Previous Page Next Page 
పగటికలలు పేజి 12


    ఆ సామానంతా పట్టుకుపోయి తాత్కాలికంగా ఒక స్నేహితుడింట్లో వుంచాడు. మళ్ళీ కొంప దొరికేవరకూ వాడినే బ్రతిమాలుకుని అక్కడే వుండటానికి ఒప్పించేడు!
    గిరి ఈ గొడవల్లో పడి తల్లికి ఉత్తరాలు రాయడం కూడా అశ్రద్ధ చేసేడు. ఆమె సొమ్ము పంపుతూవుంటే. సంతకం మాత్రం పెట్టేసి తీసుకుంటున్నాడు! అంతే మరి- తన ఉద్యోగ ప్రయత్నం ఏమయిందో - ఎట్లా వుంటున్నాడో ఏమీ వ్రాయడం మానేశాడు. దాంతో అతని తల్లికి ఆతృత లావయింది.

                                    8

    ఎన్నాళ్ళకీ గిరిదగ్గర నుండి ఉత్తరం రాకపోయే సరికి చూసి చూసి అతని తల్లి, బయలుదేరింది! నిజంగా గిరి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాడో! లేక డబ్బంతా ఖర్చుచేసి తిరుగుతున్నాడో! ఆమెకు అర్ధం కాలేదు,
    గిరి యిచ్చిన ఎడ్రసు పట్టుకుని- దాసుగారి గుమ్మంలో దిగింది. ఆమెనుదాసుగారు ఆశ్చర్యంగా చూస్తూ-
    "అరె! చెల్లెమ్మ! ఎన్నాళ్ళకి! అనుకోకుండా వచ్చావే! రా! రా!" అని అన్నాడు సంతోషం పట్టలేక- దాసుగారిని ఆకస్మాత్తుగా అనుకోకుండా ఆ విధంగా చూసి, ఆవిడ వింత పోయింది. వెళ్ళనా మాననా అని తడబడింది.
    "రా చెల్లెమ్మా! అయినవన్నీ మరిచిపో ! ఆ రోజులు మరిలేవు, లోపలికిరా!" అని దాసుగారు మళ్ళీ అంటూ ఆవిడ చెయ్యిపట్టుకుని లోపలికి తీసుకువెళ్ళాడు.
    వాళ్ళెవరో కాదు! అన్నా చెల్లెళ్ళు! ఏవో పట్టింపులూ అవీ వచ్చి, చాలా కాలం క్రిందటతెగతెంపులు చేసుకుని యీ పాటివరకూ మొహాలు కూడా చూసుకోలేదు !....అంటే గిరికి దాసుగారు మేనమామ! గిరికి గిరిజ మరదలు అన్నమాట! యింకేం?
    ఈనాడు అకస్మాత్తుగా, గిరిని వెదుక్కుంటూ వెళ్ళిన అతని తల్లిని అన్నగారు చూసి పూర్వం జరిగిన సంఘటనలు మరచిపోయి చెల్లెలికి మర్యాద చేశాడు! ఎలాగయినా అభిమానాలు, రక్త సంబంధం ఎక్కడికి పోతాయి? ముఖ్యంగా ఈ కలయికకు కారణం గిరి అతని యింట్లో అద్దెకు వుండడమే కదా?
    దాసుగారు గిరిజని పిలిచి - నవ్వుతూ -
    "అమ్మాయి చూడు ఎవరు వచ్చారో!.....చెప్పుకో చూద్దాం!"    
    గిరిజ ఆమెని చూసి తెల్లమొహం వేసింది -
    ఎవరో కాదే మీ మేనత్త! లోపలికి తీసుకు వెళ్ళి స్నానం అవీ చేయించు తర్వాత మాటాడదాం!" అని అన్నాడు.
    -జ్ఞానం వచ్చాక చూడకపోయినా కొంచెంకొత్తగా అనిపించినా గిరిజ నవ్వుతూ కలిసి పోయింది ఆమెతో!
    "చిన్నది దానికేం జ్ఞాపకంలే- వదినగారు పోయారటగా!"
    "అవును చెల్లీ? ..... ఏవో ఆ రోజులన్నీ పీడకలలు అనకూడదు గాని, నా మనసు అది పోయాకే స్థిమిత పడింది! ఈ యింట్లో శాంతి లభించింది!"
    "ఏదోలే - ఎంతయినా యింటికి పెద్దదిక్కు పోయిందంటే -ఎంత చిన్నబోయిందో చూడు!"
    "అవుననుకోగాని! దాన్నించి నేను మన కుటుంబంలో ఎవరికీ కాకుండా అయిపోయాను! అదేం మనిషో ఉన్నన్నాళ్ళూ, ఎవరిపొడా గిట్టేది కాదు!.... నీకు దాని సంగతి తెలీనిదా ఏమిటి? పోనీ ఈ నాటికయినా మళ్ళీ భగవంతుడు మనల్ని కలిపేడు. ఈ విధంగా.... ఎప్పటి కప్పుడే అనుకుంటూండేవాడిని మిమ్ముల్నందరినీ వచ్చి చూద్దామని.....కాని ఏమిటో మళ్ళీ నాలో నేనే చిన్నబోయి ఊరుకుంటున్నాను ! .... ఇక నయినా పాత సంగతులన్నీ మరచిపోయి ఎప్పటి లాగా వుందాం ఏమంటావు?"
    "అట్లాగే అన్నయ్యా! అంతకన్నా నాకు మాత్రం కావలసిందేమిటి? అయినా వదిన మాత్రం ఏం చేసింది లే. అంతా రోజుల మహత్యం, మన గ్రహచారం, అలా జరగావలసి వుంది. జరిగి పోయింది. పోనీలే దాని కాలం కూడా తీరిపోయింది, ఇంక అనుకోవడం దేనికే?"
    "రా అత్తయ్యా స్నానం చేసి మాట్లాడు కుందాం!" అని గిరిజ పిలుచుకుపోయింది ....
    శాంతమ్మ స్నానపానాదులు కానిచ్చింది, తర్వాత అందరూ కబుర్లకి కూర్చున్నారు. చాలా కాలానికి కలుసుకున్నారేమో ఎన్నో విషయాలు దొర్లిపోతున్నాయి! మాటల్లో-
    "ఏం చెల్లీ నీ కొడుకు విషయమే చెప్పేవు కాదు! ఈ పాటికి పెద్దవాడయిపోయి వుంటాడు! యిప్పుడేం జేస్తున్నాడూ? "చాలా కాలం అయింది వాణ్ణి చూసి!" అని అడిగాడు దాసు.
    "ఏమిటో అన్నయ్యా! వాడి సంగతే ఏం చేయడానికి బోధపడలేదు-చదువేమో అయి పోయిందట! ఆ పల్లెటూర్లో వుంటే ఏం తెలుస్తుంది! అని ఏదయినా నౌఖరీ కోసం ప్రయత్నిద్దామని ఈ వూరే వచ్చి వుంటున్నాడు.....ఆర్నెల్లవస్తూంది! ఉద్యోగమూలేదు సద్యోగమూ లేదు, నెలనెలా డబ్బు మాత్రం పంపిస్తూంటే, అందుకుని ఖర్చుపెడుతున్నాడు! - నిజంగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడో ఏమో!.....ఉత్తరాలా సరిగ్గా వ్రాయడు నెల్లాళ్ళయింది. నాలుగుత్తరాలు వ్రాసినా జవాబు లేదు! సంగతేమిటో చూసిపోదామని, వాడిచ్చిన అడ్రసు వెతుక్కుంటూ యిలా వచ్చాను ఇదిగో ఈ ప్రక్కింట్లో వుంటున్నాడంటే వచ్చేను, యింతలో నువ్వు కనిపించావు. యిహ ఫరవాలేదు! నువ్వు వున్నావు కాబట్టి వాడి బాధ్యత నువ్వే తీసుకోవాలి!" అని అన్నది శాంతమ్మ.
    "ఏమిటి? మా యింటి ప్రక్కనా? ఏదీ అడ్రసు యిలాతే! అని గిరి వ్రాసిన ఉత్తరమూ, అడ్రసూ చూసి వింతపోయాడు-"
    "అరె! ఈ కుర్రవాడా .....ఏమిటీ? వీడు నీ కొడుకా? అంటే నా మేనల్లుడా! .....భేష్ భేష్ బాగానేవుంది! .....చెల్లీ చూశావా? ఎంత పొరపాటు జరిగిందో! యిన్నాళ్ళు నా దగ్గరే వుంచుకుని పోల్చుగోలేకపోయాను!" అని ఆశ్చర్య, సంతోషాలతో అన్నాడు.
    "ఏమిటన్నయ్యా! వాడు నీకు తెలుసా!"
    "తెలుసా? .... ఆ ప్రక్కిల్లూ వాడే! వాడూ, వాడి భార్యా మా యింట్లోనే అద్దెకుంటేను, నిన్ననే ఎందుకో అకారణంగా, అకస్మాత్తుగా యిల్లు కాళీచేసి వెళ్ళిపోయాడు!.... నాకు తెలీక అడుగుతాను ఎవరి సంబంధం చేశావు!" అని ప్రశ్నించాడు.
    ఈ మాటలు విని ఆమె నిర్ఘాంతపోయింది!
    "వాడికి పెళ్ళామేమిట్రా అన్నయ్యా! ఇంకా నౌఖరీ ఏదో స్థిరపడితే వాడినో యింటి వాడిని చేసి, రామా కృష్ణా అని అనుకుందామనుకుంటూంటేను! అదివారని గురించి నువ్విలా అనుకుంటున్నావో, వాడికింకా ఎక్కడా సంబంధాలు కుదర లేదే!"
    ఏమిటి చెల్లీ నువ్వనేది? ఈ అడ్రస్ గాని నీ కొడుకు దయితే వాడిపేరేగాని "గిరి" అయితే ఖచ్చితంగా వాడు మాయింట్లోనే సపత్నీ సమేతంగా ఇన్నాళ్ళూ వున్నాడు! సలక్షణంగా కాపురం చేస్తున్నాడు.
    "ఏమిటన్నయ్యా నువ్వనేది! నాకేదో లాగా వుంది! నువ్వు నిజంగా చూశావా!"
    "నేను కళ్ళారా చూడలేదు గాని ...... ఆ అన్నట్లు కావాలంటే గిరిజని అడుగు. మొన్ననే పేరంటానికి వీళ్ళందరూ వెళ్ళి ఆ పిల్లని చూశారు? అదికాక వీళ్ళందరూ రోజూ మాట్లాడుకుంటూనే వుంటారు! నువ్వు కాదంటావేమిటి?"
    "ఏమోరా? అన్నయ్య! నాకంతా అయోమయంగా వున్నాది- కొంపతీసి ఎవర్తినయినా తీసుకవచ్చి వేరే కాపురం వెలిగిస్తున్నాడా ఏమిటి? ఏమే గిరిజా నిజమేనా ఏమిటి?" భయంతో అడిగింది.
    "అవునత్తయ్యా! నిజమే.... కాని అదంతా నాటకం నాన్నా! నిజంగా అతనికి పెళ్ళీ పెటాకులు ఏం లేదు!" అని గిరిజ అంది.
    "ఆఁ ఏమిటి? నాటకమా అంతా అబద్ధమా నీ కెలా తెలుసు? ఏమిటి ఇందులో బూటకం? నీకు తెలిస్తే నాకు తెలియనివ్వలేదా?" అని కొంచెం గట్టిగానే అన్నాడు.
    "ఏంటి తిన్నగా చెప్పే గిరిజా! సంగతేమిటో అని ఆతృతతో శాంతమ్మ అడిగింది.
    "అవున్నాన్నగారూ! నాకు నిన్నటి వరకూ నిజం తెలీదు! కాని నిన్న అతని వేషం మోసం అంతా తెలిసిపోయింది. అందుకే అంత అకస్మాతుగా యిల్లు కాళీ చేసి వెళ్ళిపోయాడు. ఎవరితోనూ చెప్పవద్దని బ్రతిమాలుతున్నాడు! అందుకేమిటో చెప్పలేదు. కానీ. కథ అడ్డం తిరిగింది."
    "ఏమిటీ! ఎంత మోసం? అదా అతను వెళ్ళి పోడానికి కారణం! యింకా ఎంత మంచివాడనో ఎంత బుద్ధిమంతుడనో అనుకున్నాను! యింతకీ ఎందుకు ఎలా నాటకం ఆడాడు! అంతకర్మ ఏం వచ్చింది? నీకీ సంగతులన్నీ ఎలా తెలిశాయి!" అని కూతుర్ని గద్దించి అడిగేడు.
    "ఎప్పటిలాగే నేను గుమ్మం ఉదయాన్నే కడుగుతున్నాను- వాళ్ళ గుమ్మంలో కూడా ఎవరో గుమ్మం కడుగుతున్నారు. చీకట్లో చీర కప్పుకుని కనిపించేసరికి అక్కయ్యగారనే అనుకున్నాను. పలకరించాను! కాని పలక్కుండా లోపలికి వెళ్ళి పోతూంటే - నేను పెంకితనానికి గబగబా వెళ్ళి పట్టుకున్నాను. నా చేతిలోకి చీర ముసుగు వచ్చేసింది తీరా చూద్దునుకదా - యింకెవరు? అతనే, నేనే భయపడి చస్తుంటే -నన్ను ఆ సంగతి ఎవరితోనూ చెప్పవద్దని. బతిమిలాడేడు!"
    "ఏంటర్రా యిదంతా నా కయోమయంగా వుంది!" అని ఆందోళనపడుతూ అడిగింది శాంతమ్మ.
    "నువ్వుండు చెల్లీ నేనంతా చెబుతాగాని....ఆఁ ? తర్వాత ఏమయింది.....ఏమిటీ తమాషా అని అడిగేవా లేదా?"
    "అడిగేను.....అడిగితే అంటాడూ - ఎక్కడా యిల్లుదొరకలేదుట. మన ఇల్లోమో బాగా నచ్చందట ! మరి మనం కుటుంబంగల వాళ్ళకేగాని అద్దెకు యివ్వమన్నామని - అట్లా అబద్ధం చెప్పి మనకు అనుమానం తగలకుండా నటిస్తూ వచ్చాడట యిన్నాళ్ళూ!"
    "ఆఁ ఎంత సాహసం! అయితే గిరిజా నువ్వప్పుడపుడు, గుమ్మం కడుగుతున్నప్పుడు మాట్లాడే దానివేమో! మరిపోల్చలేక పోయావా?"
    "లేదు నాన్నా! టెలిఫోనులో చూశావా ఒక ఆపరేటరు గొంతుక ఆడదాని గొంతుకలా వుంటుంది! ఆయనపేరు మణి. అతను ఈయన గారి స్నేహితుడట! నాటకాల్లో ఆడవేషాలు కూడా వేస్తూంటాడు. వేషం వేస్తే, మగవాడో, ఆడదో పోల్చుకోలేరట, అతనిచేత మాట్లాడించే వాడట!"
    'ఎంత గుండెలు తీసినపని! .... అయితే మరి ఆ వేళ పేరంటం - సంగతి - ఎంత యినా దూరంనించి మోసం చేయవచ్చుగాని ఒకరా ఇద్దరా! అంతమంది ఆడవాళ్ళని అంత దగ్గరగా వుండి ఒక మగవాడు ఆడ వేషం వేసి నమ్మించడం అంటే నమ్మతగ్గ విషయంకాదు!"
    "అవున్నాన్నా ఆ వేళ మాత్రం ఆ స్నేహితుడు కాడు. వాళ్ళందరూ కలిసి, ఆ స్నేహితుడి చెల్లెల్ని ఆ రూముకి తీసుకువచ్చి - కూర్చోబెట్టీ - సమయానుకూలంగా మాట్లాడించారు." ...
    "గట్టివాడే! .... నాకు తెలియకుండా నా ఇంట్లోనే ఎంత నాటకం ఆడేడు! అయినా గిప్పుడయినా వదులుతానా! ఎక్కడున్నా తీసుకువచ్చి తగిన శాస్తిచేసి తీరుతాను!" అని కోపంలో, ఆవేశంలో, ప్రక్కని చెల్లెలుండ యినా మరచి అనేశాడు. మళ్ళీ- ఆమాయకంగా అయోమయంగా భయంతో చూస్తున్న చెల్లెల్ని చూసి నాలిక్కర్చుకున్నాడు.
    "చూశావా చెల్లీ! - నీ కొడుకెలాంటి! ప్రయోజకుడయినాడో!" అని అన్నాడు.
    "ఏమిటో! యిదంతా నా కర్ధం కాలా -నిజంగా మాట్లాడే అలా చేస్తే అలా ఎందుకు చేయ వలసి వచ్చిందో, కారణం వేరే వుండి వుంటుంది. ఈ వూరిలో వేరే అద్దెకొంపే దొరక్క పోయిందా వాడికి!"
    అది విని - గిరిజ
    "అదేనత్తయ్యా! నేను అడిగేను! అంటే - అన్నాడు కదా! ..." అని అనబోయి చెప్పడం మాని ఆగిపోయింది. చెప్పబోయేది, తెలుసుకుని సిగ్గుపడిపోయింది! తొందరలో నోరు జారినందుకు తడబడింది -
    "ఏమిటి! ఏఁవన్నాడు! తిన్నగా చెప్పవేం!" అని అధికార స్వరంలో అన్నాడు దాసు.    
    గిరిజ అతని వయిపు చూసి, చెప్పడమా! మానడమా! అని భయపడుతూ జంకింది.
    "చెప్పమ్మా!" అని అడిగింది శాంతమ్మ.
    "అబ్బే! ఏం లేదు.....చెప్పానుగా ఎక్కడా దొరకలేదని అదే ... చెప్పాడు!"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS