సిగ్గుతో తలదించుకొని వుంది గిరిజ.
"ఏమిటీ, ఏమన్నానే? అలాగే అని పిలవమన్నావా?"
"అవున్నాన్నా?"
"అంటే నీ కిష్టమేనన్న మాట!"
గిరిజ మౌనం వహించింది. మొహం ఎర్రగా గులాబీ అయింది. తండ్రి దగ్గర నిలబడలేక అక్కడనుండి. పరుగెట్టింది - దాసుగారు ఆనందంతో చిరునవ్వు నవ్వేడు -
"ఇదుగో చెల్లమ్మా!" అని పైకి అనబోయి, ఆఁకాదు, కాదు! అని లోపలే అనుకొని -
"అయితే అమ్మాయి నువ్వెళ్ళి మీ అత్త గార్ని తీసుకురా. వెళ్ళు అన్నాడు నవ్వుతూ.
అప్పటికప్పుడే గేటు వరకూ వెళ్ళిపోయినా శాంతమ్మ దగ్గరికి గిరిజ పరుగెట్టుకు వెళ్ళి చెయ్యి పట్టుకు ఆపింది.
"రాండి అత్తయ్యా! అలా వెళ్ళిపోతే నా మీద ఒట్టే." అని అంది.
"ఎందుకులేవే. పెద్దవాళ్ళం సిగ్గులేక పోట్లాడుకొని ప్రేమలూ, అభిమానాలూ, లేకుండా చేసుకున్నది చాలక, పిల్లల మధ్యకూడా ఆ ద్వేషాలూ, కోపాలూ, రేపుకోడం ఎందుకు? ఎవరి మానాన్ని వారు సుఖంగా వుంటే చాలు! నన్నెందుకు రమ్మంటావు! నన్నుపోనీ! మీ నాన్నకి ఇలా ఎవరికీ వారే వుంటేనే బావున్నట్టుంది." అని అనేసింది, ఇంతలోనే దాసుగారు కూడా వచ్చి -
"ఇంకా అనాలా చెల్లెమ్మా! నీ కోడలు స్వయంగా వచ్చి పిలుస్తున్నా రావా? " అని అన్నాడు.
"ఏమిటీ నా కోడలా? నిజంగానా అన్నయ్యా, అలా వారికిరా! నయమే-నీ బుద్దులూ, వదిన బుద్దులూ, నా కోడలికి లేవులే, నా తల్లి పదమ్మా! తప్పకుండా వస్తాను పద" అని ..... శాంతమ్మ-గిరిజని కావలించుకుని లోపలకు వెళ్ళింది.
"వాడెక్కడున్నాడో - ఏమిటో చూసి తీసుకురా అన్నయ్యా" అని అన్నగారికి చెప్పింది ఆ ప్రయత్నంలోనే వున్నాడు దాసుగారు.
* * *
ఆ రోజు దినపత్రికలో - "వాసూ అండ్ కంపెనీ ప్రైవేటు లిమిటెడ్" అనే సంస్థలో సైనోలు కావాలని ప్రకటన వచ్చింది. అది చూసి, గిరి మరి ఆలస్యం చెయ్యకుండ అప్లయిచేశాడు, ఇన్నాళ్ళూ "ఎప్లెయి, ఎప్లెయి - నో రిప్లెయి" అయినా, ఈ మారు వారం రోజులు తిరక్కుండానే ఇంటర్వ్యూకి రమ్మని పిలవడం గిరికి మంచి ఉత్సాహం వచ్చింది. ఆ ఊరిలోవాసూ అండ్ కంపెనీ. చాలా పెద్ద వాణిజ్య సంస్థ అంచేత నమ్మకం ధైర్యం రెండూ కలిగాయి గిరికి.
ఇంటర్వ్యూకి టిప్ టాప్ గా తయారయిబయలుదేరాడు ఇష్ట దైవాల నందర్నీ తలుచుకొని. ఆంజనేయస్వామికి కొబ్బరికాయలు కొడతానని వెంకట్రమణమూర్తికి ముడుపు కడతానని- ఎన్నో మ్రొక్కుకుని, గుమ్మం ఎక్కాడు.
అక్కడా తనలాటి నిర్భాగ్యులే పదిహేను మంది దాకా కూర్చుని వున్నారు! తనను చూసి వాళ్ళు పైకి నవ్వినా, లోపల ఏడుస్తూనే బెంచీ మీద కూర్చోడానికి బాగా యిచ్చాడు. అప్పటి కింకా ఎవరినీ పిలవలేదు. తర్వాత మరోనలుగు రయిదుగురు వచ్చారు!
కావలసింది ఒక పోస్టు. దానికి రమారమి ఇరవై మంది. అబ్బ! ఏం కాలం వచ్చింది!.....చదువుకోండి చదువుకోండి అని ప్రోత్సహించడమేగాని, ఈ చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు చూపడంలేదు ప్రభుత్వం. మరి నిరుద్యోగ సమస్య ఎలా పోతుంది?
చదువుకుంటే చాలు ఉద్యోగమే చేసితీరాలి. చదువుకోడం కేవలం ఉద్యోగం కోసమే అన్న దురభిప్రాయం ఒకటి మనలో వుందాయె.
కొత్త కేండిడేటు ఒక్కొక్కడూ వస్తూంటే అంతవరకూ కూర్చున్న వాళ్ళ ప్రాణాలు ఒక్కొక్కటి పోతున్నాయి. ఆ వచ్చిన వాడే ఆ ఉద్యోగం కాస్తా తన్నుకుపోతాడో ఏమో అన్నట్లు చూస్తున్నారు. ప్రతీ ఒక్కడిలోనూ స్వార్ధం, ఈర్ష్య, వున్నా నాగరికత పెట్టిన మునుగు వెనక అది కనబడనీయ కుండా, లేనినవ్వు తెచ్చుకుంటూ షేక్ హేండ్స్ చేసుకుంటున్నారు.
ఇంటర్వ్యూ మొదలయింది - ఎప్పుడు పిలుస్తారా, ఎప్పుడు పిలుస్తారా అని ఎదురు చూస్తున్న గిరిని .... ఎప్పటికీ పిలవడం లేదు. అందరూ ఒకడి వెంట ఒకడు వెళ్ళపోతున్నారు. ఎగ్జామినేషన్ హాల్లోంచి - వస్తున్న స్టూడెంటుల్లా వాళ్ళ మొహాలు ఒక్కక్కడిదీ ఒక్కొక్క రకంగా వున్నాయి! సంతోషంగా ఒకడూ విచారంగా ఒకడూ, ఏడుస్తూ ఒకడు, నిరాశగా ఇంకొకడూ నవ్వుతూ ఖాతరు లేనట్టు, ఆరుస్తూ మరొకడూ ఇలా అవకాశాలన్నీ వెళ్ళి పోతున్నాయి.....
గిరికి రానురాను చికాకూ విసుగూ కలిగింది. కాని ఆశ పీడిస్తూండడం వల్ల యింకా చూస్తున్నాడు. అది పూర్తి అయ్యేవరకూ ఉండడం తన కర్తవ్యం!
ఆఖరికి ఎట్లాగయితేనేం తన పేరు పిలవడం- ఒకసారి, బట్టలు సర్దుకొని క్రాఫ్ దువ్వుకొని, రుమాలుతో మొఖం తుడుచుకొని వెళ్ళాడు గిరి. లోపలకుపోయి టేబిల్ దగ్గర నిలబడి విష్ చేశాడు. అక్కడ ఎదురుగా కూర్చున్న ఆసామీ ఎవడోగాని డైలీపేపరు ముఖానికి అడ్డంగా పెట్టుకొని చదువుతూ కూర్చున్నాడు. గిరిని చూడ నయినా చూడకుండానే-
"కూర్చో!" అన్నాడు......అబ్బా సినీమాలో చూపించినట్లు వుందే అనుకున్నాడు గిరి- ఆ గొంతుకకూడా ఎక్కడో నిన్నదే అనిపించింది కాని ఎవరిదో జ్ఞాపకం రావడంలేదు.
"ఏం చదువుకున్నావ్?" అంటూ పేపరు తీశాడు ముఖం మించి - ఆ ఆఫీసరు.
ఆ ముఖం చూసేసరికి ముచ్చెమటలూ పోసేయి గిరికి - పులిని చూసినట్టు అదిరి పోయాడు. అతనెవరో కాదు వాసుగారే!
"మీరా!" అని ఆశ్చర్యపోయాడు. ఏం మాట్లాడానికీ నోరు పెగలలేదు.
"ఏం ఆశ్చర్యం ఎందుకు? ఈ ఎపాయింట్ మెంట్స్ చూడ్డానికి నేను హాసరరీ చైర్మన్ ని" అన్నాడు.
"మంచిదేనండీ!" అని నవ్వుతెచ్చుకుని అన్నాడు.
"ఏం చదూకున్నావు?" అని అధికారిలా అచ్చం ప్రశ్నించాడు. ఆ ప్రశ్న విని ఆశ్చర్యపోయినాడు. గిరి-ఏం తెలీనట్టు అడుగుతున్నాడేమా అని!
"మీకు తెలియదా?" అన్నాడు-
"తెలుసననుకో అయినా అది నిజమేనని నమ్మకం ఏమిటీ? నువ్వు చెప్పిన కొన్నిటిలాగే అబద్ధం కాకూడదా?
"ఏం చేత్తో అలాగడుతున్నారీవేళ ' అని లోలోన భయపడుతూనే ధైర్యంగా పైకి అన్నాడు.
