'ఏమిటబ్బా! నా సలహాలు...?'
'నన్ను పై చదువులకు పంపేటప్పుడు నీవిచ్చిన.....వాటిని నేనేమాత్రం మరచిపోలేదు జాగ్రత్తగా చదువుకుంటున్నాను కాని బావా....ఒక్కటే సందేహం! నాన్న అదో తరహామనిషి ఏ నిముషంలోనైనా చదువు ఆపు చేయమంటాడేమోనని నాకు భయంగా ఉంది.'
'ఏం...? రాగానే చురకతగిలించాడా...?'
'తగిలించలేదు కాని వాలకం చూస్తే అలాగే ఉంది. మధ్యలో ఆపుచేయిస్తే ఎలాగేం" బుంగమూతిపెట్టి గారాబం చేసింది శాంత.
'మంచిదే....! మామయ్య చదువు మానెయ్యమంటే మానెయ్యి.' చిలిపిగా శాంత కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు రామం.
'ఫో బావా....! ఇలా అవుతే నీతో నేనసలు మాట్లాడను.' మూతి బిగించి అలుక ప్రారంభించింది.
రామం చిరునవ్వునవ్వుతూ 'దేవిగారు అలుక ప్రారంభించి నట్లున్నారే....!' అని తనవైపుకు త్రిప్పుకోబోయాడు. ఏమాత్రం లొంగిరాలేదు శాంత.
'శాంతా నీ ఈ అలుక చూస్తూ ఉంటే చిన్నప్పుడు నీ పిప్పరమెంటు బిళ్ళలను తిని నా దగ్గర ఉన్న బిళ్ళలకోసం అలగడం గుర్తుకు వస్తూ ఉంది. అప్పుడు నేనేం చేశేవాడినో గుర్తుందా? సగంకొరికి మిగతాసగం నీకిచ్చేవాణ్ణి 'ఛీ.....ఎంగిలి' అని అసహ్యించుకునే దానవు. అప్పుడు పుల్లయ్యమామ మనిద్దరితగువూ తీర్చే వాడు. 'అమ్మాయిగారూ! మీరు అబ్బాయి గోరి ఎంగిలి తినాల్సిందే! ఆరు మీకు కాబోయే భర్తగారు కదండీ!' అని సంతోషపడుతూ చెప్పేవాడు. నీవేమో ససేమిరా అని బిగతీసుకుపోయేదానివి. అప్పుడు నేను కాకి ఎంగిలి అంటూ చొక్కా అడ్డుపెట్టుకొని కొరికి యిచ్చే వాణ్ణి. అవన్నీ గుర్తున్నాయా...?' శాంతను బలవంతంగా తన ముందుకు త్రిప్పుకుంటూ అన్నాడు రామం.
'నవ్వించాలని ఈ కబుర్లన్నీ జెబుతున్నావ్ ! నాకు తెలుసులే! నేనేం నవ్వను.' అని అంటూనే నవ్వాపుకోలేక ఫక్కున నవ్వింది శాంత.
'శాంతా....నేను కోరేదల్లా నీవెప్పుడూ అలా నవ్వుతూ సంతోషంగా ఉండాలనే...! నీ సంతోషంకోసం నీ సుఖంకోసం నేనేమైపోయినా ఫర్వాలేదు.' అతని మాటలలో గాంభీర్యం ప్రస్ఫుటమైంది శాంతకు.
'బావా....! నీవు నా సంతోషాన్ని కోరే వాడవని నాకు తెలుసు. కాని నాన్న మొండి పట్టుపడితే ఏం చేస్తావ్...?'
'ఆ విషయం అప్పుడు తెలుస్తుంది. యిప్పుడెందుకు? అదిసరే ఎన్నడూ లేనిది ఈరోజు ఒంటరిగా తోటకు వచ్చావేం?'
'ఒంటరిగా రాలేదు. స్నేహితురాలితో వచ్చాను.' అని నలువైపులా చూస్తూ 'శారదా...! శారూ...! ఎక్కడికెళ్ళావే?' అని పిలిచింది.
'ఇక్కడే ఉన్నాను.' అని లేచి వాళ్లున్న వైపు వచ్చింది శారద. అప్పుడే చీకటి నలువైపులనుండి ఆవరిస్తూ ఉంది. అది తోట కాబట్టి బయలుప్రదేశం కన్న అక్కడ త్వరగా చీకటి పడుతుంది. రామం లేచి లైటువేశాడు. దగ్గరగా వచ్చిన శారదను రామానికీ పరిచయం చేసింది శాంత. ఇద్దరూ పరస్పరం నమస్కారాలు చేసుకున్నారు.
'మీరేం చదువుతున్నారండీ?' ప్రశ్నించాడు రామం శారదను చూస్తూ.
'నేను, శాంత క్లాసుమేట్సు' సిగ్గుపడుతూ అంది శారద.
"అలాగా....మీది హైదరాబాదేనా? మీ నాన్నగారేం చేస్తుంటారు?'
ఆ ప్రశ్నలో కళకళ లాడుతూన్న ఆమె ముఖం అమవసనిశిలా మారిపోయింది. కారణం తెలియక తికమకపడ్డాడు రామం.
'నే నేమైనా పొరపాటుగా మాట్లాడానా శాంతా...?' అయోమయంగా శాంతను చూస్తూ ప్రశ్నించాడు రామం.
'లేదుబావా....అటువంటి దేమీలేదు.' అని క్లుప్తంగా శారద విషయాలన్నీ చెప్పింది. తామిద్దరూ ఒకరిని విడిచి మరొకరు ఉండలేని స్నేహబంధంలో బంధింపబడినట్లు కూడా చెప్పింది. చివరకు శారద వివాహం జరిగిన తర్వాతే తను వివాహం చేసుకుంటానని ప్రమాణం చేసిన విషయంకూడా చెప్పింది.
అన్నీ విన్న రామం ఆలోచనలో పడ్డాడు. అలా పదినిముషాలు గడిచిపోయాయి-
శాంత మౌనభంగం చేస్తూ తమ కాలేజీ కబుర్లు శాంత మంచి మార్కులతో గత పరీక్షలలో ప్యాసైన విషయం అన్నీ వివరించింది. ఆ విధంగా కబుర్లతో చాలా రాత్రివరకూ ఆ ముగ్గురూ గడిపారు. ఆ తర్వాత యింటికి వెళ్ళారు రామం అలా గంభీరంగా ఉండి ఏదో ఆలోచిస్తూ న్నట్లుగా ఉండడంతో శారద భయపడింది. తనకు సహాయం చేసిన శాంతను మందలిస్తాడేమోనని బాధపడింది. ఏవేవో ఊహించుకుంటూ భయపడుతూ ఉండడంవల్ల చోటు క్రొత్త చేయడం వల్ల చాలా రాత్రివరకు ఆమెకు నిద్ర పట్టలేదు.
* * *
శాంత శారదలు వచ్చి వారం రోజులైంది. రామం శారదలో ఉన్న సుగుణాలకు ముగ్ధుడయ్యాడు. తనకు అటు వంటి చెల్లెలు ఉంటే ఎంతో బాగుండేదని అనుకున్నాడు. ఈ వారం రోజులలో శారదను రామం, రామాన్ని శారద చక్కగా అర్ధం చేసుకున్నారు.
ఒకరోజు సాయంత్రం శాంత, శారద లిద్దరూ తోటకు బయలుదేరారు. బయలు దేరే ముందు లక్ష్మయ్యగారు ప్రొద్దుపోక ముందే తిరిగి రావలసిందని వారిద్దరినీ ఒకటికి నాలుగుసార్లు హెచ్చరించారు. అలాగే నంటూ వారు తోటవైపు నడకసాగించారు. వారు తోట చేరుకున్న అరగంటకు రామంకూడా అక్కడికి వచ్చాడు. ముగ్గురూ ఒకదగ్గర విశ్రాంతిగా కూర్చున్నారు.
రామం శారదవైపు చూస్తూ 'మీకు అభ్యంతరం లేకపోతే మీ చదువుభారం నేను వహిస్తాను. ఇంత తెలివిగల మీలాంటి వాళ్ళకు సహాయం చేయడం మహద్భాగ్యంగా తలుస్తాను..... మీరేమంటారు...?'
'ముందు మీరు నన్ను అలా బహువచనంలో సంబోధించడం మానండి. ఆ తర్వాత అన్ని విషయాలూ మాట్లాడుకుందాం. చూడండి! ఆవేశంలో త్వరపడవద్డు. నా పుట్టు పూర్వోత్తరాలు నాకే తెలియవు. అటువంటి నన్ను చేరదీసి నట్లయితే మీరు నలుగురిలో అపహాస్యం పాలు కావలసి వస్తుందో ఏమో? పైగా నా వివాహం జరిగిన తర్వాతే తను వివాహం చేసుకుంటానని శాంత మొండిపట్టు పట్టింది. అది అంత తేలికగా జరిగే పనేనా.... అన్నీ సక్రమంగా అమరిన ఆడపిల్లల వివాహాలు జరగడమే బ్రహ్మ ప్రళయంగా ఉన్న రోజులలో నాలాంటి దాని సంగతి వేరే చెప్పనక్కర.......' మాట పూర్తి చేయలేక కంట తడి పెట్టింది శారద.
'బాధపడకమ్మా! నీవు మాత్రం కష్టపడి చదువుకో.....మిగత విషయాలేవీ ఆలోచించకు. ఆ తర్వాత నేనున్నాను. ఆ పైన భగవంతుడు. ఆ దయామయుడు మంచి మనసుగలవారి నెప్పుడూ బాధపెట్టడు.' తన మాటలతో తనకు భగవంతుడిపై గల ప్రగాఢ విశ్వాసాన్ని ఋజువు చేసుకున్నాడు.
'శాంత నా భారం వహిస్తానని అన్నప్పుడే సగం దిగమ్రింగాను. అయినా శాంత అస్వతంత్రురాలు. పైగా క్షణికోద్రేకంతో, ఆవేశంలో అలా అని ఉంటుందని ఊహించుకున్నాను. కాని ఈనాడు మీ నిర్ణయం. నాకు ఎంతో ప్రోత్సాహాన్ని కలిగించింది. జీవితంపై ఒక విధమైన ఆశను రేకెత్తిస్తూ ఉంది. కాని మా మామగారేమంటారో...?' సందేహపడుతూ అంది శారద.
'అవన్నీ నే చూసుకుంటాను. నీవు మాత్రం సార్ధక నామధేయురాలవై వృద్దిలోకి రావాలి. కష్టపడి చదువుకుంటే ఎంతవరకైనా చదివిస్తాను. మరి నీవు గెలుస్తావో...? నేనో...?' అన్నాడు రామం చిరునవ్వు పెదిమలపై నాట్యం చేస్తూండగా-
'అన్నయ్యా .... నేనందుకు అర్హురాలినా? దీనికి ప్రతిఫలంగా నేను మీకే మివ్వగలను?' అప్రయత్నంగా శారద నోటినుండి వెలువడిన మాటలకు రామం హృదయం సంతోషంతో పొంగిపోయింది.
'చెల్లీ! చాలమ్మా! ఇంతవరకూ ఆ మధురమైన పిలుపు నోచుకోలేదు నేను. ఈరోజు నేను ఎంతో అదృష్టవంతుడను.'
రామం మాటలు శారదపై అమృతవర్షం కురిపించాయి. ఆమె ఒళ్ళు సంతోషంతో గగుర్పొడిచింది. 'అన్నయ్యా....! అన్నయ్యా!' అంటూ ఆనంద బాష్పాలు రాలుస్తూ రామం పాదాలవంటి నమస్కారం చేసింది. ఆమెను లేవనెత్తి శాంత ప్రక్కన కూర్చుండబెడుతూ 'చెల్లీ! ఆ భగవంతుడు నీ నోట ఆమాట పలికించాడు. చాలమ్మా....! నేను ధన్యున్నయ్యాను' సంతోషంతో ఊగిపోయాడు రామం.
'నేనందుకు అర్హురాలినా? నా విషయాలన్నీ తెలిసుండీ నన్ను సోదరిగా స్వీకరించావు నా బరువు బాధ్యతలు స్వీకరిస్తున్నావు. దీనికి ప్రతిగా నీకు నేనేం చేయగలనన్నయ్యా?' అశ్రుపూరిత నయనాలతో అంది శారద.
'ఒక చెల్లి తన అన్నకు యివ్వగల ప్రేమ తప్ప నాకింకేమీ వద్దమ్మా! అంతే! నీనుండి నేను అంతకుమించి ఆశించను' తన్మయత్వంతో అన్నాడు రామం.
'బాగుంది! అన్నాచెల్లెళ్ళిద్దరూ నన్ను మరిచిపోయారేమిటి? చెట్టంత మనిషి నొకర్తిని నేనిక్కడ ఉన్నాననే ధ్యాసైనాలేదే మీ యిద్దరికీ!' నిష్టూరపడుతూ అంది శాంత.
'అప్పుడే ఏమైంది? శారద యిప్పుడు నా చెల్లి, మేమిద్దరం ఒకటి! ఇక నీ భరతం పట్టిస్తాం చూడు!'
'బావా! నీ పప్పులేం ఉడకవు. శారద ముందు నా స్నేహితురాలు. ఆ తర్వాతే నీ చెల్లెలు. నా మాట వింటుందో? నీమాట వింటుందో? చూద్దాంగా!' అంది శాంత 'అమ్మ బాబోయ్....! మీరిద్దరూకలిసి నన్ను యిరకాటంలో పెడుతున్నారు. శాంతమ్మగారూ....! మీకొక దండం పెడతాను ఆ పనిమాత్రం చేయకండి!' అభినయిస్తూ అంటూన్న శారద మాటలకు శాంతా. రామంలు నిండుగా నవ్వుకున్నారు. వారిద్దరి నవ్వులతో తన నవ్వును జోడించింది శారద. తోటంతా నవ్వుల పువ్వులయ్యాయి. ఆ నవ్వులు వెన్నెలతో పోటీ పడుతున్నాయి. చంద్రుడు మేఘాలలో దోబూచులాడుతూ మధ్యమధ్య వీరి నవ్వుల పువ్వులను ఏరుకుంటున్నాడు.
తన చేతిగడియారాన్ని చూసుకున్నాడు రామం. 'అరే! మాటల సందడిలో టైమే తెలియలేదు. తొమ్మిది దాటింది. పద శాంతా! అత్తయ్య, మామయ్య యిద్దరూ మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు' అని రామం అంటూ ఉండగానే యింటినుండి పాలేరు రానేవచ్చాడు వీరిని వెతుక్కుంటూ. వాడిని చూసిన రామం 'ఏమిట్రా...! ఇలా వచ్చావేం?' అని ప్రశ్నించాడు.
'మీరా చినబాబూ...! మీరున్నారుగా! శాంతమ్మగోరు, ఆరి ఎంట వచ్చిన ఉంకొక అమ్మాయిగోరు యిద్దరూ తోటకు ఎల్లారు. ఆరిని తీసుకోని రమ్మని పెద్దయ్యగోరు నన్ను తోలిండ్రు! ఇక్కడికి మీరెప్పుడొచ్చిండ్రు దొరా...?' నసుగుతూ అన్నాడు వాడు.
'నే వచ్చి చాలా సేపైందిలే! ముందు నీవెళ్ళి మేమందరమూ వస్తున్నామని వారితో చెప్పు.' అని ముందు వాడిని పంపించి ఆ తర్వాత కబుర్లు చెప్పుకుంటూ మెల్లిగా నడిచి వెళ్లారు ఆ ముగ్గురూ.
* * *
