14
"విలాయత్ (ఇంగ్లాండు) కి వెళ్ళిన వకీల్ లు (రాయబారులు) ఇద్దరూ తిరిగి వచ్చేశారు. విలాయత్ కి వెళ్ళిన వకీళ్ళుద్దరూ తిరిగి వచ్చేరు."
అంటూ హడావుడిగా వెళ్లి చెప్పారు ఇద్దరు భటులు కార్బారీ తో.
"కార్బారీ గారూ! ఇద్దరూ వకీళ్ళూ మనభవనం ద్వారం దగ్గిరికి వచ్చేస్తున్నారు!" అన్నాడు ఒకడు. కార్భారీ సంభ్రమాశ్చర్యాలతో లేచి రాజభవన ద్వారం వైపు పరిగెత్తాడు. త్వరలో ఈ వార్త ఆ భవనం అంతా పాకిపోయింది. రఘో బాతో పాటు బొంబాయి కి వచ్చి ఉంటున్న అతని అనుచరులందరూ చాలా సంతోషించారు. పేష్వా అయిన కొద్ది రోజులలోనే రఘో బా ఒక పెద్ద ఎత్తు వేశాడు. మరాఠా సామ్రాజ్యానికి కంటకం గా ఉంటూ వచ్చిన హయిదల్ అలీ మీదకి దండెత్తి వెళ్లి, అతన్ని వోడించి దిగ్విజయంగా తన రాజధానికి తిరిగి వస్తే తన కీర్తి అమితంగా పెరిగి తన బలం అధికం అవుతుందని అనుకున్నాడు. రామ్ శాస్త్రి ఆరోపణ వల్ల ఏర్పడిన చిక్కులు చాలావరకూ విడిపోతాయని రఘో లా అనుకున్నాడు. కానీ నానా ఫడ్నవీస్, సభా రామ్ బాపూ-- వీరిద్దరూ కలిసి రఘో బా ని పేష్వా పదవి నుంచి తొలగించారు. మరికొందరితో ఒక మంత్రి మండలి' ఏర్పరచి రాజ్యపరిపాలన భారాన్ని తామే స్వీకరించారు.
బొంబాయి పారిపోయిన రఘో బా అక్కడ బ్రిటీష్ అధికారుల సహాయాన్ని అర్ధించాడు. వారు కూడా ఇదొక సదవకాశం అనుకుని పూనా మీద దండెత్తపోయిన రఘో బా సేనతో తమ సైన్యాన్ని పంపించారు. కాని, హరి సంత్ ఫడ్కే నాయకత్వం కింద మరాఠా సైన్యం రఘో బా దండుని తేలికగా వోదించింది. ఈ వార్త కలకత్తా దాకా పాకింది. అక్కడ బ్రిటీష్ గవర్నర్ జనరల్ బొంబాయి గవర్నర్ ని, 'వెంటనే మరాఠా సామ్రాజ్యం లో యుద్ధం విరమించవలసిన ' దని ఆజ్ఞాపించాడు.
రఘో బా, బ్రిటిష్ గవర్నర్ జనరల్ తనకి ద్రోహం చేశాదనుకుని మండిపడ్డాడు. అంతటితో తన ప్రయత్నాలు విరమించ కుండా ఇంగ్లాండ్ కి ఇద్దరు రాయబారులని పంపాడు. వీరిలో ఒక వ్యక్తీ దోరాబ్జీ, పార్శీ తెగకి చెందినవాడు, రెండవ వ్యక్తీ కేశో పంత్ బ్రాహ్మణ కులస్తుడు. ఇంగ్లండు లో "ఎడ్మండ్ బర్క్' ని కలుసుకుని, అతనికి నచ్చ చెప్పి అతని పలుకుబడి ద్వారా భారత దేశంలోని 'ఈస్ట్ ఇండియా కంపెనీ' అధికారులు తన పక్షం వహించేట్లు చేసే బాధ్యత వారికి వోప్పగించాడు రఘో బా.
రాజ భవన సింహద్వారం వద్ద రాయబారులిద్దరి కీ ఘనమైన స్వాగతం లభించింది. కార్బారీ వారిద్దరినీ రఘోబా సమక్షానికి తీసుకు వెళ్ళాడు.
"వకీళ్ళు' ఇద్దరూ రఘో బాకి వినయంగా వంగి సలాము చేశారు.
"రఘో బాజీ! ఇంగ్లండు లో మా ప్రయత్నాలు ఫలించాయని మీకు తెలియజేయటానికి సంతోషంగా ఉంది! ఇదుగో మా కృషి ఫలితం!" అంటూ దోరాబ్జీ తన దుస్తుల్లో భద్రపరిచిన అంగీకార పత్రాన్ని బయటికి తీశాడు.
"ఈ అంగీకార పత్రం సంపాదించటానికి ఎన్ని కష్టాలు పడ్డామో దేవుడి కెరుక! ఫాక్స్, షెరిడాన్, బర్క్, ప్రభుతూలనే కాక ఇంకా ఎందరినో కలిశాము....వారందరూ మీ తరపున కృషి చేస్తామని మాట ఇచ్చారు! వచ్చే 'పార్లమెంట్ పేషన్ ' లో మీ వైపునే వాదిస్తారు చూడండి...." అన్నాడు రెండవ వకీల్ కేశో పంత్.
రఘో బా సంతోషానికి అంతులేదు. "కార్బారీ !" అని ఆ అధికారిని పిలిచాడు. ఈ పిలుపు కోసమే వేచి ఉన్న కార్బారీ పళ్ళేలని తెచ్చి వకీళ్ళ ముందు ఉంచాడు.
"మీ కృషి ఫలితంగా ఈ బహుమతులిని స్వీకరించ గోరుతున్నాము! మీ మేలు మరిచి పోలేను!" అన్నాడు రఘోబా. ఇంతలో కా ర్బారీ మళ్ళీ మరికొన్ని కానుకలు తీసుకు వచ్చి వకీళ్ళ కి ఇచ్చాడు.
"మీరిద్దరూ మా విషయమై ఎంతో కష్టపడ్డారు! మాకు తోచినట్లు సత్కరించాము... మరొకసారి వివరాలన్నీ చెబుదురు గాని, సావకాశంగా వింటాము. అయితే మేము మీకు ఇచ్చిన మాట తప్పమని వేరే హామీ ఇవ్వనవసరం లేడను కుంటాము!" అని రఘో బా వారిని సాగనంపాడు.
"దోరాబ్జీ కి ముఖ్యమంత్రి పదవీ, కేశో పంత్ కి ప్రధాన న్యాయమూర్తి పదవీ ఖాయ మన్న మాట', అనుకున్నారు సభాసదులలో కొందరు అభిజ్నులు.
దోరాబ్జీ, కేశో పంత్ ళ నిష్క్రమణ తర్వాత రఘో బా ముఖ వైఖరి పూర్టిగా మారిపోయింది. నవ్వు కాస్తా మాయమై కోపం కనిపించింది.
"కార్బారీ , ఏరీ వేగుల వాళ్ళు! ఇంత ఆలస్యమేమిటి?" అని అరిచాడు.
"చిత్తం! ఇక్కడే ఉన్నారు...." అని తడబడుతూ సమాధానం ఇచ్చాడు కార్బారీ.
"ఉంటె ఇంత సేపెం చేస్తున్నావు? తీసుకురా మా ముందుకి?"
గూడచారు లిద్దరూ వచ్చి రఘో బా ముందు నిలబడ్డారు. వారి వాలకం చూస్తె తమ సందేశాన్ని చెప్పటానికి భయపడ్తూ నాట్టున్నారు.
"వూ! మాట్లాడరేం?' అని గర్జించాడు రఘో బా. వాళ్ళిద్దరూ అక్కడ కూర్చున్న వారిని కలియ చూశారు.
"అందరూ మనవాళ్ళే! సందేహించ కుండా చెప్పండి!!" అన్నాడు రఘో బా చిరాకుగా.
"ప్రభువు వారి అజ్ఞా! పూనా లో సాన్ లూయీ అనే ఫ్రెంచి దుర్మార్గు డొకడు తమరికి ఎదురుగా ప్రచారం చేస్తున్నాడు! ఇటీవలే తన దేశం ప్రభుత్వం వద్ద నుంచి నానా ఫడ్నవీస్ కి సహాయం ఇచ్చే హామీ తెచ్చాడని విన్నాము. ఇంగ్లీషు వారు యుద్దంలో దిగితే ఫ్రెంచి సేన తప్పకుండా నానా ఫేడ్నవీస్ కి సహాయం చేస్తుందట...." అన్నాడు ఒజ వేగి వాడు.
"రెండు వేల మంది సైనికులు ఫ్రాన్సు నుంచి వచ్చారుట ప్రభూ! అంతేకాక నానా ఫడ్నవీస్ సేనాని ఐరోపా పద్దతుల మీద తర్ఫీదు చేస్తారుట." అని చెప్పాడు రెండవ గూడచారి.
అసలే చిరాకు గా ఉన్న రఘో బా రెచ్చి పోయాడు. ఫ్రెంచి వారిని కసిదీరా తిట్టాడు. "ఆ వెధవ ఫ్రెంచి వాడు మమ్మల్నేమి చేస్తాడో చూద్దాము! బ్రిటీష్ బలమంతా మన వైపేగా!" అని చివరికి సరిపుచ్చు కున్నాడు.
"ప్రభువులు క్షమించాలి! ఇంకా చెప్పవలసింది ఉంది -- ఈ ఫ్రెంచి దుర్మార్గుడు మరొక నీచానికి దిగాడు."
"ఏమిటది?" అని అరిచాడు రఘో బా అతని మాట పూర్తీ కాకుండానే. "ఏమిటా నీచం?"
"ఆ దుర్మార్గుడు సాన్ లూయీ ఫ్రాన్సు దేశం చిత్రకారు డొకడి చేత ఓక పటం వేయించాడుట....దానిని పూనా లో అందరికీ చూపిస్తున్నాడుట! అది ఎందరి లోనో సంచలనం లేవదీసింది...."
"ఏమిటీ వాగుడు! ఆ పటానికి మాకు సంబంధం ఏమిటి? బొమ్మలూ, పటాలూ చూపించి యుద్దాలు గెలుస్తారా ఏమిటి?"
"అదొక సామాన్య చిత్రపటం కాదు ప్రభూ! అది చాలా ఘోరంగా ఉంది..." గూడచారి ఇక చెప్పటానికి సందేహించాడు.
"ఘోరమా?"
"అవును ! అతి ఘోరంగా ఉంది! అందులో మనుష్యులంతా నిజమైన మనుష్యులంత ఉన్నారు. అందులో....అందులో ... అది ఒక హత్య దృశ్యం! నిద్రపోయిన నారాయణరావు ని ఖరిగ్ సింగ్ పొట్టలో పొడుస్తున్నాడు--- వెనక నుంచున సుమేర్ సింగ్ నారాయణరావు భుజం మీద వేటు వేస్తున్నాడు! ఇంకా ...! ఇంకా ....! అని ఇక చెప్పలేక పోయాడు గూడచారి. ఈసారి రఘోబా కూడా మాట్లాడలేక పోయాడు! కుతూహలంతో భయంతో గూడచారి వైపు చూస్తూ ఉండిపోయాడు.
అ చిత్రంలోనే ప్రభువు వారు కూడా ఉన్నారు! వారి ముఖంలో సంతోషం, సంతృప్తి కనిపించేట్లు చిత్రించాడు చిత్రకారుడు! ప్రభువులు నన్ను కరునించాలి. ఉన్నదున్నట్లుగా తమరికి చెప్తున్నాను. సాన్ లూయిస్ ఆ బొమ్మని తన గూడారంలో బహిరంగంగా ప్రదర్శిస్తున్నాడు. అనుదినమూ వేలాది వేలు పటాన్ని చూసి పోవటానికి వస్తున్నారు౧ ఎందరో కన్నీటితో వెనక్కి వెళ్లి పోతున్నారు.....వారి వాఖ్యానాలు వింటే వళ్ళు జలదరిస్తుంది!"

"ఏమన్నారు?' అని అడిగాడు రఘోబా హీనస్వరంతో.
"ఆ మాటలని నేను ఉచ్చరించగలనా? నా నాలుక తెగిపోదూ?!"
"హూ! ఇంతదాకా ఈ ఐరోపా దోర్భాగ్యులు మనవి తమ తుమాకులతో బాధించారు! ఇప్పుడీ రకం బాధ కూడా ప్రారంభించారన్నమాట.....నానా ఫడ్నవీస్ పక్షం వహించినా మా కింత కోపం రాదు! ఈ చిత్ర ప్రదర్శనని మేమెన్నడూ క్షమించలేము! క్షమించము..." రఘోబా ఉగ్రుడయి పోయాడు. "ఈ నీచమైన కార్యానికి వారిని ఈ దేశం నుంచే తరిమి వేస్తాను!.... సరే , తులాజీ సంగతేమిటి?"
తులజీ రఘోబా తో వచ్చి ఉండటానికి ఇంగ్లీషు అధికారులు అంగీకరించలేదు. సామాన్యులయిన హంతకులకి శరణు ఇవ్వలేమన్నారు. అందుచేత తులాజీ నైజాం రాజ్యంలోనూ, అతని అనుచరులు సుమేర్ సింగ్, ఖరగ్ సింగ్ లు పోర్చుగీసు వారి అధీనంలో ఉన్న గోవాలోనూ దాక్కున్నారు. వారంటే ప్రీతికల రఘోబా ఎప్పటికప్పుడు వారి సమాచారం కనుక్కుంటూ ఉండే వాడు.
వారి వద్ద నుంచి వచ్చిన వేగుల వాళ్ళిద్దరూ ముందుకు వచ్చారు.
"వూ , చెప్పండి!" అని అరిచాడు రఘోబా.
"ప్రభూ ! తులాజీ హైద్రాబాద్ లో లేడు!"
"ప్రభూ ఖరగ్ సింగ్, సుమేర్ సింగ్ లు గోవాలో లేరు!"
"ఏమయ్యారు?" రఘో బా గొంతు కోపంతో జీరవోయింది.
"నానా ఫడ్నవీస్ నైజాం ని బెదిరించి తులాజీ ని చేజిక్కించు కున్నాడుట!"
"సుమేర్ సింగ్, ఖరగ్ సింగ్ ళ విషయం మాత్రం అంత తేలికగా జరగలేదు ప్రభూ! "దాద్రా ప్రాంతాన్ని పొర్చు గీసు వారికి ఇచ్చి వీరిని చేజిక్కించుకున్నాడు!"
"ఆ! ఆ నైజాం , పోర్చు గీసు వారు కూడా ఫడ్నవీస్ ఉపాయాలకి లొంగిపోయారన్న మాట.... ఎంత దారుణం! ముగ్గురినీ ఆ ఫడ్నవీస్ ఫురందర్ కోటలో దాచి ఉంటాడు ..." అని రఘోబా వాపోయాడు.
"లేదు ప్రభూ! వారు పురందర్ లో లేరు....పూనా లో శిరచ్చేదం చేయించాడు నానా ఫడ్నవీస్! అంతటితో ఆగక చిన్న శిరస్సులని ఈటేలకి గుచ్చి నగరం అంతా వూరేగింపచేశాడు....చివరికి వాటిని నక్కలకీ, గద్దలకీ వేయించాడు!"
"భగవంతుడా, ఏమిటిది! ముగ్గురూ నానా ఫడ్నవీస్ కసికి ఆహుతి అయ్యారా?!..." రఘో బా కి ఈ ముగ్గురూ అంటే నిజంగానే ఇష్టం. ఆప్రయత్నంగా కళ్ళు తుడుచుకున్నాడు.
ఇంతలో ఒక దూత అవసర అసవరంగా అక్కడికి వచ్చి కార్బారీ చెవిలో ఏదో చెప్పాడు.
"ప్రభూ ! బయట "సందినీస్వర్ ' ఒకడు వేచి ఉన్నాడు. రమ్మని సెలవా?' అని రఘో బా ని ఉద్దేశించి అడిగాడు కార్బారీ .
(సందీనీస్వర్ అంటే ఒంటె మీద సవారీ చేసేవాడు.) అతనేదయినా మంచి వార్త తీసుకువచ్చి ఉండవచ్చుననే ఆశ కార్బారీ లో మొలకెత్తింది. ఆశ అతని కంఠస్వరంలో ప్రతిధ్వనించింది. అది రఘోబా కి ఒక విధంగా ఉపశమనం కలిగించింది.
"లోపలికి తేసుకురండి!"
సందినీశ్వర్ నేరుగా రఘోబా వద్దకి వచ్చి అతని కాళ్ళ మీద పడ్డాడు.
"ప్రభువుల వారు ఈ దీనుడిని కనికరించాలి! దుర్వార్త తీసుకు వచ్చినందుకు మన్నించాలి!" అన్నాడు.
"ఏమిటి ! మళ్ళీ దుర్వార్త!" అన్నారు కొందరు.
"ఈరోజు విన్న దుర్వార్తలు చాలవా?" రఘోబా తనని తనే ప్రశ్నించు కున్నట్లు అన్నాడు. అప్పటికి కొంచెం ధైర్యం తెచ్చుకున్న వేగివాడు, "ప్రభూ రామ్ శాస్త్రి తిరిగి ప్రధాన న్యాయమూర్తి పదవి పుచ్చుకుంటున్నాడు! అతన్ని ఒక మారు మూల గ్రామం నుంచి వెతికి తీసుకు వచ్చింది నానా ఫడ్నవీస్, సఖారమ్ బాపూలె! ఈపాటికి అయన పదవీ స్వీకారం కూడా చేసి ఉండవచ్చు ......"
"ఆ! ఆ రాక్షసుడు రామ్ శాస్త్రి తిరిగి వచ్చాడా? ఇక నేను సాధించేది మాత్రం ఏమి ఉంటుంది గనుక!"
"ప్రభూ, విచారించకండి .....మన వకీళ్ళు విలాయత్ కి వెళ్లి బర్క్ వంటి పెద్ద మనుషుల ఆమోదం పొంది వచ్చారు కదా........' అని రఘో బా ని సముదాయించపోయాడు కార్బారీ.
"వెర్రివాడా! బర్క్ ఆమోదం రామ్ శాస్త్రి కి కీర్తీకే మాత్రం సాటి! ఈ మరాఠా సామ్రాజ్యంలో రామ్ శాస్త్రి మాటంటేనే ఎంత గౌరవం ఉందొ నీకు తెలుసా? ఇక నా గతి ఏమిటి?" రఘో బా పూర్తిగా నిస్పృహ కి లోనయ్యాడు. పిచ్చివాడి వలె జుత్తు పీక్కున్నాడు. హారాలు తెంపుకుని విసిరి వేశాడు. చివరికి ఇక పట్టలేక ఒక పెద్ద అరుపు అరిచి నేల మీదకి కూలిపోయాడు.
