13
వర్షం కుండపోతగా కురుస్తూ ఉంది. ఈదురు గాలికి పల్లెలోని ఇల్లు నిలుస్తాయో అనే సందేహం కలిగేట్లుగా ఉంది. ఆ ఇళ్ళలో మరి పేదగా కనిపిస్తూ ఉంది ఒక చిన్న మట్టి ఇల్లు. కప్పులోని చిరుగుల ద్వారా వాన నీరు లోపలికి ధారలుగా ప్రవహిస్తూ ఉంది. గృహ వాసులూ ముగ్గురూ పూర్తిగా తడిసి పోయారు. వారు రామ్ శాస్త్రి, అతని భార్య సీతా బాయి, అయిదేళ్ళ కొడుకు గోపాల్. రఘోబా ఏలే రాజ్యంలోనే ఉండటానికి ఇష్టపడని రామ్ శాస్త్రి రాజ్యం బయట ఉన్న ఈ కుగ్రామం లోతన నివాసం ఏర్పరచు కున్నాడు. ఇంతకన్నా మంచి ఇంట్లో ఉండే ఆర్ధిక స్థోమత అతనికి లేదు.
ఉన్నట్లుండి వడగళ్ళు పడటం మొదలు పెట్టాయి. విరిగిపోయిన కిటికీ లో నుంచీ, ఇంటి కప్పు లోని చిరుగుల ద్వారా వడగళ్ళు పెద్ద పెద్ద చప్పుడు చేసుకుంటూ వచ్చి పడటంతో చిన్న పిల్లవాడయిన గోపాల్ భయపడిపోయాడు. తల్లికి అతుక్కుపోయి ఏడవటం ప్రారంభించాడు. సీతాబాయి అతన్ని ఓదార్చటానికి ప్రయత్నించింది. రామ్ శాస్త్రి గోపాల్ ని విడిపించి తన వళ్ళో కూర్చో పెట్టుకున్నాడు.
"బాబూ గోపాల్ , ఒక కధ చెప్తాను వింటావా? మంచి కధ , తెలుసా?" అంటూ సీతాబాయి వంక చూసి ఇలా చెప్పుకు పోయాడు.
"ఈ కధ నువ్వే కాదు మీ అమ్మ కూడా బాగుందంటుంది చూసుకో. ఇదొక వెర్రి బ్రహ్మాడి కధ.....ఈ బ్రాహ్మడు ఒక పెద్ద వూళ్ళో ఒక పెద్ద ఇంట్లో ఉండేవాడు. అతనొక పెద్ద అధికారి. అందరూ అతన్ని "ప్రధాన న్యాయమూర్తి '
అనేవారు....వూళ్ళో వాళ్ళందరూ అతనికి వంగి దణ్ణం పెట్టేవారు. తనూ, భార్యా, చిన్న కొడుకూ ముగ్గురికీ చాలినంత భోజనం, బట్టలు దొరికేవి అతనికి. హాయిగా కాలం గడుపుతూ వచ్చాడు. కాని వట్టి పిచ్చివాడేమో, పని కాస్తా వదులుకున్నాడు.
"పని వదులుకున్నడా. అంతటితో వూరుకోకుండా వూరు కూడా వదులు కున్నాడు! పెద్ద వూరు వదిలి ఒక చిన్న పల్లెటూరికి వెళ్ళిపోయాడు. ఆ పల్లెటూరి లో ఒక చిన్న పూరి గుడిసె లాంటి ఇల్లు తీసుకున్నాడు. అతనీ వూళ్ళో ఇంత చిన్న ఇంట్లో ఉంటున్న సంగతి ఎవరికీ తెలీదు! అందుకోసమే అతని సంగతి ఎవరూ పట్టించుకోలేదు.
"అతనూ, భార్యా చిన్న పిల్లవాడూ ముగ్గురూ తవుడు తినేవారు -- అంతకన్నా మంచి భోజనం వాళ్ళకి దొరికేది కాదు. వాన కురిసినప్పుడు ఇల్లంతా నీళ్ళే! వాళ్ళేవళ్ళకీ మంచి బట్టలు ఉండేవి కావు. వాన కురిస్తే నానిన బట్టలతో ఉండి పోవలసిందే! తన అబ్బాయి కష్టాలు చూసి పాపం వాళ్ళమ్మ ఎంతో ఏడ్చేది. ఇవన్నీ అబ్బాయి నాన్న తీసుకు వచ్చిన కష్టాలే కదా అనుకునేవి!"
సీతాబాయి చిరునవ్వుని ఆపుకుని అమాంతంగా లేచి గోపాల్ ని తండ్రి చేతుల్లో నుంచి తీసుకుంది. తన వళ్ళో కూర్చో పెట్టుకుని, "గోపాల్, చిట్టి తండ్రీ! నేనూ ఇదే కధని చెప్తాను కాని, ఎంత బాగా చెప్తానో చూడు. మీ నాన్న గారి కన్నా ఇంకా ఎంతో బాగా చెప్తాను!
"ఆ బ్రాహ్మణు నిజంగా వెర్రి బ్రహ్మడే! ఎందుకూ? తనంత పెద్ద ప్రధాన న్యాయమూర్తి గా ఉంటూ అలా బీదగా బతకటం ఏమిటి? అంత పెద్ద ఇంట్లో ఉంటూ? కానీ అతని వెర్రి కాస్తా వదిలి పోయింది! పెద్ద ఊరు వదిలి చిన్న పల్లెటూరికి మారిపోయాడు. చిన్న గుడిసె లాంటి ఇంట్లో కాపురం పెట్టాడు. ఆ పెద్ద వూర్లో పెద్ద ఇంట్లో కన్నా ఈ చిన్న పల్లెలో చిన్న గుడిసె తన భార్యకి బావుందని ఆ వెర్రి బ్రాహ్మడికి తెలీదు పాపం! ఏం చేస్తాము?" అన్నది.
సీతాబాయి కధ విన్న రామ్ శాస్త్రి విరగబడి నవ్వాడు. ఆమె కోసం వచ్చినట్లు ముఖం పెట్టి "ఎందుకా నవ్వు? నేనేమన్నా పరిహాసం అడానా? ఉన్న నిజం చెప్పానంతే. దేవుడే నాకు సాక్షి. నిజంగా ఆ భవనం లో ఉన్నప్పుడు మీకు ఇంట్లో భార్యా, కొడుకు ఉన్నారనే ధ్యాస ఉండేదా అసలు? ఎప్పుడు చూసినా న్యాయస్థానం పనితోనే సరిపోయేది? అప్పుడు మీరు పేష్వా వారికీ, వారి రాజ్యానికీ సొత్తు. మీ మీద అధికారం అంతా వారిదే. అసలు మీకు దూరంగా ఉండి పోయిందేవరు? ఇంట్లో భార్య, కొడుకూ --వీరిద్దరే....
"ఇప్పుడు మాత్రమె మాతోనే ఎక్కువ కాలం గడుపుతున్నారు. ఇన్నాళ్ళు నగరంలో మీతో కాపురం చేశాను కదా, ఎప్పుడయినా ఇలా తేలికగా కూచుని కబుర్లు చెప్పు కున్నామా? భర్తగా, తండ్రిగా మీ పాత్ర ఏమిటో తెలుసుకునే అవకాశమే ఉండేది కాదు మునుపయితే.......నిజంగా చెప్తున్నాను. మీరు పేష్వా వారి సొత్తు కాదు, వారి ప్రజల సొత్తు కాదు-- ఈ ఇంటి యజమానులు, అంతే."
"వహినీ, క్షమించండి. మీతో ఏకీభవించలేను." అంటూ ఆ ఇంట్లోకి వచ్చాడు ఆజానుబాహువయిన ఒక వ్యక్తీ. అతని వేషం చూస్తె మరాఠా ప్రభువు వలె ఉన్నాడు. చూపరులలో గౌరవ భావం కలిగించేట్లు ఉన్నాయి. అతని ఆకృతి ,వైఖరి , కంఠస్వరం . అతనెవరో కాదు. బార్ భాయిల నాయకుడు నాన ఫడ్నవీస్. రామ్ శాస్త్రి రాజీనామా తర్వాత మరి పదకుండు మందితో కలిసి రఘో బా ని పేష్వా పదవి నుంచి తొలగించాడు. రఘో బా దేశం వదిలి పారిపోయాడు. పన్నెండుగురూ గణ నాయకులుగా దేశాన్ని ఏలుతూ వచ్చారు. ఇదంతా రామ్ శాస్త్రి కి తెలియదు.
"మీరా. రండి దయ చెయ్యండి." అంటూ నానా ఫేడ్నవీస్ ని ఆహ్వానించాడు.
నానా ఫడ్నవీస్ వెంట సభా రామ్ బాపూ కూడా లోపలికి వచ్చాడు. అప్పటికి బయట గాలివాన బాగా తగ్గిపోయాయి. వాతావరణం కొంచెం నిర్మల మయింది.
రామ్ శాస్త్రి , సీతా బాయిలు ఇంకా మర్యాద చేసేందుకు అవకాశం ఇవ్వకుండానే నానా ఫడ్నవీస్ ఇలా అన్నాడు : "వహినీ. మాలాంటి అల్ప మనస్కులే కదా ఈ లోకం లోని ఐశ్వర్య సంపదలని ఆశించేది? రామ్ శాస్త్రుల వారు వాటి అతీతులు! మానవాళి ని ఉద్దరించటానికే కదా భగవంతుడు అటువంటి వారిని ఈ భూమి మీదికి పంపిస్తాడు. అందుకనే సమయం వచ్చినప్పుడు వారి శరణు చొచ్చే హక్కు అందరికీ ఉంది .."
అతి గంబీర స్వరంతో చెప్పిన ఈ మాటలు విని రామ్ శాస్త్రి, సీతా బాయిలు ఇద్దరూ నిరుత్తరులయి పోయారు. నానా ఫడ్నవీస్ వినమ్రుడయి ఇంకా ఇలా అన్నాడు: "అయ్యా, తమరు మరాఠా సామ్రాజ్యానికి భగవంతుడు ప్రసాదించిన రత్నం వంటి వారు. ఈ శుభవార్త తమకి చెప్పుకోక నేనెవరికి చెప్పుకుంటాము?

"తమరు ఆనాడు సభ వదిలి వెళ్ళిపోయిన తర్వాత మాకు ఒక హంతకుడిని పేష్వా గా స్వీకరించలేమనిపించింది. రఘో బా ని పదవీచ్యుతుడిని చేసే ఏర్పాట్లు చేసుకున్నాము. అతన్ని దేశం నుంచి బహిష్కరించాము.
నారాయణ రావ్ పేష్వా వారి సతీమణి కి అంతకు ముందే జన్మించిన వారి మగబిడ్డ నవాయి మాధవరావ్ ని సింహాసనం మీద అధిష్టాపించాము.
"ఇప్పుడు మేము తమర్ని కోరేదేమిటంటే, తమరు తక్షణమే రాజధాని కి వచ్చి తిరిగి ప్రధాన న్యాయమూర్తి పదవిని అలంకరించాలి.
"తమ న్యాయ నిర్వహణ కన్నా మా ఆయుధ బలం గొప్పది కాదు. తమరు మా కోరికని మన్నించండి."
రామ్ శాస్త్రి ప్రశ్నార్ధకంగా సీతా బాయి వంక చూశాడు. ఆమె ముఖంలో వెలిసిన చిరునవ్వే అతనికి సమాధానం అయింది.
